బ్రహ్మ మహా పురాణము

అక్రూర స్తవము

పంచతన్మాత్ర రూపుడు, ఊహింప అలవిగాని మహిమ గలవాడు, సర్వ వ్యాపకుడు అనేక రూపుడు ఏకరూపుడు అయినవాడు అగు పరమాత్మకు నమస్కారము. శబ్దరూపము హవిస్స్వరూపము విజ్ఞాన రూపము అయినవానికి ప్రకృతి కంటె పరునికి నమస్కారము. భూతాత్మయు ఇంద్రియాత్మయు ప్రధానాత్మయు నీవే. ఆత్మయు (జీవుడు) పరమాత్మయు నీవే. ఇట్లు నీవొక్కడవే ఐదుగా ఉన్నావు. క్షరము (సర్వభూతము) అక్షరము (కూటస్థుడు) సర్వధర్మ మూర్తివి బ్రహ్మ విష్ణు శివాది నానావిధ కల్పనలచే పిలువబడు నీవు ప్రసన్నుడవు కమ్ము. నీ స్వరూపము పలుకుటకు అలవికానిది. నీవు ఏమి ప్రయోజనము గలవాడవో తెలుప శక్యముగాదు. నీ అభిదానమిది అని చెప్ప వశముగాదు. అట్టి పరమేశ్వరుని నిన్ను గూర్చి వినతుడను అయ్యెదను. నామము జాతి మొదలైన కల్పనలు ఎందులేవో అట్టి పరబ్రహ్మము, నిత్యము అవికారి అజమునైనది నీవే. కల్పన కాకుండ సకల పదార్థము లందువువు కావున కృష్ణ, అచ్యుత, విష్ణు నామములచే (కల్పనలచే) నీవు స్తుతింప బడుచున్నావు.

నీవు సర్వమునకు ఆత్మవు. వికల్పములచే నీవే దేవతలు విశ్వమును. ఓ విశ్వాత్మ! నీవు వికారభేదము లేనివాడవు. అంతట నీకంటే వేరొకటి ఇంచుకయు లేదు. నీవు బ్రహ్మవు, పశుపతివి, ఆర్యముడవు (సూర్యుడు), విధాతవు, ధాతవు, ఇంద్రుడవు, వాయువు, అగ్నివి, జలాధిపతి వరుణుడవు, ధనేశుడవు (కుబేరుడు) నీవు. అంతము చేయువాడు (యముడు) నీవు. ఒక్కడయ్యు భిన్న భిన్న శక్తులచే భిన్నభిన్న రూపుడవై జగత్తును రక్షించుచున్నావు. కిరణ రూపమున నీవు జగత్తును సృజించి హరింతువు. ఈ విశ్వము పంచభూత వికారము. గుణమయము. ‘సత్’ అను శబ్దమున కర్థమైన పరమ స్వరూపము అక్షరమునై సదసద్రూపుడవు జ్ఞానరూపుడవునగు నీకు నమస్కారము. వాసుదేవుడవు, సంకర్షణుడవు ప్రద్యుమ్నుడవు, అనిరుద్ధుడవు అగు నీకు నమస్కారము (చతుర్వ్యూహాత్మకమైన పరమాత్మకు నమస్కారము) అని ఇట్లు నీళ్లలో కృష్ణుని పొగడి ఆయాదవుడు మనస్సుచేత కల్పింప బడిన ధూపదీప పుష్పాదులచే షోడశోపచారములచే శ్రీహరిని అర్చించెను. మానసిక పూజ చేసెనన్నమాట. ఇతర విషయములను విడిచి మనస్సును కృష్ణరూప పరబ్రహ్మము నందు నిలిపి చిరకాలమునకు సమాధినుండి విరమించెను. తనను కృతార్థునిగ భావించి, యమునా జలముల నుండి వెడలి మరల రథము దగ్గరకు వచ్చెను. వచ్చి రామకృష్ణులను ముందటివలె ఉన్నవారిని గాంచెను. ఆశ్చర్యమున చూచు అక్రూరునితో కృష్ణుడు యమునా జలమున నీవేమి వింతచూచితివి నీ కన్నులు ఆశ్చర్య వికసితములైనవని అనగ అక్రూరుడు ఇట్లనియె.

అచ్యుతా! నీళ్ళలో నేనేమి వింత కనుగొంటినో అది ఇచటనే రూపొంది నాముందర కలదు. ఈ జగచ్చిత్రము ఏమహాత్మునిచే ఆశ్చర్యరూపమై ఉన్నదో అట్టి ఆశ్చర్యములకు అవధియైన నీతో నేనిపుడు కూడికొన్నాను. ఈవింతతో మనము మధురకు వెళ్ళుదమా! కంసునకు నేను జడియుచున్నాను. ఛీ! ఛీ! పరులు పెట్టిన పిండముచే బ్రతుకువాని జన్మమేమి జన్మము అని వాయువేగమున రథాశ్వములను తోలెను. కొంచెము మధ్యాహ్నముగల సాయంకాలమున అక్రూరుడు మధురలో బ్రవేశించెను. మధురను చూచి బలరామ కృష్ణులతో అతడు ఇట్లు అనెను.

“మీరు ఇరువురు నడచిరండు. నేను రథమున ఒక్కడనే నగరమున ప్రవేశింతును. మీరు వసుదేవుని గృహమునకు ఏగకుడు. మీ నిమిత్తమున అ వృద్ధుని కంసుడు బాధించును అని అక్రూరుడు ఒక్కడే మధురలో ప్రవేశించెను. రామకృష్ణులు రాజమార్గమునకు వచ్చిరి. ఆనందభరితములైన చూపుల జూడబడుచున్న స్త్రీలు, పురుషులు విలాసముగ ఏనుగు గున్నలట్లు రాజవీధిలో నడచిరి. అచట అట్టిట్టు తిరుగుచు వారొక చాకలిని జూచి చక్కని చలువమడతలను ఇమ్మని అడిగిరి. వాడు కంసుని చాకలి కావున మిగుల విస్మయ మంది రామకృష్ణులను గూర్చి ఆక్షేప వాక్యముల పెక్కులు బిగ్గఱగా అరచెను. అంతట కినుకనుకొని కృష్ణుడరచేత గొట్టివాని తలను బుడమిండకొట్టెను. వానిని చంపి పీత నీలాంబరులు కృష్ణుడు రాముడును బట్టలను తీసుకొని ముదమున పూమాలలు కట్టు వృత్తికల వా(మాలాకారు)ని ఇంటికి చనిరి. చక్కగా ఉన్న వారిని చూచి వాడు దేవతలు అవనికి దిగివచ్చిరని ఎంచి మోములు వికసింప, వారు పువ్వులిమ్మని అడిగినంతట, చేతులంపుడమి తాకి తలతో నేలనంటి ప్రసన్న సుముఖులై ప్రభువులు నా ఇంటికి వచ్చి తిరి నేను ధన్యుడను. మిమ్ము అర్చించెదనని ఆమాలా కారుడు పలికి, హర్షవదనుడై పరిమళించు చక్కనిపువ్వులు ఏరియేరి, మురిపించుచు మఱిమఱి మ్రొక్కి కోరి వారికి కానగా ఇచ్చెను. కృష్ణుడును ప్రసన్నుడై మాలాకారునికి వరమిచ్చెను. ఓ భద్రుడా! (శుభలక్షణా) నన్ను ఆశ్రయించిన సిరి నిన్నెప్పుడును విడువదు. నీ బలమునకు హానిగలుగదు. ఓ మంచివాడ! ధనహానియు నీకు కలుగదు. నీవు విపులములైన భోగములను అభవించి, తుదకు నా ప్రసాదము వలన నా అనుస్మరణ మంది దివ్యలోకము చేరెదవు. నీమనసెల్ల వేళల ధర్మమునందు ఉండగలదు. నీ సంతతికి పుట్టినవారికి దీర్ఘాయువు కల్గును. నీసంతతి సూర్యుడున్నంత కాలము ఎట్టి ఇబ్బందులకు లోనుగాదు” అని పల్కి మాలాకారుని పూజగొని వాని ఇంటినుండి కృష్ణుడు బలదేవుని తోడుగా బయలు వెడలెను. (192)