నారదకృత హరనరసింహస్తుతి

“శివా! నీకు నమస్కారము! దేవా! నమస్కారం. విష్ణుదేవా ప్రభవిష్ణూ! నీకు నమస్సు! హరా! ఉమాపతీ! స్థితిలయ భర్తా! నీకు నమస్కారం. బహురూపధారివగు హరా! విశ్వరూపివయిన విష్ణూ! మీకు నమస్సులు. సిద్ధమూర్తి వగు ముక్కంటీ! జ్ఞానదాతనగు కృష్ణా! మీకు నమోవాకములు. “నేనెంతో ధన్యుడను, సుకృతిని. పురుషోత్తములైన మిమ్ములను దర్శింప గలిగితిని. మీ ఇర్వురచే పవిత్రీకృతమైన ఈ చోట స్నానం చేసి పితరులకు తర్పణము లిచ్చిన శ్రద్ధాళువుకు మహేంద్ర జ్ఞానం కలుగును. నేనెల్లప్పుడూ నివసించే అశ్వత్థ మూలాన్ని చూచి, ఆ వృక్షానికి వందన మోనర్చువారు భయంకరమైన యమదర్శనం చేయరు. విప్రోత్తములారా! అచట నుండి ఉత్తమమైన నాగహ్రదానికి వెళ్ళవలెను. పౌండరీక తీర్థంలో స్నానం చేసినచో పౌండరీక యజ్ఞ ఫలం సిద్ధిస్తుంది. విశేషించి చైత్రశుక్లదశమి నాడు అచట స్నాన జపశ్రాద్ధాదులు చేసి ముక్తి పొందవచ్చు. అచట నుంచి దేవతలు సేవించే త్రివిష్టప తీర్థానికి వెళ్లాలి. అక్కడ పాప విమోచనం చేసే వైతరణీ అనే పుణ్యనది ఉన్నది. అక్కడ స్నానంచేసి శూలపాణి మహాదేవుని అర్చించినచో సర్వ పాపాలు వదలి పరమగతిని పొందవచ్చు. ఆ తర్వాత రసావర్తమనే ఉత్తమ తీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసిన ఉత్తమమైన సిద్ధి కలుగుతుంది. చైత్రశుక్ల చతుర్దశినాడు అలేపకమను తీర్థంలో మునిగి శివపూజకావించినచో ఏ మాత్రం పాపం అంటజాలదు.

ఓ మహామునులారా! అటనుండి ఉత్తమమైన ఫలకీవనానికి వెళ్లాలి. అక్కడ దేవగంధర్వ సాధ్య ఋష్యాదులు వేయి దివ్య సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. దృషద్వతి నదిలో మునిగి దేవపితృతర్పణాదులు చేసిన మానవుడు అగ్నిష్టోమాలు అతి రాత్ర క్రతుఫలం పొందుతాడు. కృష్ణపక్ష సోమవారం నాడచ్చట శ్రాద్ధం పెట్టినచో కలుగు ఫలం వినండి. గయాశ్రాద్ధం పితృ దేవతల నెల్లప్పుడూ ఎలా తృప్తిపరుస్తుందో అలాగే ఫలకీవనంలో గావించిన శ్రాద్ధకర్మకూడ అంతటి ఫలాన్నీ ఇస్తుంది. అంతేకాదు; మనసారా ఫలకీవనాన్ని స్మరించినంతమాత్రాననే మానవుని పితరులు సంతృప్తులౌతారు. అందుకు సందేహములేదు. అక్కడే సర్వదేవతల నిలయమైన మహాతీర్థం ఒకటి ఉంది. అందులో స్నానం చేసినవానికి వేయి ఆవులు దానం చేసినంతఫలం లభిస్తుంది. పాణిఖాత తీర్థంలో స్నాతుడై పితృ తర్పణం చేసిన మానవునకు రాజసూయంచేసిన ఫలంకల్గి సాంఖ్యయోగాలు సిద్ధిస్తాయి. అతర్వాత అతి మహిమగల మిశ్రక తీర్థంవస్తుంది. దధీచి మహర్షికై వ్యాసముని సర్వతీర్థ జలాలను అచట కలిపారు. ఆ మిశ్రకంలో స్నానం చేసినచో సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. అటనుండి నియతాహారియై నిష్టతో వ్యాస వనానికి వెళ్ళాలి. అక్కడ మనోజవ తీర్థంలో మునిగి దేవతారత్నం శివుని దర్శిస్తే మనసులోని తలపులన్నీ సిద్ధించడం నిశ్చయం. అనంతరం మధువటి అనే దేవీతీర్థంలో నరుడు శుచియై స్నానం చేసి దేవపితృ తర్పణాదులు చేస్తే ఆ దేవి కృపవల్ల గొప్ప సిద్ధులు లభిస్తాయి.

నియతాహారియైన ఉత్తమ నరుడు దృషద్వతీ కౌశికీ నదుల సంగమంలో స్నానం చేసినచో సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. అంతట హంసతీర్థం వస్తుంది. అక్కడనే పుత్రశోకంతో తల్లడిల్లిన వ్యాసుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. అంతట దేవతలు ఉపశమన వాక్యాలు పలికి ఆయన నిర్ణయాన్ని మార్పించారు. ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి పుత్ర శోకమంటూ కలుగదు. తర్వాత కిందత్తమనే తీర్థంలో ఒక ప్రస్థం (కొలత) నువ్వులు దానం చేసినచో ఋణ బాధలు తొలగిపోయి పరమసిద్ధి లభిస్తుంది. ‘అహ్నం సుదినం’ అనే అతి దుర్లభాలైన తీర్థాల్లో నిర్మలాంతఃకరణుడై స్నానంచేసినవానికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ముల్లోకాల్లో ప్రసిద్ధమైన ‘కృతజప’ తీర్థం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి అచట గంగాస్నానం చేసి మహాదేవుని అర్చిస్తే అశ్వమేధఫలం లభిస్తుంది. అక్కడ కోటి తీర్థంలో స్నానం చేసి శ్రద్ధా భక్తులతో కోటీశ్వర స్వామిని దర్శిస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అటనుండి మూడు లోకాల్లో ప్రసిద్ధి గాంచిన వామన క్షేత్రానికి వెళ్ళవలెను. అచ్చోటనే వామన మూర్తి బలిని వంచించి ఆయన రాజ్యాన్ని ఇంద్రునకు ప్రసాదించారు. అక్కడ విష్ణుపదీ తీర్థంలో స్నానం చేసి వామనదేవుని పూజించిన నరుడు సకల పాపవిముక్తుడై విష్ణులోకాన్ని పొందుతాడు.

బ్రాహ్మణోత్తములారా! అక్కడనే సకల పాపనాశనియైన జ్యేష్ఠాశ్రమం ఉంది. దాని దర్శనమాత్రాన్నే నరుడు ముక్తుడౌతాడు. ఇది తథ్యం. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినా డుపవసించి ద్వాదశినాడు ఆతీర్థంలో స్నానంచేస్తే తోటివారిలో శ్రేష్ఠత్వం లభిస్తుంది. ఆచోట అత్యంత వ్రత దీక్షాపరులు పవిత్రులయిన బ్రాహ్మణులను విష్ణుభగవానుడు నిలిపినాడు. ఆ విష్ణు భక్తుల కొసగు దానములు, అచట జరుపబడు శ్రాద్ధములు అక్షయమై మన్వంతరాంతం వరకూ వాని కర్తలకు ఫలములిస్తూ ఉంటవి. అక్కడే త్రిభువన ప్రసిద్ధమైన కోటితీర్థం ఉంది. దానిలో స్నానంచేసిన వారలకు కోటి యజ్ఞఫలం కలుగుతుంది. ఆ తీర్థంలో కోటీశ్వర మహాదేవుని దర్శనంచేస్తే ఆ స్వామి కృపవల్ల గణాధిపత్యం లభిస్తుంది. ఆ చోటనే మహిమాన్వితమైన సూర్యతీర్థం ఉంది. అక్కడ భక్తియుక్తుడై స్నానంచేయువాడు సూర్యలోకానికి పోతాడు. అచటనుంచి సకల కల్మషనాశకమైన కులోత్తారణ తీర్థానికి వెళ్లాలి. సకల వర్ణాశ్రమవాసులనూ ఉద్ధరించుటకై దానిని స్వయంగా విష్ణుభగవానుడే పూర్వం జన్మించాడు. బ్రహ్మచర్యానంతరమే మోక్షం పొందవలెనని కోరే వారాతీర్థంలో ప్రవేశించినంతనే పరమపదాన్ని దర్శిస్తారు. ఆ తీర్థంలో స్నానం చేసిన బ్రహ్మచారిగానీ, గృహమేధికానీ వానప్రస్థుడుకానీ లేక యతీశ్వరుడు కానీ తమ ఇరవై యొక్క తరాలవారిని తరింపజేస్తారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవరైనా విష్ణుభక్తి తత్పరులై అక్కడ స్నానంచేసి విష్ణుపదాన్ని దర్శించగలరు. వామనదేవుని సహితంగా ఈ కురుక్షేత్రాన్ని ఎంతదూరంగా ఉన్న వారైనాసరే భక్తితో స్మరిస్తేచాలు వారికి ముక్తికలిగి తీరుతుంది. అలాంటప్పుడు ఆ పవిత్రభూమిలో నివసించే వారిభాగ్య విషయం చెప్ప తరమా!

లోమహర్షణు డిట్లనెను, పవనకుండంలో స్నానంచేసి మహేశ్వర దర్శనం చేసుకున్న వాడు సర్వపాపాలు పోగొట్టుకొని శివపదవిని పొందుతాడు. పుత్రశోకంతో వాయువు అందులో లీనుడైపోగా బ్రహ్మాదిదేవతలు ప్రసన్నులై మరల ప్రతిష్ఠింపజేశారు. అక్కడ నుండి దేవగంధర్వుల ద్వారా హనుమంతుడెచ్చట ప్రకటింపబడినాడో, ఆ పవిత్ర శివక్షేత్రం, అమృత క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ స్నానంచేసినచో అమృతత్వం లభిస్తుంది. అంతట తైర్థికుడు కులోత్తారణ తీర్థాన్ని సేవించి తన మాతామహ పితామహాదులందరను తరింపచేస్తాడు. రాజర్షిశాలిహోత్రతీర్థం ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందింది. అక్కడ స్నానంచేసి దేహగతాలైన దోషాలన్నీ పోగొట్టుకోవచ్చు. సరస్వతీ తటానముల్లోక విఖ్యాతమైన శ్రీకుంజతీర్థం ఉంది. దానిలో భక్తితో స్నానంచేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది. అక్కడనుండి నైమిష కుంజాన్ని దర్శిస్తే నైమిశంలో స్నానంచేసిన ఫలితం కలుగుతుంది. అక్కడే మహిమోపేతమైన వేదవతి తీర్థముంది. అక్కడ రావణుడు ఆమె కేశాలు పట్టుకోగా శోకంతో ఆమె అతనివదార్థం శరీరత్యాగంచేసింది. సీత అనేపేరుతో జనకునకు పుట్టి రామపత్నిగా విఖ్యాతివహించింది. ఆ పతివ్రతను రావణుడు ఆత్మనాశనానికై అపహరించు కొనిపోగా రాము దాతనిని వధించి విభీషణుడిని లంకాధిపతిని చేశాడు. ఆ సాధ్విని మరల తనయింటికి గొనిపోయి నాడు. ఆలాంటి పవిత్ర వేదవతి తీర్థంలో స్నానంచేస్తే సమస్త పాపాలు పోయి కన్యాయజ్ఞఫలం కలుగుతుంది. పరమపదం లభిస్తుంది.

అచట నుంచి బ్రహ్మకు ఉత్తమస్థానమైన క్షేత్రానికి పోవాలి. అక్కడ స్నానంచేసినచో నిమ్నవర్ణాలవారు కూడ బ్రాహ్మణ్యం పొందుతారు. పరమపదం పొందుతారు. తర్వాత త్రైలోక్య దుర్లభమైన సోమతీర్థానికి వెళ్ళాలి. అక్కడ తపస్సు చేసి సోముడు ద్విజరాజ్యాన్ని పొందాడు. అక్కడ స్నానంచేసి దేవపితృ తర్పణములుచేస్తే పాపరహితుడై కార్తీకపూర్ణిమ చంద్రుడిలాంటి స్వర్ణాన్ని పొందుతాడు సుప్రభ కాంచనాక్షి విశాల, మానసహ్రదా, సరస్వత్యోఘనామ సువేణా, విమలోదక అనే సప్తసరస్వతులు ఏకమై ప్రవహించే సప్తసారస్వత తీర్థం ముల్లోకాల్లో ఎన్నదగినది. పుష్కర క్షేత్రంలో యజ్ఞం చేస్తున్న బ్రహ్మను చూచి ఋషులు, నదీ శిరోమణి అయిన సరస్వతి లేనిచోట తలపెట్టిన ఆయజ్ఞం సత్ఫలంఇవ్వదని వచింపగా సంప్రీతుడై పితా మహుడు సరస్వతిని స్మరించాడు.

అలా బ్రహ్మచే పిలువబడి సుప్రభాదేవి సరస్వతిగా పుష్కర క్షేత్రానికి చేరుకుంది. బ్రహ్మమీది గౌరవంతో వడివడిగా వచ్చిన ఆసరస్వతినిచూచి సంతోషించి ఋషులు గౌరవించారు. పుష్కర క్షేత్రంలో ఉన్న సరస్వతి మహాత్ముడగు మంకణుని ద్వారా కురుక్షేత్రానికి కొనిరాబడినది.

శౌనకాది మహామునులు నైమిశారణ్యంలో పౌరాణికోత్తముడైన లోమహర్షణుని అడిగారు. “సన్మార్గాన నడుస్తూ యజ్ఞఫలం పొందేమార్గం మాకుతెలుపండి. అంతట ఆ మహనీయుడా ఋషులకు శిరసాప్రణామంచేసి అన్నాడు. సరస్వతీ నది ఉన్న ప్రదేశం గొప్పయజ్ఞ ఫలాన్ని ఇస్తుంది. అంతట స్వాధ్యాయ పరులయిన ఋషులు ఒకచోటచేరి సరస్వతిని స్మరించారు. సత్రయాగ నిష్ఠులుగువారు ధ్యానించగానే వారల స్నానార్థం సరస్వతీ వారి యజ్ఞ స్థలాన్ని చేరుకుంది. మంకణమహర్షి ధ్యానించగానే కాంచనాక్షిఅను సరస్వతి నైమిశంనుండి కురుక్షేత్రానికి వచ్చి చేరింది. గయుడను రాజు గయలో మహాక్రతువు ఆరంభించి అచటకు నదీశిరోమణి సరస్వతిని ఆహ్వానించాడు. అలా గయనుచేరిన సరస్వతిని విశాల అంటారు. ఆ సరస్వతే మంకణుని ప్రార్థన మన్నించి కురుక్షేత్రం చేరింది.

దేవర్షిసేవితమైన ఉత్తరకోసల పుణ్యభూమికి ఉద్దాలకముని ధ్యానించగా సరస్వతి వచ్చి చేరినది. అచట నా శ్రేష్ఠ తరంగిణిని వల్కలాజిన ధారులైన మునిసమూహం పూజించినది. సర్వపాపహారిణి అయిన ఆ నది మనోహరంగా పిలువబడినది. ఆ నది మంకణుని ప్రార్థనను అంగీకరించి ఋషులపట్ల గౌరవంతో కురుక్షేత్రానికి వచ్చింది. కేదార తీర్థంలో ఉన్న సరస్వతిని సువేణ అంటారు. ఋషులు సిద్ధులచే సేవించబడిన ఆమె సర్వపాపహారిణి. ఆ మునియే పరమేశ్వరుని ఆరాధించి ఆమెను కూడా ఋషుల ఉపకారార్థం పవిత్ర కురుక్షేత్రానికి రావించాడు. ఆ సరస్వతీ పుణ్యనదియే పరమేశ్వరుని ఆరాధించి ఆమెను కూడా ఋషులు ఉపకారార్థం పవిత్ర కురుక్షేత్రానికి రావించాడు. ఆ సరస్వతీ పుణ్యనదియే యజ్ఞదీక్షితుడైన దక్షునిచేత గంగా ద్వారంలో విమలోదకరూపాన వెలువరింపబడింది. మహాత్ముడైన మంకణుని పిలుపునందుకొని ఆమె కూడ కురురాజు యజ్ఞ స్థలమైన కురుక్షేత్రం చేరుకొంది. మహానుభావుడైన మార్కండేయముని స్తోత్రానికి సంతోషించి పుణ్యోదక సరస్వతి సరోవర మధ్యస్థలానికి వచ్చి చేరింది. మహాదేవుని చేత నివారింపబడిన సిద్ధుడు మంకణుడా సప్తసారస్వత క్షేత్రంలో ఆనంద నటనం చేస్తూ ఉన్నారు.