వేనకృత శంకరస్తుతి

వేనుడిట్లు ప్రార్థించెను. ప్రభూ శంకరా! దేవుడవు ఈశానుడవు అభవుడవు, చంద్ర భూషణుడవగు నీకు శరణాగతుడనగుచున్నాను. నీవు మహాదేవుడవు, మహాత్ముడవు జగత్పతివి. దేవదేవేశ్వరా సర్వశత్రునాశకా, ఇంద్రశక్తిని అదుపులో నుంచువాడా, దైత్యులచేత పూజింపబడు వాడా, విరూపాక్షా సహస్రాక్షా ముక్కంటీ, కుబేరసఖా, నీకు నమస్కారము. సర్వత్రా పాణిపాద అక్షిమస్తక, ముఖాల రూపంలో, శ్రవణాల రూపంలో సమస్త విశ్వాన్ని ఆవరించియున్నావు! అన్ని చోట్ల ఉన్నావు. నీవు శంకు కర్ణుడవు (కొనదేలిన చెవులు గలవాడు) మహాకర్ణుడవు, కుంభకర్ణుడవు, సముద్రాలకు నిలయుడవు, గజేంద్ర కర్ణుడవు, గోకర్ణుడవు, పాణికర్ణుడవు నీకు నమస్సులు. ఓ శతజిహ్వా! శతావర్తా (అనేక జడలు గలవాడా) శతోదరా! శతాననా! గాయకులు నిన్ను పాడుచున్నారు. సూర్యారాధకులు నిన్నే ఆరాధిస్తున్నారు! ఓ శతక్రతూ! నిన్ను వారంతా పరబ్రహ్మగా పరిగణించుచున్నారు. ఓ మహామూర్తీ! నీ అనంతమైన మూర్తిలో సముద్రాలు, మేఘాలు, దేవతలు అందరూ పశువుల కొట్టంలో ఆవులకు వలె ఆశ్రయం పొందియున్నారు. ప్రభో! నీ శరీరంలో చంద్రాగ్ని వరుణులను నారాయణ సూర్య విరించి బృహస్పతులను దర్శిస్తున్నాను. దేవా! నీవు కారణం, కార్యం క్రియకు కారణుడవు, సర్వం నీ నుంచి ప్రభవించును, నీవే ప్రళయానివి, సదసత్ దైవతానివి నీవే! భవా! నీకు నమస్కారము శర్వా, వరదా, ఉగ్రరూపీ, అంధకాసుర నాశకా, పశుపతి, త్రిజటేశ్వరా, త్రిశీర్షా త్రిశూలధరా, త్రినేత్రా త్రిపుర సంహారకా నీకు నమోవాకములు! ముండివి, చండుడవు, అండరూపివి, జగద్యోనివి, డిండిమ హస్తుడవు, డిండిముండ (ఒక ఓషధి) రూపివగు నీకు ప్రణామములు. ఊర్ధ్వకేశివి, ఊర్ధ్వ దంష్ట్రుడవు, శుష్కుడవు, విరూపివి, ధూమ్రలోహితకృష్ణ వర్ణుడవు, నీలకంఠుడవునగు నీకు నమస్సులు, నీకుసాటి ఎవ్వరూలేరు. వికృతాకారుడవు నీవు, అయినా సర్వకల్యాణ కరుడవు, సూర్యుడవు, ఆదిత్యమాలాధారివి, నీ రూపమే నీకు ధ్వజమాలికలు, మానము అతిమానము నీవే, పాటవమంతా నీ రూపమే, సమస్త గణాధీశులకు ప్రభువు నీవే. వృషభ స్కంధుడవు, మమాధానుష్కుడవు; నీకు నమస్సులు! నీవు సంక్రందనుడవు, చండుడవు, పత్రధార పుటములుగల వాడవు, హిరణ్య వర్ణుడవు కనకాభశరీరుడవు నీకు ప్రణామములు. స్తుతింపబడినవాడవు, స్తుతింపబడదగినవాడవు, స్తుతిరూపాన నిలచువాడవు నీవే. నీకు నమస్సులు, సర్వుడవు, సర్వభక్షకుడవు, సర్వభూత శరీరివి నీవు. వినతుడవు నీవు, తృణజటాధారివి నీవు. అట్టి నీకు నమోవాకములు. ఓ కృశనాసా! శయితా (శయనించిన) ఉత్థితా (లేచిన) స్థితా (నిలచిన) ధావకా (పరుగిడునట్టి) ముండిత శిరస్కుడా, కుటిలుడా నీకు నమస్సులు!

ఓ నర్తనశీలీ, లయవాదిత్రశాలీ నీకు నమస్సులు. నాట్య ప్రదర్శనలోలా ముఖవాద్య ప్రవీణా (సుషిరవాద్యాలు) జ్యేష్ణా! శ్రేష్ఠా! అత్యంత బలశాలురను నిర్జించువాడా, మృత్యునాశకా, కాలస్వరూపా, లయరూపా నీకు నమస్కారము. ఓ పార్వతీ ప్రియా! భైరవా! ఉగ్రా! దశబాహూ నీకు ప్రతినిత్యమూ నమశ్శతాలు. చితిభస్మ ప్రియా, కపాలహస్తా, విభీషణా, భయంకరా! కఠోర వ్రతధరా! వికృతముఖా, పవిత్రమైన తీవ్రదృష్టి గలవాడా, పక్వంచేసిన ఆమమాంసలోలుపా, తుంబి వీణా ప్రియా నీకు ప్రణామములు. వృషాంక (రుద్రాక్ష) వృక్షరూపా, ఆంబోతు రంకెవంటి కంఠ ధ్వనికల ప్రభూ! కటంకటా (అగ్నిరూపా), భీమా, పరా అపరా స్వరూపా నీకు నమస్సులు. ఓ సర్వశ్రేష్ఠా, వరా, వరదా, నిరాసక్తా, కర్మఫలదాతా (భావనా) రుద్రాక్షమాలాధరా విభేదభేద భిన్నరూపా, ఛాయారూపా, ఊష్మరూపా, అఘోర ఘోరరూపా (సౌమ్య ఘోరరూపా) ఘోర ఘోర తరా (ఉగ్రాతి ఉగ్రుడా) నీకు నమస్సులు. శివా నీకు ప్రణామం, శాంతా, శాంతతమరూపా, బహునేత్ర కపాలా, ఏకమూర్తీ (పరస్పర విరుద్ధ గుణరూపా) నీకు నమోవాకములు, క్షుద్రరూపా, లుబ్ధరూపా, యజ్ఞ భాగప్రియా! పంచాలా (పాంచాల జాతి) శ్వేతాంగధరా, యమా (మృత్యు) నిరోధకా విచిత్రమైన పెద్దగంట కలవాడా, గంట మరియు ధాతు నివాసం కలవాడా, వందలు, వేలు గంటలు కలవాడా, గంటల మాలిక ధరించువాడా నీకు అనంత ప్రణామములు. ప్రాణ వాయు సంఘటన శక్తితో గర్వించువాడా, కిలికిలినాద ప్రియా, హుంకారరూపా హుంకార ప్రియా నీకు ప్రణామములు, సమసమా (శాంతినాశకా) గృహ వృక్షనివాసీ (బిల్వరూపీ) గర్భ మాంస సృగాలా (శిశుమాంస భోజియగు నక్క) తారకా, (నావికా) తరా (నౌకారూపా) నీకు నమోవాకాలు. యజ్ఞరూపా, యాజకా, హుతా, ప్రహుతా (సర్వభూత బలి), యజ్ఞవాహకా, హవ్యరూపా, తప్యా, తపనా (తపస్సు సూర్యుడు) నీకు నమస్కారం, పయ (జలం) స్వరూపా, తుండపతీ (వక్త్రాధిపతి) అన్నదాతా, అన్నపతీ, నానాఅన్నభోజీ నీకు ప్రణామములు. సహస్ర శీర్షా! సహస్ర చరణా, సహస్రోద్యత శూలీ, సహస్రాభరణా, బాలానుచర గోప్తా (చిన్న పిల్లలను రక్షించువాడా) ఆబాలలీలావిలాసీ, బాలరూపా, వృద్ధరూపా, క్షోభించినవాడా, క్షోభింపజేయువాడా, గంగాలులితకేశా (గంగాధర), ముంజకేశా నమస్కారము. షట్కర్మ సంతోషీ, కర్మత్రయ నిరతా, నగ్న ప్రాణా, చందా! కృశా! స్ఫోటనా (సాక్షాత్కరించువాడా) చతుర్విధ పురుషార్థరూపా, చతుర్విధ పురుషార్థ ప్రతిపాదకా నీకు నమోవాకములు.

ప్రభూ! సాంఖ్యశాస్త్రం నీవే, ఆ సాంఖ్యసారతత్వం నీవే. సాంఖ్యయోగ శాస్త్రాధినేతవు నీవే. విరథుడవు, రథ్యుడవు, చతుష్పథరథికుడవు నీవే. ఇట్టి నీకు నమస్కారము. మృగచర్మధరా, సర్పయజ్ఞోపవీతా, వక్త్ర సంధానకేశా (ముఖాని కంటుకొనిన కేశములు కలవాడా) హరికేశా నీకు ప్రణామము. మూడు కన్నులుగల అంబికాపతీ, వ్యక్తావ్యక్త స్వరూపా, విరించీ నీకు నమస్కారము. కామకామదాతా, కామహరా, తృప్తతృప్త విచారకా, సర్వదాతా పాపనాశకా, కల్ప సంఖ్యా విచారకా నీకు నమోవాకములు. మహాసత్వా, మహాబాహో, మహాబలా, మహామేఘా, మహాప్రఖ్యా, మహాకాళా, మహాద్యుతీ, మేఘావర్తా, యుగావర్తకా, చంద్రసూర్యపతీ నీకు నమస్సులు. అన్నానివి నీవు అన్నభోక్తవు నీవు, పక్వ భోజివి, పావనోత్తముడవు, జరాయుజ, అండజ, స్వేదజ ఉద్భిజాలనే నాలుగురకాల జీవసమూహం నీవే. ఈ చరాచర జగత్తు సృష్టించినది నీవు. దీనిని రక్షించి లయముచేసేదీ నీవే. బ్రహ్మవేత్తలగువారు నిన్ను సృష్టికర్తగా బ్రహ్మవేత్తలకు పరమగమ్యముగా పేర్కొంటారు. నీవు మనస్సుయొక్క వెలుగువు. దివ్యజ్యోతులలోని వాయువు నీవే. హంస వృక్షం (జీవాత్మల)పై తిరిగే మధుకరమని నిన్ను బ్రహ్మవాదులు ప్రశంసిస్తారు. ఋగ్యజుస్సామ వేదమయుడవు నీవు, వేదోపనిషత్తు లెల్లప్పుడు నిన్నే స్తుతిచేస్తుంటాయి. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర తదితర వర్ణాలు నీవే. మేఘబృందం, విద్యుత్తు, అశనిపాతం, సంవత్సర ఋతుమాస పక్షములు, యుగములు, నిమేషకాష్ఠాలు, నక్షత్రగ్రహ కళలు అన్నీ నీ రూపాలే. నీవు వృక్షాల్లో అర్జున వృక్షానివి, గిరులలో హిమవంతానివి, మృగాల్లో వ్యాఘ్రానివి, పక్షులలో వైనతేయుడవు, సర్పాలలో అనంతుడవు, సముద్రాల్లో క్షీరసముద్రానివి, యంత్రాలలో ధనుస్సువు, ప్రహరణాల్లో వజ్రానివి, వ్రతాలలో సత్యానివి. ద్వేషం, కోరిక, రాగమోహాలు, క్షమాక్షమలు, వ్యవసాయం, ధృతి లోభం కామక్రోధ జయాపజయాలన్నీ నీవే. నీ వద్ద బాణాలు, గదలు, ధనుస్సులు, ఖట్వాంగాలు, తూణీరాలు ఉన్నవి. నీవు చేత్తవు, భేత్తవు, ప్రహర్తవు, మంతవు (మనన శీలివి) నేతవు సనాతనుడవు, దశలక్షణ లక్షితమైన ధర్మానివి, అర్థకామాలు నీవే, సముద్రాలు, నదులు, గంగ, పర్వత సరోవరాలు, లతలు తృణాలు, ఓషధులు పశు మృగ పక్షి గణాలు అన్నీ నీవే ప్రభూ! ద్రవ్య, కర్మ గుణాల ఉద్గమం, కాలమనే పుష్పం, దానిఫలం ఇచ్చేది నీవే, వేదాల ఆద్యంతాలు, గాయత్రి, ప్రణవ ఓంకారం, లోహిత, హరిత, నీల, కృష్ణ, పీత, శ్వేత, కద్రు, కపిల, కపోత, మేచకాది వర్ణాలు అన్నీ నీ విలాసాలే. వర్ణ (రంగు) రాహిత్యం, వర్ణత్వం, కర్తృత్వం, ఉపసంహరణం అంతా నీవే. నీవింద్రుడవు, యముడవు, వరుణుడవు, కుబేరుడవు, వాయువు, రాహువు, అగ్నివి.

నీవు శిక్షాహోత్రుడవు (యజ్ఞజ్ఞానోపదేష్టవు) (తిసువర్ణ ఛందః స్వరూపివి. యజుర్వేదము లోని శతరుద్రీయమవు, పవిత్రులలో పవిత్రుడవు, శివంకరులలో శివంకరుడవు; తిందుక, గిరిజ తరువులు, అందరకు జీవనరూపమైన ముద్గ (పెసర) ధాన్యము, ప్రాణతత్వము, సత్వరజ స్తమాలు, ప్రతిపత్పతి, ప్రాణాపాన సమానోదాన వ్యాసములు, ఉన్మేషనిమేషాలు, చీదుట, ఆవులించుట అన్నియు నీవే; రక్తంలో నీవే దాగియున్నావు, దృష్టివి, మహావక్త్రుండవు, మహోదరుడవు, శ్వేతరోముడవు, హరితశ్మశ్రు (పచ్చని గడ్డముగల)డవు, ఊర్ధ్వకేశివి, చలాచలుడవు. నీకు నమస్సులు. గీత వాద్యనృత్య జ్ఞాతవు. గీతవాదిత్ర నృత్య ప్రియుడవు, మత్స్యానివి, వలవు, జలగవు, కాలుడవు, కేళికశవు, కవివి, అకాల, వికాల, దుష్కాల కాలములు నీరూపాలే. మృత్యువు, మృత్యుకారకుడు, యక్షుడు, యక్షులకు భయము గొల్పువాడు. సంవర్తకుడు, అంతకుడు, సంవర్తక వలాహక మేఘములు అన్నీ నీ రూపాలే. గంటవు, గంట కలవాడవు, గొప్ప గంట కలవాడవు, మండగతి, మాలాధరుడవు, మాతలివి, బ్రహ్మవు, కాలుడవు, యముడవు, అగ్నివి, దండధరుడవు, కేశ రహితశిరుడవు, త్రిమస్తకుడవు, నాల్గుయుగాలను, నాల్గు వేదాలను, నాల్గు హోత్రాలను ప్రవర్తింపజేయువాడవు. నాలుగాశ్రమాలకు అధినాయకుడవు. చాతుర్వర్ణ్యకర్తవు. అన్నీ నీవే. ఎప్పుడూ జూదప్రియుడవు. ధూర్తుడవు, సర్వ గణాలను నిరీక్షించువాడవు, గణాధీశ్వరుడవు, ఎర్రని మాలలు, వస్త్రాలు ధరించువాడవు, కందుకానివి, కందుక ప్రియుడవు, శిల్పానివి. శిల్పులలో శ్రేష్ఠుడవు, సర్వ శిల్పాలను ప్రవర్తింపచేసిన ప్రభుడవు నీవు. భగుని నేత్రాలను స్వాహా, స్వధా, వషట్కార నమస్కార రూపివైన నీకు శతశః నమస్సులు. నీవు గూఢ వ్రతుడవు. గుహ్యతమస్వివి, తారవు పూషుని పండ్లను రాలగొట్టిన భయంకరుడవు, తారకా మయుడవు. ధాతను, సంధాతవు, పృథివికి వేరొండు ఆధారానివి. వేద బ్రహ్మ, తపస్సు, సత్యం, వ్రతా చరణం, అర్జవం, భూతాత్మ, భూతకర్త, ఐశ్వర్యం, భూతభవిష్యద్వర్తమానాలు, భూర్ భువః సువర్లోకాలు, ఋతం, ధ్రువం, దాంతం అన్నీ నీ రూపాలే. నీవు దీక్షా రహితుడవు, చక్కనివాడవు, దుర్దాంతుడవు, దాంతికి మూలానివి! చంద్రుని రూపాన, యుగాల రూపాన, మేఘాలు రూపాన నీవే మాటిమాటికీ వస్తుంటావు. బిందురూపివి, అణు రూపివి, స్థూలుడవు, కర్ణికార (గన్నేరు) పుష్పమాలా ప్రియుడవు, నంది ముఖుడవు, భీమముఖుడవు, సుముఖుడవు, దుర్ముఖుడవు, హిరణ్యగర్భుడవు, పక్షివి, భయంకరమైన సర్ప శ్రేష్ఠుడవు, విరాట్పురుషుడవు, అధర్మ నాశకుడవు, మహాదేవుడవు, దండధారివి, ఉత్కట గణరూపివి, ఎద్దువలె రంకె వేయువాడవు (గోవర్ద), గోవులను చాటించువాడవు, వృషభేశ్వర వాహనుడవు, త్రిలోక రక్షకుడవు, గోవిందుడవు, గోమార్గానివి, మార్గానివి, స్థిరుడవు. శ్రేష్ఠుడవు, స్థాణు రూపివి, విక్రోశ, క్రోశ రూపివి అయిన నీకు నమస్సులు. నిన్నెవ్వరూ వారించలేరు, సహించలేరు, అతిక్రమించలేరు, ధర్షించలేరు. నీ వెలుగు (కొందరకు) దుష్టమైనది. నిన్ను దర్శించుట కష్టము. నిన్నెవరు జయింపలేరు. నీవు విజయానివి. ఆకలి, దప్పిక, ఆరోగ్యము, ఆధివ్యాధులు, వ్యాధిశమనము అంతా నీవే. సమూహాలకు సమూహాలనే సంహరిస్తావు. సనాతన దైవానివి, శిఖండివి, పుండరీ కాక్షుడవు, పుండరీక వనాల్లో (సరస్సుల) ఉంటావు. త్ర్యంబకుడవు, దండధరుడవు, ఉగ్రదంష్ట్రలు కలవాడవు, కులాంతకుడవు, విషనాశకుడవు, దేవశ్రేష్ఠుడవు, సోమరస పాయివి, మరుత్తుల నాయకుడవు. అమృతభోజివి, దేవతలకు దేవగణాలకు అధిపతివి, మధువు లొలికించు వారల మధువు త్రాగువాడవు, బ్రహ్మవాణివి, నేయిరాల్చువాడవు. సర్వలోకాలు నీకు భోజ్యాలు, సర్వ లోకాలకు పితామహుడవు నీవే. నీకు నమోవాకములు.

ప్రభూ! నీవు హిరణ్యరేతస్కుడవు! ఏకైక పరమపురుషుడవు. నీవు స్త్రీవి, పురుషుడవు, నపుంసకుడవు, బాలుడవు, ముసలివాడవు, స్థవిరుడవు ఐరావత గజానివి. సర్వమాన్యుడవైన విశ్వకారకుడవు విశ్వసంహారకుడవు. నీకు నమస్సులు. సృష్టిచేయు విధాతలలో నీవు సర్వ శ్రేష్టుడవు. శ్రద్ధాళువు లెల్లవేళల నిన్నారాధిస్తారు. చంద్ర సూర్యులు నీ నేత్రాలు, నీవే అగ్నివి, బ్రహ్మవు. సరస్వతీ రూపాన నిన్నారాధించి నరులు వాక్కును సంపాదింతురు. రాత్రింబవళ్లు నీవే, నిమేషం (కన్నులు మూయుట) ఉన్మేషం (కండ్లు తెరచుట) నీవే. ఓ మంగళ స్వరూపా! నీ మహిమను యథార్థముగా తెలిసికొనుట బ్రహ్మ విష్ణువు ప్రాచీన మహర్షులకు గూడ నలవి కాదు. వేలాది ప్రజల నావరించి నిబిడీకృతమైన ఘోరాంధకారాని కవ్వల వెలుగుచు నీవు వారందరనూ రక్షిస్తూ నడుపుతూ ఉంటావు. నిద్రా ప్రాణాలను నిరోధించి, జితేంద్రియులై సత్వగుణ ప్రధానులగు మహాత్ములు జ్యోతిస్సు రూపంలో దర్శించే యోగాత్మవు, పరమాత్ముడవు నీవు. అట్టి నీకు నమస్కారము. నిర్దేశించుట కలవిగాని సూక్ష్మాతి సూక్ష్మాలయిన నీ అనంత మూర్తులతో, కన్నకొడుకును తండ్రివలె నీవు నన్ను రక్షింపుము. నేను నీచే రక్షింపబడ దగిన వాడను. అట్టి నన్ను సదా రక్షించుము. ఓ పాపరహితా నీకు నమస్సులు. భక్తుల కనికరించు భగవాన్ నే నెల్లవేళల నీకు దాసుడను. ఓ జటాధరా! ముండీ! దండధరా! లంబోదర దేహా! కమండలుధరా! రుద్రరూపా నీకు నమస్కారము. నీ కేశాలలో మేఘాలున్నవి, సర్వాంగ సంధుల యందూ నదులున్నాయి, నీకుక్షి సర్వ సముద్రాలకు నిలయం, అలా జలాత్మకుడవగు నీకు ప్రణామాంజలులు! యుగాంతరవేళల్లో సకల జీవరాశినీ భక్షించి జలాల్లో విశ్రమించే జలశయానుడగు ప్రభువును శరణువేడుచున్నాను. ఆ ప్రభువు రాహువు నోటిలో ప్రవేశించి రాత్రివేళల్లో సోమపానం చేస్తాడు. ఆ నీ తేజస్సు రక్షాకవచం కాగా రాహువు సూర్యునే మ్రింగుచున్నాడు. రుద్రుని రక్షణలో యిచట గర్భపాతాలు జరుగుతున్నవి! అద్భుతానికి స్వధా, స్వాహాగా మారుతున్నది. అంగుష్టమాత్ర పురుషాకృతిలో సకల శరీరులలో నెలకొన్న ప్రభువు ప్రతి నిత్యము నన్ను రక్షించుగాక. ముందుకు నడుపుగాక! నదులలో, సముద్రాల్లో, పర్వత గుహలలో, వృక్ష మూలాలలో, గోశాలల్లో, కీకారణ్యాలలో, చతుష్పథాలలో, రాజమార్గాలలో, సభాసదనాలలో, గజాశ్వ రథశాలల్లో, శిథిలాలయాలలో, ఉద్యానవనాల్లో, పంచభూతాల్లో, దిగ్దిగంతరాలలో, చంద్ర సూర్యులలో, వారల కీరణ సమూహంలో, పాతాళ వాసులలో తదితర స్థానాల్లో సర్వత్రా ఆ విధంగా వ్యాపించియుండే ఆ ప్రభువు మూర్తులకు అహరహం నమస్సులు, ప్రణామాలు, నతులు చేయుచున్నాను. లెక్కకు మిక్కుటమైన రూపాకృతులలో, అసంఖ్యాకంగా గణాల రూపంలో సర్వత్రా వ్యాపించియున్న రుద్రులకు నమోవాక శతాంజలులు! మీరందరు నా యెడ ప్రసన్నులు కండు. మీకు కళ్యాణమగు గాక. నేను మీ వాడను. ఓ దేవదేవా! నీవే నా హృదయం, నా బుద్ధి మతి సర్వస్వమూ నీవే. నీకు నమస్సులు! ఆ విధంగా మహాదేవుడైన శంకరుని స్తుతించి ఆ ఉత్తమ ద్విజుడు వినతుడయ్యెను.