బ్రహ్మకృత శివస్తుతి

అలా వచ్చిన శివుని జూచి లోక పితామహుడగు బ్రహ్మ భూమిపైసాష్టాంగ ప్రణామం చేసి యిలా స్తోత్రం చేశాడు. ఓ మహాదేవా! భూతభవ్య భవాశ్రయా! నీకు నమస్సులు! ఓ త్రిలోకపాలకా! స్తుతినిత్యా! పవిత్రదేహా, సర్వకల్మష హరా! చరాచరగురో! నీకు నమోవాకములు. రహస్య ప్రత్యక్ష విషయాలన్నీ తెలుపువాడా! వైద్యుల కసాధ్యమైన సకల రోగములు నశింపజేయువాడా! కురుచర్మవాసా! శోకరహితా! నీకు ప్రణామములు! వారికల్లోల సంక్షుబ్ధ మహాబుద్ధి విఘటకా! దేవా నీ నామం జపించువారు సంసారంలో చిక్కుకొనరు. ఓ నిత్యులలో నిత్యా! త్రిలోకపాలకా! శంకరా! అప్రమేయా! వ్యాధినాశకా! పరా! అపరిమేయా! సర్వజీవప్రియా! నీకు నమోవాకములు. యోగేశ్వరా! సర్వపాపక్ష యకరా! దేవా! స్థాణూ! సిద్ధా! సిద్ధులు వందిమాగధులచే స్తుతించబడు వాడ! సంసార జీవులకు అందనివాడా! విశ్వరూపీ! నీకు ప్రణామములు! ఫణీంద్ర వర్ణిత మహిమాన్వితా! ఫణీంద్ర భుజబంధ కంకణధరా! ఫణీంద్ర దివ్యమాలాధరా! భాస్కరా నీకు నమోవాకములు!