బ్రహ్మ మహా పురాణము

ఆది సర్గ వర్ణనము

తెలియరానిది, అవ్యక్తము, సర్వకారణము, నిత్యము ఉన్నదియు, లేనిదియు అయినది ప్రధానము ఒకటి గలదు. దానినుండి పరమేశ్వరుడు విశ్వమును సృజించెను. అదియే తత్త్వము, బ్రహ్మ సర్వభూత స్రష్ట, అతడు నారాయణపరాయణుడు. అదియే మహత్తత్వము (బుద్ధి) అందుండి అహంకారము, అందుండి పంచభూతములు జనించెను. వాని స్థితిభేదమును బట్టి వివిధ భూతకోటి పుట్టినది. ఇదియే సనాతనమగు ధర్మము సర్గము (సృష్టి). మీకీర్తిని ఇనుమడింప జేయునది ఇదే. ఈ సృష్టి విలాసము, నేను విన్నంత శ్రుతుల వలన నాకు తెలిసినంత పూర్తి విస్తరముగ తెలిపెదను వినుడు. ఇది కీర్తిశాలురకు ఎల్లరకు పుణ్యమును పెంచును.

అటు తరువాత స్వయంభువు (బ్రహ్మ) తొలుత అప్పులను సృజించెను. అప్పులు అనగా ప్రకాశోదకము. అందు తన వీర్యమును వదలెను. వీర్యమనగా సృష్టి సంకల్పము. ‘స ఐక్షత బహుస్యాం ప్రజాయేయేతి’ అనగా తానే బహురూపములుగా పుట్టవలెనని చూచెను. అని ఈ సంకల్పమునే వేదము తెల్పినది.

అప్పులకు నారములని పేరు. అవి నరుల సృష్టికి మూలములు. అవి మొదటి గమ్య స్థానములు అయినందున వానిని సృష్టించిన ఆయన నారాయణుడను పేరొందెను. ఆయన వదలిన వీర్యము బంగారు గ్రుడ్డయి అప్పుల యందు (ఉదకములందు) తేలినది. ఆ అండమునందు బ్రహ్మ తానే స్వయంభువు అనుపేర జనించెను. అందుచే ఆ బ్రహ్మదేవునికి హిరణ్యగర్భుడను పేరు వచ్చెను.

అహిరణ్యగర్భుడు ఒక పరివత్సరము అట్లే ఉండి ‘అప్’ రూపము లేక నీటి రూపమున ఉన్న ఆ తత్వమును దివము, భువము అను పేర రెండుగా ఒనరించెను. ఆ రెండు భాగముల నడిమి ఖాళీప్రదేశమును ఆకాశముగ గావించెను. అప్పులందు మునిగిన భూమిని తేల్చి దిక్కులను పదింటిని గల్పించెను. అందే కాలము, మనస్సు, వాక్కు, కామము, క్రోధము, రతి అను వానిని సృజించెను. ఆ రూపమున సృష్టిని కావింప తలంచి మరీచి, అత్రి, అంగిరస్సు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు అను వారిని మనస్సుచేత సృజించెను. వీరు సప్త బ్రహ్మలనుపేర ప్రసిద్ది చెందిరి. ఈ సప్త బ్రహ్మ మానస పుత్రులకంటె ముందే బ్రహ్మ తన రోషమునుండి రుద్రుని సృజించెను. పూర్వులకెల్ల పూర్వుడైన సనత్కుమారుని గూడ సృజించెను. ఇంతకు పూర్వము చెప్పిన సప్త బ్రహ్మల నుండి ప్రజలు, రుద్రులు పుట్టిరి. స్కందుడు సనత్కుమారుడును, తమ తేజస్సును తమలో గుప్తపఱుచుకొని ఉండిరి. అనగా వారు సృష్టికి ఉన్ముఖులు కారైరి. సప్తబ్రహ్మల వంశములు దేవతలు, దేవగణములతో కూడినవి. వారందరు క్రియావంతులు అగు గృహస్థులైరి. మహర్షుల పరంపర ఇదియే, బ్రహ్మ మెఱుపులను, పిడుగులను, మేఘములను, లోహితములను, ఇంద్రధనుస్సును, పక్షులు మొదలగువానిని సృజించెను. యజ్ఞార్ధము ఋగ్యజుస్సామ వేదములను జనింప జేసెను. సాధ్యులను కనెను. ఆయన మేనినుండి భూతములెన్నో పొడమెను.

అట్లు కావించు తన సృష్టి వృద్ధి పొందకుండుటను చూచి, తన శరీరమునే రెండు భాగములుగా చేసి సగభాగము పురుషుడు సగభాగము స్త్రీయు అయ్యెను. ఆ స్త్రీయందు అతడు వివిధ ప్రజలను కనెను. అతడు భూర్భువసువర్లోకములను వ్యాపించి విష్ణువు అని పేరందెను. ఆయన విరాట్పురుషుని సృజించెను. అతడు మనువును సృజించెను. ఆయన తరమే మన్వంతరము. బ్రహ్మమానస సృష్టిలో ఇది రెండవది. ఆ మనువు ప్రజాసర్గ మొనరించెను. నారాయణుని విసర్గమిది. ఈ సృష్టిలోని సంతానము కూడ అయోనిజమే. బ్రహ్మపురాణమందు ఆది సర్గమను దీనిని దెలిసిన యతడు ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు నగును. సంపూర్ణ ప్రజ్ఞావంతుడై అభీష్టగతి నొందును. (1)