బ్రహ్మ మహా పురాణము

బాలకృష్ణుని వద్దకు అక్రూరుడు వచ్చుట

వ్యాసులు అనిరి.....

అక్రూరుడు గమన వేగముగా ప్రయాణించగల రథమున బయలుదేరి కృష్ణ దర్శనాసక్తిచే నంద గోకులమునకు పోయెను. ఏగుచు త్రోవలో నాకన్న ధన్యతముడు లేడు. హరి అంశమున అవతరించిన అచక్రపాణి నెమ్మోము చూడబోవున్నాను. ఇపుడు నా జన్మము సఫలమైనది. ఈ రాత్రి సుశోభనముగ తెల్లవారినది. విచ్చిన తామరరేకుల వంటి కన్నులుగల ఆ విష్ణు ముఖమును దర్శింపబోవుచున్నాను. దేనినితలచికొన్న పాపము పోవునో అట్టి పుండరీకనయనుని నిండుముఖమును ఇప్పుడుచూడనున్నాను. ఎచ్చటి సమస్త యెల్ల వేదములు వేదాంగములు వెలువడినవో, దేవతలకు ఏది పరంధామమో అట్టి భగవంతుని ముఖము చూడబోవుచున్నాను. యజ్ఞములందు యజ్ఞ పురుషునిగ, పురుషులచే పురుషోత్తముడుగ ఏసర్వాధార మూర్తి యజింపబడునో అట్టి జగద్భర్తను చూడనున్నాను. నూరు యజ్ఞములయందు ఎవ్వని ఉపాసించి ఇంద్రుడు దేవేంద్రపదవి అందెనో అట్టి అయంతువడని ఆయాదిగల స్వామిని కేశవుని చూడబోవుచున్నాను. బ్రహ్మ ఇంద్ర రుద్ర అశ్వినీ వసు ఆదిత్య మరుద్గణములు ఎవ్వని రూపమెరుగరో అట్టి హరి నన్ను తాకుచున్నాడు. సర్వమునుదానై సర్వ భూతములందు ఉండి సర్వమగు సర్వ వ్యాపి ఇప్పుడు నాకు కనబడుచున్నాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహాద్యవతార యోగమును యోగముచేత ఒనరించిన ఆ దేవుడు నన్ను ఇపుడు పలుకరింపనున్నాడు. అవ్యయుడైన హరి జగత్ప్రభువు. ఇపుడు వ్రేపల్లె యందు ఉనికి చేయ స్వేచ్ఛా శరీరధారియై మనుష్య రూపమొంది స్థితికార్యనిర్వహణమునకు వచ్చి ఉన్నాడు. ఆ అనంతుడు శిఖరాదివిశిష్ట పృథివిని ధరించునో ఆ దేవుడు జగత్కార్య నిర్వహణమునకు నవతరించిన మహానుభావుడు ‘అక్రూర!’ అని నోరార నన్ను పిలువనున్నాడు. తండ్రి బంధువు చెలి తమ్ముడు అన్న అను చుట్టరికములతో అల్లుకొనియున్న జగత్తు ఎవ్వని మాయచే దాట శక్యముగాదో అట్టి మాధవునికి నమస్కారము. ఎవ్వడు హృదయమందు బ్రవేశించినంతట మర్త్యులు (మరణ స్వభావం గలవారు) సువిస్తరమైన అవిద్యను యోగమాయను దాటుదురో అట్టి కేవల జ్ఞానస్వరూపుడైన ఆ దేవదేవునికి నమస్కారము. ఎవ్వడు వేదాంత మెరిగిన వారిచేత యజ్ఞభోక్త యజ్ఞ పురుషుడు వాసుదేవుడు అని గీర్తింపబడునో, అట్టి విష్ణువునకు నేను వినతుడను అయ్యెదను. జగదాధారుడగు ఆ పరమాత్మయందు నిలువబడి సరసద్రూప జగత్తు ధరింపబడుచున్నది. అట్టి స్వామి నా ఎడల ప్రసన్నుడు అగుగాక! నరుని జీవనము ఎవ్వని స్మరణ మాత్రమున సకల కల్యాణ భాజన మగునో అట్టి పురుషోత్తముని హరిని నిత్యము శరణొందెదను.

అని ఇట్లు భక్తినమ్రమైన తన మనస్సుతో విష్ణువుని తలచుచు అక్రూరుడు ఇంచుక పొద్దుండగనే గోకులమును జేరెను. అతడు అచ్చట ఆవుల పాలు పిదుకుచు ఉన్న కృష్ణుని, దూడల మధ్యనున్న వానిని, ప్రఫుల్ల పద్మపత్రాక్షుని, శ్రీవత్సాంకితవక్షుని, ఆజానుబాహుని, ఎత్తైన వెడద ఉరముగలవానిని, ఉన్నతాసుని, సవిలాసమందహాస భరిత వదనారవిందుని, ఎత్తై, మెరుపు చిందు నఖములతో పీతాంబరమును ఉత్తరీయమును దాల్చి, వనమాలా భూషితుడై తెల్ల తామర పూవు శిరమునదాల్చి ఉన్న హరిని అక్రూరుడు సందర్శించెను. హంసవలె, చందమామవలె, మొల్లలవలె తెల్లనై, నల్లని వలువ దాల్చిన యదునందనుని, బలభద్రుని ఆ కృష్ణుని వెనుక జూచెను. అతడు ఉన్నతుడు, ఉన్నత బాహువులు గలవాడు. సవికాసమైన ముఖారవిందము గలవాడునై మేఘముల గుంపుతో అలముకొన్న మఱొక కైలాస పర్వతమట్లున్న బలరామమూర్తిని కాంచెను. ఆ ఇద్దరి చూచిన ఆమతిమంతుడు అక్రూరుడు ముఖపద్మము విప్పార మేనెల్ల గగుర్పొడువ, ఇది పరంధామము. ఇదియే ఆ పరమ పదము. ఆవాసుదేవుడు ఇరుతెరగులై ఇచట ఉన్నాడు. ఆ ప్రదేశమిదే.

ఆ జగద్విధాత దర్శనమున నాకనుగవ సాఫల్యమందుగాక! నన్ను కౌగలించికొను చున్న అవ్యాజమైన అనవ్వు అభగవంతుని ప్రసాదమే. అది నాసర్వార్థ సిద్ధికి మార్గమగు గాక!

ఎవ్వడు తన కొనవేలిచే స్పృశించిన మాత్రాన, సర్వ పాపములు తూలిపడునో అట్టి ఆ అనంతమూర్తి నాహస్త పద్మమును, శ్రీమంతము, శోభావంతమును జేయును. దానిచే ఇంద్ర మరుత్ అశ్విని దేవతలందఱు నాయెడ ప్రసన్నులై వరములు ఇత్తురా? ఎవ్వడు దైత్యరాజ బలమునుచంపి భార్యల కనులకాటుకలను ఎల్లను తుడిచివైచెనో ఎవ్వని చేతిలో దానధార పోసి అవనిపైనుండియే అమరలోకేంద్ర భోగములను అందెనో, ఎవ్వనిని కొలిచి ఇంద్రుడు మన్వంతరముదాక స్థిరమైయుండు స్వర్గసామ్రాజ్యాధిపత్యము నందెనో, అట్టి సాక్షాద్భగవంతుడు కంసుని పరిగ్రహముచే (నన్ను తన వానిగా మిత్రకోటి లోనికి స్వీకరించుటచే) దోషమునకు స్థానమైనట్టియు, నిర్దోషినైఆత్మ బహిష్కరింప బడినట్టి దురభిమానినగు నన్నుగూర్చి నిందయగు గాక! (నన్ను నేనే ఛీ అనుకొన వలసి యున్నదన్నమాట) కేవల జ్ఞానమై, సత్వనిధియై, అదోషియై, అందరును సులభముగా తేటపడక అందరి హృదయములందు ఉండెడి ప్రభువునకీ జగమునందు తెలియనిది ఏమున్నది? అందువల్ల భక్తిచే మోమువంచి ఈశ్వరుల కెల్ల ఈశ్వరుడైన ఆ విశ్వేశ్వరుని అనాది మధ్యావ సానుడు అజుడుఅగు విష్ణువు యొక్క ఆ అంశావతార మూర్తిని దర్శింప పోయెదను. (191)