బ్రహ్మ మహా పురాణము

సంసార చక్ర నిరూపణము

మునివరులు యమమార్గము నరకయాతనలను గురించి విని తిఱిగి వ్యాసుని ఈ క్రింది సందేశమడిగిరి. “భగవంతుడా! సర్వ ధర్మజ్ఞా! సర్వశాస్త్ర విశారద! మానవునకు సహాయులు తండ్రియా? తాతయా? కొడుకా గురువా! జ్ఞాతులు బంధువర్గమా? మిత్రవర్గమా? జనులు చనిపోయిన వాని శరీరము కట్టెను రాతిని వలె విసరి పారవేయుదురు కాని వాని వెంబడి పోవువాడెవ్వడు? అనగా వ్యాస దేవులు నరుడొక్కడే పుట్టును, ఒక్కడుగానే గిట్టును. ఒక్కడే దుర్గతిని దాటును. ఒక్కడే దుర్గతినందును. జీవుడు నిస్సహాయుడు. చచ్చిన శరీరమును నీవన్నట్లు పారవేసి బంధువులు కొలదిసేపుఏడ్చి వెనుదిరిగిపోవుదురు. వారు పారవేసిన ఆ జీవుని ధర్మమొక్కటే వెంబడించును. అందుచే ధర్మము అన్ని అవస్థలందు అన్ని లోకములందు సహాయమగును కావున నరులు దానిని సేవింపవలయును. లోభ మోహముల వలన జాలివలన భయమువలన బహుశ్రుతుడు (పండితుడు) కూడ ఇతరుల కొరకు లోభవశుడై తప్పిదములు చేయును. బ్రతుకునకు ఫలము ధర్మము అర్థము కామము అను మూడు పురుషార్థములు. ధర్మము తప్పకుండ ఈ మూడు ఫలములను పొంది తీరవలెను. అనవిని మునులిట్లనిరి. వ్యాసదేవా! నీ వలన పరమహితమైనది ధర్మ యుక్తమునైన వాక్యము విన్నాము. శరీరసిచయము అనగా శరీరనాశస్థితిని ఎఱుగ కోరెదము. మానవుల మృతశరీరము సూక్ష్మమై అవ్యక్త స్థితినంది కనబడని దైనప్పుడు దానిని ధర్మమెట్లు వెంబడించును? అనగా వ్యాసులు ఇట్లనిరి. భూమి వాయువు అకాశము నీరు జ్యోతి (తేజస్సు) అంతరంగము (మనస్సు) బుద్ధి అనునవి ఏకీభావమొంది ధర్మమును చూచును. అన్ని జీవులకు వారువారు చేయు పనులన్నిటికిని రేయింబవళ్లు సాక్షులై ఉండును. వీనితో పాటు ధర్మము జీవుని వెంట ఏగును. చర్మము, ఎముకలు, మాంసము, శుక్రము, రక్తము అనునవి ప్రాణముపోయిన వెంటనే శరీరమును విడిచిపెట్టును. అందువలన ధర్మపరుడు ఒక్కడే ఇహమందు పరమందు సుఖపడువాడు. ఇంకేమి తెలుపుదు”నన మునులు ఇట్లనిరి.

ధర్మమెట్లు వెంటబడునో తాము కనులగట్టినట్లు తెలిపినారు. ఇక రేతస్సు ఎట్లు ప్రవర్తించునో ఇదియు పిండోత్పత్తి క్రమమును తెలుపుమని ప్రార్థింప వ్యాసుడు ఇట్లనియె. ఓ విప్ర శ్రేష్ఠులార! శరీరమందున్న దేవతలు (ఆయా ఇంద్రియాధిష్ఠాన దేవతలు) అన్నమును ఆరగింతురు. వారు పృథివ్యప్తేజోవాయ్యాకాశములను పంచభూతములు మనస్సు స్వరూపమున ఉందురు. ఆ రూపమున పంచభూతములు మనస్సు తృప్తిపడగానే పరిశుద్ధమైన రేతస్సు రూపొందును. దానివలన స్త్రీ పురుష సంయోగమున గర్భమేర్పడును. ఇదంతయు మీకు ఎఱింగించితి ఇక ఏమివినవలతు” రనమునులు ఇట్లనిరి.

“ఎముకలు చర్మము మాంసమును విడిచి ఆ జీవాత్మ ఎక్కడ నిలచి సుఖ దుఃఖములను అనుభవించును. “అది పురుషుడై పుట్టి ప్రవర్తించు రీతిని తెలుపుము అని ఋషులడుగగా వ్యాసులు ఇట్లనిరి. “(జీవుడు) పంచభూత సమావేశమంది వానికి లోబడి ఉండును. వానితో విడివడి తిరిగి మఱొకగతికి ఏగును. భూత సంబంధము పొంది ప్రాణ ధారణము చేయును. అప్పుడు జీవరూపమున ఉన్న వీడు చేయు పుణ్య పాపములను పంచ భూతములందు అంతర్యామి రూపమున ఉన్న దేవతలు గాంచు చుందురు. “మఱి యేమి విననెంతురు?” అన మునులును ఇట్లనిరి. “చర్మాస్థి మాంసములను విడిచి ఆ భూతములన్నింటిని విడిచి జీవుడు తనకుతానై సుఖదుఃఖములను అనుభవించును గద?” అనగా వ్యాసుడు, “జీవుడు కర్మ సంబంధము నంది రేతస్సును బొంది స్త్రీయొక్క పుష్పమును (అర్తవమును) పొంది జనించును. ఆ తరువాత యమభటుల వలన బాధలను చావును దుఃఖములను సంసార చక్ర పరిభ్రమణమును పొంది నానాక్లేశములకు వశుడగును. ఇహలోకమున ఆప్రాణి పుట్టినది మొదలు మున్ను తాచేసిన పుణ్యము ధర్మము యొక్క ఫలము ఆశ్రయించి సుఖము అనుభవించును. పుట్టినదాదిగ ధర్మమునే సేవించిన యెడల పురుషుడై నిత్యమును సుఖించును. అనంతరము తాజేసిన అధర్మ ఫలమును అనుభవించును. సుఖము తర్వాత దుఃఖమును పొందును. అధర్మ యుక్తుడు యమలోక మేగి మహాదుఃఖమొంది పశుపక్ష్యాదులందు పుట్టును. ఏయే కర్మము ఇక్కడ జేసి ఏయే యోనియందు మోహవశుడై పుట్టునో ఇప్పుడు వివరముగ వినుడు.

ఈ విషయము శాస్త్రములు ఇతిహాసాదులు వేదమునందును తెలుపబడినది. మర్త్యలోకము ఘోర యమలోకమునకు విషయమై యున్నది. ఈ లోకమందు దేవతుల్యములు పుణ్యములగు స్థానములున్నవి. అవి పశుపక్ష్యాది జీవ భావమునకు భిన్నములు. బ్రహ్మలోకము వంటి దివ్యమైన యమమందిరమందు జీవుడు కర్మబద్ధుడై దుఃఖములను అనుభవించును. ఏయే స్వరూపమున ఏయే కర్మ ఫలమును పురుషుడందునో అయా ఘోరగతులను దెలిపెదను. నాల్గు వేదములు చదివి ద్విజుడు మోహము నొంది పతితుని వలన (కులభ్రష్ఠుని వలన) పరిగ్రహముచేసి (దానము పట్టి) గాడిదయై పుట్టును. గాడిద పదునైదేండ్లు బ్రతుకును. గాడిదై చచ్చి ఏడేండ్లు ఎద్దగును. ఎద్దుచచ్చి బ్రహ్మ రక్షస్సగును. అందుమూడేండ్లుండి బ్రాహ్మణుడగును. కులభ్రష్ఠునిచేత యజ్ఞము చేయించిన వాడు కృమి (పురుగు)గా పుట్టును. అందు పదునైదేండ్లుండి గాడిదయై ఐదేండ్లు, నక్కగా ఐదేండ్లు, కుక్కగా ఒక ఏడు ఉండి అటుపై మానవుడగును.

ఉపాధ్యాయునెడ బుద్ధిపూర్వముగ పాపము చేసిన శిష్యుడు మూడు జన్మములు ఇహలోకమున సంసారమందు కుములును. అవ్వల కుక్కగును. అటుపై పచ్చి మాంసము తిను జంతువై గాడిదయై చచ్చి నరకము అనుభవించి, అవ్వల బ్రాహ్మణ జన్మమెత్తును. ఏ శిష్యుడు గురుపత్నిని మనసుచేతనైన పొందునో వాడు అధర్మచిత్త సంస్కారముచే భయంకర సంసార దుఃఖితుడగును. కుక్కగా మూడేండ్లు జీవించి చచ్చి బ్రాహ్మణ జన్మమెత్తును. గురువు బుద్ధి పూర్వకముగ పుత్రుడట్లున్న శిష్యుని హనన మొనర్చినచో ఘాతుక మృత మగును. ఏ కొడుకు తల్లిని తండ్రిని అవమానించునో, వాడు తొలుత గాడిద అగును. పదేళ్లు అట్లుండి ఒక ఏడు కుంభీరమగును. ముసలి తల్లి దండ్రులు ఇద్దరు ఎవ్వనికి దుష్టులుగ దోచుదురో దారుణమైన ఆ అపధ్యానము వలన (పొరపాటు తలంపు వలన) వాడు గార్దభమగును. ఆ విధముగ రెండేళ్లు ఉండి వాడు పిల్లియై ఏడు నెలలుండును. తల్లి దండ్రులను గోలపెట్టినవాడు కోకిలయగును. వారిని కొట్టిన వాడు మూడేండ్లు శాత్వక(డేగ)మగును. అటుపై ఆఱు మాసములు వ్యాళమై(పామై) ఆ మీద మానవుడుగా పుట్టును. యజమాని అన్నము కాజేసినవాడు, రాజద్వేషుల అన్నము తిన్నవాడు కోతి అగును. పదేండ్లు అట్లుండి ఏడేండ్లు ఎలుక అగును. ఆఱు మాసములు కుక్కయై, అటుపిమ్మట మానవుడగును. అసూయాగ్రస్తుడు శార్ఞకము అగును. విశ్వాస ఘాతకుడు చేప అగును. ఎనిమిది ఏండ్లు అట్లుండి నాల్గు నెలలు మృగమగును. తరువాత మేక అగును. ఒక్క ఏడాదికి చచ్చి కీటకమై యా మీదమానుష జన్మమందును. ధాన్యములు యవలు దొంగిలించిన వాడు ఎలుక అగును. అటుపై చచ్చిపందియై రోగముచే చచ్చును. అటు తరువాత మూగ కుక్కయై ఐదేండ్లు ఉండి మానవుడగును. పరదార గమనము చేసినవాడు తోడేలగును. కుక్క నక్క గ్రద్ద పాము కంకము రాబందు కొంగయు అగును. ఏ పాపి సోదరుని భార్యను బలాత్కరించునో అతడు మగకోకిలై ఒక్కయేడుండును. స్నేహితుని యొక్క గురువు యొక్క రాజుయొక్క భార్యను కామించినవాడు పంది అగును. అయిదేండ్లు అట్లుండి కొంగయై మూడు నెలలు చీమయై ఒక నెల కీటకమై క్రిమియై పదునాల్గు నెలలుండి తరువాత మనుజుడగును. తొలుత కన్యనిత్తునని వాగ్దానముచేసి మఱొక్కనికిచ్చిన వాడు క్రిమియగును. పదమూడేండ్లు అట్లు బ్రతికి పాపము క్షయించి మనుజుడగును. దేవ పితృ కార్యములు చేయక వారికి తర్పణము చేయకున్నవాడు కాకియై నూరేండ్లు ఉండి ఆ మీదట కోడియగును. ఆ మీద ఒకనెల పామై నరజన్మ మందును. తండ్రితో సముడైన పెద్ద అన్నను తమ్ముని ఎవ్వడు అవమానించునో వాడు బెగ్గురు పక్షిగ పదేండ్లుండి జీవకము (చకోర పక్షి) అగును. తరువాత నరుడగును. వృషలుడు బ్రాహ్మణ స్త్రీని సంగమించి, కృమియై పందియై రోగముచే చచ్చును. అటుపై కుక్కయై తుదకు నరుడగును. అపుడు సంతానముగని చచ్చి ఎలుక యగును. కృతఘ్నుడు (చేసిన మేలు మరచిన వాడు) యమలోకము ఏగి యమభటుల క్రౌర్యమునకు కుమిలి కుమిలి వారి దండాఘాతములకు ముద్గర శూరాగ్ని దండముల దెబ్బలకు గురియై ఘోరమైన అసిపత్ర వనమునందు (కత్తుల బోనున) కూటశాల్మలియను మిడమిడ కాలు ఇసుక మేటలందు నడిపింపబడి ఘోరయాతనలను అనుభవించి సంసారచక్ర పరిభ్రమణ మంది క్రిమి అగును. పదిహేను ఏండ్లు అట్లుండి అక్కడ కడుపువచ్చి అటనే చచ్చును. తరువాత అనేక గర్భములనంది తుదకు పశు పక్షి జన్మమందు పెక్కేండ్లు అట్లుండి తాబేలగును. పెరుగు దొంగిలించిన కొంగ అగును. పచ్చిచేపలను హరించినవాడు తేనెటీగ అగును. పండు మూలకము (ముల్లంగి), అప్పము దొంగిలించినవాడు చీమ అగును.

పాయసపు దొంగ తిత్తిరి (తీతువు) పక్షి అగును. పిండితో జేసిన అప్పచ్చిని అపహరించినవాడు గ్రుడ్ల గూబ అగును. మంచినీళ్లు హరించిన కాకియగును. కంచు దొంగిలించిన హారితము (పచ్చపిట్ట) అగును. వెండిగిన్నె కాజేసిన పావురమగును. బంగారు బిందెను హరించిన క్రిమి అగును. పట్టుబట్ట దొంగిలించినవాడు కురరము (టిట్టిభము-తీతువు పక్షి) అగును. పట్టు పురుగులను హరించినవాడు నర్తకుడు (నటకుడు) అగును. వస్త్ర సామాన్యమును హరించినవాడు చిలక అగును. నార పట్టుబట్ట హరించిన హంస జన్మము ఎత్తును. నూలుబట్ట హరించిప తీతువు పక్షి అగును. గొఱ్ఱె ఉన్నితో చకోరపక్షి అగును.

చందనాది సుగంధ వస్తువులు హరించినవాడు చుంచుగా పుట్టును. ఆ జన్మములో పదునైదు ఏండ్లుండి ఆపాపము క్షమింపజేసికొని మానవుడై జనించును. పాలు దొంగిలించినవాడు బలాక పక్షి (పెద్దకొక్కెర)యై పుట్టును.నూనె (నువ్వులనూనె) హరించిన గబ్బిలము (తైలముంద్రావు) జంతువగును. అర్థము కొఱకు (డబ్బుకొఱకు) చేతిలో ఆయుధము లేని వాని సాయుధుడై కొట్టినవాని (చంపినవాడు) గాడిదయగును. ఆ జన్మలో రెండేండ్లు బ్రతికి చివరకు ఆయుధముచే నరకబడును. అట్లు చచ్చి వాడు మృగముగా పుట్టి నిరంతర ఆందోళనముతో ఉండును. ఒక్క ఏడాది తర్వాత వాడు ఆయుధపు దెబ్బతిని కూలును. ఆమీద వాడే వలలో తగుల్కొన్న చేపయై నాల్గవనెలలో అడవి జంతు వగును. పదేండ్లు అట్లుండి పులిజన్మ మెత్తి అయిదేండ్లు ఉండి మరణించి, అధర్మ క్షయమై మనుజుడగును.

వాద్యమును హరించినవాడు గొఱ్ఱె అగును. పిండితో కూడిన అన్నమును (ఆహారమును) దొంగిలించినవాడు బభ్రునటువు (ముంగి పింగళ వర్ణముగల వేండ్రుకలు గలది) అను దారుణమైన మూషికముగా పుట్టును. అట్టిది మనుజులను నిత్యము కఱచుచుండును. నేతిని హరించినవాడు నీరుకాకియగును. చేపమాంసము దొంగిలించిన కాకియగును. ఉప్పు దొంగిలించిన చిరికాకము అగును. (చెముడుకాకి బొంతకాకి మొదలగు వానిలో రకము). తనపై విశ్వాసము (నమ్మకము) కల్గి ఉన్నవానిని మోసగించినవాడు చేపయైపుట్టి మనుజుడగును. అప్పుడు ఆయుర్దాయం తక్కువై ఉండును. నరుడు పాపములుచేసి పశుపక్ష్యాది జన్మము లందును. తన తాహతేదో ధర్మమేదో వాడెరుగలేడు. అట్టివారు వ్రతదూరులై వ్యాధిగ్రస్తులై దుఃఖితులు అగుచుందురు. ఒడలిపై బట్టకూడ లేకుండ మ్లేచ్ఛులై పాపులై లోభ మోహాది వశులై పుట్టుదురు. (మ్లేచ్ఛుడు అనార్యుడు గోమాంస భక్షకుడు, అపశబ్దములు భాషించువాడు, శిష్టాచారరహితమగు కామరూపాది దేశముల ఉండువాడు) పుట్టిన నాటి నుండి ఎవ్వరు పాపములను విడిచెదరో, వారు ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, రూపవంతులు అగుదురు. ఈ చెప్పిన కల్పము ప్రకారము స్త్రీలుకూడ ఆయా పాప ఫలములందుదురు. అట్టి పాపాత్ములకే భార్యలగుదురు. ఇంతవరకు విశేషించి ఆయా వస్తువుల దొంగతనము వలని దోషములు తెలుపబడినవి. ఇది లేశమాత్రముగ మీకెఱింగించితిని. వాటి యొక్క కథా సందర్భమందు ఓ ద్విజులారా! ఇంకను విశేషముగ విందురుగాక! నేను దీనిని బ్రహ్మ దేవర్షులకు తెలుపు సమయమున వింటిని. అది విన్నది విన్నట్లు మీకు తెలిపితిని. అనగా అది విని మునివరులార! మీరు మనస్సును ధర్మమునందు నిలుపుడు” అని పలికెను. (217)