బ్రహ్మ ఇట్లు అనియె- ఓ మునివరులార! అమ్మహీపతి ఇట్లు జగన్నాధుని మ్రొక్కి వినుతించి ఆలోచనలో మునిగి దర్భలు పరచుకొని ఆమీద బట్టపరచుకొని ఆ దేవుని పై మనసు నిల్పి నాబాధను హరించు దేవదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమగునని అనుకొనుచు నేలపై నిదురించెను. జగద్గురువు ఆ నిదురించిన పనికి స్వరూపదర్శనమును అనుగ్రహించెను. శంఖ చక్ర గదాశార్ఞ్గములను దాల్చి చుట్టును నొకవెలుగు గుడికట్టు చుండగా, యుగాంత అదిత్య ప్రభతో గరుడుని మూపుపై ఎక్కి ఎనిమిది బాహువులతో దర్శనమిచ్చిన ఆ దేవదేవుని రాజు దర్శించెను.
అట్లు పొడసూపిన ఆస్వామి రాజుతో “ఈ క్రతువుచేత నీ భక్తి శ్రద్ధలచేత సంతుష్టుడను అయితిని. ఊరక ఏల పరితపింతువు ఈ ప్రతిమ జగత్పూజ్యము. సనాతనము (ఈనాటిది గాదు) ఇది నీవు పొందుటకు ఉపాయము తెల్పెదను. ఈ రాత్రి గడచి సూర్యోదయము కాగానే సముద్రజలములకు అల్లంత చివర పలుచెట్ల గుబురులతో చెలియలికట్టను ఆనుకొని సముద్ర జలము కెరటములతో కానవచ్చును. దానికి ఆవలి గట్టున ఒకచెట్టు నీళ్ళను నేలను గూడ తాకుచు ఉండును. అలల తాకుడులచేత కూడా అది కంపింపదు. గొడ్డలిగొని నీవు ఆ నీటిలో ఏకాకివై ఎట్టి జడుపుగొనక అట్టిటు దిఱిగిచూచి ఇట్టి చిహ్నాలు గల ఆ వృక్షమును చూచి శంకింపక నఱకుము. ఆ అద్భుత వృక్షమును గని ఆలోచించి దానిచే ఆ దివ్యమూర్తిని గావింపుము. నిన్ను తబ్బిబ్బు పరచునట్టి వేరు ఎట్టి ఆలోచననైనను చేయకుము” అని పలికెను.
ఇట్లు మహానుభావుడు ఆ హరి ఆనతిచ్చి అంతర్ధానమందెను. రాజు తన కలను గమనించి ఎంతో ఆశ్చర్యపడెను. ఆ రాత్రి అంతయు అందే మనసునిడి విష్ణు దేవతాకములైన మంత్రములను, విష్ణు సూక్తమును పారాయణము చేయుచు వేకువను లేచి వేరు తలంపు గొనక చక్కగ సాగరస్నానముచేసి, గుఱ్ఱములేక, వెంట కాలిబంటులేక, ఏన్గులేక, సారథియు లేక, ఒంటరిగ ఆ కడలి చెలియలకట్టనుదిగి తేజోమయమైన పెనుమొదలు గట్టిన సువిస్తృతమైన ఆ పుణ్యవృక్షమును చూచెను. మిక్కిలి ఎత్తుగ మిక్కిలి బోదెగల్గి నీటి చెంత నిద్రలో ఉన్న దట్టమైన మంజిష్ఠి వర్ణము (ఎఱుపు) కలిగిన ఆతరువు ఏ జాతిదో ఏ పేరిదో తెలియరాదయ్యెను. నరనాథుడదిగని, అనందపడి పదునైన గొడ్డలిచే దానిని రెండు తునకలు గావింపనెంచి కొట్టెను. అది చూడ నాశ్చర్యము గొల్పుచుండెను. అంతట విశ్వకర్మయు (దేవశిల్పి) విష్ణువును విప్రరూపముదాల్చి వచ్చిరి. ఇద్దరు ఒకేరూపున దేజరిల్లుచుండిరి. దివ్యమాలలు ధరించిరి. దివ్యగంధము పూసికొనిరి. ఇంద్రునకు మిత్రుడైన ఆ రాజును కలిసికొని “మహారాజా! నీవు ఇచ్చట ఏదో చేయుచున్నావు? ఈ మహా వృక్షమును ఎందులకు నఱికితివి? ఈ నిర్జనమైన కాఱడవిలో నీవు తోడులేక మహోదధి ఒడ్డున ఒంటరిగ నీవెట్లీ చెట్టును నఱకితివి?” అని ప్రశ్నించిరి.
ఆ యిరువురి మాటవిని, అరాజు ముదమంది చంద్రసూర్యులవలె అచ్చటకు అరుదెంచిన ఆ బ్రాహ్మణులను ఆనందభరితుడై చూచి నమస్కరించి ఆ జగన్నాథుల సన్నిధి దలవంచుకొని నిలువబడి.
“అది అంతములేని అనంతమూర్తిని, జగత్పతిని ఆరాధించుట కొక ప్రతిమను గావించుకొనవలెనని తలంపు గల్గినది. కలలో ఆ దేవునిచేత నేను భావింపబడితిని. ఆ సంగతి మీకు తెల్పితిని” అని అనెను.
అనవిని విశ్వేశ్వరుడు హరి నవ్వి సంతుష్టి గొని ఇట్లు పలికెను. బాగు బాగు నృప! నీతలంపు మేలైనది. అంతులేని ఈ ఘోర సంసారము అరటి ఆకు పగిది నిస్సారము. బహుదుఃఖ నిలయము. కామక్రోధాకులము. ఇంద్రియములు ఇందు సుడులు, నానా వ్యాధులు, నీటి బుడగ వంటివి. విష్ణుని ఆరాధింప నీకు తలపు గలుగుటచే నీవు ధన్యుడవు. సద్గుణభూషణుడవు. ఈ ప్రజలు, పట్టణములు, గ్రామములు, పర్వతములు, అడవులతో నాల్గువర్ణములతో నీవు పాలించు పృథివియు ధన్యులు. రారమ్ము! చల్లని ఈ చెట్టుదరి మాటలాడుకొంద ఇట నీవు మాతోగూడ వచ్చి నిలువుము. ఈతడు నాతోడ వచ్చినాడు మహాశిల్పి. విశ్వకర్మతో సాటియైనవాడు. ఎల్లపనులు చేయుటయందు ఎంతో నేర్పరి. నేను ఉద్దేశించిన ప్రతిమను ఈతడు చేయును. ఒడ్డు దిగుము. అనగా ఆ ద్విజుని మాట విని సముద్రము ఒడ్డునుండి చని ఆ చెట్టునీడను నిలిచెను. ఆ విశ్వరూపుడు విష్ణువు ఆ శిల్పివరునకు ప్రతిమ చెక్కుమని, తామరఱేకులట్టి కన్నులు ఉరమున శ్రీవత్స కౌస్తుభములు హస్తములందు శంఖ చక్రగదాశార్ఙ్గములు గలిగినదొకటి అచ్చము పాలవలె తెల్లనై స్వస్తిక ముద్ర నాగలి చేతను పూనిన అనంతమూర్తి ఇంకొకటి వాసుదేవుని చెలియలు బంగారు చాయగల పరమ శోభనము సర్వ లక్షణలక్షితము అగు సుభద్రామూర్తి మూడవది. ఇట్లు మూడు ప్రతిమలు గావింపుమని ఆనతిచ్చెను.
విశ్వకర్మ ఆమాట విని అక్షణమున ఆ శుభలక్షణములతో ముమ్మూర్తుల (మూడు విగ్రహములకు)ను కావించెను. ఒకటి శరత్కాల చంద్రబింబమువలు అచ్చము తెల్లనిది. ఎఱ్ఱని కనులు పెద్ద శరీరము పాముపడగబోలు మస్తకము నల్లని వలువయుగల బలరామమూర్తి. ఒక్కటే కుండలము, దివ్యగదాముసలాయుధము పూనినది. తెల్లతామరల బోలు కన్నులు. నల్లని మేఘము. అతసీకుసుమమువలె నిగనిగలాడు నీలతనువు, పీతాంబరము ఉరమున, శ్రీవత్స లక్షణము చేతను చక్రాయుధము గల్గిన సర్వపాపహరమైన శ్రీహరిమూర్తి రెండవది. మూడవది స్వర్ణచ్ఛాయశరీరము రత్నహారకేయూరాది విచిత్ర భూషణములు కమల నయనములు విచిత్ర వస్త్రములతో ఒప్పుచు ఉన్న పీనోన్నత స్తనియైన సుభద్రమూర్తి. ఆరాజు ఇంద్రద్యుమ్నుడు ఆ అద్భుత శిల్పమును చూచి క్షణములో నిర్మించిన ఆ దివ్య మూర్తులను వీక్షించి వింతపడి బ్రాహ్మణ వేషములను ధరించి ఏతెంచిన మీరిద్దరు దేవతలు, అద్భుత కర్ములు దేవవర్తనులు అమానుష కర్ములు అగు మీరు వేల్పులా, యక్షులా, విద్యాధరులా, బ్రహ్మయు, విష్ణువునా? వసువులా! కాక అశ్వినీ కుమారులా! తెలుసుకొనలేక ఉన్నాను. మాయా రూపమున ఉన్న మిమ్ము శరణు పొందుచున్నాను. మీస్వరూపమును నాకు వెలువరింపుడు. అని ఇంద్రద్యుమ్నుడు అనెను. (50)