అని లోమహర్షణుడు ఇట్లు అనెను-
ఆయువు పుత్రులు మహారధులు అయిదుగురు. స్వర్భానుని (రాహువు) కుమార్తె ప్రభయను నామెయందు జన్మించిరి వారు అయిదుగురును జన్మించిరి. వారు నహుషుడు, వృద్ధశర్మ, రంభుడు, రజి, అనేనుడు, అనువారు త్రిలోక ప్రసిద్ధులు. రజి అయిదు వందలమంది కుమారులను కనెను. ఈ క్షత్ర కుటుంబము రాజేయమని ప్రసిద్ధికెక్కినది. ఇంద్రునికి గూడ ఇది భయంకరమయ్యెను. దేవాసుర యుద్ధమైన తఱి ఆ ఉభయులకును మా ఇర్వురకును జరుగు యుద్ధమందు ఎవ్వరు జయింతురో వినవలయునని కోరిక గలదు. నిజము ఎరిగింపుమని బ్రహ్మనడిగిరి. వారితో బ్రహ్మ రజియను ప్రభువు ఆయుధమెత్తి ఎవ్వరివంక పోరాడునో వారు ముల్లోకములను గెలువగలరు. రజి ఎటుండునో అటనే ధైర్యము ఉండును. ధృతి ఎటుండునో అచ్చట లక్ష్మి ఉండును. ధృతియు, శ్రీయు ఎందుండునో అక్కడ ధర్మము జయమును కల్గును అని అనెను.
అది విని దేవ దానవులు ప్రీతులై రజిని తమవంక రమ్మని కోరుకొనుచు ఆహ్వానించిరి. స్వర్భానుని దౌహిత్రుడు (రాహువుయొక్క కూతురు కొడుకు) ప్రభయందు పుట్టినవాడు, పరమతేజస్వి, సోమవంశ వర్ధనుడు అగు రజింగనివారు మాకు జయము కల్గుటకు నీవు విల్లు గైకొనుమని వేడికొనిరి. అతడు విని అర్ధజ్ఞుడుగావున స్వార్ధమెంచి తన కీర్తిని ప్రకాశింపజేయుచు ఇట్లనియె.
దైత్య గణములను అన్నింటిని గెలిచి, ధర్మమున నేను ఇంద్రుడను అగుదునేని అప్పుడు యుద్ధమున పోరెదను అని రజియనగా వేల్పులు మొదట సంతోషపడిరి. అట్లే నీ కోరిక సఫలము చేసికొమ్మునిరి. అటు పిమ్ముట ముఖ్యుల జూచి దేవతలను అడిగినట్లు అడిగెను. దానవులు దర్పసంపూర్ణులు గావున స్వార్ధమునే చూచికొని సాభిమానముగ అతనికి ఇట్లు బదులుపలికిరి.
అతడు అట్లే అని దేవతలచేత గూడ వీనిని (ప్రహ్లాదుని) గెలిచి ఇంద్రుడవై తీరెదవని ప్రేరేపింపబడి, దానవులందఱును సంహరించెను. వజ్రపాణికి గూడ వధింపనలవిగాని వారిని గూడ తుదముట్టించి పరమ శ్రీమంతుడైన రజిపూర్వము నష్టమైపోయిన వేల్పుల ఐశ్వర్యమును పునః ప్రతిష్ఠ చేసెను. అప్పుడు ఇంద్రుడు అమరులతో కూడుకొని మహాధీరుడు అయిన రజిని చూచి నీవు నిక్కముగ దేవేంద్రుడవే. నాపనులచే నేను నీకు పుత్రుడ అను ప్రఖ్యాతిని కాంచెదననెను. రజియు అట్లు మాయచే శత్రువుచే మోసగింపబడి అట్లేయగుగాక అని సంప్రీతినందెను. అట్లు ఆ నృపతి దేవసముడై స్వర్గమునకు అతని అతని పుత్రులు ఐదువందల మంది ఆతని ఆస్తిని (పిత్రార్జితమును ఇంద్రుని నుండి గైకొనిరి, అట్లు స్వర్గము ఆక్రమించి వారు రాగమత్తులై తమకు తాము మూఢులై, ధర్మ దూరులై బ్రహ్మద్వేషులై వీరవిక్రమముల గోల్పోయిరి. అందుపై కామక్రోధ వశులైన వారిని చంపి ఇంద్రుడు ఎప్పటియట్ల స్వస్థానమును బొంది స్వస్థుడయ్యెను. ఈ శతముఖుని స్థాన భ్రంశమును పునః ప్రతిష్ఠానమును విన్న వాడును ధారణ జేసినవాడును దుర్గతి పాలుగాడు అని
సూతుడు ఇట్లు అనియె-
రంభునకు సంతానములేదు. ఇక అనేనసుని వంశము వర్ణించెద. అనేనసుని కుమారుడు యశస్వియైన ప్రతిక్షత్రుడు అనురాజు. వాని తనయుడు సంజయుడు. వాని బిడ్డడు జయుడు. వానికుమారుడు విజయుడు. వాని తనయుడు కృతి. వాని సుతుడు హర్యత్వతుడు. వాని ఆత్మజుడు సహదేవుడు. మంచి ప్రతాపశాలి. వానికొడుకు ధర్మ శీలియగు అదీనుడు. జయత్సేనుడు వాని కుమారుడు. వాని యౌరసుడు సంకృతి. వాని బిడ్డడు ధర్మపరుడైన క్షత్రవృద్ధుడు, కీర్తిశాలి. ఇప్పటి వరకును అనేనసులు చెప్పబడిరి. ఇక క్షత్రవృద్ధుని వంశమును చెప్పెదను. క్షత్రవృద్ధుని తనయుడు సుసహోత్రుడు. యశస్వి వాని సంతానము, పరమ ధార్మికులు కాశుడు, శలుడు గృత్సమదుడు అనువారు. గృత్సమదుని కుమారుడు శునకుడు. వాని కొడుకు శౌనకుడు. వానికి బ్రాహ్మణ క్షత్రియులు, వైశ్యశూద్రులు కలిగిరి. అర్ఘిసేనుడు శలుని కుమారుడు. వాని తనయుడు కాశుడు. కాశుని కొడుకులు కాశిపుడు, దీర్ఘతపుడు. ధనువు దీర్ఘతపుని కుమారుడు. విద్వాంసుడు. వాని తనయుడు ధన్వంతరి. ఆయన మహత్తర తపము చేసి వృద్ధుడయిన దశలో ధనువునకు కల్గినాడు. దేవతాంశమున మున్నుదయించిన ధన్వంతరియే ఇపుడు మానవ అంశమున జన్మించెను. కాశీ మహారాజై భరద్వాజుని వలన ఆయుర్వేదమును చదివి వైద్యముచేసి సర్వ రోగహరుడై ఆ శాస్త్రమును, ఎనిమిది భాగములు గావించి, (అష్టాంగ మొనరించి) శిష్యులకు ఉపదేశించెను.
అ ధన్వంతరి తనయుడు కేతుమంతుడు. భీమరథుడు అతని తనయుడు. దివోదాసు అతని తనయుడు. అతడు ధార్మికుడు కాశీనగరమును ఏలినవాడు. ఈతని కాలముననే క్షేమకుడు అను రాక్షసుడు వారణాసిని శూన్యము గావించెను. మహాత్ముడైన నికుంభుని శాపముచే వేయేండ్లు కాశీ క్షేత్రము అట్లు గావలసివచ్చెను. అట్లు శాప నష్టమైన, రమ్యమైన నగరమును దివోదాసుడు గోమతీ తీరమందు పునర్నిర్మించెను. ఇంతకుముందు వారణాసి భద్రశ్రేణ్యుని పాలనయందు ఉండెను. దివోదాసుడు వాని కుమారులను నూరుగురు మేటి విలుకాండ్రను చంపి భద్రశ్రేణ్యుని రాజ్యము గెలిచి నూతన నగర నిర్మాణము చేసెను.
భద్రశ్రేణ్యుని తనయుడు దుర్ధముడు దివోదాసునిచే బాలుడని కరుణచే విడువబడినవాడై హైహయుని దాయాద్యమును (పరంపరాగతమైన రాజ్య సంపదను) హరించెను. బలాత్కరించి హరించిన సామ్రాజ్యమును మహానుభావుడగు దుర్దముడు లాగికొనెను. తన ప్రతాపముచే వైరమును అంతముచేసెను. దివోదాసునికి దృషద్వతి యందు వీరుడగు ప్రతర్ధనుడు ఉదయించెను. బాలుడైనను అతడు పరబలమును హరించెను. వాని తన యులు వత్సుడు, భర్గుడు అనువారు మిక్కిలి కీర్తిశాలురు. వత్సుని కుమారుడు అలర్కుడు. అలర్కుడు బ్రహ్మజ్ఞాని, సత్యప్రతిజ్ఞుడు. వానికొడుకు సన్నతి. రాజర్షియగు అలర్కుని గూర్చి ప్రాచీనుల శ్లోకమొకటి గలదు. అతడు అరువది ఆరువేల ఏండ్లకు లోకోద్ధారకుడై, లోపాముద్రానుగ్రహ పాత్రుడయ్యెను. రూప యౌవన సంపన్నుడైన అతనికి సువిశాలమైన సామ్రాజ్యముండెను. శాపాంతమున క్షేమకుడను రాక్షసుని చంపి వారాణసీ నగరమును రమ్యముగ పునర్నిర్మాణము గావించెను.
సన్నతి కొడుకు సునీధుడు. వానినుండి క్షేముడు, వానికి కేతుమంతుడు, వానికి సుకేతువు, వానికి ధర్మకేతువు వానికి మహారధుడగు సత్యకేతువు, వానికి విభువు. వానికి ఆనర్తుడు, వానికి సుకుమారుడు, వానికి దృష్టకేతువు, వానికి వేణుహోత్రుడు, వానికి భార్గుడు అనుపుత్ర పరంపర ఏర్పడెను. వత్సునికి వత్సభూమి, అనువాడు భార్గునకు భార్గభూమి అనువారు పుత్రులు. వీరందరును అంగిరసుని పుత్రులు. భార్గవ వంశము వారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వేలకొలది జన్మించిరి. ఇది కాశ్యపవంశము ఇక నహుషుని పరంపర వినుడు. (11)