బ్రహ్మ మహా పురాణము

మన్వంతర కీర్తనము

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ బుద్ధిశాలీ లోమహర్షణ! మన్వంతరములను అన్నింటిని తెలుపుచు వానియొక్క విశేష సృష్టిని వర్ణింపుము. మనువు లెందరో వారి కాలమేదియో వారి సమయమందు జరిగిన విశేషములను స్పష్టముగా ఎరుగ కోరుచున్నాము. అని ఋషులు అడుగగా సూతుఁడు మన్వంతరములను గూర్చిన చరిత్ర సంక్షేపముగ చెప్పెదను. వేయేండ్లయిన దీనిని తెలుపుటకు అలవికాదు. స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు. సావర్ణి (తర్వాత) రైభ్యుడు, రౌచ్యుడు, మేరుసావర్ణి. వీరందరూ మనువులు. ఇప్పుడు వైవస్వత మన్వంతరము జరుగు చున్నది. ఆయా మన్వంతరము లందలి సప్తర్షులను పుత్రపౌత్ర పరంపరను దేవగణములను తెలుపుచున్నాను వినుడు.

స్వాయంభువ మనువుకాలమున సప్తర్షులు మరీచి, అత్రి, అంగిరస్సు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వశిష్ఠుడు, వీరు బ్రహ్మ కుమారులు. ఉత్తర దిక్కునందు ఉందురు. అగ్నీధ్రుడు, అగ్నిబాహుడు. మేధ్యుడు, మేధాతిథి, వసువు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సబలుడు, పుత్రుడు అను పదిమంది స్వాయంభువుని కుమారులు. ఇది ప్రథమ మన్వంతరము.

స్వరోచి మనువు కాలమున ఋషులు-ఉర్వుడు, స్తంబుడు, కశ్యపుడు, ప్రాణుడు, బృహస్పతి, దత్తుడు, అత్రి, చ్యవనుడు. మహావ్రతులైన ఏడుగురు దేవతలు తుషితులు. హవిఘ్నుడు, సుకృతి, జ్యాతి, ఆపుడు, మూర్తిప్రతీతుడు, నభస్యుడు, నభస్సు, ఊర్జస్సు అను వారు స్వారోచి కుమారులు. ఇది రెండవ మన్వంతరమునకు సంబంధించిన విషయము.

ఉత్తముని కాలమున వశిష్ఠ కుమారులు(వాశిష్ఠులు) ఏడుగురు ఋషులు. హిరణ్యగర్భుని కుమారులు ఊర్జులు. ఉత్తముని కుమారులు పది మంది. ఇషుడు, ఊర్జస్సు తనూర్జుడు. మధువు, మాధవుడు, శుచి, శుక్రుడు, సహుడు, నభస్యుడు, నభుడు, దేవతలు ఇందు భానువులు ఇది తృతీయ మన్వంతర విషయము.

వశిష్ట కుమారులు (వాశిష్టులు) ఏడ్వురు ఋషులు. హిరణ్యగర్భుని కుమారులు ఊర్జులు. ఉత్తముని కుమారులు పదిమంది. ఇషుడు, ఊర్జసు, తనూర్జుడు, మధువు, మాధవుడు, శుచి, శుక్రుడు, నహుడు, నభస్యుడు, నభుడు. దేవతలు ఇందు భానువులు. ఇది చతుర్ధ మన్వంతర విషయము.

తామస మన్వంతరమున కావ్యుడు, పృథువు, అగ్ని, జహ్నువు, ధాత, కపీవంతుడు, అకపీవంతుడు అనువారు సప్తర్షులు. ఇందు దేవగణములు. ద్యుతి, తపస్యుడు-సుతపుడు, తపోభూతుడు, సనాతనుడు, తపోరతి, అకల్మాషుడు, తన్వీ, ధన్వీ, పరంతపుడు అనువారు పదిమంది వాయువుచే చెప్పబడినవారు. దేవబాహువు యదుధ్రుడు. (ముని) వేదశిరస్సు హిరణ్య రోముడు, పర్జన్యుడు, ఊర్ధ్వబాహువు (సోమజుడు, సత్యనేత్రుడు (ఆత్రేయుడు) అను వారు రైవతమనువు కాలమున సప్తర్షులు. ఇందు దేవగణములు - అభూత రజస్సు ప్రకృతి. వారిఫ్లవుడు, రైభ్యుడు, ధృతిమంతుడు, అవ్యయుడు, యుక్తుడు, తత్త్వదర్శి, నిరుత్సుకుడు, అరణ్యుడు, ప్రకాశుడు నిర్మోహుడు, సత్యవాక్కు కృతి. ఐదవ రైవతమన్వంతరమునందు రైవతుని కుమారులు.

ఆఱవ మనువు చాక్షుషుడు, ఈయన కాలమున సప్తర్షులు. భృగువు, నభన్సు, వివస్వంతుడు, సుధాముడు, విరజుడు, సహిష్ణువు అనువారు (అప్రసూతులు) ఆ బాలప్రఖ్యాతులు. లేఖులను వారు దేవగణములు ఐదుగురు. అంగిర కుమారులు అతినాముడు, నాడ్వులేయులు పదిమంది. చాక్షుష మనువు పుత్రులు రురు ప్రభృతులు.

సప్తమము వైవస్వత మన్వంతరము. అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, (ఋచీకుని కుమారుడు) జమదగ్ని అనువారు ఇప్పుడు సప్తర్షులు. సాధ్యులు, రుద్రులు, విశ్వేదేవులు, వసువులు, మరుత్తులు, అదిత్యులు, అశ్వినులు వైవస్వత మనువు కాలమున దేవతలు. ఇక్ష్వాకు మొదలగువారు పది మంది కుమారులు. వారి సంతానములు అనంతములయి సర్వ మన్వంతరములందు సప్తసప్తకులు అనగా 7 x7 = 49 మంది ధర్మవ్యవస్థ కొఱకు లోకరక్షణ కొఱకు (సప్త గణములు) వర్తించి కర్మానుష్ఠానమును చేసి శాశ్వత బ్రహ్మలోకమును అలంకరింతురు. ఆమీద వారివారి స్థానములను తపస్సంపన్నులు మరియొకరు అధిష్ఠింతురు. ఇట్లు అతీతులు వర్తమానులు అయిన వారిని పేర్కొంటిని.

ఇక రాగల మన్వంతరములలో సావర్ణి మనువుకాలమున రాముడు, వ్యాసుడు, (ఆత్రేయుడు) అశ్వత్థామ (భరద్వాజుడు, ద్రౌణి) అజరుడు, శరద్వంతుడు (గౌతముడు), గాలవుడు (కౌశికుడు), ఔర్వుడు (కాశ్యపుడు) వీరు ఏడుగురు ఋషులయ్యెదరు. వైరి అధ్వరీవంతుడు, శమనుడు, ధృతిమంతుడు, వసువు, అరిష్టుడు, అధృష్టుడు, వాజి, సుమతి అను వారు. సావర్ణి మనువు కుమారులు. వీరిని వేకువవేళ మేల్కొని కీర్తించిన సుఖసమృద్ధి కలుగును, కీర్తి కల్గును. ఆయుర్భాగ్యము కలుగును. సావర్ణులయిన, మనువులలో ఒకడు వైవస్వతుడు నల్గురు ప్రజాపతి సంతతివారు. పరమేష్ఠి కుమారులు మేరు సావర్ణ్యులయిరి. మేరుగిరిపై తపోనిరతి నుండువారు. రుచి ప్రజాపతి పుత్రుడు. రౌచ్యుడు. (మనువు) రుచికి భూతిదేవియందు గల్గినవాడు. వీరు ఈశ్వేత వరాహ కల్పమునందు రాగల మనువులు ఏడుగురు. ఈ పదునాల్గురు మనువులవలన సప్తద్వీపయైన ఈ పృథివియెల్ల పట్టములతో గూడ వేయి యుగములు పరిపాలింపబడగలదు. డెబ్బది యొక్క మహాయుగములు ప్రజాపతి యొక్క పూర్ణాయుర్దాయము. వీరు మనువులు పదునల్వురు కీర్తి వర్ధనులు. వేదములందు పురాణములందు వినిపింతురు. ప్రజాపతులు వీరు. వీరి సంకీర్తనము ధన్యతాసంపాదకము. మన్వంతరములందు సంహారము, సంహారాంతమున (లయమందు) సృష్టి-ఈ లెక్క వర్ణింప అలవిగాదు. ప్రళయావసానమున సప్తర్షుల తోడ, తపోబలముచే, బ్రహ్మచర్య సంపత్తిచే, శ్రుతముచే (జ్ఞానముచే) కొందరు మహర్షులు శేషించి ఉందురు. వారినే శిష్టులందురు. యుగ సహస్ర సంపూర్తి యందు కల్ప సమాప్తియై జగత్తు నిశ్శేషమగును. అపుడెల్ల భూతములు ఆదిత్య కిరణములచేత దగ్ధములగును. వీరు బ్రహ్మను ముందిడుకొని ఆదిత్య గణములతో సురశ్రేష్ఠుడైన నారాయణ ప్రభువునందు చొచ్చెదరు. కల్పాంతమునందు పునస్సృష్టిచేయు మహానుభావుడు ఆయన. అవ్యక్తము. శాశ్వతము అయిన తత్త్వము. ఈ జగత్తంతయు ఆయనయే ఇక వైవస్వతమనువు యొక్క విసర్గ వృత్తాంతము వినిపించెదను. పురాణ లక్షణములందు ఒకటైన వంశ లక్షణముగ ప్రసంగ వశమున శ్రీహరి అవతరించిన వృష్టి వంశమును అటుతరువాత వర్ణించెదను వినుడు. (5)