బ్రహ్మ మహా పురాణము

పార్వతీ తపోవర్ణనము

బ్రహ్మ ఇట్లు అనియె -

అఖిల దేవతా మండలి ఆజగజ్జనని కడకేగి, ఓ దేవీ! తపము వలదు. శీఘ్ర కాలములో ఆ నీలకంఠుడు ఏతెంచి నీకు భర్త కాగలడు అని నచ్చజెప్పి ప్రదక్షిణముచేసి వెళ్లిపోయిరి. ఆమె తపస్సు విరమించెను. తన పర్ణశాల గుమ్మమున ఉన్న అశోకము క్రింద ఆమె వసించెను. అంతట ఇందుతిలకుడు సురార్తిహరుడు అగు హరుడు వికృత రూపియై పొట్టిచేతులు సొట్టముక్కు రాగిజడలు వికృత ముఖము మఱుగుజ్జునై వచ్చి దేవీ! నిన్ను నేను వరింతుననెను. ఉమయు యోగసిద్ధిచే నాతనిని శంకరునిగా గ్రహించి విశుద్ధాంత రంగయై అర్ఘ్యపాద్యాదులు మధుపర్కములు ఒసగి బ్రాహ్మణాకారమున ఉన్న స్వామిని బ్రాహ్మణ ప్రియగావున యధావిధి నర్చించి.

‘స్వామీ! నేను అస్వతంత్రను. మా తండ్రి శైలాధిపతి ఇంట ఉన్నారు. ఆయన కన్యాదానము చేయసమర్థుడు. అతని అర్థింపుము. అయన నన్ను కీకిచ్చునేని యది నాకు ఉచితము’. అంత నా విప్రుడు గిరిరాజు కడకేగి ‘తనకు కన్యా దానము చేయుమని” అర్థించెను. ఈ వికృతరూపుని శివునిగా గ్రహించి శాపభీతిచే నిట్లనియె.

శైలరాజు ఇట్లు అనెను-భూ దేవులగు విప్రులను అవమానింపబోను, నా యభిప్రాయము మనవిచేసెదను. ‘మా అమ్మాయి స్వయంవరమున ఎవ్వనిని వరించునో అతడు ఆమెకు భర్తయగును.’ అనగా వృషభధ్వజుడు తిఱిగివచ్చి ‘దేవీ! మీ తండ్రి స్వయంవరమున నీవెవ్వని వరింతుపువో వానికిచ్చెదనని చెప్పియున్నాడు. నీవు నీకు ఈడగు రూపవంతుని విడచి తగనివాని నేల వరింతువు’. కాన నాకందవు. నీతో చెప్పి వెళ్లుచున్నాని తెలిపిన

బ్రహ్మ ఇంకను ఇట్లనియె అంత ఆ ఉమాదేవి ఆమాటను భావనచేసి తనపై అతడు ఇడిన భారమును గ్రహించి దానితో బాటు చూపిన మనః ప్రసన్నతను ఆలక్షించి ‘దేవేశ! నీకు మఱొక తలపు వలదు. నేను నిన్ను వరించెద. ఆశ్చర్యమక్కరలేదు. సందేహము ఉన్నదా? ఇదిగో ఇక్కడే నాకోరిన విభుడవగు నిన్ను నేను వరించుచున్నాను అని పుష్పగుచ్ఛ మొక్కటి రెండుచేతలంగొని శంభుని మూపున ఉంచి యాదేవి దేవదేవుంగని ఇప్పుడు వరింపబడితివి అనెను. అంత ఆశివుడామె కూర్చుండిన యశోకమును చూచుచు దానికి మాటచే ప్రాణము పోయుచున్నాడా అన్నట్లు ఇట్లనియె.

“ఓ అశోకమా! నీ పూలగుత్తిచే నేను వరింపబడినాడ కావున నీకు ముదిమి ఉండదు. అమరమయ్యెదవు గాక! నీవు సర్వాభరణ కుసుమ ఫల భరితమై కామరూపివై, సర్వకామ ప్రదమై, కామపుష్పమవై, సర్వాన్న భక్షకమై అమృతాస్వాదివై సర్వపరిమళ పూర్ణమై దేవతలకు అత్యంత ప్రియము కాగలవు. నీకు ఎందును భయముగల్గదు. నీవు సంపూర్ణ తృప్తుడు వయ్యెదవు. ఈ అశోకాశ్రమము చిత్ర కూటమని ఖ్యాతినందగలదు. ఇటకు యాత్రచేసిన వాడు అశ్వమేధయాగ ఫలమందును. ఇచట ప్రాణోత్ర్కమణ మందిన, అతడు దేవి యొక్క తపస్సుతో గూడి మహాగణపతి అగును”

బ్రహ్మ ఇట్లు అనియె-పై ప్రకారము అశోకమునకు వరమిచ్చి శివుడు గిరికన్యతో వెళ్ళివత్తునని చెప్పి అంతర్ధాన మందెను. ఆయన వంకనే మోమునిలిపి ఆదేవి అచట ఒక శిలయందు చంద్రుడు లేని రాత్రియట్లు విరహ వ్యధాకులమనస్కయై ఉండెను. అంతలో శైలకన్య ఆశ్రమ సమీపమున ఉదక పూర్ణమైన సరస్సు నందు అర్తుడైన ఒక బాలుని మాట వినెను. శివుడు బాలరూపము దాల్చి ఆ సరోవరమందు క్రీడించుచు మొసలి పట్టుకొన్నట్లు సృష్టి హేతువైన యోగమాయను పూని నటించి.

“ఎవరైనా నన్ను మొసలిబారినుండి రక్షించండి! అయ్యో! మొసలినోట బడినాడను. నాకై నా దేహమునకై నేను ఏడ్వను. కాని నాకై ఇంటనెదురు చూచు నా తల్లిదండ్రుల గూర్చి చింతించుచున్నాను. వారికి నేనొక్కడనే తనయుడను. నాయందు ఎంతేని ప్రేమ, మక్కువ గొన్నవారు. కావున ఈ విషయము వినిన ప్రాణముల బాసెదరు. ఎంత కష్టము వచ్చినది. బాలుడను. అకృతాశ్రముడను. (ఉపనయనమైనను కానివాడను) ఈ మొసలి వాతబడి మృత్యువాత కెర అయ్యెదను గదా!” అని దుఃఖించెను.

బాలకుని మాటలు విని ఆ కల్యాణి బయలుదేరి సుందరుడగు ఆ బాలకుడు మొసలి నోటబడి కొట్టుకొనుచున్న విధమును చూచెను. ఆ మొసలియును దేవిని చూచి ఆ బాలుని నోట గఱుచుకొని సరస్సులోనికి పాఱెను. బాలకుడు ఆక్రందించు చుండెను. అది చూచి పార్వతి మొసలితో ఇట్లనియె.

“ఓ గ్రాహరాజ! మహాపరాక్రమా! ఈ బాలకుని త్వరగ విడిచిపెట్టుము. ఈతడు తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు” అన మొసలి.

“దేవి! ఆఱవరోజున ముందుగా ఈ సరస్సునకు వచ్చు నతడు నీకు ఆహారమగునని నాకు బ్రహ్మ యేర్పాటుచేసెను. నేడు, నాకు ఈతడు లభించెను. బ్రహ్మ ప్రేరణమిది. ఏమైనను వీనిని వదలననెను. అంత వారిరువురకు ఇట్లు సంవాదమయ్యెను.

“ఓ మకర రాజమా! హిమగిరి శిఖర మందు నేను చేసిన ఉత్తమతపస్సు ఫలము నీవు తీసికొని ప్రతిఫలముగ ఈ బాలుని విడిచి పెట్టుము. నీకు నమస్కారము”

“ఓ దేవీ! తపము వ్యయ పరచకుము. నేను చెప్పినట్లు చేయుము. అట్లైన ఇతడు ముక్తుడగును. హే గ్రాహాధిప! సత్పురుషులు నిందింపని ఏ పనియైన చెప్పుము. తప్పక చేసెదను. సందేహము లేదు. బ్రాహ్మణులు నాకు మిక్కిలి ఇష్టులు”

“ఓ దేవి! నీవు చేసిన తపము స్వల్పమైనను ఉత్తమమైనది. ఆ తపము సర్వమును నాకిమ్ము. అట్లైన ఈ బాలుడు ముక్తుడగును” “ఓ మహాగ్రాహమా! మంచిది. ఆ జన్మము నేను చేసిన పుణ్యమేదిగలదో అది సర్వము నీకు ఒసగుచున్నాను. బాలుని విడువుము” అని పలికెను.

ఇట్లు అన్యోన్య భాషణములు జరిపిన వెంటనే మొసలి ఆదేవి తపస్సు సర్వము స్వీకరించి మధ్యందిన భానునివలె వెలుగొందెను. మరియు లోకోద్ధారిణి అగు దేవినిగని సంతుష్టాంతరంగుడై ఇట్లు పల్కెను.

“దేవీ! తపస్సు సంపాదించుట కష్టము దానిని త్యజించుట ప్రశస్తముగాదు. కావున తపస్సును, ఈ బాలుని కూడా నీవే స్వీకరింపుము. నీ బ్రాహ్మణ భక్తికి మెచ్చితిని” అని మకరము పలుక మహావ్రతధారిణియగు అమె ఇట్లనియె.

“దేహముతోనైనను విప్రుడు నాకు రక్షణీయుడు. తపస్సు మరల సాధించగలను గాని బ్రాహ్మణుడు సాధ్యుడు కాడు గదా! విప్రులకంటె తపస్సు గొప్పది కాదు. నేనిచ్చినది మరల స్వీకరింపను. ఇది నీకు ఇవ్వబడినది. ఇచ్చిన దానిని ఎవ్వడును తిరిగి తీసుకొనడు. తపస్సు నీదె. బాలుని మాత్రము విడిచిపుచ్చు” మనెను.

ఆ మాటలను విన్న మకరము దేవికి నమస్కరించి ఆదిత్యుడట్లు వెలుంగుచు అచ్చటనే అంతర్ధానమయ్యెను. ఆ బాలుడును సరస్తీరమున మొసలిచే విడువబడి, కలలో కనిపించిన వస్తువువలె అచ్చటనే అంతర్ధానమయ్యెను. దేవియు తన తపఃఫలము బాలుని నిమిత్తముగా వ్యయమగుటను చూచి మరల తపస్సు ఆచరింప పూనుకొనెను. శంకరుడది యెరిగి నీవింక తపస్సు చేయవలదు. నీ చేసినదంతయు నాకు అర్పించితివి. అది నీ కక్షయము కాగలదనెను. అట్లు వరమును పొంది అదేవి స్వయంవరము కొఱకు నిరీక్షించుచుండెను. పరమేశ్వరుని ఈ శిశులీలను జదివిన వాడు దేహపాతానంతరము పవిత్రుడై కుమారతుల్యుడై గణాధీశుడగును. (35)