సూక్ష్మము పుణ్యము స్వచ్ఛమునైన పరమతేజస్సును ధరించు నీకు నమస్కారము. తేజోవంతులకు ఈశ్వరుడును తేజస్సులకు ఆధారభూతుడు శాశ్వతుడునై జగదుపకారమునకై తీవ్రరూపముదాల్చిన నిన్ను స్తుతించెదను. ఓ గ్రహాధిపతి! ఎనిమిది మాసములు (ఆదాన మాసములు) జలరూపమయిన రసమును గ్రహించుటకు తీవ్రరూపమును దాల్చు నీకు వినతనయ్యెదను. అగ్నిష్టోమములతో గూడి త్రిగుణాత్మకమై ఋగ్యజుసామరూప వేదత్రయీ రూపమైన నీ స్వరూపము ఈ విశ్వమును తపించుచున్నది. అట్టి నీకు నమస్కారములు. ఓ సనాతనమూర్తి! నీ త్రయీరూపము కంటె పరమై ఓంకారముచేత అభిసంహితమైన (వర్ణింపబడిన) స్థూలము సూక్ష్మమునైన ఆ నీ రూపమునకు నమస్కారము.
అని ఇట్లు నిరాహారమై అహర్నిశము ఆ భగవానుని స్తుతించెను. చిరకాలమునకు ఆ సూర్యభగవానుడు ఆమెకు ప్రత్యక్షమయ్యెను. ఆమె ఆకసమంతట ఆవరించి పుడమికి అవతరించిన ఆ జ్వాలామయమూర్తిని జూచి మిక్కిలి జడుపంది స్తుతించెను.
ఓ దివాకర! జగత్తునకెల్ల మొదటివాడా! నీ స్వరూపము చూడలేకున్నాను. నేను చూడగల్గునట్లు ప్రసన్నుడవగుము. నీ భక్తులగు నాబిడ్డలను రక్షింపుము.
అంతట సూర్య భగవానుడు ఆ తేజోమండలము నుండి వెలువడి అగ్నితప్తమైన రాగి వలె నెఱ్ఱగా సాకారముగ దర్శనమిచ్చి, నమస్కరించుచున్న ఆమెతో అభీష్టవరము కోరుకొనుమనెను. ఆమె శిరసువంచి మోకాళ్ళ మీదవ్రాలి నమస్కరించి వరదుడయిన స్వామిని ఇట్లు కోరెను.
గ్రహరాజా! నా యెడను నా పుత్రులయెడను ప్రసన్నుడవుకమ్ము. ప్రబలురైన దైత్య దానవులు త్రిభువనములను హరించి యజ్ఞభాగములను తామే అనుభవించుచున్నారు. అందుచే మాయెడల ప్రసన్నుడవై నీ అంశమున వారికి భ్రాతవై జన్మించి ఆ శత్రువులను నశింపజేయుము. నా కుమారులు మరల యజ్ఞభాగములు అనుభవించి ముల్లోకములకు ప్రభువులగునట్లు అనుగ్రహింపుము. శరణన్నవారి దుఃఖమును హరించువాడవు. వారి కార్యము చక్కబెట్టువాడవు అని పేరొందితివి” అనగా ఉదకములను హరించు సూర్య భగవానుడు ప్రసన్నుడై ఆమెతో
నేను నీతపస్సునకు సంతోషించితిని. నీకు నా తేజస్సులో వేయియవవంతుతో కుమారుడనై జనించి నీ బిడ్డలకు శత్రువులయినవారి నందరను నశింపజేసెదను అని చెప్పి సూర్యభగవానుడు అంతర్ధానమందెను. ఆమె కోరిక సఫలమై తపస్సును చాలించెను.
అటు తరువాత ఒక సంవత్సరమునకు ‘సుషుమ్న’ అనుకిరణరూపమున అదితి గర్భమందు ఆమె కోర్కె సఫలమొనర్ప సూర్యుడు ప్రవేశించెను. ఆమె కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములను ఆచరించెను. అంతట కశ్యపుడు కుపితుడై ‘నిత్యోపవాసములను చేసి నీగర్భమారణము చేసికొందువా’ యనగా ఆమె కుపితయై ఈ గర్భాండమును జూడుము. ఇది మారితము కాలేదు. గాక శత్రు మారకము కాగలదు అని పలికి గర్భమును పనివడి విసర్జించెను. అట్లు జారిన అమెగర్భము తేజస్సులచే జాజ్వల్యమాన మయ్యెను. కశ్యపుడు భాస్కర వర్చస్వియగు ఆమూర్తింగని ప్రణతుడై ఆదరముతో తొలిపల్కుల స్తుతించెను. అంతట నాగర్భాండము వెలువడి పద్మపత్రమట్టి అరుణ ప్రభల దీపించుచు నలుదెసలు ఉద్దీపింపజేయుచు నొక మూర్తి ప్రత్యక్షమయ్యెను. అవ్వల అంతరిక్షమునుండి ఆముని సత్తముని గూర్చి అశరీరవాణి సజలజలద గంభీరముగా ఇట్లు పలికెను.
ఈ అండము మారితమని నీవంటివి. ఓ కశ్యప మునీంద్రా! అందువలన నీ మూర్తి మార్తాండుడను పేరుచేత ప్రసిద్ధి చెందగలదు. ఇతడు యజ్ఞభాగముల హరించుచున్న అసురులను సంహరించును. అప్పుడు ఆ ఆకాశవాణి వాణినాలించి గీర్వాణులు హర్షించిరి. దానవులు దిగులొందిరి. దేవేంద్రుడు అంతట అసురులను యుద్ధమునకు పిలిచెను. మార్తాండునిచే చూడబడిన దానవులెల్ల నిస్తేజస్కులై దహింపబడి భస్మమైపోయిరి. దేవతలు మార్తాండుని పెక్కు భంగుల వినుతించిరి. సురలు మార్తాండుడు స్వాధికారమును బడసి యజ్ఞభాగములు అందిరి. ఇనుడు క్రిందుమీదును తన కిరణములచే కడిమి పూవువలె భాసించుచుచ అగ్నిగోళమట్లు వెలుంగుచు అస్ఫుటమైన ఆకారము దాల్చెను.
అంత మునులు ‘కదంబ ముకుళమట్లెఱ్ఱగ కన్నెఱ్ఱయైన అమూర్తి ఎట్లు దర్శనీయమయ్యె” అనతిమ్మన బ్రహ్మ ఇట్లనియె.
తపస్వినియైన సంజ్ఞ సవర్ణకు (ఛాయకు) ఇట్లు తెలిపి బిడ్డలనప్పగించి తండ్రియగు త్వష్ట ప్రజాపతి సమీపమున కేగి సిగ్గున తలవంచుకొని నిలువబడెను. ప్రజాపతిచే భర్త సన్నిధికి పోపొమ్మని పలుమారులు అదలించి బెదిరించి ఆదేశింపబడియు ఆయింతి కాంతుని వంక బోక బడబాకృతిని దాల్చి (ఆడుగఱ్ఱమై) తన రూపము మఱుగు పఱచుకొని ఉత్తరకురుభూములందు పచ్చిక బయళ్ళలో తిఱుగజొచ్చెను.
రెండవ సంజ్ఞను ఈమె సంజ్ఞయేయని భావించి ఆమెయందు ఆదిత్యుడు తనకు సమానుడైన కొడుకుంగాంచెను. ఇంతకు మున్ను, పుట్టిన మనువును పోలినవాడైనందున ఇతడును ‘సావర్ణ మనువు’ అని పిలువబడుచుండెను.
ఆమెకు కల్గిన రెండవ కుమారుడు శనైశ్చరుడు అతడు పుట్టిన తరువాత అమె తనకు అప్పగించిన సవతిబిడ్డలను ఆదరింపదయ్యెను. మనువు దానికి సైచి ఊర కుండెను. యముడది ఓర్వక ఆసవతి తల్లిని పాదమెత్తి బెదరించెను. అందులకు ఛాయ కోపించి మిగుల దుఃఖించి నీకాలు పడిపోవుగాకయని శపించెను. యముడా వృతాంతమును తండ్రికి ప్రాంజలియై విన్నవించెను. నాకు ఆమె ఇచ్చిన శాపమును మరలింపుమని తండ్రిని వేడుకొనెను. తల్లి తనయులందరియెడ వాత్సల్యముతో వర్తింప వలయునుగదా. ఈ అమ్మ మమ్ములను నిరసించినది. అందువలననే ఆమెపై పాదమెత్తితిని, ఎత్తితినే కాని ఆమె శరీరమునకు తాకింపలేదు. నేనుచేసిన తప్పును క్షమింపదగుదువు. తల్లిశాపమునకు గురియైతిని గ్రహరాజ! నీ అనుగ్రహముచే నా పాదము పడిపోకుండుగాక! అని కొడుకు వాపోవ కరుణించి సూర్యుడిట్లనియె. పుత్ర! ఇందేదో గొప్ప కారణముండి తీరును. ధర్మజ్ఞుడవు, సత్యవచనుడవైన నిన్ను క్రోధము ఆవేశించినది. నీతల్లిమాట మిథ్యగాకుండుటకు, కృములు నీకాలి మాంసము తిని అవని కేగును ఈరీతి మీ అమ్మ మాట సత్యము కాగలదు. ఈ విధమైన శాపపరిహారముచే నీవును సురక్షితుడయ్యెద వనెను.
అదిత్యుడు సంజ్ఞను జూచి (ఛాయామూర్తిని) బిడ్డలనందరిని ఒక్కరీతిగా గాక ఒక్కని యందెక్కువ ప్రేమ నీ కెందులకని అడిగిన నామె ఆమాట తప్పించెనేగాని నిజము చెప్పదయ్యెను. అతడు తనకు తాను సమాధానపడి యోగదృష్టిచే నిజమెఱింగెను. ఆమె అప్పుడు శపింపబూనియు శాపమీయక జుట్టు పట్టుకొని ఊపెను. అంత ఆమె జరిగినది పతికి విన్నవించెను. వివస్వంతుడు విని కనలి మామగారగు త్వష్ట చెంత కరిగెను. మామయు అటువచ్చిన అల్లుని అదరించెను. రోషముగొని తనను దహింప ఏతెంచినాడని గ్రహించి అపుడాతని అనునయించుచు ఇట్లనెను.
ఓ ఆదిత్య మూర్తి! ఈ నీ రూపము భరింపరాని తేజముచే చూడరాదయ్యెను. సంజ్ఞ ఇది సైపనేరక పచ్చిక బయళ్ళ తిరుగాడుచున్నది. శుభచాఱిణియైన నీ సహధర్మచారిణిని ఇప్పుడు చూడవలయును. ఆమె శ్లాఘనీయ. యోగబల సంపన్నురాలు. గ్రహరాజగు నీకు నామాట అనుకూలము, సమ్మతము అగునేని, యోగమూని ఆమె చెంతకరుగుము. నీ రూపమును జూడముచ్చటగ ఒనరింతునని తెలిపి ఆ తరణిని (సూర్యుని) యంత్రము నెక్కించి చెక్కివైచెను. తరణిని యంత్రమున బట్టిన నాటినుండీ తరణిబట్టుటన నీ పేరు లోకమున రూఢికెక్కెను. దాన నాతని తేజస్సు కొంతడిందువడి రూపము చూడ అందమయి ఇంపొందెను. ఆ మీద అతడు యోగశక్తిచేపోయి తన భార్యను బడబారూపమున చరించు దానిని జూచెను. తేజస్సుచే పాతివ్రత్య నియమముచే భూతములకు అదృశ్యమైయున్న అయ్యంగనను ఎందును జడియక సంచరించుచున్న దానిని చూచి, తాను అశ్వరూపము దాల్చి ముఖమునంగవయబోయెను. పరపురుషశంకగొని ఆమె పెడమొగమయి ఉన్న సమయమునందు ఆమెయందు నిక్షిప్తమైన శుక్రము అమె నాసికారంధ్రముల వెంట చీదివైచెను. అందుండి అశ్వినులు అను దేవవైద్యులు, నాసత్యుడు (దస్రుడు) అని పేర్కొనబడెడివారు ఉదయించిరి. అష్టమ ప్రజాపతియగు మార్తండుని ఔరసులు ఈయిర్వురు మిక్కిలి అందగాండ్రు. అవ్వల భాస్కరుడు, ఆకాంతకు మిగులకాంతుడై కానవచ్చె. ఆమె కూడ తన మనోహరుని చూచి మిగుల సంతోషించెను.
యముడు మాత్రము తాను ఇంతకు ముందు చేసిన పనికి మిక్కిలి బాధచెంది ప్రజలను ధర్మముచే రంజింపచేసి ధర్మరాజను సార్థకనామము, పితృదేవతలకు ఆధిపత్యమును, లోకపాలకత్వము బడసెను. సావర్ణి ప్రజాపతి సావర్ణి మన్వంతరమున మనువు కాగలడు. అతడు మేరుగిరిపై ఇప్పుడును తపము చేయుచున్నాడు. వాని తమ్ముడు శని గ్రహపదవి నందెను. త్వష్ట (సూర్య బింబమును) తరణి బట్టగా రాలిన రజమును ప్రోగుచేసి విష్ణు చక్రమును తయారుచేసెను. అది దానవాంతకము, అప్రతిహతము. యముని తరువాత పుట్టిన ఆ బాలిక యమున అనుపేర లోకపావని అయ్యెను. మనువు సావర్ణుడు అను పేర ఆ రెండవ కుమారుడు పిలువబడెను. ఆయన తమ్ముడు శని గ్రహ పదవి నంది సర్వలోక పూజితుడయ్యెను. దేవతల ఈ జన్మవృత్తాంతమును విన్నవాడు ఆపదలను బాసి మహాయశస్సును పొందును.
సర్వలోకములకు నాభిస్థానమైన సూర్యుడు తరణి పట్టునప్పుడు పరిభ్రమించుట వలన సముద్రములు పర్వతములు వనములతో గూడిన భూమి ఆకాశమంటెను. చంద్రాది గ్రహనక్షత్ర సహితమైన ఆకాశమెల్ల చిమ్మబడి వ్యాకులమై భూమికి దిగిపోయెను. సముద్ర జలము సంక్షోభించెను. ధ్రువు నాధారముగా గొన్న ఆఖిల జ్యోతిర్నివాసములు (లోకములు) రశ్మి (కిరణము శ్లేష రజ్జువు) బంధములు తెగి క్రిందబడినవి. సూర్య భ్రమణము వలన విక్షిప్తములైన భూమ్యా కాశ పాతాళ ప్రపంచము మిక్కిలి వ్యాకులమయ్యెను. ఇట్లు ముల్లోకముల ఆకుల మగుటగని బ్రహ్మతోగూడ దేవతలు భాస్కరుని ఇట్లు స్తుతించిరి.