సప్తగోదావరం మహాత్మ్యం

ఓ సుందరీ! నీవు వెంటనే సప్తగోదావర క్షేత్రానికి వెళ్ళు. ఆ శుభ ప్రదేశంలో మహాను భావుడైన హాటకేశ్వర స్వామిని ఉపాసించుము. నీవు అక్కడ ఉండగా కందరమాల అను దైత్యుని పుత్రిక దేవవతి, అంజనుడను యక్షుని కుమార్తె నందయంతి యను తపస్విని, మరొక సుందరి పర్జన్యుని తనయ వేదవతి అక్కడకు చేరుదురు. వీరు మువ్వురూ హాటకేశ్వరుని చరణాలకడ సప్తగోదావర సంగమజలాలలో కలిసినప్పుడు నీవు నీ భర్తను మరల కలుసుకోగలవు. ఆ ముని మాటలు వినినంతనే ఆలసింపక నా చిత్రాంగద సప్త గోదావర సంగమంవద్ద గల హాటకేశ్వర క్షేత్రానికి వెళ్ళి శుచిగా భక్తి శ్రద్ధలతో కందమూల ఫలాలు తింటూ నా హాటకేశ్వరుని పూజింప మొదలుపెట్టింది. జ్ఞాన సంపన్నుడైన అ ఋషి  కంఠేశ్వరుని అలయంమీద, చిత్రాంగదకు హితముచేయు సంకల్పముతో ఒక మహాఖ్యాన గర్భితమైన శ్లోకం ఈవిధంగా వ్రాశాడు. “ఈ మృగలోచని దుఃఖాన్వితను పరాక్రమంతో పోగొట్ట జాలిన, త్రిదశుడుగాని, అసురుడుగాని యక్షుడుగాని నరుడుగాని రజనీచరుడుగాని లేదు!” అలా విశ్వకర్మ పుత్రిని ఆదేశించి ఆముని, శరణ్యుడు సర్వజన వంద్యుడైన పుష్కరనాథు నీపయోష్ణీ నదిని సేవించుటకై విశాలాక్షిని సంస్మరిస్తూ వెళ్ళాడు.