ప్రపంచమునకు ఆధారమైనవాడు, అణువుకంటె అణువైనవాడు, సర్వ భూతములందు ఉండువాడు, అచ్యుతుడు, జ్ఞానమూర్తి, మిక్కిలి స్వచ్ఛమైనవాడు, పరమార్థముగ నిర్మలుడు (గుణ సంగము లేనివాడు), భ్రాంతి దృష్టికి జగముగ (వస్తువుగ) తోచువాడు, సర్వవ్యాపకుడు, సర్వము కబళించువాడు, సృష్టి స్థితులను తానే చేయు స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు, పుట్టుట, హాని వృద్ధులు లేనివాడు, ఆద్యుడు మిక్కిలి సూక్ష్మమైన వాడును అగు విశ్వేశునికి బ్రహ్మాదులకు నమస్కరించి ఇతిహాస పురాణవేత్త వేదవేదాంగ పారగుడు సర్వశాస్త్ర తాత్పర్య రహస్యము ఎఱిగినవాడు పరాశరకుమారుడును అగు నా గురునికి వ్యాస భగవానునికి మ్రెక్కి వేద తాత్పర్యమైన పురాణమును చెప్పుచున్నాను అని వారికి చెప్పి సర్వాత్మకుడైన భగవానునికి, తన గురువైన కృష్ణద్వైపాయన వ్యాసునికి మ్రొక్కి పూర్వము దక్షాది మునులు అడుగగ, బ్రహ్మ పలికిన కథమైనదానిని పాపహరమైన దానిని చెప్పెదను వినుడు. ఇది అర్థ గంభీరము, బహు చిత్రము, వేదార్థ విస్తరము. దీనిని ఎప్పుడు ధారణచేయు వాడును, వినునట్టి వాడును స్వవంశోద్ధరణ మొనరించి స్వర్గమందు ఆదరమును పొందగలడు.