బ్రహ్మ మహా పురాణము

నరసింహమూర్తి వర్ణనము

నరసింహరూపమెత్తి హరి హిరణ్యకశిపుని సంహరించిన కథ వినుడు. కృతయుగ మందు దైత్యులకు మొదటి పురుషుడు హిరణ్యకశిపుడు పదివేల పదునేను వందల సంవత్సరములు ఉపవాసముచేసి మౌనము బూని తీవ్ర తపస్సు చేసెను. వాని శమదమములకు బ్రహ్మచర్యమునకు తపోనియమములకు ప్రీతినొంది భగవంతుడు స్వయంభువు స్వయముగా హంసలను పూన్చిన సూర్య ప్రభగల విమానమున ఆదిత్యులు వసువులు మరుత్తులు, దేవతలు, రుద్రులు వెన్నంటిరాగా యక్షరాక్షసులు, కిన్నరులు, దిక్కులు, విదిక్కులు, నదులు, సముద్రములు, నక్షత్రములు, ముహూర్తములు, మహాగ్రహములు తపోవృద్ధులైన సిద్ధులు, విద్వాంసులు పుణ్యఋషులు మొదలగు పరివారముతో వచ్చి “నీ తపస్సునకు సంతసించితిని. నీకు భద్రమగు గాక. ఇష్టమైన వరము కోరుము సిద్ధినందుము” అనెను.

హిరణ్యకశిపుడు ఇట్లనెను. “పితామహ! దేవాసుర గంధర్వాదు లెవ్వరును కోపించి నన్ను శపింపరాదు. ఇదియే వరము. శస్త్రాస్త్రములచే చెట్లచే గిరులచే ఎండిన తడసిన దేనిచేగాని క్రిందగాని పైనగాని కాకుండ ఒక్క చేతితో మాత్రమే సైన్య సపరివారముగ నన్ను చంపగలవాడే నాకు మృత్యువు కావలెను. నేనే సూర్యచంద్రులు, వాయువు, అగ్ని, నీరు, అంతరిక్షము, ఆకాశమునై ఉండవలెను. కామక్రోధములు నేనే. ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు అంతయు నేనే కావలెను” అనగా బ్రహ్మ ఇవిగో దివ్యబాణములు. నీకు ఇచ్చుచున్నాను. ఇవి అద్భుతములు. నీవు కోరిన కోరికలు వానిచే పొందెదవు. సందియము లేదు” అని బ్రహ్మర్షి గణసేవితుడై వైరాజము అని శ్రుతి (వేదములు) పిలిచెడి బ్రహ్మ తన సదనమునకు బ్రహ్మర్షి గణసేవితుడై వేంచేసెను. అటుపై దేవనాగ గంధర్వమునులు బ్రహ్మవలన జరిగిన ఈ వరప్రదాన విషయము విని బ్రహ్మతో ఇట్లు అనిరి. “స్వామీ! ఈ నీ విచ్చిన వరమువలన ఆ అసురుడు మమ్ము బాధింపగలడు. దయజేసి వాని వధ విషయము ఆలోచింపుము. నీవు ఆదికర్తవు హవ్య కవ్యములను సృష్టించిన వాడవేనీవు” అనగా బ్రహ్మ “త్రిదశులార! చేసిన తపస్సు యొక్క ఫలమును అవశ్యము అనుభవింప వలసినదే. తపస్సునకు చివర విష్ణు భగవానుడు వానిని వధించును” అనగా విని దేవతలు సంతసించి స్వస్థానములకు వెళ్ళిరి.

వాడు వరము లభించిన క్షణములో పొగరెక్కి మున్యాశ్రమములందు వ్రతనిష్టులై సత్య ధర్మరతులైన దాంతులను శాంతులను హడలగొట్టెను. అట్లే స్వర్గమునకు వెళ్ళి దేవతలను ఓడించెను. ముల్లోకములు వశము చేసుకొని స్వేచ్ఛాసంచారియై దైత్యులను యజ్ఞీయులను (యజ్ఞ భాగార్హులను) దేవతలను అయజ్ఞీయులను కావించెను. ఆదిత్యులు మొదలుగా దేవ వర్గము విష్ణుని శరణొందిరి. “దేవేశ్వరా! రక్షింపుము. హిరణ్యకశిపుని వలన మాకు ఇప్పుడు భయము వచ్చిపడినది. నీవుగదా మాకు పరమ దైవము. పరమ గురుడవు, పరమ దాతవు, కమలలోచన! అదితి వంశ జయమునకు శరణ”మగు మనిరి.

వాసుదేవుడు పలికెను-

జడియకుడు. అభయమిచ్చుచున్నాను. మునుపటివలె స్వర్గమును త్వరలో పొందగలరు. ఇప్పుడే నేను వరదాన దర్పితుడైన వానిని సపరివారముగ సంహరించుచున్నాను అని ఇట్లు పలికి దేవతలను పంపి భగవంతుడు హిరణ్యకశిపుని వద్దకు వచ్చెను. సగము నరశరీరము సగము సింహశరీరముచేసి చేతిలో చేయిని తాకుచు దట్టపు మేఘమువంటి శరీరము మేఘగర్జనము వంటి గర్జనముకొని మెరయుచు మేఘమంత వేగముగ వచ్చి రక్కసులచే రక్షణ ఇవ్వబడుచున్న ఆకలికొనిన పెద్దపులివలె నున్న ఆరక్కసుని పొగరెక్కి ఉన్న వానిని సంహరించెను.