సరస్వతీ సనాతన తీర్థవంశం

లోమహర్షణుడు చెప్పదొడగెను. బుద్ధిమంతుడగు మార్కండేయుని మాట విని సరస్వతి ప్రవాహరూపంతో కురుక్షేత్రంలో ప్రవేశించింది. ఆ పుణ్యజల ప్రవాహం అచ్చటికి చేరి కురుక్షేత్రాన్ని తడుపుతూ పశ్చిమ దిశగా మళ్లింది. అక్కడ మహర్షి సేవితాలయిన వేయి తీర్థాలున్నవి. పరమేష్టి కృపవల్ల వాటిని వర్ణిస్తాను వినండి. పవిత్ర తీర్థాలను స్మరిస్తే పుణ్యం, చూస్తే పాపక్షయం, స్నానం చేస్తే పరమదుశ్చేష్టితులకు గూడ ముక్తి కలుగుతాయి. ఎవరు తీర్థాలను స్మరిస్తారో, అచట దేవ ప్రీతికరాలయిన కార్యాలు చేస్తారో, స్నానాలు చేస్తారో, వాని పట్ల శ్రద్ధ గలిగి ఉంటారో, వారంతా ఉత్తమగతులను పొందుతారు. అపవిత్రుడైనా, పవిత్రుడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే కురుక్షేత్రాన్ని స్మరించినంతనే మానవునకు బాహ్య అంతరశుచిత్వం కలుగుతుంది. ఇంతేకాదు. నేను కురుక్షేత్రం వెళ్తాను. అక్కడ నివాసం చేస్తాను. అనినోట పలికినంత మాత్రాన్నే పాపక్షయం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం, గయాశ్రాద్ధం, గోగ్రహంలో మరణం, కురుక్షేత్రవాసం వల్ల నాలుగు విధాలముక్తులు చెప్పబడినవి. సరస్వతీ దృషద్వతీ ఈ రెండు దేవనదుల మధ్యగల భూమి దేవ నిర్మితమైంది. దానిని బ్రహ్మావర్తమంటారు. దూరాన ఉంటూకూడ నేను కురుక్షేత్రం వెళ్లాను. అక్కడ ఉంటాను అని నిరంతరం అంటూ ఉండేవాని సర్వ పాపాలుపోతాయి. అచట సరస్సులో స్నానం చేస్తూ సరస్వతీ తీరాన ఉండే వారికి బ్రహ్మజ్ఞానం కలుగుటలో సందేహం లేదు.

దేవతలు, ఋషులు, సిద్ధులు కురుజాంగలాన్ని సదా సేవిస్తారు. ఆ కారణాన వారు బ్రహ్మను తమలోనే చూడగలుగుతున్నారు. క్షణభంగురమైన మానవజీవితాన్ని పొంది, మోక్షమును కోరువారు జితేంద్రియులై ఈ క్షేత్రాన్ని సేవిస్తారు. ఎంతటి దురాచారులైనను సరే అనేక జన్మార్జితాలయిన పాపాలనుంచి ముక్తులై తమ హృదయాల్లో ఆ పవిత్ర బ్రహ్మతత్వాన్ని చూడగలుగుతారు. నిత్యమూ బ్రహ్మదేవుని కురుక్షేత్రాన్ని సన్నిహిత సరోవరాన్ని భజించే మానవులు పరమపదప్రాప్తి పొందుతారు. గ్రహనక్షత్ర తారలకైనా కాలంతీరిన తర్వాత పతనం పొందుతామనే భయం ఉండవచ్చుగాని కురుక్షేత్రంలో మంణించువారలకు అలాంటి భయం ఉండదు. బ్రహ్మ మొదలగు దేవతలు ఋషులు సిద్ధులు యక్షులు గంధర్వాప్సరసాదులు తమతమ పదవులు నిలబెట్టు కొనుటకు ఆ క్షేత్రాన్ని సేవిస్తారు. అక్కడకువెళ్ళి శ్రద్ధతో స్థాణుసరోవరంలో స్నానంచేస్తే మనస్సులోని కోరికలన్నీ సిద్ధిస్తాయి. సందేహంలేదు. వ్రతనిష్ఠతో ఆ సరోవరానికి ప్రదక్షిణంచేసి, రంతుకానికి వెళ్ళి మరలమరల క్షమాయాచనచేస్తూ సరస్వతినదిలో స్నానంచేసి యక్షుని దర్శించి ధూప దీప పుష్పనైవేద్యాదులతో పూజించి ఓ యక్షేంద్రా! నీ అనుగ్రహంవల్లనే నేను తలపెట్టిన ఈ తీర్థ అరణ్య సరోవరాల పర్యటనం నిర్విఘ్నంగా నెరవేరుగాక అని ప్రార్థించవలెను.