బ్రహ్మ మహా పురాణము

క్షరాక్షరతత్త్వ విమర్శము

మునులు వ్యాసునితో ఇట్లనిరి:

అక్షర తత్త్వమును చేరినవారు సంసారమున మరల ఆవృత్తిని పొందరు. క్షరతత్త్వమును చేరినవారు మరల సంసారమున అవృత్తులగుదురు అని తెలిపితిరి. ఈ రెండు తత్త్వములను వివేచించి తెలుప ప్రార్థింతుము. వేదతత్త్వజ్ఞులును మహాభాగులు అగు ఋషులును మహాత్ములగు యతులును నీవు జ్ఞానవేత్తలలో శ్రేష్ఠుడవని ప్రశంసించు చున్నారు. ఇట్టి మీ నుండి ఈ విషయమును మేము వినగోరుచున్నాము. ఉత్తమ అమృతమును ఎంత వినియు మేము తృప్తులగుట లేదు.

వ్యాసుడు ఇట్లనెను:

ఈ విషయములో మీకు పురాతనమగు వసిష్ఠ జనక సంవాద రూపమగు ఇతిహాసమును వినిపింతును. ఋషులలో శ్రేష్ఠుడును సూర్య తేజోయుక్తుడును తన సభలో కూర్చున్న వాడు అగు వసిష్ఠుని శ్రేయః ప్రదమగు ఉత్తమ జ్ఞాన విషయమున ప్రశ్నించెను. ఆ వసిష్ఠుడు పరమాత్మ తత్త్వమును బాగుగా నెరిగినవాడు. అధ్యాత్మ విషయమున నిశ్చయాత్మక జ్ఞానము కలవాడు. అట్టి ఋషివర్యుని జనకుడు దోసిలి యొగ్గి నమస్కరించి తన హృదయమునుండి ఉత్పన్నమైనదియు మధురమును చక్కగా ఏర్పరచుకొనబడినదియు అగు పై ప్రశ్నమును అడిగెను;

బ్రహ్మ యొక్క పగటి సమయమున పరమాత్ముడగు నారాయణుడు సృష్టిని జరుపును. రాత్రి కాగానే దానిని రుద్ర రూపమున సంహారమొనర్చి నిద్రించును. మరల పగలు కాగానే సృష్టి ఆరంభించును. అణిమ లఘిమ మొదలగు అష్టసిద్ధులకు ఈశ్వరుడు అవ్యయ జ్యోతీ స్వరూపుడు అన్ని వైపులకు అంతట పాణిపాదములు నేత్ర శిరో ముఖములు కర్ణములు కలిగి సాంఖ్యశాస్త్రము నందు బహుధా నామములతో వ్యవహరింపబడుచు, విచిత్రరూపుడు విశ్వాత్ముడు ఏకాక్షరుడు అని శాస్త్రములలో చెప్పబడుచు, ఏకాత్మకమగు త్రైలోక్యమును స్వశక్తితో ధరించుచున్న ఆ పరతత్త్వము బహు రూపములతో విశ్వముగ కనబడుటచే విశ్వాత్ముడనబడుచు, తానే మాయావశమున వికారమును పరిణామమును పొంది, తన్ను తానే ప్రపంచముగా సృజించుకొనుచున్నాడు. అప్పుడతనికి విరించి అనియు మహత్తత్త్వము అనియు ఇత్యాది వ్యవహారము. ఈ తత్త్వమే శాస్త్రములలో బుద్ధితత్త్వము హిరణ్య గర్భుడు అనియు చెప్పబడినది. ప్రజాపతులచేత నమస్కరింపబడు ఆ తత్త్వమును మహాతేజస్సంపన్నమగు అహంకార తత్త్వమనియు అవ్యక్త తత్త్వమునుండి వ్యక్తమైన విద్యా సృష్టియనియు అవిద్యా సృష్టియనియు వివిధములుగ వ్యవహరింతురు. ఏలయన ఏకైక తత్త్వము నుండియే అచరము చరము అవిద్య విద్య భూతసృష్టి వైకృత ప్రపంచము అన్నియు ఏర్పడినవి. శబ్ద స్పర్శ రూప రస గంధములనెడి తన్మాత్రలు పృథివ్యాప్తేజో వాయ్వాకాశములనెడి పంచభూతములు ఈ పదియు ఒకేమారు వ్యక్తములైనవి. మనస్సుతో కూడ త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణములనెడి ఐదు జ్ఞానేంద్రియములు వాక్పాణి పాదపాయూపస్థము అనెడి కర్మేంద్రియములు ఐదును జన్మించినవి. ఈ విధముగా చతుర్వింశతి ఇరువది నాలుగు తత్త్వములును ఏర్పడినవి. వీనితోనే ఈ సమస్తమగు ప్రపంచమును, నరకము, యక్షులు, భూతములు, గంధర్వులు, కింనరులు, మహోరగులు, దోమలు, ఈగలు, పురుగులు, కీటకములు, శునకము, శ్వపాకుడు మొదలగు రూపములలో పృథివి జలాకాశములందుండు స్థిర చర రూపములగు ప్రాణులు జడచేతన పదార్థములు ఏవేవి కలవో అన్నియు ఆ పరమాత్మునియొక్క రూపమే. ఇది ఆ అక్షర, నాశములేని, తత్త్వమునుండి క్షరమగుచున్నది. వ్యక్తమగుచున్నది. కనుక ఇది క్షరము. ఇది మరల ఆ అక్షర తత్త్వమునందు లయము నొందుటచే కూడ ఇది క్షరము-నశించునది అనబడును. ఇచట చతుర్వింశతి తత్త్వములు పంచ భూతములు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, చిత్త మనో బుద్ధ్యహంకారములు అనెడి అంతఃకరణ చతుష్టయము ఇవి ఇరువది నాలుగు. మఱియు క్షరతత్త్వము వ్యక్తమయి సృష్టి జరుగు దశలు ఐదు. 1. పరమాత్మ, 2. బుద్ధి తత్త్వాత్మక హిరణ్యగర్భుడు; 3. ఈ హిరణ్యగర్భుని అహంకారము నుండి కలిగిన సూక్ష్మ భూతసృష్టి; 4. భూతముల వైకృతము; 5. భౌతిక లోకముల-లోకములందలి ప్రాణుల సృష్టి. ఈ జగత్తు అంతయు మోహాత్మకమైనది. అమూరమగు అవ్యక్తతత్త్వము నుండి వ్యక్తమై మూర్తిని ధరించినది.

ఈ క్షర స్థితికి అతీతమగు అమూర్త అవ్యక్త మూలకూటస్థ తత్త్వము అక్షరము. త్రిగుణాతీతమైనది. వ్యవహారమున సత్త్వగుణ ప్రధానమైనది. ఇంతవరకు చెప్పిన చతుర్వింశతి తత్త్వాత్మక వ్యక్త జగత్తునకు అధిష్ఠాతయగు నిత్యతత్త్వమది. ఈ తత్త్వము అన్ని మూర్తతత్త్వములకు అంతర్యామియై వాని హృదయాకాశమున నుండును. వాటిని ఆయా వ్యాపారముల యందు ప్రవర్తింప జేయును. తనకు మూర్తి, రూపము, లేకయు మూర్త రూపమున, ప్రపంచ రూపమున వ్యక్తమగును. సృష్టి ప్రళయ ధర్మము నొంది సృష్టి ప్రళయ రూపమై ఇంద్రియ గోచరమగును. నిర్గుణుడయ్యు సగుణ రూపము ధరించును. ఇట్లు తత్త్వము వికృతిని, పరిణామమును పొందుచుండియు ప్రకృతి, మూలతత్త్వ రూపమయి వాటి విషయమున ఏ అభిమానమును లేక ధీరుడై యుండును. అజ్ఞానులగు జనులు తన్ను సేవించుకొనుటకు అనువుగా త్రిగుణాత్మక మూర్తులుగా అవతారములెత్తి ఆయాజన్మలు ధరించుచున్నదీ అక్షర తత్త్వము. కాని అతడు జ్ఞాన స్వరూపుడు, తాను బాల్యాది దశలు లేనివాడయ్యు ఆయా రూపములలో నుండి నేను బాలుడను వృద్ధుడను ఇత్యాది అభిమానములను పొందుచున్నాడు. అహంరూపుడు కాకయు అహంకారమును ప్రకటించుచున్నాడు. వ్యవహారమునకై శుక్ల కృష్ణ లోహిత వర్ణములు కలవిగా చెప్పబడు సత్త్వతమో రజో గుణాశ్రితుడై గోచరించుచున్నాడు. కాని ఈ గుణములు మూడును ప్రాకృత జనులలో ప్రాణులలో వ్యవహారమున గోచరించుచున్నవి. తామస జీవులు నరకమును పొందును. రజోగుణ ప్రధానులు మానుష భావమున ఉందురు. సత్త్వ ప్రధాన జీవులు దేవత్వమును పొందుదురు. కేవలము పాపులు నరకమును పశుపక్ష్యాది తిర్యక్ జన్మములను పొందుదురు. పుణ్య పాప మిశ్రణమున మానవత్వము కలుగును. కేవల పుణ్యముచే దేవత్వము కలుగును. మోక్షము వీటికన్నిటికి అతీతము. అది కేవల జ్ఞానము చేతనే సాధ్యము. ఇరువది యైదవది అగు అక్షర తత్త్వములో అజ్ఞానము గుణములు మూర్తి మొదలగు దోషములు లేవు. ఆ తత్త్వము కేవల జ్ఞాన రూపమై శుద్ధ జ్ఞానముతోనే ప్రవర్తిల్లును. (241)