బ్రహ్మ మహా పురాణము

విష్ణుభక్తి హేతు కథనము

జాగరణము చేసి విష్ణు మహిమ గానము చేసి చండాలుడును ముక్తిని పొందిన విషయము వింటిమి. మహామతిశాలివగు ఓ వ్యాసమహర్షీ! ఏ తపస్సుచే ఏ కర్మనాచరించుటచే విష్ణువునందు భక్తి కలుగునో ఆ ఉపాయమును మాకు తెలుపుము. వినగోరు చున్నాము. అని మునులు అడిగిరి.

ఓ మునిశ్రేష్ఠులారా! మానవునకు మహాఫలప్రదమగు విష్ణుభక్తి కలుగు ఉపాయము క్రమముగా చెప్పెదను వినుడు. మహాఘోరమును సర్వప్రాణులకు భయమును కలిగించునదియు, మహామోహమును కలిగించునదియు నానా విధములగు నూర్లకొలది దుఃఖము లతో నిండినదియు అగు ఈ సంసారమున జీవుడు వేలకొలదిగా తిర్యగ్యోనుల-వృక్ష పశు పక్ష్యాది జన్మముల యందు మరల మరల జన్మించి ఎంతో కష్టము మీద మనుష్య జన్మమును పొందును. అందును బ్రాహ్మణుడగుట, అందును వివేకము కలుగుట, అందును ధర్మమునందు ప్రవృత్తి, అందును శ్రేయఃప్రదమయిన వానిని గ్రహించుట దుర్లభము. సంచితపాపము సంపూర్ణముగా నశించనంతవరకు సర్వజగద్రూపుడగు వాసుదేవుని యందు భక్తికలుగదు. కనుక అందులకు ఉపాయము తెలిపెదను వినుడు. త్రికరణములతో శుద్ధిగా అన్యదేవతల అందు మనస్సు నిలిపి అనుష్ఠించు భక్తివలన యజ్ఞములు చేయుట అందు శ్రద్ధకలుగును. అప్పుడు అగ్నియందు భక్తి కలిగి యజ్ఞములుచేసి అగ్నిని తృప్తి నొందించుటచే సూర్యునియందు భక్తికలుగును. భాస్కరుని ఉపాసించి అతనిని ప్రీతునిగా చేయుటవలన శంకరునియందు భక్తికలుగును. విధివిధానానుసారము శంకరుని ఆరాధించి అతనిని తుష్టి నొందించుటవలన విష్ణునియందు భక్తి కలుగును. జగద్రక్షకుడును అవ్యయుడును-నాశము లేనివాడు-అగు వాసుదేవుని సంపూజించుట వలన నరుడు భుక్తిని ముక్తిని పొందును.

ఓ మహామునీ! లోకమున వైష్ణవులు కానివారు కొందఱు కనబడుటకును వారా విష్ణువును అర్చింపకుండుటకును హేతువేమని మునులు వ్యాసునడిగిరి.

ఓ మునిశ్రేష్ఠులారా! స్వయంభూబ్రహ్మ చేయు ఈ భూత సృష్టి దైవీ సృష్టి, అసుర సృష్టి అని రెండు విధములు. దైవీ ప్రకృతి-స్వభావము-కలవారు విష్ణుని భక్తితో అర్చింతురు. ఆసురీ ప్రకృతి కలవారు హరిని దూషింతురు. ఆసురీ ప్రకృతిగల నరాధములు మాయచే విజ్ఞానము నశించినందున విష్ణుని చేరలేక అధమగతిని పొందుదురు. విష్ణుని మాయ గంభీరమైనది. సురాసురులకును తెలిసికొన శక్యము కానిది. మహా మోహము కలిగించునది. సంస్కారము నొందిన మనస్సులు లేని వారికి దాట శక్యము కానిది.

ఓ ధర్మజ్ఞా! సుదుస్తరమగు విష్ణుని మహామాయను గూర్చి తెలిసికొన కుతూహల మగుచున్నది. తెలుపుము.

లోకములను ఆకర్షించు ఆ విష్ణుమాయ స్వప్నముతో, ఇంద్రజాలముతో, సమానమైనది. దానిని విష్ణువు తప్ప మఱెవ్వరును తెలిసికొన జాలరు. మాయ విషయములో ఒక బ్రాహ్మణునకును నారద మహర్షికిని కూడ జరిగిన మోసము తెలిపెదను వినుడు. ఒక నగరమున పూర్వము ఆగ్నీధ్రుడగు కామదమనుడు అను రాజుండెడివాడు. అతని కుమారుడు పవిత్రుడు, ధర్మమునందే ఉండి ఆనందము పొందువాడు, క్షమాశీలము పితృసేవాసక్తి ప్రజలను రంజించు సమర్థత కలవాడు, వేదములయందు శాస్త్రములయందు పరిశ్రమ చేసినవాడు. తండ్రి అతనికి పెండ్లి చేయ యత్నించెను. అతడు ఇష్టపడలేదు. నాయనా! నీవు పెండ్లాడ ఇష్టపడని కారణమేమి? మనుజులు భార్యవలన సుఖములు లభించునను తలపుతోనేకదా పెండ్లాడుదురు. కనుక నీవును వివాహము చేసికొనుము అని తండ్రి పలుకగా ఆయనయందలి గౌరవముచే కుమారుడు ఏమియు సమాధాన మీయక ఊరకుండెను. ఐనను మరల అడుగగా అతడు తండ్రితో ఇట్లు పలికెను: నేను అభివ్యక్తమును, పరిపాలింపదగినదియు, విష్ణునికి సంబంధించినదియును అగు ‘నామాను రూపతా’-నామమునకు తగినట్లు నడచుట అను నియమమును ఆశ్రయించితిని అనెను. తండ్రి ఇట్లు పలికెను. కుమారా! ఇది ధర్మముకాదు. వివేకియగు పురుషుడు తండ్రి ఆజ్ఞకు విరుద్ధముగా ఆలోచింప తగదు. నాకు నీపై అధికారము కలదు. నామాట పాలింపుము. సంతతి ముందునకు సాగకపోవుటచే నా వంశము నరకములో మునుగునట్లు చేయకుము అనెను. తండ్రి ఇచ్చిన ఈ అజ్ఞను విని ఇంద్రియ నిగ్రహము కల ఆ కుమారుడు అనాది సిద్ధముగా నున్న ఈ సంసారపు విచిత్ర స్థితిని జ్ఞాపకము చేసికొని ఇట్లు పలికెను.

నాయనా! సహేతుకమగు తాత్విక విషయమును చెప్పెద వినుము. ఓ రాజా! నామమునకు అనుగుణముగా ఆచరించుట కర్తవ్యము అనునది సత్యము. నేను ఎన్నియో జన్మములు జరామరణములు, భార్యలతో సంయోగ వియోగములు గడ్డి, పొదలు, తీగలు సరీసృపములు, ప్రాకెడి పామువంటి ప్రాణులు, మృగములు, పక్షులు, పశువులు, మానవులలో, స్త్రీ, పురుషులు మొదలగు రూపములు ఎన్నియో పొందితిని. గణదేవతలగు వసు రుద్రాదిత్యులు కిన్నర గంధర్వ, విద్యాధర నాగులు యక్ష గుహ్యక రాక్షసులు, దానవులు, అప్సరసలు, దేవతలు, సముద్రములు మొదలగు అనేక రూపములలో సృష్టింపబడితిని. సంహరింపబడితిని. దారలతో సంయోగము వలన నాకు కలిగిన మోసము ఇటువంటిది. ఈ జన్మనుండి పూర్వము మూడవ జన్మమున జరిగినదియు తీర్ధ మాహాత్మముతో సంబంధించినదియు అగు వృత్తాంతమును సంగ్రహముగా చెప్పెదను వినుము. నేను నర దేవ గంధర్వ నాగ విద్యాధర గరుడ కిన్నరాది జన్మములు అనేకములు పొందిన తరువాత సుతపస్కుడను మహాఋషిగా జన్మించితిని. అట్టి నాకు లోకములకు ప్రభువు-మధువను రాక్షసుని వధించినవాడు అగు జనార్దనుని యందు స్థిరమగు భక్తి కలిగెను. చక్రగదా ఖడ్గధారియగు విష్ణుని వివిధములగు వ్రతములచే ఉపవాసములచే మెప్పింపగా ఆ మహాత్ముడు నాకు వరమీయ కోరి గరుడుని ఎక్కివచ్చి ఓ బ్రాహ్మణా! నీకు కావలసిన వరము ఏదో కోరుము ఇచ్చెదను అని బిగ్గరగా పలికెను. నీకు నాపై ప్రీతి కలిగినచో నీ మాయా తత్త్వమును నాకు తెలుపుమని కోరితిని. ధర్మార్థ కామములను శ్రేష్ఠులగు పుత్రులను బాధారాహిత్యమును ఇత్తును. తీసికొనుము. నా మాయను తెలిసికొని ఏమీ చేయుదువు? అని విష్ణువనెను. ధర్మార్థ కామాది పురుషార్థములచేతనైనను జయింప వలసినది నీ మాయయే కావున నేను దానితత్త్వమును తెలిసికొనగోరుచున్నాను. కనుక ఓ పుండరీకాక్షా! నాకు నీ మాయాతత్త్వమును చూపుము అని నేనంటిని.

నా మాయ ఇంతవరకు ఎవరును ఎఱుగరు. ఇకముందును తెలిసికొనజాలరు. పూర్వము బ్రహ్మకు కుమారుడును దేవర్షియు అగు నారదుడు భక్తియుక్తుడై నీవలెనే నన్ను ఆరాధించి మెప్పించెను. నేనతనికి వరమీయ బోవ అతడును ఇదే కోరెను. నేనెంతగా వలదు అని చెప్పినను అతడు మూఢుడై ఈ వరమునకై పట్టుపట్టెను. అంతట నేనతనితో నారదా! నీవు నీటిలో మునిగినచో నామాయ తెలియునంటిని. నారదుడు నామాటను అనుసరించి నీట మునిగిలేచి సుశీల అను కాశిరాజ పుత్రిగా అయ్యెను. ఆమె యౌవనవతి ఐనతరువాత ఆ రాజామెను విదర్భ రాజకుమారుడగు సుధర్మునకిచ్చి వివాహము చేసెను. ఆ సుధర్ముడు ఈమెతో కామసుఖమును అనుభవించెను. తన తండ్రి స్వర్గమునకు ఏగిన తరువాత ప్రతాపవంతుడగు ఆ సుధర్ముడు ఆతని విదర్భ రాజ్యమునకు పాలకుడై పుత్ర పౌతులతో కూడి సంతోషముతో నుండెను. ఇట్లుండ కాశీరాజునకు సుధర్మునకును యుద్ధము జరిగెను. తమ పుత్రపౌత్రులతో కూడ ఇరువురును నాశము నొందిరి. ఈ విషయముతెలిసి యుద్ధ రంగమునకు పోయి సుశీల చాలతడవు శోకించి ఆర్తురాలై తల్లికడకు పోయెను. మఱియు మరణించిన తన తండ్రిని భర్తను వారి వారి పుత్రపౌత్రాదులను తీసికొని గొప్ప చితిని పేర్చి అగ్నిని ప్రజ్వలింపజేసి హాపుత్త్రా! హాపుత్త్రా! అని శోకించుచు అగ్నిలో ప్రవేశించెను. వెంటనే ఆమె నారదుడయ్యెను. ఆ అగ్నిస్ఫటికమువలె నిర్మలమును చల్లనిదియునై నిండు సరస్సయ్యెను. అతని ఎదుట నిలిచి దేవ శ్రేష్ఠుడగు విష్ణువు బిగ్గరగా నవ్వి దేవర్షియగు నారదునితో ఇట్లు పలికెను! మహర్షీ! నీ కుమారుడు ఎవ్వరు? బుద్ధిపోగొట్టుకొని ఎవరిని గూర్చి శోకించుచున్నావు? అది విని నారదుడు సిగ్గుపడెను. నేను ( శ్రీ మహావిష్ణువు) అతనితో మరల ఇట్లంటిని: ఓనారదా! నామాయ ఇటువంటిది. చాలకష్టరూపమయినది. బ్రహ్మరుద్రుడు మహేంద్రుడు కూడ దీనిని ఎఱుగ లేరనిన నీవేమి తెలిసికొనగలవు? ఈ నామాయ ఇట్టిదని ఊహించుటకును అలవి కానిది.

నారద మహర్షి నామాట విని ఇట్లు పలికెను. ఓ విష్ణూ! నాకు నీయందు భక్తిని ఇమ్ము. సమయము వచ్చినప్పుడు నీ సంస్మరణమును సందర్శనమును నాకు లభించుగాక! నేను ఇప్పుడు ఆర్తుడనై చితిని ఆరోహించిన స్థలము తీర్థముగా అగుచుండగా ఓ అచ్యుతా! కేశవా! పాపనాశకుడవగు నీచేతను బ్రహ్మదేవునిచేతను అధిష్ఠింపబడినది అగుగాక! నారదుని కోరికవిని ఓ బ్రాహ్మణా! సుతపోమహర్షీ! నేను (శ్రీ మహావిష్ణువు) ఇట్లంటిని: ఓ నారదా! కాశిరాజ కన్యగా నీవు చితి చేసిన తావు సితోదమను తీర్థము అగును. నేనును మహేశ్వరుడును దీనియందు నిలిచెదము. ఉగ్రముగా మాటలాడిన బ్రహ్మయొక్క ముఖమును శివుడు త్రుంచిన తరువాత ఆతడీ నీటి తీర్ధమున స్నానముచేయగనే ఆ బ్రహ్మ యొక్క కపాలము. ఈ తీర్ధ స్థానమున భూమిపై పడును. అంతటనుండి దీనికి కపాల మోచన తీర్థమను ప్రఖ్యాతి ఏర్పడును. అప్పటినుండి ఈ పుణ్యతీర్థమునందు ఇంద్రుడు నిరంతరము నిలిచియుండును. ఇంద్రునికి నిరంతర బ్రహ్మవధ దోషము అంటగా, అతడు దానిని ఇచ్చట విడిపించుకొనును. కాన దేవతలును ఈ రహస్యమగు మహాతీర్థమును విముక్త తీర్థమని ప్రసిద్ధము చేయుదురు. నరుడు ఎన్ని మహాపాపములు చేసినవాడైనను ఈ తీర్థమున ప్రవేశించి ఏమరుపాటులేక స్నానమాడి శుచియై నన్ను స్మరించినచో శుద్ధుడై భగవదనుగ్రహము పొంది ముక్తుడగును. రుద్ర పిశాచమను మహాపాపుడు అనేక జన్మములంది దుఃఖములు అనుభవించును. అతడట్లు జన్మపరం పరలతో పాపము నశించి అనేక సహస్ర సంవత్సరముల తరువాత విప్రగృహమున జన్మించును. అతడు జన్మములో మహా నిగ్రహము కలవాడగును. అతని అంతకాలమున రుద్రుడు హితకరమగు తారకమంత్రము నతనికి ఉపదేశించును. ఓ విప్రా? నేనిట్లు నారదునకు చెప్పి నా నివాసమగు క్షీరసాగరమునకు వెళ్ళితిని. విప్రుడు-నారద మహర్షియును గంధర్వ రాజుచే సమర్పించబడుచు స్వర్గమున సంచరించెను. ఓ సుతపోమహామునీ! నిన్ను ప్రబోధించుటకై నీకు ఈ నారద వృత్తాంతము తెలిపితిని. నా మాయను నీవు ఎఱుగజాలవు. నీవది తెలిసికొనగోరినచో ఈ కోకాముక తీర్థమందు మునుగుము అని విష్ణువు పలికెను.

విష్ణుని వచనము ననుసరించి విప్రుడగు సుతపోమహాముని తన భవిష్యత్ ఫలమునకు వశుడై ఆ నీట మునిగెను. నాయనా! ఆ బ్రాహ్మణుడు వెంటనే చండాల గృహమున కన్యగా అయ్యెను. ఆమె మంచిరూపము శీలము గుణములు కలది. క్రమముగా యౌవన వంతురాలు కాగా ఆమెకు రూపహీనుడగు సుబాహుడను చండాల కుమారునితో వివాహమయ్యెను. భర్త ఆమెకు ఇష్టుడు కాలేదు. కాని భర్తకు ఆమె ఇష్టురాలు అయ్యెను. ఆమెకు ఇద్దఱు అంధులగు కుమారులును ఒక చెవిటి కుమార్తెయు కలిగిరి. భర్త దరిద్రుడు. అందుచే అ అమాయకురాలు అనుదినము నదికిపోయి ఏడ్చుచుండెడిది. ఒకానొకప్పుడా చండాల కన్యక బిందె తీసికొని నదికిపోయి స్నానమునకై నీటిలో ప్రవేశించి లేవగనే కర్మయోగమునందు ఆసక్తుడగు సుతపో మహామునియను బ్రాహ్మణుడుగా మొదటి రూపమునకు మారెను. భర్తయగు సుబాహుడును భార్య నదికిపోయి చాలసేపయినదేయని నదికి వెడలి అచట కడవ మాత్రముండి ఒడ్డున ఆమె కనబడకపోవుటచే మహాదుఃఖమున ఆ ప్రదేశము మారుమ్రోగునట్లు ఏడువసాగెను. అంతలో గ్రుడ్డి కుమారులును చెవిటి కూతురును అచటికి వచ్చి తమతండ్రి ఏడ్చుచుండుట చూచి తామును ఏడువసాగిరి. తరువాత సుబాహుడు అచ్చటనున్న బ్రాహ్మణులను మీరెవరైన నీటికి నదిలో దిగిన యువతిని చూచితిరా? చెప్పుడు అని అడిగెను. ఆమె నదిలో దిగుట చూచితిమి. కాని పైకి వచ్చినట్లు చూడలేదు అని వారు చెప్పిరి. భయంకరమగు ఆమాట విని సుబాహుడు గట్టిగా ఏడువ నారంభించెను. ఓ రాజా! అట్లు అతడును కొడుకులును కూతురును ఏడ్చుట చూచి నాకు చాల బాధ కలుగుటతోబాటు నేనే అంతవరకు చండాల కన్యకగా ఉంటినను విషయము స్మరణమునకు వచ్చెను. అందుచే నేనా సుబాహునితో నీవిట్లు ఎందులకు ఆర్తుడవై ఏడిచెదవు? మూర్ఖుడవై ఎంత ఏడ్చినను ఆమె నీకు లభింపదు అంటిని. అతడు నాతో ఇట్లనెను. ఓ బ్రాహ్మణా! ఈ కుమారులు ఇద్దరును గ్రుడ్డివారు. కుమార్తె చెవిటిది. దుఃఖించుచున్న వీరిని నేను ఎట్లు ఓదార్చగలను? ఎట్లు పెంచి పెద్ద చేయగలను? ఇట్లు పలికి అతడు కుమారులతో కుమార్తెలతో కూడ వెక్కివెక్కి ఏడువసాగెను. అతడు ఏడ్చినకొలది నాకు వారిపై దయ కలిగెను. అందుచే అతని ఏడ్పు మాన్పించి నా వృత్తాంతము అతనికి తెలిపితిని. అతడును మిగుల అర్తుడై ఆ కోకాముఖ తీర్థమున మునిగెను. నీటిలో ప్రవేశించగనే ఆ తీర్థ ప్రభావమున వాడు పాపములనుండి ముక్తుడై నేను చూచుచుండగనే విమానమెక్కి స్వర్గమునకు పోయెను. అతడట్లు మరణించగనే నాకును మోహకరమగు మనోవ్యథ కలిగెను. ఓ రాజా! నేనును పవిత్రమగు కోకాజలమున మునిగి స్వర్గమునకు వెళ్ళితిని.

తరువాత జన్మమున వైశ్యకులమునందు వ్యధతో బాధపవాడనుగా కోకాముఖతీర్థ ప్రభావమున పూర్వ జన్మస్మృతి కలవాడనుగా జన్మించితిని. అంతట నేను వాక్కును మనస్సును నిగ్రహములో ఉంచుకొని కోకాముఖ తీర్థమునకు వెళ్ళితిని. అచ్చటనే కృశింపజేసికొని దేహత్యాగముచేసి స్వర్గమును పొందితిని. స్వర్గమునుండిదిగి భూలోకమునందు కూడ విష్ణుని అనుగ్రహము వలన పూర్వజన్మ స్మృతి కలవాడనుగా నీ ఇంట పుట్టితిని. ఇట్లు నేను శ్రీమహావిష్ణుని ఆరాధించి కోకాముఖతీర్థమున శుభాశుభము లగు కోరికలు ఏవియు లేకుండ వదలుకొనిన వాడనైతిని అని పలికి అరాజకుమారుడు తండ్రికి నమస్కరించి శ్రేష్ఠమగు కోకాముఖ తీర్థమునకు పోయి వరాహ రూపుడగు శ్రీమహావిష్ణువు ఆరాధించి సిద్ధిని పొందెను. ఇట్లు ఆ కామదమనుడను నతడు తన పుత్ర పౌత్రులతో కూడ మహాపవిత్రమగు కోకాముఖ తీర్థమున అపవిత్రమగు మానవ శరీరమును విడిచి విమానములో స్వర్గమునకేగెను.

ఓ బ్రాహ్మణులారా! దేవతలకును ఊహింరానిది, ఇంద్రజాలముతోను సమానమును, లోకమును మోహపరచునదియునగు పరమేశ్వరుడగు విష్ణునిమాయను మీకు తెలిపితినని వ్యాసమహాముని పలికెను. (229)