బ్రహ్మ మహా పురాణము
రాస క్రీడారంభము
ఆకాశము స్వచ్ఛమై శారద చంద్ర చంద్రికా మనోహరమై కలువ తీగలు వికసింప దిగంతములు సువాసనలు ఘుమఘుమలాడ తుమ్మెదల ఝంకారములచే ఇంపుగొలుపు వనపాళిని జూచి కృష్ణుడు గోపికలతో క్రీడింప మనసు పడెను. బలరామునితో కృష్ణుడు పద్మములవంటి పాదములతో ఆ వనమున విహరించుచు, గోపాంగనలకు మిగుల ఇంపు గూర్చుచు వేణుగాన మొనరించెను. రమ్యమైన ఆ గీతధ్వనిని విని, గోపికలు ఇండ్లు వెడలి సత్వరము కృష్ణుని దరికి ఏతెంచిరి. ఒక గోపిక అతని అడుగులను మెల్లమెల్లగా అనుగమించెను. వేణుగానము విన గుతూహలముగొని, వేఱొకతె అతనినే స్మరించెను. మఱొకతె కృష్ణా! కృష్ణా అని పలికి అంతలో సిగ్గుపడెను. వేఱొకతె ప్రేమ కనులుగప్ప సిగ్గువిడిచి అతని ప్రక్కన నిలిచెను. మఱియొక గోపిక ఇంటనే నిలిచి, బయట ఉన్న పెద్దల (మామగారిని) గని బృందావనమునకు వెళ్ళుటకు సాహసము జేయలేక తన్మయతను చెంది కనులు మూసికొని గోవిందునే ధ్యానించెను. శరచ్చంద్ర మనోహరమైన ఒక రాత్రివేళ గోపికలు వెంబడింప గోవిందుడు రాసక్రీడారంభ రసోల్లాసియై వారల ఆదరించెను. గోపికలు గుంపులుగ కృష్ణ విలాసవివశలై అతడు కనుపించకపోవుటచే విరహాతురులై కృష్ణ దర్శన అపేక్షతో బృందావన మెల్లను వెదకుచు తిరిగిరి. రాత్రి కృష్ణుని అడుగుజాడలను చూచి అతని వివిధ శృంగారానుభావములకు మురిసి, మైమరచి పరిపరి విధముల ఆ వనమున పరిభ్రమించిరి. కృష్ణుడు కనిపించనందుచే నిరాశచెంది మరలి యమునా తీరమునకు వచ్చి కృష్ణ చరిత్రమును మధురముగ స్వర సమ్మేళనమొనరించి పాడిరి. అంతలో హరిముఖ పంకజము వికసింప తటాలున ఎదురువడగ గోపికలు ముల్లోకములను రక్షింపగల పుణ్యశీలురు కావున ఆమూర్తిని దర్శించిరి. ఏతెంచుచున్న గోవిందుని ఒక సుందరి చూచి కనుదమ్ములు విప్పార ఆనంద భరితయై కృష్ణా! కృష్ణా! అని ఆలాపనము చేసెను. ఒకతె కనుబొమలు ముడివడ హరినిజూచి అ ముఖ పంకజమును తన నయనములను తుమ్మెదలచే ఆస్వాదించెను. మఱియొకతె కనులల్లన మూసికొని అతని రూపమును ధ్యానించుచు యోగారూఢయైనట్లు భాసించెను. అవ్వల ప్రియభాషణములచే ఒక్కతెను, భ్రూభంగ విలాసములచే ఒక్కతెను, కరస్పర్శముచే ఇంకొకతెను అనునయించి మాధవుడు వారి నందరిని అన్ని లీలల కలకదేర్చి, వారితో రాసక్రీడా విలాస వైభవమున రమించెను.
గోపికాజనము వర్తులాకారముగ తీరి రాసక్రీడయందు ఇమిడియున్నను, ఒకే లక్ష్యమందు స్థిరపడిన మనస్సుతో కృష్ణునియందు ఏకాగ్రత చెందిన మనస్సుతో, సుస్థిరమైన సమాధి యోగముచేత కృష్ణుని పార్శ్వభాగమును విడవకుండ నిరంతర సాన్నిధ్యానందము అనుభవించెను. శ్రీహరియొక గోపిక చేయి పట్టుకొని తన కరస్పర్శచే కల్గిన ఆనంద పారవశ్యముచేత అరమోడ్పుపెట్టిన కన్నులు కలదానినిగా నొనరించెను. అవ్వల చలించు నొడ్డాణముల చిరుగంటల స్వనములచే క్రమక్రమముగ శరదృతు సమయ కావ్య గీతము అనుసరించి లయానుగుణముగ గోపికా కృష్ణుల నృత్యము ఆరంభ మయ్యెను.
ఒక గోపిక బాహులతలు సాచి కృష్ణుని కౌగిలించుకొని గోపికల సంగీత మాధుర్యమును స్తుతించు నెపమున తోచు నైపుణ్యమున స్వామిని ముద్దు పెట్టుకొనెను. ఆ గోపికల చెక్కిళ్ళ కలయిక (సంశయమును) నొంది, కృష్ణుని భుజములు ఒడలు పులకరించుట అను పంటనుజ్జీవకమగు స్వేదము అనెడి జలమును వర్షించుటలో జలధర భావమును పొందినది. (అనగా నొక సస్యమునకు వర్షము గురియు మేఘముజ్జీవక మైనట్లు కపోల స్పర్శము వలన కల్గిన శృంగారానుభవముచే గోపికలు మైమరపు చెందగా వారి తనువల్లరి పులకరించినదని భావము) కృష్ణుడు తారస్థాయిలో రాసక్రీడా గేయ మాలపించి అంతట భేష్ భేష్ కృష్ణా! అని రెట్టించి వంతపాడిరి. హరిముందడుగు వేయ అవెంబడిని వారడుగు వేసిరి. అతడు వెనుతిరిగిన, వారతనికి సమ్ముఖమైరి (ఎదురైరి) ఇట్లు లయానుగుణమైన పాద విన్యాసమున గోపాంగనలు ప్రతిమలోమానులోమముగ హరికి తారసిల్లిరి. ఇట్లా గోప సుందరులతో కృష్ణుడు రమింప అతనితో అగు క్షణము ఎడబాటు వారికి కోటి సంవత్సరముల వియోగముతో సమానమై తోచెను.
తండ్రులు భర్తలు అన్నదమ్ములు ఎంత వారించినను అత్యుల్లాసమున వ్రజసుందరులు రాత్రులందు కృష్ణునితో గ్రీడించిరి. అతడును కైశోరక వయస్సున వారిని ఆదరించుచు అనేక రాత్రులు రమించెను. వారి పతులందు గోపికలందు సర్వభూతములందు సర్వేశ్వరుడు కావున ఆత్మస్వరూపమై సర్వమున వ్యాపించి హరి వర్తించెను. సమస్త భూతములందు పృథివ్యాపస్తేజోవాయురాకాశములను పంచభూతములు ఎట్లు వ్యాపించి ఉన్నవో, అట్లే కృష్ణపరబ్రహ్మము ఆ ప్రదేశమున సర్వ వ్యాపకుడై ఉండెను.