బ్రహ్మ మహా పురాణము

మహాజ్యేష్ఠీ ప్రశంస

బ్రహ్మ ఇట్లు అనియె-

మహాజ్యేష్ఠి పర్వమునందు పురుషోత్తమ క్షేత్రము సేవింపదగినది. శ్రీకృష్ణుని, బలరాముని సుభద్రను అనాడు దర్శించుట వలన ప్రయాగ మొదలైన పుణ్య క్షేత్రములను సేవించిన ద్వాదశ పుణ్య క్షేత్ర యాత్రా ఫలము లభించును. గోదావరి మొదలైన పుణ్యనదులు సేవించిన ఫలము కూడ సిద్ధించును. భూమియందు గల సర్వ దేవాలయములను, నదీ సాగర పర్వత తీర్థములను సేవించి స్నానదానాదులు చేసిన పుణ్యము కృష్ణ దర్శనము చేత లభించును. అంతేగాక విష్ణు లోకము కూడ లభించి అచ్చట పుణ్యానుభవమైన తరువాత కర్మ భూమి యందు జనించి చతుర్వేదాధ్యయనము చేసి వేదోక్తాచార ధర్మ నిరతుడై కృష్ణ భక్తుడై విష్ణుభక్తి యోగమునంది మానవుడు మోక్షము పొందును” (64)