పళ్ళు దుంపలు పాలు పెరుగు మజ్జిగ గో మూత్రము గంజి ఏడు రోజులు తీసుకొనినచో అభోజ్యాన్న భోజన దోషము పోవును. మరియొక విశేషము. విష్ణు భక్తుడు విధి విధానముగ ఇట్లు శ్రాద్ధము పెట్టి ఆ బ్రాహ్మ స్తంబ పర్యంతమైన జగత్తును సంప్రీతి నందించును.
మునులు-తండ్రి బ్రతికి ఉండగ తండ్రియొక్క తల్లి దండ్రులు పోయినపుడు చేయవలసిన విధానమేమన తండ్రి బ్రతికియుండి ఎవనికి తద్దినము పెట్టునో కొడుకు దానిని స్వయముగ పెట్టవలెను. లౌకిక వైదిక ధర్మములు రెండును దీనివలన లోపింపవు. (తండ్రి తన తండ్రికి తద్దినము పెట్టుచుండ కొడుకు తాతకు తద్దినము పెట్టనక్కర లేదన్న మాట) తండ్రిపోయి పితామహుడు బ్రతికి యున్నప్పుడు, కొడుకు తండ్రికి పిండమువేసి పితామహునిచే భుజింప జేయవలెను. ప్రపితామహుని ఉద్దేశించి పిండమును వేయవలెను. ఇది శాస్త్ర నిర్ణయము. పోయినవారికి పిండము పెట్టవలెను. ఉన్నవారికి అన్నము పెట్ట వలెను. సపిండీకరణము పార్వణ శ్రాద్ధము వీనియందు లేవు. పితృమేధ కల్పము అనుసరించి ఆచారము పాటించినవాడు ధనధాన్య ఆయురారోగ్య పుత్ర పౌత్రాదులతో వర్థిల్లును. ఈ పితృ మేధాధ్యాయనమును శ్రాద్ధ కాలమందు పఠించిన ఎడల ఆ యజమాని ఇడిన అన్నమును పితృదేవతలు మూడు యుగములు అనుభవింతురు. ఈ పితృ మేథ కల్పము పాపహరము. పుణ్య వివర్ధనము శ్రాద్ధములందు దీనిని కీర్తింపవలెను. శ్రద్ధతో వినవలెను. (220)