సముద్రమునకు ఉత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము గలదు. అందలి సంతతి ‘భారతి’ అనబడును. ఇది తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమియని దీనికి పేరు. కోరినవారికి స్వర్గము మోక్షమును కూడ ఇందే ఉన్నవి.
ఇందు మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, ఋక్షము, వింధ్యము, పారియాత్రములు అను సప్తకుల పర్వతములున్నవి. భారత వర్షము నుండియే స్వర్గ మోక్షములను జీవులు పొందుదురు. పశు పక్ష్యాది జన్మములను నరకమునుగూడ ఇట నుండియే పొందుదురు. ఆవాంతర కర్మఫలము స్వర్గము పర్యవసానము నందు అత్యంతిక ఫలమైన మోక్షముగూడ ఇటనుండియే మానవుడు పొందును. ఈ భూమండలమందు ఇక్కడనే కర్మానుష్ఠానము విధింపబడినది. అందుచేతనే దీనికి కర్మ భూమి అను పేరు సార్ధకము.
భారతవర్షమున తొమ్మిది ద్వీప విభాగములున్నవి. ఇంద్రద్వీపము, కశేరువు (కశేతుమంతమని కూడ అందురు) తామ్రపర్ణము, గభస్తిమంతము, నాగద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము. అందు ఈ భారత ఖండము తొమ్మిదవది. సముద్ర సంవృతము ఇది దక్షిణ దిశనుండి ఉత్తర దిక్కుకు వేయి యోజనములు.
తూర్పున కిరాతులు, పడమట యవనులు, నడుమ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉందురు. యజన, యాజనములు, యుద్ధము, వాణిజ్యము, కృష్యాదులు వృత్తులు క్రమముగా వీరికి విహితములు.
హిమవత్పర్వత ప్రత్యంత పర్వతము నుండి శతద్రు (సట్ లజ్) చంద్రభాగ, వేదము, స్మృతి మొదలయిన నదులు ప్రవహించుచున్నవి. నర్మద, సురస మొదలయినవి వింధ్యగిరి నుండి వెడలుచున్నవి. తాపి, పయోష్ణి, నిర్వింధ్య, కావేరి మొదలయినవి ఋక్షపర్వత పాదమందు జనించినవి. గోదావరి, భీమరధి, కృష్ణవేణి మొదలగునవి సహ్యగిరి పాదమందు పుట్టినవి. కృతమాలా, తామ్రపర్ణీ ప్రముఖములు మలయాద్రి సంభవములు. త్రిసాంధ్య, ఋషికుల్య మొదలయినవి మహేంద్రగిరి జన్యములు. ఋషికుల్యా, కుమారి మొదలైనవి శుక్తిమత్పర్వత పాదమందు పుట్టినవి. వీని ఉపనదులు వేలకొలదిగా కలవు.
వానియందు కురుపాంచాల దేశ ప్రజ నివసించుచున్నది. తూర్పున కామరూప దేశవాసులు, కళింగులు మగధులు ఉన్నారు. దాక్షిణాత్యులు దక్షిణమునందు ఉండువారు. పశ్చిమమున సౌరాష్ట్రులు, శూద్రులు, అభీరులు-అర్బుదులు, మారుకులు, మాళవులు పారియాత్ర నివాసులు, మద్రులు, రాములు, అంబష్ఠులు, పారసీకాదులు వీరందరు ఈ యీనదుల జలములను త్రాగుదురు. ఈ దేశములు కలిసిమెలసి ఆనందభరితులై పుష్టివంతులు అయి జనులతో నిండియుండును.
కృత, త్రేతా, ద్వాపర, కలియుగ విభాగమిక్కడనే కలదు. అన్యత్రలేదు. ఇందు యతులు తపస్సుచేయుదురు. యజ్వలు హోమములు (యాగములు) చేయుదురు. పరలోకము కోరి ఇచట దానము లాచరింపబడును.
జంబూద్వీపమందు యజ్ఞపురుషుడు ఉపాసింపబడును. విష్ణువు యజ్ఞరూపుడుగ యజ్ఞేశ్వరుడుగ ఇచ్చట ఉపాసింపబడును. ఇతరద్వీపములందు మఱియొక పేరున కొల్వబడును. ఈ జంబూద్వీపమున భారతవర్షము శ్రేష్ఠము. ఇది కర్మభూమి. తక్కినవి భోగభూములు, బహుజన్మ ఫలభోగముగ ఇందెంతో కాలమునకు మనుష్య జన్మము కల్గును.
స్వర్గాపవర్గము లొసగు భారతభూమియందు మనుష్యులై, వారిలో పురుషులై పుట్టి, అట్టి కర్మభూమి యందు జన్మము పొంది, ఫలాభిసంధిలేక సర్వ కర్మ ఫలములను పరమేశ్వరార్పణమని, పరమాత్మయగు విష్ణువునందు అర్పించి, పాపడూరులై ఆ పరబ్రహ్మమందు లీనమగువారు ధన్యులు. అనగా పరమేశ్వరార్పణముగ అనాచరించిన స్వర్గ ప్రదమగు కర్మ లీనమైపోయిన తర్వాత దేహబంధమును మఱియెందు పొందుదురో ఎఱుగము. ఇంద్రియవంతులై భారత వర్షమున పుట్టినవారు ధన్యులు అని దేవతలు ఈ భారతభూమిని గూర్చి గానము చేయుచుందురు. తొమ్మిది వర్షములుగల్గి లక్ష యోజనముల విరివిగల ఈ జంబూద్వీపమును గూర్చి సంక్షేపముగా దెల్పితిని. ఈ ద్వీపమును ఆవరించి లక్ష యోజనములు విస్తారముగల క్షీరసముద్రము వలయాకారముగ నున్నది. (19)