బ్రహ్మ మహా పురాణము

గోకులేబల ప్రత్యాగమన వర్ణనమ్

వ్యాసులు అనిరి -

ఇట్లు ముచుకుందునిచే పొగడబడి సర్వ భూతేశ్వరుడు అగు హరి నీకోరిన దివ్య లోకములను పొందుమని ఆరాజునకు తెల్పెను. నా సాకతము అవ్యాహమైన ఐశ్వర్యముతో దివ్యభోగములు అచట అనుభవించి పూర్వజన్మ స్మృతివడసి ఉత్తమకులమందు పుట్టి, ఆవల ముక్తినందుదువు. అనగా ఆరాజు పరమేశ్వరునకు మ్రొక్కిగుహనుండి వెలువడి వచ్చి వెలినున్న అల్పాల్ప శరీరులను నరులను జూచెను. దానిచే కలియుగము వచ్చెనని గ్రహించి నరనారాయణ స్థానమైన గంధమాదనమున (బదరి కాశ్రమమున) తపము చేయ నేగెను.

కృష్ణుడు ఉపాయముచే శత్రువు, కాలయవనుని కూల్చి వాని సేననెల్ల గొనివచ్చి ద్వారకయందు ఉగ్రసేనునికి సమర్పించెను. ఆవల యదుకులము శత్రు భయశంకపోయి స్వస్థతనందెను. బలరాముడును యుద్ధములెల్ల శాంతింప తన జ్ఞాతులను దర్శించు వేడుకతో నంద గోకులమున కేగెను. అచ్చట గోపకులును గోపికలును ముందటియట్ల తనను సబహుమానముగ ప్రేమతో కలిసికొని అచ్చట నిల్చిపోయెను. కొందఱు వచ్చి కౌగలింప కౌగలించుకొనెను. కొందఱితో నవ్వెను. కొందఱితో ముచ్చటలాడెను. వారు ఎన్నో ప్రియ వాక్యముల బలరాముని పలుకరించిరి. కొందఱు గోపికలు ప్రేమతో కొందరు ఈర్ష్య తోడను గూడ ప్రశ్నలు వేసిరి.

నాగరిక కామినులకు ప్రాణమైనవాడు నిలకడలేని వలపుతీపులను తొలకు కృష్ణుడు సుఖముగ ఉన్నాడు గదా! ఆ క్షణమాత్ర సౌహృదుడు (నిమిష మాత్రము వట్టి మెరుపువలె మెరమిచ్చులు గొలుపువాడు) నైన చెలిమిగల హరి వారివద్ద మా చేతలయెడ పరిహాసముతో సౌభాగ్య గర్వాతిశయము చేయుటలేదు గదా! బృందావనమున వేణుగానమును విని అనుసరించి వచ్చిన మా రాకను తలంచుచున్నాడా? కన్నతల్లిని చూడడానికి ఒక మాటైన అతడు ఇచ్చటకు వచ్చునా! ఐనను వాని ప్రసంగములు ఎందుకు? వేరు మాటలు చెప్పుకొందము, మనము లేకుండ అతనికి, అతడు లేకుండ మనకు సాగదు. అతనికై మేము తండ్రి, తల్లి, సోదరుడు, భర్త బంధుజనము అను వారిలో అందరిని వదలి పెట్టితిమి. తనకొఱుకు ఇందరను కాదని వచ్చినారము. అట్టి మమ్ములను వదలి ఉన్న అతడు కృతఘ్నుడు గదా! ఐనను ఇటకు తాను తిరిగి రాదగిన ఆత్మీయమగు ఏదో వస్తువును ఉద్దేశించి ఉండును. లేదా అట్టివారెవరికో తన సందేశమిచ్చి ఉండవలెను. అతని వచనామృతము నీనుంచి తెలుసుకొన కోరుకొనుచున్నాము. ఈ దామోదరుడు గోవిందుడు పురస్త్రీలపై తగిలిన మనస్సుచే మా యెడల ప్రీతి తొలగినాడు. ఇక మాకు కనపడడని తోచుచున్నది అని ఇట్లు గోపికలు బలరామునితో పలుకుచునే మైమరచి కృష్ణా! దామోదరా! అని సుస్వరముగ బిలుచుచు కలకల నవ్విరి. అవ్వల చక్కగా, మధురముగ, నిండు ప్రేమ తొలుక స్వాతిశయము ఇంచుకయు కనపడకుండ, మధురస్వర సరసముగ కృష్ణుడు పంపిన సందేశము వారికి వినిపించి బలరాముడు ఆ గొల్ల భామలను ఓదార్చెను. అటు పిమ్మట బలభద్రుడు మునుపటియట్ల పరిహాస సుందరులగు గోపకులతో నా వ్రేపల్లెయందు ప్రేమ పూర్వకముగా సంభాషణములు నెఱపెను. (197)