బ్రహ్మ మహా పురాణము

రుక్మిణీ కల్యాణం - శంబరాసుర వధ

వ్యాసులు ఇట్లు చెప్పిరి -

భీష్మకుడు విదర్భ దేశాధిపతి కుండిన నగరము రాజధానిగ రాజ్య పరిపాలన చేసెను. అతని కుమార్తె రుక్మిణి. కుమారుడు రుక్మి అనువాడు. రుక్మిణిని కృష్ణుడును కృష్ణుని రుక్మిణియు ఒండొరులు వరించుకొనిరి. కాని రుక్మి ద్వేషముచేత చక్రాయుధునకు తన చెల్లెలు రుక్మిణిని ఈయడయ్యెను. జరాసంధుని ప్రేరణచే ఆమెనురుక్మి శిశుపాలునకు వాగ్దానము చేసెను. భీష్మకుడును రుక్మితో అట్లే అనెను. అటు పిమ్మట జరాసంధాదులు కళ్యాణార్ధము భీష్మ నగరమునకు వచ్చిరి. శిశుపాలుడును వచ్చెను. కృష్ణుడు బలభద్రుడు మొదలగు యాదవులతోగూడి ఆవివాహము చూచుటకు వచ్చెను. రేపు వివాహముకానున్న సమయమున హరి ఆ కన్యను కొంపోయెను. అందుచేత శ్రీమంతుడగు పౌండ్రకుడు, దంతవక్తృడు, విదూరథుడు, శిశుపాలుడు, జరాసంధుడు, శాల్వాది రాజులు కోపించి బలరామాది బంధువుల యెడ శతృత్వముగొని హరిని చంపుటకు తీవ్రమైన యత్నము చేసిరి. వారిపై దండెత్తి వచ్చిరి, అట్లైత్తివచ్చిన ఆ బలగము కూడిన వారందరు రామాదులచే ఓడిపోయిరి. రుక్మి రణమున కేశవుని చంపకుండా పురమున ప్రవేశింపనని ప్రతిజ్ఞచేసి కృష్ణుని చంపుటకు దూకెను. చక్రాయుధుడు వాని చతురంగ సైన్యమును అవలీలగ కూల్చి రుక్మిని పడగొట్టెను. వాడు ఓడి పోయెను. అట్లు రుక్మిని గెలిచి శ్రీకృష్ణుడు శ్రీరుక్మిణీ దేవిని రాక్షస వివాహవిధానమున పరిణయమాడెను. కృష్ణునకు ఆమెయందు మన్మథాంశమున ప్రద్యుమ్నుడు జన్మించెను. ఒకప్పుడు శంబరుడు ప్రద్యుమ్నుని దొంగిలించుకొని పోయెను. శ్రీకృష్ణుడు శంబరుని సంహరించెను. (199)