బ్రహ్మ మహా పురాణము

సాంఖ్య వివేచనము

సత్త్వము-సత్తా-అనునది గుణత్రయమును, క్షేత్రజ్ఞుడగు ఆత్మతత్త్వము ఈ గుణత్రయమునకు సత్త్వమునకు అధిష్ఠాతయై ప్రపంచ రూపమున పరిణామము పొందు గుణములను ఉదాసీన భావముతో చూచుచు ఈశ్వరుడై యుండును. సత్త్వము గుణములను సృజించుట సాలెపురుగు తన నుండి తనకంటె వేరుకాని పదార్థముతో దారమును తీసి గూడు అల్లుటవంటిది. గుణములు ఎప్పుడును ప్రవృతివైపే ఉండి ముందునకు పోవు చుండును. ఆ ప్రవృత్తి గోచరము కాదు అని కొందరును, నివృత్తియు వాటికి కలదని కొందరును అందురు. ఈ విషయములో గొప్ప సంశయమునకు అవకాశమున్నది. కాని విచారణ చేసి ఏదో ఒక పక్షమును నిర్ణయించుకొనవలయును. మొత్తము మీద ఆత్మతత్త్వము జనన మరణములు లేనిది. దాని నెరిగి ఆనందించవలెను. క్రోధము హర్షము మత్సరము విడువవలెను. ఈ ఆత్మతత్త్వమును ఎఱిగిన మనుష్యులు కృతకృత్యులై ముక్తినందుదురు. ఇట్టి వారికి పరలోకవిషయమై భయముండదు. లేనివారికి భయము కలదు. తత్త్వవేత్తకు కలుగు శాశ్వతగతియగు పరమముక్తి కంటె మించిన ఉత్తమస్థితి మతి ఏదియు లేదు. నరుడు కృతమును-కార్యరూపమగు ప్రపంచ తత్త్వమును-అకృతమును-జనన మరణములులేని పరతత్త్వమును ఎరుగనంతవరకును భేదబుద్ధి కలవాడగుటచే ఇది ప్రియము ఇది అప్రియము అని తలచుచు ఒకప్పుడు తల్లినికూడ ద్వేషించును. శోకమును అనుభవించును. కర్మలను ఫలముపై అభిసంధితో చేయునంత వరకు ఇది ప్రియము ఇది అప్రియము అను భావముండును. తత్త్వమును ఎరిగి ఫలముపై అభిసంధి లేక కర్మలను ఆచరించువాడు తాను పూర్వమునందు కర్మలుచేసి సంపాదించిన సంచిత కర్మమునుకూడ నశింపచేసికొనును. అనగా ముక్తి పొందును.

అన్ని భూతతత్త్వముల కంటె ఉత్తమమగు తత్త్వమును అన్ని ధర్మముల కంటె మేలగు ధర్మమును మాకు తెలుపుమని మునులు వ్యాసునడిగిరి. అందులకు వ్యాసులవారు.

అతి ప్రాచీనమును ఋషులును మెచ్చినదియు అన్ని ధర్మములకంటె శ్రేష్ఠము అగు ధర్మము తెలిపెదను వినుడు. ఇంద్రియములు జీవుని కలవర పరచునవి. కనుక బుద్ధితో వాటిని బాలురను తండ్రివలె అదుపులో ఉంచుకొని ఇంద్రియములకును మనస్సునకును ఏకాగ్రత అనెడి ఉత్తమతపస్సుచే ఆ ఉత్తమ ధర్మమును ఎరుగవలెను. గోచరించు వేటిని అనుభవింపగోరక ఇంద్రియములు నివృత్తి నొందినపుడు శాశ్వతుడగు పరమాత్మతత్త్వము సాక్షాత్కారమును పొందును. ఎన్నో కొమ్మలు పండ్లు పూలు ఆకులు కల వృక్షమునకు తన ఏ పండెక్కడనో ఏ పూవు ఎక్కడనో ఏ కొమ్మ ఏ ఆకు ఎక్కడనో తెలియనట్లే అనేక వస్తు భేదములతో నిండిన ఈ సంసారములోని జీవుడును తానెవడు? ఎక్కడనుండి తాను వచ్చెను? ఎక్కడకు పోవలెను? అని తెలియకుండును. కాని జ్ఞాన దీపమును ప్రకాశింప జేసికొనినచో అతడు తన అంతరాత్మతో తనలో తన్నుతాను చూడగలుగును. కనుక ఓ విప్రులారా! అందులకై మీరును మొదట వైరాగ్యమును పూనుడు. దానిచే మీరు కుబుసము విడిచిన పామువలె పాపములను వదలించుకొనగలరు. జ్ఞానము సంపాదించి, చింతా సంతాపములు విడువగలరు. లోకగతి అనాది ప్రవాహము. నది వంటిది. ఘోరమైనది. ఇది అన్ని వైపులకు వ్యాపించును. ఇంద్రియములు మొసళ్లు, మనఃసంకల్పములు దీనిగట్లు. లోభమోహములు, క్రోధము బురద, అవ్యక్తతత్త్వమునుండి ఇది పుట్టినది. మహా వేగముకలది. సంసారసాగరములో అది కలియును. జన్మ పరంపర అను పాతాళములోనికిది పోవును. కామముచే ఇది పుట్టును. జిహ్వచాపలము సుడులు. దీనిని జ్ఞానవంతులు మాత్రమే దాటగలరు. సమస్త భూతము సృష్టి ప్రళయములు తెలిసికొన గలరు. ఇదియే సర్వశ్రేష్ఠమగు ధర్మము. దీనిని హితుడై అనుగతుడై శుచిమనస్కుడైన శిష్యునకును, కుమారునకును మాత్రమే బోధించవలయును” అని చెప్పెను. అంతట

“స్వయంభూ బ్రహ్మము మోక్షమునకై నిర్ణయించిన ఉపాయమును యథాశాస్త్ర న్యాయానుసారముగ మాకు తెలుప వేడుచున్నా” మని మునులు వ్యాసుని అడిగిరి.

వ్యాసుడు మునులకిట్లు చెప్పెను:

ఓ మహా ప్రాజ్ఞులారా! మనవంటివారికి వివేక జ్ఞానము సరియగు ఉపాయము. దాని సహాయమున సర్వ విషయములను అన్వేషించి కనుగొనవచ్చును. కాని మనకు ఒక కడవతో పనిపడినపుడు దానిని ఒక్కదానిని సరియైనదానిని సంపాదించుకొనవలయునే కాని లోకములో అన్ని కడవలను గూర్చి తెలిసికొనవలసిన పనికాని, అన్ని కడవలను సంపాదించవలసిన పనికానిలేదు. అట్లే మోక్షమును కోరినవారు మోక్ష ధర్మమును మాత్రమే కాని ఇతర ధర్మములను తెలిసికొన నక్కరలేదు. తూర్పు సముద్రమునకు చేర్చు మార్గము పశ్చిమ సముద్రమునకు చేర్చదు. అట్లే మోక్షము సిద్ధింపజేయు ధర్మము ఒక్కటియే. ఇతర మార్గములు దానిని సిద్ధింప జేయజాలవు. అట్టి ధర్మమును తెలిపెదను. యోగ సాధనకు మూలముగా క్షమచే క్రోధమును సంకల్పములను విడుచుటచే కోరికలను, సత్త్వ వృద్ధిచే నిద్రను, ఎచ్చరికచే భయమును, మనస్సు నిబ్బరముచే ఇచ్ఛను ద్వేషమును కామ ప్రవృత్తిని, జ్ఞాన వివేకమును అభ్యసించుటచేత బుద్ధిమాంద్యమును, ఏ విషయములును చిత్తమున స్ఫురించకపోవుటను హితములు సులభముగా జీర్ణమగు మితాహారముచే దైహికములు మానసికములు అగు ఉపద్రవములను, తృప్తిచే లోభమోహములను తత్త్వా జ్ఞానముచే విషయ భోగములను దయాభావముచే అధర్మమును ఫలానభిసంధిచే యజ్ఞ దానాది ధర్మ కర్మములను ఆ యతిచే ఆశను సంగము విడుచుటచే కార్య సామర్థ్యమును దృశ్య ప్రపంచ వస్తువులు అనిత్యములను భావముచే వాటిపై ప్రీతిని, యోగముచే ఆకలిని జయించవలెను. మౌనముచే వాగుడుతనమును, శౌర్యముచే భయమును విడువవలెను. వాక్కును మనస్సును బుద్ధితో, బుద్ధిని జ్ఞాన నేత్రములతో అదుపులో నుంచి జ్ఞానముచే ఆత్మ తత్త్వమెరిగి ఆత్మ శాంతిని సాధించవలెను. ఫలాభిసంధి లేక పవిత్రకర్మలు ఆచరించి శుద్ధమైన చిత్తముతో జ్ఞానము సాధించవలెను. కామ క్రోధ లోభ భయస్వప్నములను యోగదోషముల అయిదింటిని విడిచి యోగసాధనము చేయుచు ధ్యానము అధ్యయనము దానము సత్యము బిడియము ఋజువర్తనము క్షమ శౌచము ఆచారశుద్ధి ఇంద్రియ జయము కలిగియున్నచో తేజస్సు వృద్ధియగును. పాపము నశించును. సంకల్పములు నెరవేరును. విజ్ఞానము ప్రవర్తిల్లును. చివరకు బ్రహ్మ స్థానమున ప్రవేశించును. అమూఢత్వము సంగ రాహిత్యము కామక్రోధముల విడుచుట దైన్యముకాని పొగరుకాని లేకుండుట భయములేక నిబ్బరముతోనుండుట-ఇది ప్రసన్నమును విమలమును శుచియు అయిన మోక్షమార్గము. మనోవాక్కాయ నిగ్రహము తప్పక ఉండవలసిన నియమము. (138)