“సూర్య భగవానుని మహిమ నీవు చెప్పగా విన్నాము. ఇంకను వినుటకు కుతూహల మగుచున్నది. బ్రహ్మచర్యాశ్రమస్థులు ముక్తిని పొందుటకు ఏ దేవతను ఉపాసింప వలయును. స్వర్గమునుండి దిగజారకుండుటకు ఏమిచేయవలయును? దేవతలకు పితృదేవతలకు పరమదేవత ఎవరు? ఈ సృష్టి ఎవనివలన జరుగును? ఎవ్వనియందు లీనమగును. తెలుపవలయును” అని అడుగగా, ఓ ద్విజోత్తములారా! ఈ ఆదిత్యుడు ఉదయించుచునే తన కిరణములచే చీకటిని హరింపజేయును. ఇంతకంటే మరిదైవమెవ్వరు? ఈ పురుషుడు మొదలు తుదలేనివాడు శాశ్వతుడు. అవ్యయుడు. ముల్లోకములను తన కిరణములచే వెలిగించుచుండును. సర్వ దేవమయుడు, సర్వజగన్నాథుడు, సర్వసాక్షి, జగత్పతి, సర్వభూతములను సృజించును, పెంచును, సంక్షేపించును. ఈయనయే వేడిమిని ఇచ్చును, వర్షించును. ధాత, విధాత, భూతాది, భూతభావనుడు, అయిన ఈయనకు క్షయములేదు. అన్నివేళల అక్షయ మండలుడు పితరులకు పిత. దేవతలకు దేవత. ఈయనది ధ్రువస్థానము. ఇందుండి మరలడు. ఆదిత్యుని నుండి జగత్తు పుట్టును. అందులయించును. యోగులు కళేబరమును వీడి వాయు రూపమంది తేజోరాశియైన దివాకరుని యందు ప్రవేశింతురు. పక్షులు తరుశాఖలను ఆశ్రయించి ఉన్నట్లు ఈయన వెలువడజేయు వేలకొలది కిరణములను ఆశ్రయించి సిద్ధులు, దేవతలు ఈయనయందు వసింతురు. యోగులు, గృహస్థులైన జనకాది రాజర్షులు వాలఖిల్యాదులు, బ్రహ్మవాదులైన మహర్షులు వ్యాసాదులు వానప్రస్థులు భిక్షువులు యోగము పూని సూర్యమండలమున ప్రవేశింతురు. వ్యాసకుమారుడు శ్రీ శుకుడు యోగధర్మము పూని యాదిత్య కిరణముల జొచ్చి పునరావృత్తి లేని పదవిని పొందియున్నాడు.
బ్రహ్మ విష్ణు శివాది దేవతలు శబ్దమాత్ర శ్రుతిగమ్యులు. ఈయనయే ప్రత్యక్షముగా మన కనులకు కనిపించు పరదేవత, తమోహరుడు. విష్ణుముఖ దేవతావర్గము కంటికి కానరారు. ఈయన ప్రత్యక్ష నారాయణుడు. ఈయనయే తల్లి, తండ్రి, గురువు, అనాది, రశ్మిమాలి, జగత్పతి, మిత్రుడు నిత్యుడు, అక్షయుడు. ఈయన సాగర ద్వీపములను పదునాల్గు భువనములను సృజించి చంద్రనదీ తీరమున ఉన్నాడు. సహస్రాంశువై అవ్యక్తుడయ్యు, ద్వాదశమూర్తులచే వ్యక్తుడై, ప్రత్యక్ష నారాయణుడై, ఆదిత్యస్థానమున వెలుగుచున్నాడు.
ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు అను ఈ పండ్రెండు మూర్తులచే ఈ పరమాత్మ సర్వజగమ్ములు వ్యాపించియున్నాడు. దేవశత్రునాశినియైన మూర్తి ఇంద్ర రూపమున దేవ రాజ్యమందున్నది మొదటిది, రెండవది ప్రజాపతి రూపమున సృష్టి గావించునది. మూడవది మేఘములందు వర్షించునది. నాల్గవది వనస్పతులందు ఓషధులందున్నది. ఐదవ మూర్తి పూష, అన్నగతమై ప్రజల పోషించును. ఆఱవమూర్తి ఆర్యమా రూపమై దేవతలందున్నది. సప్తమ మూర్తి భగనామమున దేహులదేహములందు, సంపదలందు ఉన్నది. ఎనిమిదవది వివస్వాన్ అగ్నిగా ఉండి జీవుల ఆహారమును పచనము చేయుచున్నది. తొమ్మిదవది ‘విష్ణువు’ అను మూర్తి. దేవశత్రు సంహారమునకు ప్రవర్తించును. పదవమూర్తి వాయువునందు ఉండి జీవులకు సుఖ స్పర్శనొసగి ఆనందపెట్టును. పదునొకండవ మూర్తి వరుణనామకము, జలములందుండి ప్రజాపుష్టి కూర్చును. పది రెండవ మూర్తి మిత్ర సంజ్ఞకము. లోకహితమునకై చంద్రనదీ తీర మందున్నది. ప్రభాకరుడు ఈ మూర్తితో వాయుభక్షణ సేయుచు మైత్రీ ప్రయుక్తమైన చూపుతో వరములు ఇచ్చి, భక్తానుగ్రహము చేయుచు చంద్రనదీ తటమందు తపము చేయుచుండును. కావున అతడు మిత్రుడను బిరుదు నామమందెనని స్మృతులు తెలుపుచున్నవి. ఇట్లు ద్వాదశ మూర్తియగు పరమాత్మ స్థావర జంగమముల కెల్ల ఆత్మరూపుడైన సూర్యభగవానుడై, ధ్యానమునకు లక్ష్యమైయుండి నమస్కరింపతగినవాడు ఈ ద్వాదశాదిత్యులను గూర్చి నిత్యము నమస్కరించుచు, పఠించుచు, వినువారు. సూర్యలోకమందు వెలుగొందుదురు” అని లోమహర్షణుడు చెప్పగా మునులు ఇట్లు పలికిరి .....
సూర్యుడు సనాతనుడగు ఆది దేవుడైనచో ప్రాకృత జనునివలె వరములను కోరుచు తపమెందులకు చేసెను.
బ్రహ్మ ఇట్లు అనియె-ఇది మిక్కిలి రహస్యవిషయము. నారదుడు సూర్యుని అడిగిన విషయమిది. ఇంతకు మున్ను సూర్యభగవానుని పండ్రెండు మూర్తుల గురించి చెప్పితిని. అందు మిత్రుడు. వరుణుడు అనువారు తపస్సు నందుండిరి. అందు జలా హారియై వరుణుడు పశ్చిమ సముద్రమునందును మిత్రుడు వాయుభక్షకుడై, ఈ వనమందును ఉన్నారు. ఈ మిత్రుడు మేరుశిఖరము నుండి గంధమాధనము నుండిజారెను. మహాయోగియైన నారదుడు మిత్రుని దగ్గరకు వచ్చెను. తపస్సు చేయుచున్న ఆయనను చూచి చాలా వేడుకపడెను. అవ్యయము వ్యక్తావ్యక్తము త్రిలోకధారకము సర్వదేవతా పరాయణము సర్వజనకమునైన మిత్రమూర్తి మనస్సుచేత మఱి ఏ దేవతలను, పితృ దేవతలను ఉద్దేశించి ధ్యానించుచు యజించుచున్నాడు అని ఆలోచించి ఆయనతో ఇట్లు అనెను.
“సాంగోపాంగములైన వేదములందు నీవు గానము చేయబడుదువు. భూత భవద్భవ్యమయిన ఈ దృశ్యమెల్ల కేవల ద్రష్టవైన నీ యందు నిలుపునందును. గృహస్థాద్యాశ్రమస్థులు నల్గురు నిన్నే పూజింతురు. నీవు సర్వ జగజ్జనకుడవు జననివియును, దైవమును, నీవు నీకు పితయైన మఱి యే దేవతను యజింతువో మేము ఎఱుంగము”
అనగా మిత్రుడు (సూర్యుడు) ఇట్లనియె. “నీ వడిగిన ప్రశ్నము పరమగుహ్యము. తెలుపరానిది. నీవు భక్తుడవని తెలుపుచున్నాను. సూక్ష్మము అవ్యక్తము అచలము ధ్రువము అనబడు ఆదివస్తువేది గలదో అది భూతేంద్రీయ వివర్జితము. సర్వభూతాంతరాత్మ క్షేత్రజ్ఞుడనబడును. త్రిగుణాతీతము. పురుష శబ్దవాచ్యము. హిరణ్యగర్భ నామకమే అదియే బుద్ధియని చెప్పబడును. మహత్తు ప్రధానమనియు యోగ సాంఖ్యములందు పెక్కు పేరుల పిలువబడును. ఆ వస్తువు త్రిరూపము. ఈశ్వరుడనియు, అక్షరమనియు పేర్కొనబడినది. అది ఏకరూపమై ఈ త్రిలోకమును ధరించును. శరీరులందు అశరీరుడై యుండును. కర్మ లేశము అతనికి లేదు, అంతరాత్మ అనగా అదియే. సర్వసాక్షి. ఈ తత్త్వము సగుణము, నిర్గుణము. విశ్వరూపము. జ్ఞానగమ్యము. సర్వతః పాణిపాదము. సర్వతోక్షి శిరోముఖము. సర్వత శ్రుతిమంతము. సర్వమావరించి ఉన్నది. విశ్వమూర్ధము విశ్వ భుజము విశ్వ పాదాక్షినాసికము. క్షేత్రమందు (దేహమందు) స్వేచ్ఛా సంచారియై ఒక్కడుగా ఉండును, తానున్న ఉపాధుల నెరుగువాడు కావున క్షేత్రజ్ఞుడనబడును. అవ్యక్తమయిన పురమందు శయించును. కావున పురుషుడనబడును. విశ్వము బహువిధము. అది ఆయనయే కావున విశ్వరూపుడనబడును. ఆయన యొక్కనికే మహత్త్వముండుటచే అతడు మహాపురుషుడు. ఆకాశమునుండి పడిన నీరు భూమియొక్కరుచిని బట్టి రుచి భేదమందినట్లు గుణభేదమును బట్టి అతడు పలువిధ రూపముల గానవచ్చును. ఒక్కటే వాయువు దేహమందు అయిదు తీరులుగ ఉన్నట్లాయన ఒక్కడే నానారూపుడగును. అగ్ని స్థాన భేదమునుబట్టి పలు రీతుల గనవచ్చి పలునామములందినట్లు ఆయనయు ఉపాధి నిమిత్తముగా నానాత్వ మందును. ఒక్క దీపమునుండి పలుదీపములు ముట్టింపబడి వెళ్లిన ట్లొక్కడయ్యు అతడనేక రూపముల కన్పించి వెలుగును. తన్ను తానెరిగినతరి అతడు కేవలుండగును. ఏకత్వ ప్రళయమునందు బహుత్వము నొందును. నిత్యుడు అతడొక్కడే. అతని వలన త్రిగుణ రూపము అవ్యక్తము పొడమినది. వ్యక్తావ్యక్త భావ అవస్థయగు దానినే ప్రకృతి అందురు. అదిబ్రహ్మకు కారణము. బ్రహ్మ సదసదాత్మకుడు. దేవ పితృ కర్మములందితడే పూజింపబడువాడు. అతడు, తండ్రి, దేవుడు, ఆత్మచే తెలియదగినవాడు. అతనినే నేను పూజించుచున్నాను. నానారూపముల, నానాదేవతల అర్చించు అందరి పూజలు అతడికి ఒక్కడికే చెందును. ఆయన సర్వగతి. ఆయనయే సూర్యుడును. కావున దివాకరుని నామరూపమునే నేవారాధింతును. ఏకత్వ విశ్వాసము గలవారు ఏకైకమైన ఆ పరతత్వమునే అందుదురు. ఇది గుహ్యాతి గుహ్యమైన అంశము.”
ఇట్లు ఇంతకు ముందు నారదునకు సూర్యుడు తెలిపెను. మీకు ఇది తేట తెల్లముగా నేను వివరించితిని. ఆదిత్య భక్తిలేని వానికిది తెలుపరాదు. ఇది చదివిన, విన్న నరులు సహస్ర కిరణు సాలోక్యము పొందగల్గుదురు. ఇది సర్వ దుఃఖహరము. అభీష్ట సిద్ధిదము. సూర్య భగవానుని మీరెల్లప్పుడు స్మరింపుడు. ఆయనయే ధాత, విధాత, సర్వజగత్ప్రభువు. (30)