బ్రహ్మ మహా పురాణము

ఆదిత్య ఉత్పత్తి

సూతుడు ఇట్లు అనియె -

ద్విజోత్తములార! కశ్యపునికి దక్షసుతయందు వివస్వంతుడు ఉదయించెను. అతని భార్య సంజ్ఞ. ఆమె త్వష్ట ప్రజాపతి కుమార్తె. సురేశ్వరియను పేర త్రిలోక ప్రఖ్యాతి పొందినది. రూప యౌవనశాలినియైన ఆ దేవికి భగవంతుడగు వివస్వంతుని యొక్క (మార్తాండుని యొక్క) అందము అంతగా ఆనంద మీయదయ్యెను. ఆమె మంచి తపస్సుచేసి మంచిదీప్తి గడించుకొన్నది. కాని అదిత్య మండలము వేడిమికి అమె తనూలత వాడిపోయి అంతగ రాణింపదయ్యెను. కాశ్యపుడు వాత్సల్యాతిశయముచే వీడు ‘అండమందు మృతుడు కాలేదు’ గద అని ఎఱుగక పలికిన విధమున అతనికి మార్తండుడను పేరు రూఢమయ్యెను. ఆతని తేజస్సు దుర్భరమై ముల్లోకములను దహింపజేయు నట్టిది అయ్యెను. ఆదిత్యుడు {వివస్వంతుడు) సంజ్ఞాదేవియందు మనువును శ్రాద్ధదేవుడైన యముని కనెను. యమున అను కన్యకుగూడ జన్మనిచ్చెను. యముడును, యమునయు కవలపిల్లలు. సంజ్ఞ శ్యామ వర్ణుడైన ఆ వివస్వంతుని జూచి ఓర్చుకొనలేక తనకు సమానురాలును, మాయమయియైన ఛాయ (నీడ) అను స్త్రీని కల్పించెను. ఆ మాయ సృష్టింపబడిన వెంటనే సంజ్ఞ ఎదుట నిల్చి, ప్రాంజలియై మ్రొక్కి, ఓ సుహాసిని! నేను చేయతగిన కార్యమును జెప్పుము. నీ ఆజ్ఞావశనై ఉన్నాను. నాచేత పనిచేయించుకొనమని పలికెను.

సంజ్ఞ మాటలకు -

“అబలా! నేను పుట్టినింటికి ఏగెదను. నీకు శుభము కలుగును గాక! నాయింట నీవు నిశ్శంకముగ ఉండవచ్చును. ఈ పిల్లలిద్దరు ఈ బాలిక సంతానము. వీరిని కనిపెట్టుకొని ఉండుము. ఈ మాట భగవంతుడు వివస్వంతునికి ఎన్నడేని జెప్పకుము” అని పలికెను.

ఆ మాటలను ఆలకించిన సవర్ణ (ఛాయ) జుట్టు పట్టి లాగునందాక, శాపమిచ్చు నందాక, ఈ వార్త నేను ఎన్నడును చెప్పను. నీకు నమస్కారము. దేవీ! సుఖముగ వెళ్ళిరమ్మనెను.

తపస్వినియైన సంజ్ఞ సవర్ణకు (ఛాయకు) ఇట్లు తెలిపి బిడ్డలను అప్పగించి తండ్రియగు త్వష్ట ప్రజాపతి సమీపమునకు ఏగి, సిగ్గున తలవంచుకొని నిలువబడెను. ప్రజాపతిచేత భర్త సన్నిధికి పో! పొమ్ము అని పలుమారులు అదలించి బెదిరించి ఆదేశింపబడియు అయ్యింతి కాంతుని గృహమునకు పోక, బడబ (ఆడు గుఱ్ఱము) ఆకృతిని దాల్చి (ఆడు గుఱ్ఱమై) తన రూపము మఱుగుపఱచుకొని ఉత్తర కురు భూములందలి పచ్చిక బయళ్ళలో తిఱుగజొచ్చెను.

            రెండవ సంజ్ఞను, అసలు సంజ్ఞయే అని భావించి ఆమె యందు ఆదిత్యుడు (సూర్యుడు) తనకు అన్నింటియందు సమానుడైన కొడుకును పొందెను. ఇంతకుముందు పుట్టిన మనువును పోలినవాడైనందున ఇతడును ‘సావర్ణ మనువు’ అని పిలువబడుచుండెను.

ఆమెకు కల్గిన రెండవకుమారుడు శనైశ్చరుడు. అతడు పుట్టిన తరువాత ఆమె తనకు అప్పగించిన సవతిబిడ్డలను ఆదరించుట మానివేసెను. మనువు దానిని సమీపించి ఊరకుండెను. యముడు అది ఓర్వలేక ఆసవతి తల్లిని పాదమెత్తి బెదిరించెను. అందులకు ఛాయ కోపించి మిగుల దుఃఖించి నీకాలు పడిపోవుగాక అని శపించెను. యముడా వృత్తాంతమును తండ్రికి ప్రాంజలియై విన్నవించెను. నాకు ఆమె ఇచ్చిన శాపమును మరలింపుమని తండ్రిని వేడుకొనెను. తల్లి తన బిడ్డలు అందరియెడ సమానమైన వాత్సల్యముతో వర్తింపవలయునుగదా. ఈ అమ్మ మమ్ములను నిరసించి బ్రతుకనెంచినది. అందువలననే ఆమెపై పాదము ఎత్తితిని, ఎత్తితినే కాని ఆమె శరీరమునకు తాకింపలేదు. బాల్యముచే, లౌల్యముచే ఎఱుఁగకనేను ఒనరించిన తప్పును క్షమింపుము. తల్లి శాపమునకు గురియైతిని. గ్రహ రాజ! (ఓ సూర్యుడా) నీ అనుగ్రహముచే నా పాదము పడిపోకుండుగాక! అని కొడుకు వాపోవకరుణించి సూర్యుడు అతడితో ఇట్లు అనియె. పుత్ర! ఇందేదో గొప్ప కారణముండి తీరును. ధర్మజ్ఞుడవు, సత్యవచనుడవైన నిన్ను క్రోధము ఆవేశించినది. నీ తల్లిమాట మిధ్య గాకుండుటకు కృములు నీ కాలి మాంసము దిని అవనికేగును. ఈ రీతి మీ అయమ్మ మాట సత్యము కాగలదు. ఈ విధమైన శాపపరిహారముచే నీవును సురక్షితుడవు అయ్యెదవనెను.

ఆదిత్యుడు సంజ్ఞను జూచి (ఛాయామూర్తిని) బిడ్డలను అందరిని ఒక్కరీతిగా గాక ఒక్కనియందు ఎక్కువ ప్రేమ నీకు ఎందులకని అడిగిన ఆమె ఆమాట తప్పించెనేగాని నిజము చెప్పదయ్యెను. అతడు తనకు తాను సమాధానపడి యోగదృష్టిచే నిజమెఱింగెను. ఆమెను అప్పుడే శపింపబూనియు శాపమీయక జుట్టు పట్టుకొని ఊపెను. అంత ఆమె జరిగిన విషయము తన పతికి విన్నవించెను. వివస్వంతుడు ఆ వృత్తాంతము అంతటిని విని కోపించి, మామ గారగు త్వష్ట చెంతకు వెళ్ళెను. మామయు ఆ విధముగా వచ్చిన అల్లుని ఆదరించెను. రోషముతో తనను దహించుటకు వచ్చినాడని గ్రహించి అపుడు అతనిని అనునయించుచు ఇట్లనియె.

ఓ ఆదిత్యమూర్తి! ఈ నీ రూపము భరింపరాని తేజము కలది. అందుచే దానిని చూడరాదయ్యెను. సంజ్ఞ ఇది సైపనేరక పచ్చిక బయళ్ళ తిరుగాడుచున్నది. శుభచారిణియైన నీ సహధర్మచారిణిని ఇప్పుడు చూడవలయును. ఆమె శ్లాఘనీయ. యోగబల సంపన్నురాలు. గ్రహరాజగు నీకు నామాట అనుకూలము, సమ్మతము అగునేని యోగమూని యామె చెంతకరుగుము. నీ రూపమును చూడముచ్చగటగ ఒనరింతునని తెలిపి, యా తరణిని (సూర్యుని యంత్రమునెక్కించి చెక్కివైచెను. తరణిని యంత్రమున బట్టిన నాటినుండీ తరణిబట్టుట వలన నీ పేరు లోకమున రూఢికెక్కెను. దానివలన అతని తేజస్సు కొంతటిందువడి రూపము చూచుటకు అందమై ఇంపొందెను. ఆ మీద అతడు యోగశక్తిచే ఉత్తరకురు భూములకు పోయి బడబారూపమున చరించుచున్న తన భార్యను చూచెను. తేజస్సుచే పాతివ్రత్య నియమముచే భూతములకు దృశ్యమైయున్న ఆ అంగనను ఎందును భయపడక సంచరించుచుంచగా చూచి తాను అశ్వరూపము ధరించి ముఖ మునంగవయఁబోయెను. పరపురుషశంకగొని ఆమె పెడమొగ మైయున్న సమయమున ఆమెయందు నిక్షిప్తమైన శుక్రమును ఆమె నాసికా రంధ్రముల వెంట చీదివైచెను. అందుండి అశ్వినులు అను దేవవైద్యులు నాసత్యుడు (దస్రులు) అని పేర్కొనబడెడివారు ఉదయించిరి. అష్టమ ప్రజాపతియగు మార్తండుని ఔరసులైన ఇర్వురు మిక్కిలి అందమైనవారు. తరువాత భాస్కరుడు ఆకాంతకు మిగులకాంతుడై కానవచ్చె. ఆమె కూడ తన మనోహరునింగని మిగుల సంతోషించెను.

యముడు మాత్రము తాను ఇంతకు ముందు చేసిన పనికి మిక్కిలి వగచెంది ప్రజలను ధర్మముచే రంజింపఁచేసి ధర్మరాజును సార్ధక నామము, పితృ దేవతలకు ఆధిపత్యమును, లోకపాలకత్వమును బడసెను. సావర్ణి ప్రజాపతి సావర్ణి మన్వంతరమున మనువు కాగలడు. అతడు మేరుగిరిపై ఇప్పుడును తపము చేయుచున్నాడు. వాని తమ్ముడు శని గ్రహపదవిని పొందెను. త్వష్ట (సూర్యబింబమును) తరణి బట్టగా రాలిన రజమును బ్రోవుచేసి విష్ణు చక్రమును గావించెను. అది దానవాంతకము, అప్రతిహతము. యముని తరువాత పుట్టిన ఆ బాలిక యమున అనుపేర లోకపావని అయినది అయ్యెను. మనువు సావర్ణుడు అను పేర ఆ రెండవ కుమారుడు పిలువబడెను. ఆయన తమ్ముడు శనిగ్రహ పదవినంది సర్వలోక పూజితుడు అయ్యెను. దేవతల ఈ జన్మ వృత్తాంతమును విన్నవాడు ఆపదలను బాసి మహాయశస్సు నందును. (6)