బ్రహ్మ మహా పురాణము

ఫలశ్రుతి

దక్షుడు చేసిన ఈ శివస్తవమును పారాయణముచేసిన వాడెన్నడును అశుభము పొందడు. దీర్ఘాయువునందును. సర్వదేవులందు మహాదేవుడు భగవంతుడు, శ్రేష్ఠుడైనట్లు దక్షకృతమైన ఈ శివస్తుతి కూడ సర్వస్తుతివరిష్టము. కీర్తి, స్వర్గము, దేవైశ్వర్యము, ధనము జయము కోరువారును విద్యాకాములును ఈ స్తవమును భక్తితో పఠింపవలయును, వ్యాధి, దుఃఖము, భయమునకు గురియైనవాడు రాజకార్య నియుక్తుడును, ఈస్తుతి పఠించిన భయవిముక్తుడగును. అతడీ దేహముతోనే శివగణములు అనుభవించు మహేశ్వర సుఖమును (పరమేశ్వర విభూతిని) ఇహమందు అనుభవించి, గణాధిపతి అగును. యక్షులు, పిశాచులు, నాగులు, వినాయకులును, ఆ భక్తునికి ఎట్టి విఘ్నములు కల్గింపరు. ఈ స్తుతిని భక్తితో శివునిపై భావమునిల్పి విన్నచో పుట్టింటను, అత్తింటను పూజ్యురాలగును. దీనిని విన్నను కీర్తించినను, వానికి నిర్విఘ్నముగ సర్వకార్యసిద్ధి అగును. ఇది కీర్తించుటచే మనసుచేత సంకల్పించినది మాటచే అన్నది ఎల్లపనులు నెరవేరును. కుమారస్వామికి గౌరికి నందీశ్వరునికి ఇంద్రియ నిగ్రహముతో నియమముతో వేర్వేరు బలిని (పూజను) ఒనరించి ఆమీద నీ శివనామములను క్రమముగ పారాయణమునకు గ్రహింపవలెను. అందువలన మానవుడి ఇష్టార్థములను భోగములను పురుషార్థములను బడయును. మరణించి అప్సర స్త్రీ సహస్రముతో స్వర్గమునకేగును. కోరికలతో పాతకములతో ఉన్న వాడైనను ఈ దక్షకృత శివస్తుతి పఠించి సర్వపాప ముక్తుడగును. దేహపాతానంతరము గణ సాయుజ్యమందును. సురాసురలపుడు వానిని పూజింతురు. అతడు భూత ప్రళయము దాక వృషభ వాహన మెక్కి రుద్రానుచరుడగును.

ఈ విధముగ పరాశరసూనుడు వ్యాసభగవానుడు పలికినాడు. ఇది ఎవ్వడు ఎఱుగడు. దీనిని ఎవ్వనికి వినిపింపరాదు. ఇది గుహ్యమైన (మంత్రసమ్మితమైన) స్తవము. పాపజన్ములయినను వైశ్యులు స్త్రీలు శూద్రులు ఈస్తుతిని పఠించి విని రుద్రలోక మందుదురు. విప్రులకు ప్రతిపర్వమందు దీనిని వినిపింపవలెను. అందుచే ద్విజుడు రుద్రలోక మందుకొనగలడు. సందియము లేదు. (40)