బ్రహ్మ మహా పురాణము

పాతాళ ప్రమాణ కథనము

భువనకోశ వృత్తాంతమును సంగ్రహముగను సాకల్యముగను వర్ణించుచు, లోమహర్షణుడు, మునిశ్రేష్ఠులారా! భూమియొక్క వైశాల్యము డెబ్బది వేల యోజనములు, దాని ఎత్తు కూడా అంతే ఉండును. ఒక్కొక్క పాతాళము వైశాల్యము పది వేల యోజనములు. అతలము, వితలము, నితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము అనునవి సప్తపాతాళములు. అచట కృష్ణా శుక్లా అరుణా పీతా శర్కరా శైలకాంచనీ అను భూములు ఉత్తమ సౌధములతో ఒప్పుచుండును. ఆ ప్రదేశములందు దైత్య, దానవ జాతులు వందల కొలది కలరు. మునిసత్తములారా! అచట పెద్ద సర్ప జాతులు కూడ కలవు.

స్వర్గము కంటెను పాతాళములు రమ్యములని పాతాళముల నుండి స్వర్గమునకేగి సభామధ్యమున నారదమహర్షి చెప్పిరి. వీనియందాహ్లాద జనకములైన పరిశుభ్ర కాంతి భరితములైన రత్నములున్నవి. నాగాభరణ భూషణములు పెక్కులున్నవి. ఇట్టి పాతాళము దేనితో సాటియగును. దైత్యదానవ కన్యారత్నములు ఇందు అందందు క్రీడింతురు. ఇట్టి పాతాళము ముక్తుడైన వానికి గూడ ప్రీతిజనకమై ఉండును. పగటి సూర్యుని కిరణములు ఇచ్చట కాంతి నొసంగును గాని ఎండ వేడిమిని కలిగింపవు. రాత్రి చంద్ర కాంతులును చలినిగాక, చక్కని వెలుగును మాత్రమే ఇచ్చును. భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయ రూపమైన ఆహారములచే మదించిన భోగులగు దానవాదులు కాలగమనమును ఇచట గమనింపనే గమనింపరు. వనములు, నదులు, సరోవరములు, పుంస్కోకిలల కలకలారావములతో మనోహరములై ఉండును. ఇచటి ప్రజలు ధరించు భూషణములు మిగుల రమ్యములు. అంగరాగములు గంధాదులు పరిమళ భరితములు. నిరంతరము వీణా వేణు మృదంగనాదము శ్రవణ మనోహరముగ వినిపించును. ఇచటి భాగ్య భోగ్యములు పరమ మనోహరములు. పాతాళవాసులగు దానవులు, దైత్యులు, నాగులును ఆ భోగములు అనుభవించుచుందురు.

పాతాళమునకు అడుగున విష్ణువుయొక్క తమోమయ శరీరము శేషుడు అను పేర అనంత కళ్యాణగుణ నిలయమై తేజరిల్లుచుండును. దేవ, దేవర్షి, సిద్ధులచే అతడు అనంతుడని కీర్తింపబడును. స్వస్తిక ముద్రాంకితములైన వేయి శిరస్సులచే సహస్రఫణామణి కాంతిపుంజములచే దిశలను రంజింపచేయుచుండును. లోకహితమునకై ఆయన అచటి అసురులను తన తేజముచే నిర్వీర్యులనుగా చేయుచుండును. ఎల్లప్పుడు ఒకే కుండలమును ఆభరణముగ ధరించి, కిరీటధారియై, పుష్పమాలాలంకృతుడై, మదఘూర్ణిత నేత్రుడై అగ్ని సహిత శ్వేతాచలమువలె ప్రకాశించుచుండును. నీలవసనుడు మదోత్సికుడు, శ్వేతవరోపశోభితుడు, ఆకాశగంగా ప్రపాత సంయుత కైలాస పర్వతమన్నట్లు ఈ శేషుడు ఒకచేత నాగలియు మరొకచేత రోకలియుధరించి వారుణి అను నాగ అంగనతో కూడి ఉపాసింపబడును. కల్పాంతమందు సహస్ర ముఖములనుండి విషానలజ్వాలలు గ్రమ్ముకొన సంకర్షణ స్వరూపుడైన రుద్రుడు జగత్రయమును మ్రింగివేయును. గిరిమండలమువలె అశేష క్షితి మండలమును ఫణాగ్రమున ధరించి అశేష సురసమర్చితుడై పాతాళ మూలమందు అధిష్టించి ఉన్నాడు. దేవతలు కూడ అతని వీర్య ప్రభావ రూప వైభవము వర్ణింప జాలరు. తెలిసికొనజాలరు. ఆయన ఫణామణి శిఖలచే అరుణమై కుసుమమాలికవలె ఇలాతలము అఖిలము నిలిచియున్నది. అట్టి మహానుభావుని శక్తి ఎవ్వడు వర్ణింపగలడు.

మదముచే తిరుగుడుపడు కన్నులతో ఆ అనంతుడు ఎప్పుడు విజృంభించునో అపుడు భూమండలము పర్వతములతో సహా సముద్రముగ కంపించును. గంధర్వాపుర సిద్ధ కిన్నర ఉరగ వారణులు కూడ అశేషాహి గుణముల అంతు తెలియలేరు. కావుననే ఆయన అనంతుడను పేరు పొందెను. నాగకన్యా తిలకములు తమ మృదుల కరకమలములచే అతనికి పూయు హరిచందనము శ్వాసానిలములచే వినరబడి దిశలకు సువాసన భరితవటవాసమై (పరిమళ చూర్ణమై) వాసించును. ఆ ఫణిరాజును ఆరాధించి పురాణ మహర్షి గర్గాచార్యుడు జ్యోతిశ్చక్రము యొక్క రహస్యములను తెలుసుకొనెను. సకల శకున ఫలితములను తెలుపగల్గెను. ఆ నాగేంద్రునిచే శిరసావహింపబడిన ఈ వసుంధర దేవాసుర మానుష విశేష సహితములయిన సర్వలోకములను ధరింపగల్గుచున్నది. (21)