అప్రబుద్ధావస్థలోనుండు జీవుడు అవ్యక్తమును నిర్గుణమునునగు ఇరువది యైదవ తత్త్వమును కూడ సగుణతత్త్వముగా భావించును. ఆ తత్త్వమునందు ఆరోపింపబడు గుణములను సృజించుచు ఉపసంహరించుచు ఉన్నట్లు కల్పన చేసికొనును. ఓ జనకరాజా! ఆ మూలతత్త్వము అజము-జన్మరహితము-ఐనను క్రీడార్థమై వికారములను పొందుచున్నాడు. తన్నుతాను అనేక తత్త్వముల రూపమున కల్పించుకొని నానా రూపములను పొందినవాడు వలె చెప్పబడుచున్నాడు. ఇట్లు వికృతి నొందుచుండియు, ఇట్లని వాస్తవ స్థితిని ఎరుగలేకున్నాడు. అవ్యక్తతత్త్వస్వరూపము ఇదియని తత్త్వ బోధ చేయబడినపుడు జ్ఞాన సాధనదశలో అతడు బుధ్యమానుడు, బోధమును, జ్ఞానమును అందుకొనుచున్నవాడు అని వ్యవహరింపబడుచున్నాడు. కాని ఇట్లు బోధింపబడుచుండియు సగుణమైనదివలె కనబడు ఈ అవ్యక్త తత్త్వమును వాస్తవమున నిరుణమైనదానినిగా గుర్తింపలేక పోవుచున్నాడు. ఇరువది యైదవదియగు ఈ అవ్యక్త తత్త్వ స్వరూపమును దాని నిర్గుణత్వమును ఒకానొకప్పుడు ఈతడు తెలిసికొనగలిగిన యెడల ప్రతిబుద్ధుడు అని వ్యవహరింపబడును. బుధ్యమాన దశలో జీవుడు మమకారావృతుడు. అన్ని తత్త్వములకును అతీతమగు ఇరువది ఆరవ తత్త్వము విమలమును బుద్ధమును- జ్ఞానాత్మకమును-అప్రయేమమును. ఇట్టిది అని ఎరుగ శక్యముకానిది-సనాతనము-శాశ్వతమైనది. దానిని గుర్తింప గలిగినప్పుడు సృష్టి ప్రళయ ధర్మయుక్తమగు ఇరువది యైదవ తత్త్వముగా నుండుటను గూడ అతిగతమై అత్యున్నత దశనందుకొనును. అప్పుడీతడు వస్తుతః గుణ రహితమును జడమునునగు ప్రకృతిని సగుణత్వము నొందిన దానినిగా గుర్తెరుగును. తాను కేవల జ్ఞానాత్మకుడై అవ్యక్త తత్త్వమును గూడ వాస్తవ రూపమున దర్శింపగలుగును.
ఓ రాజా ! తత్త్వముల నాశ్రయించిననే కాని నరుడు తత్త్వజ్ఞుడు కాజాలడు. నాయనా! తత్త్వజ్ఞుడు సంసారగతులలో మునుగడు. తత్త్వము లిరువది యైదని విద్వాంసులు చెప్పుచున్నారు. వీని లక్షణమును తెలిసికొన్నచో వీటి మూలతత్త్వమును కూడ చేరగలుగును. ఏలయన-ఇరువది ఆరవది సర్వ మూలతత్త్వము. ఇతడు ఇదియే ఇరువది ఆరవ తత్త్వమని సరిగా గుర్తించినచో జరామరణములు లేక శుద్ధయోగ బలముచే సమతాస్థితిని పొందును. సందేహములేదు. ఐనను అజ్ఞానానికి జ్ఞానబోధ చేయుటకై తత్త్వములు ఇరువదినాల్గే అని ఇరువదియైదే అని ఏకత్వమునుండి నానాత్వము జరిగిన విధము ఇది అని సాంఖ్యదర్శనము. ఎప్పుడు చేతనతత్త్వము కూడిన ఈ పంచ వింశతితమ తత్త్వము యొక్క ఏకత్వము బుద్ధియందు స్థిరమై అవగతమై నిలుచునో అపుడు ముముక్షువు సమత్వము పొందును. ఏలయన నిఃసంగుడై యుండియు పరమాత్ముడు మాయాకృతమైన సంగవశమున సంసారములో పరిభ్రమించుచున్నాడు. మాయు దూరమైనపుడు ముక్తినందుచున్నాడు. నిఃసంగరూపుడగు పంచ వింశతి తమ తత్త్వమును ఎరిగిన తరువాత అజుడగు -జన్మరహితుడగు-ఆ ఇరువదియారవ తత్త్వము నెరుగగలుగును. అవ్యక్త తత్త్వము నెరుగుట చేతనే ఈ పరమ విబోధము-జ్ఞానము-కలుగును. చతుర్వింశతి తత్త్వముల నెరుగుట కూడ ఈ ఇరువది ఆరవ తత్త్వము నెరిగి ముక్తిని అందుటకు సాధనమే. ఓ అనఘుడవగు జనకరాజా! నీకు ఇట్లు సాంఖ్య విధానమున బుద్ధ, బుధ్యమాన, అప్రతిబుద్ధుల లక్షణమును తెలిపితిని. ఈ తెలిపిన తత్త్వముల నానాత్వము, ఏకత్వముల సంబంధము చేపకు నీటికిని -మేడికాయకు దానియందలి పురుగులకునుగల సంబంధము వంటిది. జ్ఞానము విజ్ఞానము అని వ్యవహరింపబడు ముక్తి స్వరూపమిదియే. ఈ దేహమున సాక్షితత్త్వముగా నున్న ఇరువది ఐదవ అవ్యక్త తత్త్వము నెరుగనిదే ముక్తికలుగదు. ఈ ఇరుది ఆరవ తత్త్వము పరతత్త్వము-పరమగు ధర్మము కలిగినది; ఏ మాత్రమును అశుద్ధము కాని శుద్ధతత్త్వము; విశుద్ధమగు ధర్మముకలది; జ్ఞానశాలి; జ్ఞానాత్మకుడు; వాస్తవమున అలోచించినచో సర్వ ధర్మముల నుండి విముక్తుడు; కాని సంయోగ వియోగ ధర్మములుకల ఈ చతుర్వింశతి తత్త్వాత్మకమగు ఈ ప్రకృతితో సంబంధము కలుగుటవలన బుద్ధుడైనందున మరల దాని నుండి విడివడినప్పుడు ముక్తి నందెనని వ్యవహరించుట, వాస్తవమున అతనికి బంధము మోక్షములేవు. అట్లతడు విమోక్షిగా-శుచికర్మునితో కలిసి శుచిగా విమలాత్మునితో కలిసి విమలాత్ముడుగా కేవలునితో కలిసి కేవలాత్ముడుగా అగుచున్నాడు. స్వతంత్రునితో కలిసి స్వతంత్రుడై స్వాతంత్ర్యమును పొందుచున్నాడు.
ఓ మహారాజా! ఇంతవరకు నేను నీకిట్లు యథార్థతత్త్వము తెలిపితిని. నీవును విశుద్ధమును ఆద్యమును సనాతనము-శాశ్వతమును-అగు బ్రహ్మ తత్త్వమును అమత్సరుడవై-మనో దోషములేవియు లేనివాడవై ప్రతిగ్రహించితివి. నీవును ఈ పరమ విద్యాను శాసనమును వేదనిష్ట-వేదముల యందును శాస్త్రముల యందును ప్రామాణ్యబుద్ధి-కలిగి ప్రబోధము నొందుటకై ప్రణతుడై తెలిసికొనగోరి అడిగిన వానికి మాత్రమే ఈయవలెను. అసత్యవాది, మోసగాడు, కపటబుద్ధి, అసమర్థుడు, జ్ఞానపరులగు పండితులను నొప్పించువాడు అగువానికి ఈయరాదు-శిష్యులకు జ్ఞానము కలిగించుటకై నీవీ విద్యను శ్రద్ధ కలవాడు సద్గుణవంతుడు పరనిందచేయనివాడు వివేచనతో కూడిన శీలము కలవాడు వేదశాస్త్ర విధియందు ప్రీతికలవాడు వివాదములు చేయనివాడు అనేక శాస్త్రములను పెద్దల వలన వినినవాడు వినయమును తెలుపు వేషముకలవాడు హేతువాదము చేయనివాడు ఇట్టివానికి మాత్రమే తెలుపవలయును. విశుద్ధమగు పరబ్రహ్మ తత్త్వమును ఈ సద్గుణములు లేనివాని కీయరాదు. ఇచ్చినచో అపాత్ర దానమువలన ప్రవచనము చేసిన గురువునకు కూడ శ్రేయస్సు కలుగదు. వ్రతనియమములు లేనివాడు తాను సమస్త రత్నములతో ఈ భూమినంతటికి విద్యకు ప్రతిఫలముగా ఇత్తును అనినను, అట్టివానికీ విద్యను బోధించరాదు. ఓ నరేంద్రా! తత్త్వమునెరుగగోరి జితేంద్రియుడై ప్రయతుడైన-ఇంద్రియ నిగ్రహము శుచిత్వము కలిగిన-వానికి మాత్రమే ఇది బోధించవలెను. ఓ జనకా! నీవు పరమ పవిత్రమును అత్యంతము శోక రహితమును అనాది మధ్యమును అగు బ్రహ్మ తత్త్వమును వాస్తవముగ ప్రవచించగా వింటివి. నీకిక సంసార భయములేదు. ఈ తత్త్వము అగాధము, అజరామరము, దోషరహితము, భయరహితము, శుభకరము, పరవాదము అనుపేరుగల ఈ తత్త్వార్థము తెలిసికొని మోహస్వరూపమును గుర్తించి విడువుము.
ఓ రాజా! పూర్వము హిరణ్యగర్భబ్రహ్మ సనాతన పరమాత్మ నుండి ఈ విద్యను గ్రహించెను. మహా తేజస్వియగు ఆ బ్రహ్మనుండి నేను ఆయనను అనుగ్రహింపజేసికొని గ్రహించితిని. నీవడిగినందున నేను నీకిది ప్రతిపాదించితిని. ఇదియు నేను బ్రహ్మ వలన ఎంత ఎట్లు తెలిసికొంటినో అంతయు అట్లే తెలిపితిని కాని ఏ మాత్రము మార్పులు చేర్పులు చేయలేదు.
వ్యాసుడిట్లు మునులతో పలికెను:
ఓ మునిశ్రేష్ఠులారా! వసిష్ఠుడు పంచవింశతితమ తత్త్వసంబంధియగు తత్త్వమును ఇట్లు తెలిపెను. ఈ తత్త్వమును ఎరిగి దాని ద్వారమున షడ్వింశ ఇరువది ఆరవ తత్త్వమును చేరినవారికి జనన మరణ రూప సంసారములో పునరావృత్తి యుండదు. ఇది పరమమగు జ్ఞానము. దీనిని మించిన జ్ఞానము లేదు. ఇది ఎరిగిన వారు అజరామరమగు తత్త్వము చేరుదురు. ఓ ద్విజులారా! నిః శ్రేయస్కరమగు ఈ పరమ జ్ఞానమును దేవర్షియగు నారదునివలన విని నేను ఉన్నదున్నట్లు మీకు తెలిపితిని. ఏలయన-హిరణ్య గర్భుని నుండి వసిష్ఠుడును అతని నుండి నారదుడును అతనినుండి నేనును వింటిమి. దీనిని వినినందున మీకును సంసారమువలన శోకము కలుగదు. క్షరాక్షర తత్త్వముల భేదాభేదము నెరిగిన వారికి భయముండదు. ఎరుగని మూఢాత్ముడు మాత్రము అనేక జన్మ పరంపరల నొంది మరల మరల ఉపద్రవముల పొందును. జననము, మరణము, దేవలోకము, నరకలోకము, తిర్యగ్యోనులు, మనుష్యజన్మము, ఇదే క్రమమున పునఃపునరా వృత్తి పొందును. అవ్యక్తాగాధమగు అజ్ఞాన సముద్రమున మునుగును.
ఓ ముని శ్రేష్ఠులారా! నేనిట్లు మిగుల సారతమమగు పరతత్త్వమును మీకు తెలిపితిని. దీనిని తెలిసికొనినవారు పరమ మోక్షమును పొందుదురు. మరల జననమరణ పునరావృత్తి పొందరు. ఓ విప్రులారా! దీనిని నాస్తికుడు అభక్తుడు దుష్టమతి శ్రద్ధారహితుడు అగువానికి తెలుపరాదు. (245)