బ్రహ్మ మహా పురాణము

వసిష్ఠ జనక సంవాదము

వసిష్ఠుడు జనకునితో నిట్లు పలికెను:

ఈ చెప్పిన విధముగా ఆ అక్షరతత్త్వము జ్ఞానరూపుడు అయికూడా, అప్రతిబుద్ధ, అజ్ఞాన సహిత రూపుడై అప్రతి బుద్ధులగు మనవంటివారిని అనువర్తించుచున్నది. దేహము నుండి మఱియొక దేహములో ప్రవేశించుచు, వేలకొలది జన్మలను పొందుచున్నది. వేల కొలది తిర్యగ్యోనులందును దేవతల యందును తపోవంతుడై మహాసద్గుణ యుక్తుడుగా గుణ క్షయముచే మనుష్యుడుగా జన్మించి పుణ్యవశమున స్వర్గమునకు పోవును. మనుష్య లోకమునకు వచ్చును. పాపముచే నరకమునకును పోవును. పట్టుపురుగు తన దేహము నుండి తీసిన దారముతో తన్నే చుట్టుకొన్నట్లు తననుండి నిష్పన్నములైన త్రిగుణములతో తన్నే బంధించుకొని ఆ అక్షరుడు తాను స్వభావముచే ద్వంద్వాతీతుడై యుండియు సుఖదుఃఖ రూపములగు ద్వంద్వములకు లోబడి శిరోరోగము, నేత్రరోగము, దంతశూలగల గ్రహము, జలోదరము, అతిసారము, గండమాల, విచర్చిక, బొల్లి, కుష్ఠము, అగ్ని, దాహము, అపస్మారము మొదలగు బాధలను పొందుచు దేహము నేనే అనియు దేహము నాదే అనియు మాయావశమున కలిగిన అభిమానముచే ఆ బాధలును తనకే అని అభిమానమును పొందుచున్నాడు.

అభిమానముచే కలుగు ఈ ద్వంద్వ జనిత దుఃఖములతో పాటుగ ఆ దేహాత్మాభిమానవశముననే అహంకార మమకార వశముననే ఆతడు కొన్ని సుకృతములను కూడ ఆచరించుచున్నాడు. అవి ఇట్లు ఉండును. ఒకే వస్త్రము ధరించుట, నాలుగు వస్త్రములు ధరించుట, నేలపై పరుండుట, కప్పవలె పరుండుట, వీరాసనములో కూర్చుండుట, వీరాసనముతోను ఆకాశమునందును శయనించుట, ఇటుకల కుప్పపై బూడిదరాశిపై భూమిపై పండుకొనుట, వీరస్థానమున జలముతో తడిసినచోట కొయ్య-రాతి పలకలపై పరుండుట, కాయలతో పండ్లతో పశువులతో పక్షులతో నిండినచోట ఉద్యానములో కళ్లములో పండుకొనుట పూసలతో వెంట్రుకలతో చేసిన వస్త్రములు వ్యాఘ్ర చర్మము సింహచర్మము చెట్ల బెరడు పట్టములు నారతో పురికొసతో నేసిన పట్టలు మొదలగునవి. చాపలు చాపలవంటి ఇతర వస్తువులు నార వస్త్రములు మొదలైనవి తన అభిరుచి ననుసరించి ధరించుట ఒక రాత్రి వదలి మఱియొక రాత్రియు దినమున కొకే మారును నాలుగు భోజన కాలముల కొకమారు, ఎనిమిది భోజన కాలములకు ఒకసారి, ఆరు భోజన కాలములకు ఒకసారి, ఎనిమిది నాళ్ళకు ఒకసారి, ఆరునాళ్లకు ఒకసారి భోజనము చేయుట మాసోపవాసము చేయుట మూలములు పండ్లు తిని ఉండుట వాయువును, నూనె పిండివంటలను, పెరుగును గోధుమలతో యవలతో చేసిన వంటలను గోమూత్రమును ఱెల్లు పూవులను నాచును ఎండుటాకులను వివిధములగు పండ్లను భుజించి జీవనము గడపుట కృచ్ఛమ్రులు చాంద్రాయణములు మొదలగు కఠిన వ్రతములు ఆచరించుట వివిధ వేషములు చిహ్నములు అవి నాలుగు ఆశ్రమములలో వేటికి సంబంధించినవైనను ధర్మాధర్మములలో దేనికి చెందినవైనను వాటికి సన్నిహితమైన ఇతర లక్షణములను వేద విరుద్ధములైన వానిని ధరించుట వివిక్తమగు శిలల నీడలను సెలయేళ్లను ఇసుక తిన్నెలను అడవులను పర్వతగుహలను వివిధ నియమములను తపస్సులను యజ్ఞములను వివిధ యజ్ఞములను ఆశ్రయించుట బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతి ధర్మములలో తోచిన వాటిని అవలంబించుట, దీనులు అంధులు మొదలగు వారికి వివిధ దానములు చేయుట వివిధ గుణములను స్వభావములను అలవాటులను పాటించుట ధర్మార్థ కామములలో తనకు అభిమతమగు పురుషార్ధము నందు ప్రవృత్తుడగుట ఇవన్నియు దేహాత్మాభిమానము అహంకార మమకారము అనెడి వానివలన మాయా వశమున కలుగు ప్రవృత్తులే. స్వాహా, స్వధా, వషట్ నమస్కారములు యజన యాజనాధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహములు జన్మ జరామృత్యువులు హింస శుభాశుభ కర్మలన్నియు ఈ అభిమాన వశమున కలుగునవే. ఇట్లు ఆ అక్షరతత్త్వమే క్షరరూపమున తన్ను తాను వివిధ రూపములలో విభజించుకొనుచు వ్యక్తమూర్త రూపమున కనబడుచున్నది.

పూజ్యురాలగు ప్రకృతి దేవియే భయమును ప్రళయమును కూడ కలిగించును. బ్రహ్మ యొక్క పగలు అనగా సృష్టికాలము అయిన తరువాత శ్రీ మహావిష్ణువు ప్రళయమును జరిపి ఈ త్రిగుణములకును వాటివలన కలుగు సమస్త లక్షణములకును అతీతుడై ఏకైకతత్త్వమగు తాను మాత్రమే ఉండును. సృష్టి జరుగక నిలిచిపోయిన రాత్రి-ప్రళయ కాలమున సూర్యుడు తన కిరణములను వలె కొంతకాలము పాటు ఆయా గుణ ధర్మములను తన లోపల ఆయన నిగ్రహించి యుంచును. ఇది యంతయు ఆయన ఇట్లు లీలా, క్రీడార్ధమై చేయుచు తన హృదయమునకు ప్రియములైన ఈతన రూప గుణములను తనవి అను అభిమానముతో, మమకారముతో చూచును. ఆయన త్రిగుణాత్మకుడు, త్రిగుణములకు అధిపతి. క్రియా ప్రవృత్తి మార్గమునందు ఆసక్తి కలవాడు. క్రియా ప్రవృత్తులతోను యజ్ఞాది క్రియలతోను సంతతమును కూడియుండువాడు. అందుచే ఈ సృష్టి ప్రళయ రూపమగు ప్రవృత్తియందు ముందునకు సాగుచు ఇది నాది అను మమకారమును లీలార్థమై మాత్రమే వహించును. వాస్తవమున ఆ మహానుభావునకు అహంకార మమకారములు ఏవియు లేవు. ఈ జగమంతయు ప్రకృతి ధర్మముచే కన్ను గానక రజస్తమో గుణ ధర్మములచే అనేక విధములుగా వ్యాప్తమై యున్నది. ఈ ద్వంద్వములు సుఖ దుఃఖ శీతోష్ణాదులు నాచే అతీతములై, నానుండి యుత్పన్నములగుచు, నాయందే లయము పొందుచున్నవి. అని ఆయన ఎరుగును. అవి తనచే లెస్సగ సృజింపబడినవే యైనను తాను సామాన్య జీవుడై యున్నపుడు మాయావశమున ఏమియు ఎరుగక పోవుటచే అయ్యో! ఇవి యన్నియు నేను తరించవలెను. దేవలోకమున నేను ఈ ఫలములను అనుభవింపవలెను. ఈ లోకములో నున్నపుడు కర్మ వశమున కలుగు శుభాశుభ ఫలములను అనుభవింపవలసి యున్నది. ఈ విధమగు కర్మములాచరించి సుఖములను సంపాదింపవలెను. ప్రతి జన్మమునందును నాకు సుఖమే కలుగుటకు యత్నించవలెను. ఇహమున నాకు అనంతమగు దుఃఖములు నరకమున యాతనలు ఉండరాదు. ఒకవేళ నరకమునకు పోయినచో మరల మనుష్య జన్మమును తరువాత దేవత్వమును పొందుడు అని ఇట్లు బ్రాహ్మణాది జన్మములు పొందిన ఈ మానవులు ఆయా గుణములతో ఆవరింపబడి భావనచేయుచు అందుకు తగినట్లు కర్మములు ఆచరించుచు నరకమునో మనుష్యత్వ దేవత్వములనో పొందుచు కేవలము మమకార వశమున ఈ జనన మరణ రూప సంసారగతిలో తిరుగుచుందురు.

ఈ విధముగా జీవుడు శుభాశుభ ఫలాత్మకమగు కర్మల నాచరించుచు జనన మరణముల నడుమ అనేక రూపములలో సంచరించుచున్నాడు. కాని ఈ జీవుల ప్రవృత్తుల లోను తిర్యగ్యోని మనుష్యత్వ దేవత్వ ప్రాప్తులలోను ప్రకృతియే హేతువు. అది స్వతంత్రమైనది. జీవుడు ప్రకృతికి అతీతమైన తత్త్వమునందు వ్రణము లేదు. కర్మఫల సంగము లేదు. వ్రణద్వారములనదగిన జ్ఞాన కర్మేంద్రియములు త్రిగుణ జన్యములైన రాగద్వేషాదులు తోడుకాగానే యీ జీవుడు అహంకార మమకారములు కలిగి తనకు ఇంద్రియములు వ్రణములు, చిహ్నములు, కాలము, సత్తా, మరణములు, సంచరణము క్షేత్రము, సంగము, తత్త్వము, సంసారము నాశము లేకున్నను అజ్ఞాన వశమున తనకివి అన్నియు ఉన్నవని   భావించుచు పెద్దలను సేవించి వివేకమును సంపాదించక, దేవత్వము మొదలు నరక పాతము వరకు గర్భ ప్రకాశము మొదలు మరణము వరకు వివిధ స్థితులకు కారణములగు వేలకొలది సృష్టులలో సంచరించుచున్నాడు. చంద్రునకు పదునారు కలలున్నవని శాస్త్రము చెప్పుచున్నది. వానిలో పదునైదింటిని మాత్రము దేవతలు అనుభవింతురు. పదునారవ కలమాత్రము దేవతల అనుభవమునకు అందక నిలిచి యుండుచు తానే దేవతలను అనుభవించుచు మరల మరల చంద్రుడు వృద్ధి క్షయములు పొందుటకు మూలమగు చున్నది. అట్లే శుద్దమగు ఆత్మతత్త్వము కూడ అజ్ఞాన వశమున ప్రకృతికిలోబడి ఆయాజన్మ పరంపరలలో వృద్ధిషక్షయములను పొందుచుండియు శుద్ధతత్త్వమునకు ఏమియు అంటక నిలుచును కావున ఆ తాత్త్విక స్థితిని వృద్ధజన సేవనముచే వివేకము పొందియు యోగాది సాధనచేసియు భగవదనుగ్రహము పొందినప్పుడు గ్రహించి ముక్తుడగుచున్నాడు. (243)