వామన మహా పురాణము
దేవి పునర్జన్మ వృత్తాంతము
అ సర్వవృత్తాంతాన్ని విన్న నారదుడు, బ్రహ్మ శ్రేష్ఠుడవగు ఓ పులస్త్యమునీ! శ్రీదేవి తర్వాతి జన్మను గురించి వినుటకు కుతూహలంగా ఉంది. ఆ కథసవిస్తరంగా చెప్పగలరు. అని అడుగగా అందుకు పులస్త్యుడు ఈ విధంగా చెప్పాడు. నారదా! శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించుటకు ఆ దేవి గైకొనిన తర్వాతి జన్మను గురించి చెబుతున్నాను. హిమవంతుని పుత్రిగా జన్మించి ఆమె శంకరుని పెండ్లాడినది. ఆ తపోధనురాలి పేరు ఉమ. ఆమె కోశాన్నుంచి కౌశికి జన్మించినది. జన్మించి నంతనే ఆమె భూతగణాలతో వింధ్య మూలానికి వెళ్ళి తన ఉత్తమ ఆయుధాలతో శుంభ నిశుంభులను వధించగలదు. అని చెప్పగా అంతట నారదుడు బ్రహర్షీ! నీవు మొదట దక్షుని కుమార్తె సతీదేవి మృతి జెందినదని చెప్పితివి. ఆమె ఏ విధంగా హిమవంతునింట జన్మించెనో చెప్పగోరెదను. ఆ పర్వత పుత్రికోశాన కౌశికి జన్మించిన వైనం, శుంభనిశంభులను రాక్షస వీరులెవరైనది వివరంగా తెల్పుము అని ప్రశ్నించాడు. ఆ నారదునికి పులస్త్యుడు. ఓ మునీ! నీకిప్పుడు పార్వతి జన్మవృత్తాంతమును కుమార సంభవ పురాతన గాథను చెబుతున్నాను. శ్రద్ధగా విను. సతీదేవి మరణానంతరం నిరాశ్రయుడైన శంకరుడు బ్రహ్మచర్య దీక్ష గ్రహించి కఠోర తపశ్చర్యలో మునిగాడు. ఆ విధంగా దైత్య దర్పవినాశకుడైన ఆ దేవసేనాధ్యక్షుడు శివుడు తన దేవసేనాపతిత్వాన్ని విసర్జించాడు. ఆ విధంగా సేనానాయకుడైన శంభుని పోగొట్టుకొనిన దేవతలు మహిషాసురునిచే ఓడింపబడి, శ్వేత ద్వీపవాసీ, మహాహంస స్వరూపుడునైన చక్రగదాపాణి శ్రీహరిని శరణు జొచ్చారు. దేవేంద్రుని నాయకత్వంలో తన్నాశ్రయించిన ఆ దేవతలను చూచి నవ్వి పురుషోత్తముడైన హరి మేఘ గంభీర ధ్వనితో “దురాత్ముడైన మహిషాసురుడు మిమ్ముల నోడించెనాయేమి? మీరందరు కలిసికట్టుగా నాదగ్గరకు వచ్చినారు. అలాగైతే మీ మేలుకోరి నేను చెప్పునట్లు చేయుడు. దానితో మీకు విజయం తప్పక లభిస్తుంది. అగ్నిష్వాత్తులను పితృదేవతలున్నారు గదా? వారల మానస పుత్రిక మేనాకన్య ఉన్నది. ఓ దేవతలారా! మహాతిథినాడు ఆమెను పరమశ్రద్ధా భక్తులతో ఆరాధించి ఆ మహాసతిని హిమవంతుని పెండ్లాడునట్లు ప్రసన్నురాలిని గావించుకొనండి. దక్షునిపై కోపించి తన అపవిత్ర శరీరాన్ని విసర్జించిన మహా తపస్విని ఆమె గర్భమున జన్మించ గలదు. ఆ సౌందర్యవతిని పార్వతి శంకరుని తేజోంశం గలిగిన కుమారుని జన్మనిచ్చును. అతడు దైత్యేశ్వరుడైన మహిషుని సపరివారంగా సంహరిస్తాడు. కనుక మీరందరు మహాఫల దాయకమైన కురుక్షేత్రానికి వెళ్ళి పృథూదక తీర్థంలో పవిత్రమైన మహాతిథినాడు పితరులు నారాధించండి. మీరు శత్రువుల నందర నోడించి సుఖపడతలచుకొంటే ఈ విధంగా చేయండి. ఇందుకు మరొకదారి లేదు అని అన్నాడు.