వ్యాసులు ఇట్లు అనిరి - ఓ మునీశ్వరులారా! సర్వజీవి సుఖకరమైనది సర్వ పురుషార్ధములు ఇచ్చునదియు నైన ఆపురుషోత్తమ క్షేత్రమున ‘కండువు’ అను ఒక ఋషి పరమ ధర్మాత్ముడు, తేజస్వి, సత్యవాది, శుచి ఇంద్రియముల నిగ్రహించినవాడు సర్వభూత హితవు కోరువాడు క్రోధము లేనివాడు వేదవేదాంగ పారంగతుడునై వసించుచుండెను. అతడు పురుషోత్తముని ఆరాధించి పరమ సిద్ధి నందెను. అట్టివారే మఱిపెక్కుమంది మునులు అతనివలె ముక్తి నందిరి అని చెప్పగా మునులు ఈ కండువెవరు? అచట పరమగతిని ఎట్లందెను. ఆ చరిత్ర వినవలతుమన వ్యాసులు ఇట్లనిరి.
మునులార! ఇదె వినుడు. పవిత్రమైన గోమతీనదీ తీరమందు కందమూల ఫల సమృద్ధము సమిత్పుష్ఫ కుశ సంపూర్ణము అయిన పుణ్యాశ్రమము కలదు. అది కండుముని నివాసము. అది సర్వర్తు ఫలపుష్ప శోభితము. అందాయన యమ నియమాదులతో మౌనముతో తపమాచరించుచుండెను. గ్రీష్మ ఋతువున, పంచాగ్ని మధ్యమున, వర్షాకాలమున ఆవరణము లేని ప్రదేశమున తడి బట్టలతో ప్రదేశమున చలికాలములో మహాతప మాచరించెను. అదిచూచి ఈయన తపస్సు వేడిమికి భూమి అంతరిక్షము స్వర్గముకూడ ఉడుకెత్తినవి. ఆహా! ఈయన ధైర్యమేమి? ఈ తపస్సేమి? అని దేవతలు వెరగంది యందరు నాయన తపము భంగము గావింతమని నిశ్చయించిరి. వారి తలపెఱింగి ఇంద్రుడు ప్రమ్లోచయను అప్సరసను పరమసుందరినిజూచి భామినీ కండుముని తపమాచరించు తావునకు ఇప్పుడు చనుము. అతని తపము చెరచి క్షోభింప జేయుమనియె. ఆమె ప్రభూ! నీయాజ్ఞ తప్పక చేసెదను కాని ఇక్కడ నాకు జీవిత సంశయము ఏర్పడినది. బ్రహ్మచర్యనిష్ఠుడగు ఆమునిని మహోగ్ర తపస్విని అగ్ని సూర్యులట్లు వెలుగు వానినిగ నెఱిగిన దానను గావున జడియుచున్నాను. అతడు దుస్సహమయిన శాపమీయగలడు. ఏలినవారియానలో ఊర్వశ్యాదులెందరో యప్సరసలున్నారు. వారు సుందరులు, నెఱజాణలు. ఎవ్వనినేని మోహింపజేయగల నేర్పరులు. వారిని ఆ పనిలో నియోగింపుమనెను.
ఆమె మాటవిని ఇంద్రుడు-”ఎందరో ఉందురుగాక! ఇక్కడ నీవే నేర్పరివి. నీకు మన్మథుని, వసంతుని, వాయువును కూడ తోడొసంగెదను. నీవేగుమన నా ప్రమ్లోచ అకాశమున, ఆ ముని ఆశ్రమమునకు వెళ్ళి, అచ్చట ఒక సుందర వనమీక్షించెను. అందు ఆశ్రమమందున్న అమ్మునిని చూచెను. ఆ ఆశ్రమ సమీపమునందలి అవనము యొక్క శోభ నిరుపమానము, సర్వపుష్ప ఫలభరితము సర్వర్తుశోభనము. అందలి పావురములు కోవెలలయొక్క కలకూజితములు శ్రవణ మనోహరములు. ఆ విశాలనయన అయందమును చేరి పాఱజూచి ఆ మధుర నాదములు విని ప్రసన్న సలిలములైన కొలనులను చూచి వసంతాదులతో మీరందఱు నాకు తోడ్పుడుడని హెచ్చరించెను.
ఇట్లని వారిచే ఔననిపించుకొని ఇప్పుడు ఆ మునిచెంత కేగెదను. శరీర రథమును ఇంద్రియములను గుఱ్ఱములచే నిగ్రహించిన ఆతని పూవిలుతుని వాడి అమ్ములచే పగ్గముల బిగువు సడలంజేసి చేతగాని సారథినిగలవానిబోలె చేసెదను. బ్రహ్మ జనార్దనుడు శివుడయినను అగుగాక ఈక్షణములో కామబాణక్షతుని గావించెదను అని ఆముని ప్రశాంత ఆశ్రమందు నిలిచి అల్లల్లన సంగీతము పాడ నారంభించెను. అంతట వసంతుడు తన బలగమును గూర్చికొని అకాలిక మధుర కోకిలారావము మేళవింపజేసెను. గంధ వహుడు (వాయువు) మలయాద్రి నుండి అల్లల్లన వీవందొడంగెను. అంతేకాక ఆవన సీమ నాల్గు దిక్కుల చెట్లును పూవులను జలజల రాల్చెను. మదనుడు పూవుటమ్ములచేత ఆముని మనస్సును కలగుండుపరచెను. అంత కండువా సంగీత ధ్వని నాలకించి వింతగొని ఆ అప్సరోరత్నమన్న తావునకేగి ఆ సొగసులాడి సోయగమున కచ్చెరువడి తేఱిపాఱ జూచి పైవలువజార మేను గగుర్పొడవ మది చెదరి అల్లన ఇట్లు పలుకరించె. ఓ సుందరి! నీవెటనుండు దానవు ఎవరిదానవు? నామనసు చూరగొనుచున్నావు. నిజము తెల్పుమన ఆమె నీ దాస్యము చేసెదను. పూవులకొఱకు వచ్చితిని. నావలన పనిగొనుము. నీ ఆజ్ఞను ఇప్పుడు నిర్వహింతును అని పలుకగా విని ముని మోహముగొని ధైర్యమెడలి ఆమె చేతబట్టుకొని తన ఆశ్రమమున ప్రవేశించెను. అవ్వల పువ్విలుకాడు, వాయువు, వసంతుడు ఇట్లు తమపని చక్కవెట్టికొని వచ్చినదారిన అమరపురికి అరిగిరి. అతని యొక్కయు అమె యొక్కయు సమావేశ వృత్తాంతము ఇంద్రునకు ఎరింగించిరి. సురపతియు సురలు అదివిని ప్రీతిచెందిరి.
కండుముని ఆ వనితతో ఆశ్రమమందు ప్రవేశించి, మనోహర రూపము నిండు జవ్వనమున తనకు సంతరించుకొనియె. దివ్య వస్త్రములు దివ్యాభరణములును తాల్చి పదునాఱేండ్ల ఈడున నున్న ఆ మందయాననుగాంచి కేవల తపశ్శక్తిచే దివ్య కుసుమ మాలలు తాల్చి సుగంధము బూసికొని సర్వ భోగసంపన్నుడై అప్పటికప్పుడు తోచిన ఆ తపస్వి ప్రభావముంగని అచ్చెరువుపడి యవ్వేల్పుపడతి, ఓహో! ఈయన తపస్సు ఈయన వీర్యము అద్భుతమని కడుంగడు సంబరపడెను. స్నాన సంధ్యలు, జపము, హోమము, బ్రహ్మ యజ్ఞము, దేవతార్చనము, ధ్యానము, వ్రతోపవాస నియమములను వదలి ఆ అప్సరా శిరోమణితో, రేయింబవళ్ళు మదనవశుడై క్రీడించెను. తపస్సు క్షయమైనదని కూడ గుర్తింపడయ్యె. విషయలంపటుడై పగలు రాత్రి సంధ్య పక్షమాస ఋతు సంవత్సరములు ఏవోకూడ తెలియక, ఆమె వలపునంబడెను. అక్కాంతయు పంచబాణ బాణనిహతయై ఏకాంతమున నింపు ఇంపు పలుకుల ఉపలాలించుచు అతనిగోరి రమించెను. ఇట్లా మౌని గ్రామ్య సుఖము మఱగి వందయేండ్లా సుందరితో మందరగిరి కందరమునందుండెను. అంతనది అమ్మాహానుభావునిగని నేను స్వర్గమునకేగెద. ప్రసన్నముఖుడవై ఓ బ్రహ్మణ్యమూర్తీ అనుజ్ఞ దయసేయుమనియె. ఆతడామెయెడ సడలని వలపుగొని కల్యాణి. కొన్ని దినములుండుమనియె. అట్లయని ఆ వేల్పుపడతి నూరేండ్లకు మించి అతని తోడి పొందుకొని ఇంపొందెను. ఆ మీద మఱల అనుమతింపుమనియె. కాదుకాదు నిలునిలుము అన మరి వందసంవత్సరము లేగె. ఎడనెడ ఇట్లు ఆవిడ అడుగుటయు ఆముని వలపుగొని వలదనుటయుంగా జరుగుచుండ, నాతని శాపమున కడలి యాదేవకామిని ఇంచుక తక్కువగా రెండువందలేండ్లు ప్రణయ భంగమువలన గలుగు బాధ నెఱింగినది కావున అతని వదలిపోదయ్యెను. ఆ పరమ మహర్షి దానితో రేయింబవళ్లు రమించుచున్న కొలది ప్రేయ యెప్పటికప్పుడు గ్రొత్తదికాజొచ్చెను. ఒక్కతఱి నాతడు తత్తరముగొని అట్లు విడిచి చనుచుండ ఆ సురకాంత ఎచటికేగుచున్నారన కల్యాణి తెల్లవారినది. సంధ్య వార్చెదను. కాదేని అనుష్ఠానలోప మగునన అల్లననవ్వి అమ్మహామునినిగని ఓ ధర్మజ్ఞ! ఇప్పుడా నీకు తెల్లవారుట అనుష్టానమెప్పుడో గతించినది. ఇమ్మాట ఎవనికి వింతగొలువదు? అనగా ఆముని ఈ ఉదయమే నీవీ నదీ తీరమునకు వచ్చితివి. నాకు కనబడితివి. నా ఆశ్రమమును జొచ్చితివి. సంధ్యా సమయమైనది. ప్రొద్దెక్కినది ఎందుకు పరియాచకము లాడెదవు? ఉన్నదున్నట్లు పలుకుము. అనవిని ప్రమ్లోచ నేను వేకువవేళ వచ్చిన మాట ఓ బ్రాహ్మణ్యా నిజమే. నేను అబద్ధమాడుట లేదు. కాని ఇప్పుడా కాలము కొన్ని వందఏండ్లు గడచిపోయినదనియె. అంతట నా విప్రుడు వెఱుపుగొని యామెంగని నీతో నేను క్రీడించిన కాలమెంతో నిజము చెప్పుము, జడియకుము. పరిహాసమా? యన తొమ్మిది వందలేండ్ల ఆరుమాసాల మూడు రోజులయినది, అబద్దమాడను, బ్రహ్మణ్యుడవగు నీ సన్నిధినా అబద్దములాడుట దారి యించుకయు దప్పని మహానుభావులగు తమరడుగుచుండ అనృతమెట్లు పలుకగలను అనదాని పలుకు ఆలించి ఆముని ఛీఛీ ఎంత అనాచార మెంత అపచారము గావించితిని? అని తనను దానిని నిందించుకొని నా తపస్సునెల్ల నీటగలిసినది. బ్రహ్మవేత్తల ధనమెల్ల చెఱచినట్లయినది నావివేక మెవ్వడో కాజేసినట్లయినది. ఈ ఆడుది నన్ను మోహపెట్టుటకు పుట్టింపబడినది. షెడూర్ముల (1.ఋభుక్ష, 2.తృష్ణ, 3.శోకము, 4.మోహము, 5.జర, 6.మరణము) కు అవ్వలిదా బ్రహ్మ వస్తువు ఆత్మ నిగ్రహముచే నెఱుగ వలసినది. చీఛీ ఆకామమహాగ్రహము నన్ను పట్టుకొని నాకీగతి తెచ్చిపెట్టినది. నా వ్రతములు సర్వ వేదములు మఱియెల్ల ఉత్తమ కారణములు, నరక గ్రామమునకు మార్గమైన కామముచే నిహతములయినవి. అని ఇట్లు తన్ను తాను నిందించుకొని ఆ ధర్మజ్ఞుడు తనముందు గూర్చున్న ఆ అప్సరసను జూచి ఇట్లనియె.
పొమ్ము ఓ పాపాత్మురాల! నీ హావభావములచే నామదిని కలచి ఇంద్రునికై చేయవలసిన దంతయును జేసితివి. సత్పురుషులతోడి మైత్రి సాప్తపదము (అనగా ఏడడుగులు కలిసి వేయుట లేక యేడుమాటలు మాటలాడు కొనుటవలన నేర్పడునది) కావున నీతో గలిసి కొన్నాళ్లుంటిని గావున నిన్ను భస్మము చేయను. అదిగాక ఇందు నీ తప్పిదమేమున్నది! నీకేదైన శాస్తిచేయుటకు, ఇంద్రియ నిగ్రహము లేనివాడనగుట నీ తప్పు నాదే. సురపతి ప్రీతికొరకైన నీ వాలుచూపును సమ్మోహన మంత్రముచే నేను ఈయపకరమునకు గుఱియైతిని. అని ఇట్లా బ్రహ్మర్షి అ రమణితో అనిన అంతట అది ముచ్చెమటలుపోసి ఒడలెల్ల తడియ నెడనెడ వణకుచున్న ఆ వేల్పుపడతింగని పోపొమ్మని అమ్ముని అలుకగొని జడిపింపనది అయ్యాశ్రమము వెడలి ఆకసమువెంట ఏగుచు అచెట్ల చిగుళ్లను జెమట దుడిచికొనియె. అట్లు చెట్టునుండి చెట్టున కడుగు వెట్టుచు, ఆ చిన్నది ఎర్రయెఱ్ఱని క్రొత్త చిగురుటాకులందు చెమట తడులొత్తుకొనుచున్నంత అయ్యింతికి పులకలయ్యే. అప్పుడు పులకలతో పాటు ఆమె మేనువెడలి స్వేద రూపమున గర్భము కలిలమయి జాల్వారెను. దానిని వృక్షములు చేకొనియె. వాయువద్దానిని ఏకము చేసెను. అమృతాంశుడు తన కిరణముల దానికాప్యాయ మొనరింప అల్లల్లన అది దినదినాభివృద్ధి నొందెను. ఆ గర్భమే మారిషయను పేర వృక్షములకు కన్య అయ్యెను. ఆమె ప్రాచేతసుల భార్య దక్షునికి తల్లి.
ఆ కండుముని తనను క్షమించుటకు పురుషోత్తమము అను ఆ విష్ణు క్షేత్రమున వెళ్ళెను. ముక్తిదము దుర్లభమునై దక్షిణ సముద్ర తీరమందున్న సర్వకామదమయిన ఆ దివ్య క్షేత్రమును దర్శించెను. భృగ్వాది మునులు నిరంతరము సేవించు ఆ వైకుంఠాయతనమునుగని సర్వదేవతలు కొలువ నింపుగులుకు హరిని పురుషోత్తము, వైకుంఠుని దర్శించి కృతార్థుడనైతి అనుకొనియె. మఱియు ఏకాగ్రచిత్తుడై ఆస్వామిని ఆరాధించెను. అయోగి ఊర్ధ్వబాహువై అచట నిలువబడి ‘బ్రహ్మ పారము’ అను మహా మంత్రమును జపించెను అని చెప్పగా వినిమునులు వ్యాసుని చూచి యోమునీ ఆ బ్రహ్మ పారము పరమ శుభమంత్రము కండుముని జపించి విష్ణువును ఆరాధించిన దానిని మేము వినవలెనని కోరుచున్నామన వ్యాస భగవానుడు ఇట్లు ఆనతిచ్చెను.