బ్రహ్మ మహా పురాణము

కుబ్జోద్ధారణము

అటుపిమ్మట కృష్ణుడు రాజమార్గము వెంట సుగంధ ద్రవ్యపాత్రను చేకొని వచ్చుచున్న నవయౌవనశాలిని అగు కుబ్జను జూచెను. ఇందీవరాక్షీ! ఈ అనులేపనము ఎవఱికొఱుకు తీసుకొనిపోవుచున్నావు. నిజము చెప్పమని కృష్ణుడు ఆమెను ప్రశ్నించెను. సాభిలాషముగ హరి ముచ్చటింప అదియు అనురక్తిగొని ఆసుందరుని చూచినంత వివశమైన మనస్సును, బలిమియై నిలిపి హరితో సొంపుగ ఇట్లు పలికెను. కాంతుడా! నీకు తెలియదా? నేను సుగంధ ద్రవ్యానులేపన కార్యక్రమమున కంసునిచే నియోగింపబడినదానను. అనేక వక్ర అను ప్రసిద్ధి గన్నదానను. కంసునికి నా కూర్చిన కలవము దప్ప ఇతరము ప్రియము కాదు. అతని అనుగ్రహ సంపదకు నేను పాత్రమును’.

అన కృష్ణుడు ‘సుందరముఖి; రాజునకు అర్హమైన ఈ మంచి గంధము మేమిద్దరము పూసికొనదగినది. అది మాకు ఇత్తువా? అనగా ఆమె వెనువెంటనే ‘తీసికొమ్మ’ని ఆదరముతో వారికిచ్చెను. వారు చిత్ర చిత్ర రచనలుగా ఆ గంధమును పూసికొని ఇంద్రధనస్సుతో శోభించు తెల్లని నల్లని మేఘములట్లు భాసించిరి. అంతట హరి ఉల్లాపన నిపుణుడు కావున (మధుర హాస్యవచన రచనా నిపుణుడు గావున) దాని గడ్డము క్రింద జేయిజేర్చి దాని పాదములందన యడుగులం ద్రొక్కిపట్టి (భక్తులను ఉద్ధరించు నెరజాణ గావున) ఈమెను మీదికెత్తి లీలగ ఇటు అటు ఊచెను. దానిచే ఆ పడతి మేని వంకర లెల్ల పోయి, తీరి తిన్న పడిన శరీరమున సుందరుల కెల్ల సుందరి అయ్యెను. అవ్వల ప్రేమ నిర్భర మృదు మధుర మంద్రముగ మా ఇంటికి రమ్మని పలికి సవిలాసముగ నతని పై వలువగొని యాకర్షించెను. స్వామి తప్పక వచ్చెదననెను. అ విలాసిని బలభద్రుని వంక అల్లన గనుచు పెద్దగా నవ్వి కృష్ణుని వదలెను. అమె ఇచ్చిన అమంచి గంధమును అయిద్దరు పూసి కొని రంగు రంగుల పూలమాలలుదాల్చి నీలాంబర పీతాంబరధారులై ధనుశ్శాలకు చనిరి. ధనుర్యాగమునకు నిర్దిష్టమైన ధనుశ్శ్రేష్ఠము ఎక్కడ ఉన్నదని శాలారక్షకులను అడిగి తెలిసికొని హరి దానిని గొని ఎక్కుపెట్టెను. ఎక్కుపెట్టినది తడవుగ అది విరుగగా వెలువడిన చప్పుడు మధురా పట్టణము నలుమూలల అలము కొనెను. ఆవిల్లు విరుగుట చూచి శూలా రక్షకులు మీరెవ్వరని ప్రశ్నింప బదులు పలుకకయే ఆ అయన్నదమ్ములు ధనుశ్శాల నుండి వెడలిరి. కంసుడు అక్రూరుని రాకను, రామకృష్ణులు, ధనుస్సును విరచుటను విని చాణూర ముష్టికులను జూచి, గోపాల బాలకులు ఇద్దరు వచ్చినారు. మల్లయుద్ధమున నా ప్రాణమును హరించువారిని మీరు సంహరింపుడు. అందువలన నేను సంతోషించెదను. న్యాయా న్యాయ విచక్షణ లేకుండ ఎట్లైనను మీరు వారిని కడతేర్చవలెను. దాన మీకోరినదెల్ల తీర్చగలను. వారి వధవలన నీ రాజ్యము నాకును మీకును ఉమ్మడి సొత్తు కాగలదు’ అని ఆ మల్లురకు ఆజ్ఞ ఇడి మావటి వానిని పిలిచి ‘నీవు మదపుటేనుగును సమాజ ద్వారమున నిలుపుము. కువలయాపీడమను ఆ మదగజము చేత మల్లరంగ ద్వారమునకు వచ్చిన ఆ గొల్లపిల్లలను త్రొక్కింపుము అని ఆనతి ఇచ్చి పోగాలము దాపురించిన ఆ దుష్టుడు కంసుడు, సూర్యోదయమున కెదురు చూచుచుండెను.

పౌరులు మంచములందును, రాజులు భృత్యులతో ఏగి తమకు ఉచితములగు మంచములందు అధిష్ఠించిరి. మల్లురు ప్రశ్నకులు (మధ్యవర్తులు) ఆ సభారంగమున నడిమి భాగమున వసించిరి. కంసుడు అందరికంటె ఎత్తైన మంచెనందు (అనగా ఆసనము నందు) అసీనుడయ్యెను. అంతఃపుర జనము వసింప వేర్వేరు అసనములు అమర్చబడెను. వార స్త్రీలు ఒకచో, నగరాంగనలు ఒకచో నందాది గోపకులు ఒకచో ఆసీనులైరి. అక్రూర వాసుదేవులు ఆ మంచే ప్రాంతమున ఉండిరి. పౌరాంగనల నడుమ పుత్రవాత్సల్య భరితయగు దేవకిని ఆబిడ్డ నెమ్మోము తుదిగడియలోనైన చూతునుగాక అని కూర్చుండెను.

ఉత్సవ వాద్యములు మ్రోగగా చాణూరుడు ఎగిరెగిరి గంతులిడుచుండ, ముష్టికుడు బాహువులు చరచ, లోకము హాహాకారము ఒనరింప మావటీడు తమ మీదికి తోలిన కువలయాపీడమును చంపి, దాని మదముచే రక్తముచే శరీరములు పూతవడ దాని దంతములు పెరికి ఆయుధములుగ ధరించి సగర్వ విలాసమున చూచుచు మృగముల నడుమ మృగరాజులట్లు బలరామకృష్ణులు మల్లరంగమును ప్రవేశించిరి. అంతట అన్ని రంగములందు ఇతడే కృష్ణుడు. ఇడుగో బలభద్రుడని జనము వింతగొనిచేయు హాహాకారము మిన్నంటెను. ఘోర రాక్షసిని పూతనను చంపిన అతడే ఇతడు. శకటాసుర భంజనము, యమల అర్జునోన్మూలనము చేసినవాడు కాళియ ఫణి ఫణాగ్రమున నర్తనము జేసిన ఆ బాలుడు ఇతడే. గోవర్ధన మహాగిరిని ఏడురోజులు ఎత్తిపట్టిన పలుదిట్ట ఆతడు. అరిష్ట, ధేనుకులను, కేశి అను హయమును విలాసముగ చంపిన మహాత్ముడు అచ్యుతుడు ఇతడే. ఇతని ముందు సవిలాసముగ ఈ మల్లరంగమున పచారు చేయుచున్న సుందరీ నయనానందకరుడు యదునందనుడు ఇడుగో! బలరాముడు. ఈ స్వామి హరిపురాణ అర్థములను లెస్సగ చూచిన ప్రాజ్ఞులు. గోపాలమూర్తియై కంసునిచే దిగబడియున్న యదువంశమును ఉద్ధరింపగలడని పొగడొందిన బాలుడిడుగో. ఇతడు సర్వసృష్టి హేతువు. సర్వము తానైన విష్ణువు అంశమున అవతరించి భూభారమును హరింప ఉన్నాడు’ అని ఇట్లు బలరామ కృష్ణులను పౌరులు కొనియాడుచుండ దేవకిపాలు చేపుకొన ఆ బిడ్డలంగని మనసునందు తాపము నొందెను. మహోత్సవము చూచుచున్న నెపమున తన పుత్రులనే చూచుచు పై గదిసిన ముదిమి (వార్ధక్యము) పోయి, యువకుడట్లై వసుదేవుడు తనిసెను. శుద్ధాంతః స్త్రీలు నాగర స్త్రీ సమాజము కనుగవలు అల్లార్చి అవిరామముగ ఆ రామ కృష్ణులను తిలకించిరి - మఱియు ఇట్లాండొరులతో మురిసి ముచ్చటింప జొచ్చిరి.

సఖులార! కమలములవలె ఇంపుగొలుపు కృష్ణుని నెమ్మోము గనుడు. ఏనుగుతోడి పెనుగులాటచే నొడవిన శ్రమచే గ్రమ్మిన చెమట బిందువులతో హరి వదనము మంచు బిందువులు పై బడిన వికసిత నవాంబుజ మట్లు సొంపు కులుకుచున్నది. అల్లదే చూడుడు. అక్షరము (అవినాశి) అయిన పరబ్రహ్మమును మరచి వినశ్వరమగు నీ జగద్దృశ్యమును మరిగిన మన ఈ జన్మమును మన కన్నులను సఫలములను జేసుకొందము. శ్రీవత్సలాంచితమై సర్వ జగదావాసమై శత్రువులను మట్టుపెట్టు ఈవీరుని వెడద ఉరంబును విశాల భుజయుగమును సఖీ! కన్గొనవె. గంతులిడు ముష్టికునితో రంతులుచేయు చాణూరునితో తక్కుంగల మల్లురతో వీరాలాపముల మేలమాడు బలరాముని నెమ్మోము గనరె! సఖులారా. పలుదిట్టయగు చాణూరునితో పసిబాలుడు గోపాలుడు తలపడుచున్నాడు. అన్యాయమిది అని చెప్పగల పెద్దలెవ్వరు ఇక్కడ లేరా? ఇపుడిప్పుడు అంకురించు యౌవనమునకు ఉన్ముఖుడై సుకుమార శరీరుడై ఉన్న ఈ హరియెక్కడ వజ్రకఠినమై నిండు మదమెక్కి ఉక్కును మించిన నెమ్మేన ఉన్న ఈ మహా రాక్షసుడెక్కడ? పరమ సుకుమారులు చిరుతప్రాయమువారు గోపాలురే రంగమందున్నవారు. వీరితో ఉజ్జీగ, పరమ రాక్షసులు అతి దారుణులు చాణూరాదులు మల్లులు ఎదుట ఉన్నారు. ఈ విపర్యయము ఈ మర్యాదను ఇటనున్న మధ్యవర్తులు ఉల్లంఘించుట కడు విపరీతము. మధ్యస్థులిది చూచి ఉపేక్షించుచున్నారు. అని ఇట్లు ఊరక పౌరసుందరులు పరితపించుటగని పుడమి కంపింప హరి చూపరులకు ఆనందోత్కర్షమును వర్షించుచు యుద్ధసన్నద్ధుడయ్యెను. బలరాముడును బాహువులు చరచి చక్కగ ఇటు అటు దూకినంతట అడుగడుగున అవని పగులు పడవలసినది అట్లు కాకుండుట అదియు ఒక అద్భుతమయ్యెను.

అంతట చాణూరునితో కృష్ణుడును మల్లయుద్ధ విశారదుడైన ముష్టికుడు బలదేవునితో తలపడిరి. ఒండొరులు దూరముగ విసరుట, గ్రుద్దుట, పట్టు గడచినంత చేబట్టి దిగనడచుట, పాదములను తన్నుట, మర్ధించుట మొదలగు మల్లయుద్ధ భంగిమలచే, వారితో అస్త్రములులేని అతిఘోరమైన అతిదారుణమైన సమరము జరిగెను. ధనుర్యాగ ఉత్సవమందు తన బల ప్రాణములచే ఎంతెంత చేయగలడో అంతకు చుట్టరికమని లేకుండ ఆ రామకృష్ణులు పోరాడిరి. జగదంత ర్యామియైన కృష్ణుడును వానితో విలాస మాత్రముగనే పోరెను.

అంతట కంసుడు భేదమువలన, తనయొక్క వధను, చేయనున్న, చేతిని, చలింప జేయుచున్న కృష్ణునిచే కల్గిన, కోపము వలనను (అనగా కృష్ణుడు విజృంభించిచేయు భీషణమైన యుద్ధము చూచినందు వలన కల్గిన బాధవలనను, తనను చంపనున్న హస్తమును, పాముపడగవలె ఆడించుచున్న కృష్ణుని యెడల ఉడుకుమోతుతనమువలన గల్గిన క్రోధమువలనను) చాణూరునియందు బలక్షయమును కృష్ణునియందు బలవృద్ధిని చూచి యుద్ధ వాద్యములను ఆపు చేయించెను. మృదంగాది వాద్యములు అట్లు ఆపబడినంత ఆ క్షణము అకసమందలి దేవవాద్యములు (దుందుభులు మొదలయినవి) భోరన క్రాసినవి.

“జయింపుము గోవింద! చాణూరుని సంహరింపుము కేశవ. ఈ దానవుని అంతము చేయుము” అని అంతర్థానగతులై వేల్పులు ఆనందమంది హరిని స్తుతించిరి. మధు సూదనుడు చాలసేపు చాణూరునితో ఆడికొని తుదముట్టింపదలచి వానిని లేవనెత్తి అంతకు నూఱుఱెట్ల ఊపున గిరగిరత్రిప్పి గగనమంద ప్రాణములువాసిన వానిని బుడమిపై విసరి వేసెను. ఆ వ్రేటున వాడు నూరుప్రక్కలై రక్త స్రావము చేసికొని అనేలను అంతటిని పెనుబెందడి గావించెను.

చాణూరునితో హరియట్లు బలదేవుడును ముష్టికునితో పోరెను. అతడును వీని ముష్టిచే నడితల నడచి మోకాలును ఱొమ్మునం బొడిచి, పుడమిపై బడవేసి ప్రాణములు పోవ కాలఱాచెను. కృష్ణుడు ఎడమ పిడికిలితో గ్రుద్ది, మల్లవీరుని మహాబలుని అవిధముగ భూతలమున పడవేసెను. చాణూరుడు నిహతుడు కాగా ముష్టికుడు కూల్పబడగా అచ్చట ఉన్న మల్లురు అందరూ పారిపోయిరి. అపుడు కృష్ణ సంకర్షణులు ఇద్దరు అవీరవిహారమున తమ ఈడువారల బలాత్కారముగ ఆకర్షించి, ఆయారంగభూమిపై కుప్పించి గంతులు పెట్టిరి. అంతట కంసుడు కినుకచే కనులెఱ్ఱవడ అట చెదఱియున్న తన మనుజులతో “ఈ గోపకులను ఇద్దరిని ఈ సమాజముగుంపునుండి బలాత్కారమున గెంటివేయుడు, పాపాత్ముడు నందుని ఇప్పుడే సంకెళ్ళచే బంధింపుడు. వృద్ధులకు తగినిట్టిదిగాని, దండనమున వసుదేవుని గూడ కట్టివేయుడు? కృష్ణునితో ఎగిరెగిరి గంతులు పెట్టు ఈ గొల్లల గోధనములను కొల్లగొట్టు”డు అనెను.

ఇట్లు ఆజ్ఞయిచ్చు ఆ కంసుని చూచి, మెల్లగా నవ్వి మధుసూదనుడు మీదికి దూకి ఎత్తుగా ఉన్న సింహాసనముపైకెక్కి కంసునిబట్టి జుట్టుపట్టి లాగి, కిరీటము తొలగి ఇలపై పడునట్లుగా వానిని పడవైచి వానిపై పడెను. ఎల్ల జగములకు ఆధారమైన బరువుచే మీదబడిన కృష్ణునిచే ఆయుగ్రసేని (ఉగ్రసేనుని కొడుకు) కంసరాజు ప్రాణములను వదెలెను. చచ్చిన వాని కేశముల బట్టి కేశవుడు వాని దేహమును ఆ రంగమధ్యమందు బరబర ఈడ్చి వైచెను. సహజముగ పెద్దది, బరువైనది, క్రోధముచే మఱియు బరువెక్కినది అగు కంసుని శరీరమును మహాత్ముడగు కృష్ణుడు కూల్చి వేసి కడువేగముగా ఈడ్చబడి వేసెను. అది చూచి వాని తమ్ముడు సునాముడు ఎత్తి రాగ, బలభద్రుడు లీలగ వానిని పడగొట్టెను. హరిచే అవమానమునకు గురియై మధురాధీశ్వరుడు కంసుడు హతుడు అగుటను చూచి, కని ఆ రంగమండపమెల్ల హాహాకారములతో నిండిపోయెను. కృష్ణుడును వెనువెంటనే బల రామునితో కలసి దేవకీ వసుదేవుల వద్దకు పోయి వారి పాదములను పట్టుకొనెను. వసుదేవుడు దేవకియు, జనార్దనునెత్తి జన్మ సమయమున (పురిటింట) స్వామి పల్కిన పల్కులను తలచుకొని వారికి ప్రణతులై నిలిచిరి. అప్పుడు వసుదేవుడు ఆ ప్రభువును ఇట్లు వినుతించెను.