వామన మహా పురాణము
శ్రీ వామన మహాపురాణ విశేషాలు
శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారం వామనావతారం. ఆ అవతార మూర్తి పేరుతో వెలసినదే వామన పురాణం. పరబ్రహ్మం అనబడే పరమాత్మ నిర్గుణం అని వేదాంత వేద్యుల ఉక్తి. సగుణ రూపంలో ఆ పరబ్రహ్మను కనిపెట్టి జీవుడు ఉపాసిస్తున్నాడు. బ్రహ్మం యొక్క సగుణ రూపాలు శివ విష్ణు రూపాలు. వీటిల్లో విష్ణువును జీవునికి రక్షకునిగా భావించడం జరిగింది. ఈ రక్షణ అనే ప్రక్రియలో ఆయన తన అసలు స్వరూపంలో కాక వేరొక రూపంలో అవతారం ఎత్తి, భూమిపై దిగివచ్చి భక్తుల కష్టాలను కడతేర్చి, వారికి ముక్తిని కలిగిస్తాడు. ఈ రక్షణ ప్రక్రియలో ఆయన రాక్షసులను వధించటం జరుగవచ్చు. దుర్మార్గులను తగిన విధంగా శిక్షించవచ్చు. అయితే అవతార ముఖ్య ఉద్దేశ్యం కేవలం రాక్షసులను వధించడమే కాదు. ఈ దుఃఖ భాజనమైన సంసార జంజాటం నుండి జీవునికి విముక్తి కలిగించి అనందమయ ముక్తిని పొందే విధానం నేర్పటమే భగవంతుడు అవతారం ధరించటంలోని పరమార్ధం అని భాగవతం (మర్త్యావతారం ఖలు మర్త్య శిక్షణం రక్షోవధాయైవ కేవలం విభోః-5.1. -5) తెలుపుతున్నది. అందువలన విష్ణువు ఎత్తిన అవతారాలను తెలిపే పురాణాలే వామన, కూర్మ, వరాహ, మత్స్యపురాణాలు. వీటిల్లో వామన పురాణం అష్టాదశ పురాణాల్లో 14వ స్థానం ఆక్రమిస్తుంది.