బ్రహ్మ మహా పురాణము

కాళీయ మర్దనము

కృష్ణుడు గోపకులతో అడవి పూలమాలలు దాల్చి బలరాముడు రాకుండ ఒకసారి బృందావనమునకు వెళ్ళెను. అచట తరగలులేచి నురుగులు ఒడ్డుల దొరయ, నవ్వుచున్నదా అన్నట్లున్న కాళిందీ నదికి పోయి అందు ఒక భయంకరమైన విషాగ్నిని చిమ్ము కాళీయ సర్పమునకు నివాసమైన మడుగును జూచెను. విషాగ్ని వ్యాపించి మాడిపోయిన ఆ తీరమందలి తరువులతో గాలి తాకిడికి లేచిన విషజల స్పర్శచే మాడిపోయిన పక్షులతో మరొక మృత్యుముఖమా అన్నట్లు మహారౌద్రమై ఉన్న అమడుగు చూచి మధుసూదనుడు ఈ మడుగులో విషాయుధుడు కాళీయుడు అను దుష్ట సర్పరాజు ఉన్నాడు. ఇంతమున్ను వీనిని సముద్రమందు నిర్జించి వదలిపెట్టితిని. వానిచేత సాగరమున కలియు యమునానది విషదూషితయైనది. దానిచే నరులు గోవులు దప్పిక గొనియు దీని దరిలేక పోవుచున్నారు. కావున వీనిని అవశ్యము నిగ్రహింపవలెను. వ్రేపల్లెలోని జనము నిత్యము వీనికి జడియు చుందురు. వారెల్లరు ఇంక ఇచట సుఖముగ సంచరింతురు గాక. ఇందు కొఱకే నీ లోకము నందు అవతరించితిని. ఇది సత్పురుషులకు రాకపోకలకు అనువైన చోటు. దురాత్ములకు శాస్తి చేయవలెను. కావున అనతి దూరములోనున్న కదంబ వృక్షమును (కడిమి చెట్టును) ఎక్కి జీవనాశకమైన ఈ విషపు మడుగులో దూకెదను అని తలచి నడుమున వలువ బిగించుకొని ఆ కాళీయుని మడుగునందు కృష్ణుడు దూకిపడెను.

అట్లు దూకిన హరిచే ఆమడుగు కలగబడి దూరదూరమున ఉన్న వృక్షములను గూడ తన జలములచే దడపెను. విష జ్వాలలచే క్రాగిన ఆ ఉడుకు నీటిచే తడుపబడిన చెట్లు అంటుకొని నలుదెసల జ్వాలలు క్రమ్ముకొనెను. కృష్ణుడు ఆ మడువును బాహువులచే కలగుండుపరచెను. ఆ శబ్దము విని నాగరాజు కోపముచే నిండ ఎరుపెక్కిన కనులతో విష జ్వాలాకులమైన బుడగలతో మఱిపెక్కు ఎఱ్ఱని మహావిష సర్పములతో చుట్టుకొనబడి ఉండెను. ఆ నాగుని భార్యలు మనోహర హారములను తాల్చి మేనులు కంపింప, కుండలములు జలించి మణికాంతులు మిరుమిట్లు గొలుప నూరునకు మించి అందంద క్రమ్ము కొనిరి. ఆ ఫణిరాజు ఫణాగ్రమందు జొచ్చి కృష్ణుడు పడగల బంధమందు జిక్కు కొనియె. కాళీయుని పరివారమగు పాములు విషజ్వాలలు చిమ్ము ముఖములచే కరచెను. ఆమడుగున బడి నాగుని భోగమునందు ఇరుకుగొని యున్న హరిని చూచి గోపకులు వ్రేపల్లెకు పోయి శోకవివశులై గోల పెట్టిరి. ఇదిగో కృష్ణుడు కాళీయుని మడుగున విషముచే మూర్ఛపోయినాడు. సర్పరాజు వీనిని తినివేయగలడు. రండు. త్వరగా రండని కేకలు పెట్టిరి.

అదివిని గోపకులు గోపికలు పిడుగుపడినట్లై యశోద మున్నగువారందరు మడువు దరికేగిరి. ‘కృష్ణుడెక్కడ’ అనుచు వ్రేపల్లెలో యశోదతో బెదరిబెదరి తడబడుచు అటకు వచ్చిరి. నందుడు గోపకులు బలరాముడు మొదలగు అద్భుత పరాక్రమ సంపన్నులు కూడ హడలెత్తి కృష్ణుని చూచుటకు యమున కేగిరి. సర్పరాజ వశమున నుండి అన్ని పడగలచే చుట్టబడి ఏమి జేయక మిన్నకున్న కృష్ణుని జూచిరి. నందగోపుడు నిశ్చేష్టుడై కొడుకు నెమ్మోము చూచుచు నిలువబడెను. మఱియుంగల గోపికలు ఏడ్చుచు, కేశవుని గూర్చి శోకాక్రాంతులై, భయభ్రాంతులై, యశోదతోగూడ ఈపెనుమడువున జొత్తుము చత్తుము గాక తిరిగి పల్లె చెంతకు పోరాదు. సూర్యుడులేని పగలేమి, చంద్రుడు లేని రాత్రియేమి? రాత్రి పాలులేని ఆవులు? ఏమి ఆవులు. కృష్ణుడులేని వ్రేపల్లె ఏమి పల్లె? ఈ కృష్ణుడు లేకుండ గోకులమునకు పోనేపోము అను నీ గోపికల మాటవిని రోహిణి కొడుకు బలరాముడు కృష్ణ దూరులైన గోపకులను జూచి చూపు నిలిపి బిడ్డ ముఖమున జూపు పెట్టి దిగులు పడియున్న నందుని, మూర్ఛాకులయైన యశోదను ఉద్దేశించి కృష్ణు ప్రభావమెఱిగి ఇట్లనియె

‘దేవదేవ! నీ మానుష భావము వెల్లడించుచుంటివా? ఆత్మ స్వరూపమును నీ వెరుగవా? వేరొక రూపే చూపనేల? నీవే జగత్తునకు నాభిభూతుడవు. దేవతలకు ఆశ్రయుడవు. త్రైలోక్యమునకు కర్తవు, భర్తవు, హర్తవును, వేదత్రయీ రూపుడవు. ఇట అవతరించిన మన ఇద్దరకు గొల్లలే చుట్టాలు కదా కృష్ణా! గోపికలు అంతే కదా! ఇట్లు పరితపించు నీ బంధువులను చూచి ఎందువలన ఉపేక్షించుచున్నావు. మానుషభావము చూపితివి. బాలచేష్టలు ప్రదర్శించితివి. కోరలు ఆయుధముగ గొనిన ఈ దురాత్ముని దమింపుము’. అని బలరామునిచే జ్ఞప్తి చేయబడి, కృష్ణుడు చిరునవ్వున అధరబింబము తెరచుకొన భుజా స్పాదనముజేసి పాము పడగల బంధముల నుండి తన మేనిని వదలించుకొనెను.

రెండు చేతుల ఆ పాము మధ్యమ ఫణమును వంచి వ్రాలిన వాని తలపై కెక్కి అవక్ర విక్రమమున నర్తనము చేసెను. హరి పాదకుట్టనములచే (రాపిడిచే) వాని పడగలు పుళ్ళుపడెను. త్రొక్కిన తల వొంగిపోయెను. కాళీయుడు కృష్ణపాద ఘట్టనమున మూర్ఛచెందెను. దండపాతమట్లు పడిపోయి నెత్తురు గ్రక్కెను. శిథిలములైన శిరస్సుల ముఖముల నుండి రక్తము స్రవింప చూచి, వాని భార్యలు మధుసూదనుని శరణొందిరి.

దేవదేవ! సర్వేశ్వర! పురుషోత్తమ! నీవు పరంజ్యోతి స్వరూపుడవు. ఆత్మ యొక్క భాగమే నీవు. నిన్ను స్తుతింప దేవతలును చాలరు. అట్టి నీ స్వరూప వర్ణన ఆడుది ఎట్లు చేయగలదు. పృథివ్యాపస్తేజో వాయ్వాకాశ రూపమయిన బ్రహ్మాండము నీలో అల్పాల్పమైన అంశము. అట్టి నిన్నేమి స్తుతింపగలము. కావున ఓ జగత్ప్రభో! ఈ నాగుని ఎడ దయ చూపుము. అణగిమణగి ప్రాణములు వదలుచున్నాడు. భర్తృభిక్ష పెట్టుము అని నాగ పత్నులు పలుక కాళీయుడు ఒడలెల్ల నలుగుడువడి కూడ దేవదేవ! అనుగ్రహింపు మని మరిమరి ఇట్లు పలికెను.

నీ ఐశ్వర్యము ఎనిమిది విధములు. అది స్వభావసిద్ధము. దానిని అతిశయించు నది మఱిలేదు. అట్టి అణిమాది విభూతి సంపన్నుడగు నిన్ను ఏమని స్తుతింపగలను. నీవు పరుడవు, పరునకును మూలము నీవు. నీకంటె పరమైన తత్వము నీవె. పరతత్వమునకు పరమునీవు. అట్టి నిన్నేమి స్తుతింపగలను. జాతిచే రూపముచే తాము ఇట్లు నన్ను సృజించితిరి. దానికి అణుగుణమైన స్వభావము కూడినవాడను. తదను గుణమైన చేష్టను చేసితిని. సర్ప స్వభావమైన కాటు వేయుటను, కరచుటను మాని వేఱొక తీరున ప్రవర్తింతునేని స్వామి! నన్ను దండించుట న్యాయము. అట్లయ్యు ఓజగత్ప్రపభు! నాపై దండనము వైచితివి. ఈ దండనము నీవు విధించినది కావున ఇది వరముగ నేను స్మరింపవలసినదే. ఇంతకంటె నీవలన మఱొక వరము వలదు. అచ్యుత! వీర్యము హతమైనది. విషము హతమైనది. నీచే నేనును దమితుడను అయితిని. ప్రాణ మొక్కటి మాత్రమిమ్ము. నేను మఱియేమి సేయవలెనో ఆజ్ఞాపింపుము. అని పలుకగా విని శ్రీభగవానుడు “ఓ పాము! ఈ యమున జలమున ఇక్కడ నీవెపుడు ఉండవలదు. భృత్యపరివారముతో నీవు సముద్రజలములలోనికి చనుము. నీతలపై నా పాదములను జూచి సముద్రమున పన్నగారియైన గరుడుడు నిన్ను చంపడు” అని హరి సర్పరాజును వదలెను. వాడును కృష్ణునకు మ్రొక్కి సముద్రమున కేగెను. సర్వభూతములు చూచుచుండ భృత్యులతో, సంతతితో, బంధువులతో, భార్యలందరితో ఆ మడుగు విడిచి సర్పము పోయి నంతట గోపకులు చనిపోయి మఱి బ్రతికివచ్చిన వాని విధముగ గోవిందుని కౌగిలించుకొని భాష్పములచే అతని శిరస్సును తడిపిరి. ఎల్లరు మనసులు అచ్చెరువుచెంద ఆనందభరితులై ఆనంద మధుర మంగళ రసపూరితముగా చూచి స్వామిని స్తుతించిరి. గోపికలచే కీర్తింపబడి, గోపకులతో కృష్ణుడు వ్రేపల్లెకు అరుదెంచెను. (175)