ఒకతరి అర్థాస్తమయ సమయమున (ప్రదోషకాలము సగము గడచిన తరువాత) జనార్దనుడు రాసక్రీడా వినోదమునందు ఆసక్తుడై ఉండగా అరిష్టుడను రాక్షసుడు మదమెక్కి హడలగొట్టుచు గోశాల కరుదెంచెను. కారుమబ్బువలె నల్లగ ఉండి, పదునైన కొమ్ములుగల్గి సూర్యునట్లు జ్వలించు చూపులతో డెక్కలతాకున భూతలము చీల్చుచు, నాలుకచే పెదవులను నొరయించి నాకుచు, తోకలు ఉవ్వెత్తున పైకెత్తి, మిగుల కఠినమగు స్కంధ బంధమున మిగుల వెడదయగు మూపుతో ఒడ్డుపొడువులను మిగుల గడువరానివాడై, మూత్ర పురీషములం పూతపడిన పిరుదులతో ఒడలితో గోవులకు వెరపుగొల్పుచు మెడవ్రేల ఎదురై, చెట్లతాకిడివడిన ముఖముతో, వృషభ రూపముగొని గోవులకు గర్భపాతము చేయుచు అడవుల కూల్చుచు నిలువగా ఒక దైత్యుడు అచట ఎల్లపుడు సంచరించు వాడు ఎదుటబడెను. భయంకరమగు కన్నులతో ఉన్న వానిని చూచి గోపకులు గోపికలు కృష్ణా! కృష్ణా అని ఆక్రందించిరి. అంతట కేశవుడు సింహగర్జనము చేసి చప్పట్లు చరచెను. ఆ రాక్షసుడు ఆ సడివిని, దామోదరున కెదురుగ చని కొమ్ములు ముందునకు నిగిడించి కృష్ణుని కడుపునెడ చూపు నిలిపి, పరుగులు పెట్టెను. అట్లు వచ్చుచున్న వృషభాసురునిచూచి కృష్ణుడు వానిని ఈసడించు సూచనగ ఒదవిన చిరునవ్వు సొగసు చూపి తాను నిలిచిన చోటనుండి కదలక నిలుచుండెను. మఱియు దాపునకు వచ్చిన వానిని హరి మొసలి పట్టినట్లు పట్టి, కొమ్ములు చేకొని వాని కడుపునందు తన మోకాళ్ళచే పొడిచెను. వాని కొమ్ములను ఒడిసిపట్టి వాని దర్పమును బలమును కొట్టి తడిబట్టను పిండినట్లు వాని కంఠమును మెలిపెట్టెను. మఱియు వాని కొమ్మొకటి పెరికి దానిచేతనే వానిని గొట్టెను. ఆ మహాదైత్యుడు నోటనెత్తురు గ్రక్కుచు మరణించెను. వాడు అట్లుహతుడైనంత, గోపకులు అప్పుడు ఇంద్రుని స్తుతించినట్లు జనార్దనుని స్తుతించిరి. (188)