వామన మహా పురాణము
రక్తబీజుని రణ విహారం - వధ
పులస్త్యుడు అన్నాడు: నారదా! చండముండులు వధింపబడి తమ సైన్యమంతా చెల్లా చెదరు కావడంచూచి శుంభనిశుంభులు రక్త బీజుడనే ఘోరరాక్షసుణ్ణి ముప్పదికోట్ల అక్షౌహిణీ సైన్యంతో యుద్ధానికి పంపించారు. వారు రావడం చూస్తూనే చండిక భయంకరమైన సింహనాదం చేసింది. ఆ దైత్యులు కూడా సింహనాదాలు చేశారు. ఆమె గర్జిస్తుండగా ఆమె నోటినుండి, అక్షమాల కమండలాలు ధరించి హంసల విమానం మీద కూర్చున్న బ్రహ్మణి వెలువడింది. మరుక్షణాన మూడుకన్నులు త్రిశూల, సర్పకుండలాలు వలయాలు ధరించి వృషభారూఢయై మాహేశ్వరి ఉద్భవించింది. అంతట మహర్షీ! ఆమె కంఠాన్నుండి నెమలి ఈకలు శక్తిని ధరించి నెమలి మీద కూర్చొని కౌమారి పుట్టింది. ఆమె బాహువుల నుండి శంఖ చక్ర గదాఖడ్గశార్ఙ్గ బాణాలు ధరించి గరుడుని ఆరోహించి రూపసి అయిన వైష్ణవి జన్మించింది. ఆమె పృష్ఠ భాగాన్నుంచి మహోగ్రమైన రోకలిపట్టుకుని క్రోధంతో, దంష్ట్రలతో భూమిని త్రవ్వుతూ శేషనాగం మీద కూర్చొని వారాహీదేవి వచ్చింది. ఆమె స్తన మండలాన్నుంచి ఏనుగు మీద కూర్చొని వజ్రాంకుశాలూ వివిధాలంకారాలు ధరించి మహేంద్రి ఆవిర్భవించింది. అంతట భయంకరమైన జూలు విదిల్చి ఆసటలతో ఆకాశంలోని గ్రహనక్షత్రతారకలను చెదరకొట్టుచు వాడియైన గోళ్ళతో భయంకరాకారయగు నారసింహీ, ఆ దేవి హృదయాన్నుంచి బయటకువచ్చింది. వారలచేత సంహరించబడిన రాక్షసబలాన్ని చూచి నిర్భయంగా ఆ చండిక మరొక పర్యాయం గర్జించింది. ముల్లోకాల్లో నిండిన ఆ మహానాదాన్ని విని దేవదేవుడు త్రిశూలి త్రినేత్రుడచటకు వచ్చి అంబికకు అభివాదనంచేసి -”దుర్గే! నేనుచేయవలసిన కర్తవ్యం ఆజ్ఞాపించమని” కోరాడు. ఆయన వాక్యాలతో బాటు దేవి శరీరంనుండి వచ్చిన శివ ఆయనతో, శంకరా నీవు శుంభనిశుంభులు వద్దకు దూతగా వెళ్లి వారితో - మీరు బ్రతుకదలచుకుంటే వెంటనే సపరివారంగా సప్త పాతాళానికి వెళ్ళండి. దేవతలకువారి స్వర్గం ఇచ్చివేయండి. బ్రాహ్మణులు నిర్విఘ్నంగా యజ్ఞయాగాదులు చేసుకుంటారు. అలాగాక బలంతో క్రొవ్వి యుద్ధం చేయదలచుకుంటే అవశ్యంగా రండి. అందరనూ యమలోకానికి పంపుతామని చెప్పమన్నది.
ఓ నారదా! ఆమె శివుని దూతగా నియోగించినందున శివదూతి అను పేరు గలిగినది. శంకరుని హితవచనాలు విని ఆ గర్విష్టులు హూంకారాలు చేస్తూ ఆ కాత్యాయని ఉన్నవైపు పరుగులు తీశారు. అంతట ఆ రాక్షసులందరు బాణాలు శక్తులు, అంకుశాలు పరశువులు, శూలభుశుండి పట్టిపాదులు, వాడిగల ప్రాసపరిఘలు ఆ దేవి మీద ఒక్క మారుగా వర్షించారు. ఆ మహేశ్వరి ఉత్తమమైన ధనుస్సును సంధించి వందలాది నిశిత బాణాలు గుప్పించి, ప్రచండమైన విక్రమంతో, ఆ మహాసురులు శస్త్రాస్త్రాలను తునాతునకలు గావించి వారల బాహువుల ఖండించింది. మరెందరనో బాణసహస్రాలు వర్పించి వధించింది. మారిత్రిశూలంతో కొందరను పరిమార్చింది. కౌశికి ఖట్వాంగంతో కొందరను వధించింది. ఇక బ్రాహ్మి మంత్రించిన జలం చిలకరించి ఎందరినో హతమార్చింది. మహేశ్వరి శూలంతో శత్రువుల వక్షాలను చీల్చి చంపితే వైష్ణవి మరెందరనో భస్మంగావించింది. కౌమారీ శక్తితో, ఐంద్రి వజ్రంతో, ముట్టెతోను చక్రంతోను వారాహి, వాడి గోళ్ళతో చీల్చి నారసింహీ, వికటాట్టహాసధ్వనులతో శివదూతీ ఎందరనో యమసదనానికి పంపించారు. రుద్రుడు త్రిశూలంతో వినాయకుడు పరశువుతో ఎందరినో హతమార్చారు. ఈ విధంగా పరమేశ్వరి తన అసంఖ్యాక రూపాలతో దైత్యముఖ్యుల నెందరినో సంహరించింది. వారల దెబ్బలకు భూపతితులైన రాక్షసులందర్నీ భూతగణాలు తినివేయడంతో మహాప్రళయం ఏర్పడింది. ఆ విధంగా దేవతలు మాతృగణాల సంహారకాండకు భయాతురులై రాక్షసవీరులు జుట్టుముడులు వీడగా కళ్ళచూపులు చెదిరిపోగా పారిపోయి రక్త బీజుని ఆశ్రయించారు. అంత నా రక్తబీజుడు భయంకరంగా గర్జిస్తూ శ్రేష్ఠమైన ఆయుధాలతో మాతృకాగణాలను, భూతగణాలను చీకాకుపరుస్తూ కదనరంగానికి దూకాడు. అది చూచిన మాతృకాగణాలు వాడి శరీరాన్ని వాడిశస్త్రాస్త్రాలు వర్షించి చిల్లులుపడజేసారు. వాడి శరీరాన్నుంచిక్రింద పడిన ప్రతి రక్తపుబిందువునుంచి వాడంతటివాడు మరొక రక్తబీజుడు పుట్టసాగాడు. యుద్ధభూమి అంతా రక్తబీజులతో నిండిపోయింది. ఆ విచిత్రాన్ని గమనించిన కౌశికి కేశిని పిలిచి ఓ చండీ! నీ నోటిని విశాలంగా తెరచి వాడి వంటినుండి పడే రక్త బిందువులన్నీ త్రాగేసి వేయుమని ఆదేశించింది. దేవి ఆదేశం ప్రకారమే చండి పైపెదవి ఆకాశాన్నీ క్రింది పెదవి భూమిని తాకునట్లు తన భయంకరమైన వక్తాన్ని తెరిచి అశత్రువును జుట్టుపట్టుకొని తన నోటిలో వేసుకొని మింగేసింది. శూలంతో వాడి వక్షం భేదించి రక్తం ఒక్కబొట్టు కూడ క్రిందపడకుండా త్రాగేసింది. శరీరంలోని నెత్తురంతా పోవడంతో ఆరక్తబీజుడు శక్తిహీనుడైపోయాడు. వాడిని వెంటనే స్వర్ణాలంకృతమైన చక్రంతో నూరుముక్కలుచేసింది.
అలా రాక్షస సైన్యాధిపతి చావడంతో దానవులంతా దైన్యంతో “హా తండ్రీ! హా సోదరా! వెళుతున్నావా, క్షణం అగుమాగు” మంటూ ఆర్తనాదాలు గావించారు. జుట్లు విరబోసికొని వస్త్రాలూడిపోగా, కవచాలు ఆభరణాలు ముక్కలుకాగా భయకంపితులయిన యితరుల నామృడాని నేలపై బడగొట్టినది. వారలు “బ్రతుకు జీవుడా”యని ఆ కొండను వదలి పారిపోయారు.