అక్రూరుడు ఆరాత్రి గోపకులకు చెప్పి కృష్ణునితో బలభద్రునితో నందుని మందిరమున నిదురించెను. బలశాలురగు రామకృష్ణులు ఆ తరువాత రోజు సుప్రభాతమునందు అక్రూరునితో మధురకు ఏగ సన్నద్ధులైరి. గోపికలది చూచి కన్నుల నీరు నిండ, దుఃఖమున చిక్కి ముంజేతుల కంకణములు జార, నిట్టూర్పు పుచ్చుచు ఒండొరులతో ఇట్లు అనుకొనిరి. గోవిందుడు మధుర కేగి మరి వ్రేపల్లె కెట్లు రాగలడు? ఆ నాగరిక సుందరుల అవ్యక్త మధుర భాషణ మధుధారల వీనులగోలును. ఆ నగర కాంతల మెరమెచ్చుల ముచ్చటలందు చిక్కుకొన్న ఈతని చిత్త మీక ఈపల్లె గొల్లపడుచుల వంక ఎట్లు తిఱుగును? ఈ గోష్ఠము యొక్క (వ్రేపల్లె యొక్క) సమగ్రసారమైన హరినిట్లు హరించుకొని పోవు ఆపాడు దైవము నిర్దయమై గోపాంగనల సర్వస్వము దోచుకొన్నాడు. పరిహాసభావ గర్భితమైన ఆయాపలుకులు, ఆ ఒయ్యారపు నడకలు, అనెఱజాణలు మధురాపురీ సుందరుల ఆ వాలుచూపుల చిక్కి ఈ పల్లెటూరి దేవయ్య మీ ప్రక్కకు మఱి ఏయుక్తిని రాగలడు? పేరుమాత్రమునకు అక్రూరుడయిన ఈ క్రూరునిచే, ఈహతాశునిచే, మోసగింపబడి ఇదే మాధవుడు రథమెక్కి మధురకు ఏగుచున్నాడు. ఈ నీచుడింత ఎరుగడా? ఈతని పై వలపుగొన్న ఈ జనమును తఱుగనితఱి తీపుకొని మఱగిన మనస్వామిని హరిని కొంపోవుచున్నాడు. ఇతడో! దయమాలి రమ్మన్నదే తడవుగ ఈ వనమాలి హలితో వీని వెంటబడి రథమెక్కి (ఎన్నడు ఎక్కని రథమెక్కుటకు ఉబలాటపడి కాబోలు!) పోవుచున్నాడు. వలదని వారింప త్వరపడుదము? పెద్దలయెదుటబడి మా కేదిగతి ఏమందువని మొర పెట్టుదము. ఆ పెద్దవాండ్రు మాత్రము విరహాగ్నిచే క్రాగుమన ఏమిచేయగలరు? నంద గోపుడు ముందుగా ప్రయాణము కాకనే, వీరును ప్రయాణ సన్నద్ధులగుచున్నారు. గోవిందుని మఱలింప ఒక్కరైనను ఇందు యత్నించుట లేదు. మథురావాసులగు విలాసినులకు ఈరేయి ఇపుడు సుప్రభాతము. అచ్యుతుని ముఖార విందమునకా సుందరుల కనుగవలు భోగ్య వస్తువులు కాగలవు. (అనగా కృష్ణుడు ఆ పడతుల వాల్చూపుల సొంపులను అనుభవించు నన్నమాట) ఇటనుండి కృష్ణుడు ఏగుచుండ దారిలో నిలిచి స్వేచ్ఛగా ఆ సొగసుగాని సొగసు చూచి నెమ్మేనపులకింతురో ఆ ఇంతులు ధన్యులుగదె. గోవింద వదనారవింద సందర్శనమున ఇపుడు మధురాపుర పౌరుల నయనములకు ఇది ఒక మహోత్సవముగా ఉన్నది. కనులంతంతలు చేసికొని ఏ అభ్యంతరము లేకుండ భాగ్యవతులగు ఆ పురయువతులు కృష్ణుని చూడ ఉన్నారు. ఇది ఒక కలగాదుగదా? ఈ గోపికల కొక పెన్నిధిని చూపించిన అవ్విధి (బ్రహ్మ) ఇంతలో జాలిమాలి మనకన్నులందిగ నడచినాడు. మాధవుని యెడ అనురాగమున అతడేగుటకు మనయందు శైథిల్య మేర్పడ (ఏ కీలునకాలు పట్టువిడుచుండ) మాతో బాటు మా ముంజేతుల నున్న వలయములును (కంకణములు) పట్టుతప్పి జారిపోవుచున్నవి. అక్రూరుడు క్రూర హృదయుడు, అల్లదె గుఱ్ఱములను త్వరత్వరగా తోలుచున్నాడు. అని ఇట్లు అర్తులై అలమటించు అబలలపై ఎవ్వనికి దయపుట్టదు? ఓ ఓకృష్ణా! అల్లదె రథచక్రములచేత రేగిన రేణువు వదనముపై క్రమ్మినది చూడుము. దానిచే హరి దూరము చేయబడినాడు ఆ రేణువు గూడ కనబడుట లేదు అని ఇట్లు హార్దమైన భావముతో గోపికలు అలమటింప ఎవరికి జాలి కలుగదు!
జవనాశ్వమగు రథమున పోయి, బలరామకృష్ణులు అక్రూరుడును మధ్యాహ్నమునకు యమునా తీరమును జేరిరి. అంతట అక్రూరుడు తామిద్దరు ఇట గూర్చుండుడు. నేనీ కాళిందీ జలములందు ఆహ్నిక కృత్యము ఒనరింతును అనెను. వారట్లేయన అతడు యమునా జలములంజొచ్చి ఆచమించి స్నానముచేసి పరబ్రహ్మమును ధ్యానించెను. అనీటిలో అతడు ఆ సమయమున వేయిపడగలతో ఉన్న శేషునిగ బలరాముని దర్శించెను. అతడు మల్లెదండ వంటి శరీరము ధరించి తామరరేకులట్లున్న కన్నులలో వాసుకిగన్న డింభకులు పవనభక్షులు, చుట్టు ఉండి స్తుతింప వనమాలదాల్చి నల్లని వస్త్రమును ధరించి చక్కని అవతంసముతో (శిరోభూషణముతో) ఇంపైన కుండలములుదాల్చి నీటిలో కనిపించుచుండగా అతని ఒడిలో మేఘశ్యాముని, అంతట ఎఱ్ఱనగు కన్నులుగల వానిని, నాలు చేతలుగల వానిని, ఉన్నత శరీరుని, చక్రాద్యాయుధధారిని, పీతాంబరోత్తరీయముల రంగు రంగుల పూలమాలల దాల్చి ఇంద్రధనుస్సు మెఱపుదీగల తోడి విచిత్రమగు తోయదము (మేఘము) వలెనున్న, వానిని శ్రీవత్సాంకిత వక్షుని, భుజకీర్తులు కిరీటముదాల్చి మిఱుమిట్లు గొల్పుచున్న వానిని, తెల్లతామర పువ్వు సిగపూవుగా ధరించి ఉన్న ఆనంద మూర్తిని, కృష్ణుని పుణ్యులగు సనకసనందాది సిద్ధ యోగులు ముక్కుకొనపై చూపు నిలిపి మనస్సుచే ధ్యానించు వానిని కృష్ణుని కనెను.
అప్పుడు అక్రూరుడు వీరు బలరామ కృష్ణులని తెలిసికొని ఆశ్చర్యపడి ఆ వెంటనే వీరు ఎట్లు ఇచ్చటికి వచ్చినారని ఆలోచించెను. పలుకబోయిన అతని వాక్కును హరి స్తంభింపజేసెను. అంతట అతడు నీరు వెడలి, వెలికేగు దెంచి రథమునందును ఆ ఇరురువురను దర్శించెను. మునుపటియట్ల వారు మానవులట్లు ప్రాకృతరూపమున గోచరించిరి. తిఱిగి అతడు నీటను మునిగి యున్నట్లు ప్రాకృత దివ్యమూర్తులను అందుదర్శించెను. గంధర్వులు మునులు సిద్ధులు నాగులు మొదలగు దివ్వులు వారిని అ సమయ మునందు స్తుతించుచుండగా చూచెను. అంతట అద్దానవపతి (అక్రూరుడు) సర్వసత్తా స్వరూపము తెలుసుకొని సర్వవిజ్ఞానమయుడగు అచ్యుతుని ఈశ్వరుని స్తుతించెను.