వ్యాసుడు అనియె -
ఇట్లు దేవేంద్రునిచే భగవంతుడు పొగడబడిన భావగంభీరముగ నవ్వి, ఇట్లు పలికెను. జగన్నాథా! నీవు దేవ ప్రభువవు. ఇంద్రుడవు. మేము మానవులము. నేను చేసిన ఈ అపరాధము నీవు క్షమింపవలయు. ఈ పారిజాత తరువును యథా స్థానమునకు కొనిపొమ్ము. సత్యభామ వచనానుసారము నేను దీనిని కొనివచ్చితిని. నీచే విసరబడిన ఈ వజ్రాయుధము పూజనీయము. దీనిని నీవే చేకొనుము. శత్రువుల చీల్చు ఈ ప్రహరణము (ఆయుధము) నీదే. అని అనగా ఇంద్రుడు ఇట్లనియె. స్వామి! నేను మర్త్యుడనని పలికి నన్ను తబ్బిబ్బు చేయనేల? భగవంతుడగు నీవలని అనంత సౌఖ్యమును ఎఱిగిన (రుచి మఱగిన) మేము నిన్నెఱుగుదుము. జగన్నాథ! నీవెవ్వడవో ఆతడే అగుదువుగాక! (నీ స్వరూపమును గూర్చి తర్కింపపనిలేదన్న మాట) అయినను ప్రవృత్తి యందున్నావు. (నివృత్తియందు కేవలము నీవు సాక్షివి. కూటస్థ బ్రహ్మమయినను) జగత్కంటకుల నిష్కర్షను (పెల్లగించి వేయుటను) జేయుచున్నావు (దుష్ట సంహారము కొఱుకు అవతరించితి వన్న మాట) కావున ఈ పారిజాతమును ద్వారవతికి కొనిపొమ్ము. నీవు మర్త్యలోకము విడిచిన తర్వాత ఈ వృక్షము అచ్చట ఉండదు అనగా హరియు ఇంద్రునితో అట్లే కమ్మని అతనితోడి సిద్ధ గంధర్వులు ఋషులును కొనియాడ భూలోకమునకు ఏతెంచి ద్వారకానగరము పై నుండి శంఖమును పూరించి పురవాసులకు ఆనంద మొనరించెను.
సత్యభామతో గరుడుని పైనుంచి దిగి పారిజాతతరువును సత్యభామ పెరటిలో నాటించెను. నగర మందలి జనము ఆ స్వర్గతరువును దర్శించి పూర్వ జన్మ స్మృతినందిరి. ఆ పారిజాతము యొక్క పూవుల వాసనచే మూడు యోజనముల దాక పరిమళించుట మరియు యాదవులెల్లరునాతరువునందు అద్దమందువలె తమ ముఖదర్శనము చేయుటయే గాదు దేవగంధర్వ మానుషులు ఎల్లరు అందు దర్శించిరి. ప్రాగ్జ్యోతిషము నుండి నౌకరులు గొనివచ్చిన ఏనులు గుఱ్ఱములు ధనము స్త్రీలను కృష్ణుడు నరకుని పరిగ్రహము నుండి గ్రహించెను. అవ్వలనొక సుముహూర్త మందు నరకుని చెఱునుండి విడిచి రప్పింపబడిన ఆ కన్యలందఱను (అవివాహితలు అన్నమాట) తన కులధర్మానుసారము పదునాఱువేల మీద ఒక వంద మందిని యథాశాస్త్రముగా పాణిగ్రహణ మొనరించుకొనెను. అయ్యెడ భగవంతడగు శ్రీకృష్ణుడు అందఱుకు అన్ని రూపముల తాల్చెను. ఆ కన్యకలును ఒక్కొక్కతె ఒక్కొక్కనిగా కృష్ణుని భావించి ఎవరి మట్టుకు వారు గోవిందుడు నాపాణియే గ్రహించి నా చేతినే చేపట్టెనని అనుకొనిరి. రాత్రులందు జగత్సృష్టి కర్తయగు మాధవుడు యోగీశ్వరేశ్వరుడు కావున విశ్వరూపధరుడై అందఱి ఇండ్ల ఇన్నిరూపుల తానొక్కడై సంచరించెను. (204)