బ్రహ్మ మహా పురాణము

దేవకీ వాసుదేవులతో శ్రీకృష్ణ సంవాదము

భగవద్విలాస దర్శనము వలన విజ్ఞానము ఉదయించిన దేవకీ వసుదేవులను చూచి హరియాదవ సంఘము మోహములో పడుటకు తన వైష్ణవ మాయను విస్తరింపజేసెను. అమ్మా! ఓ అయ్యా! ఎన్నాళ్ల నుండియో మిమ్మెప్పుడు చూచెదనా అని త్వరపడుచు, కంసునికి భయపడి ఉన్న బలరాముడు నేటికి మిమ్ములను చూచినాడు. తల్లిదండ్రులను పూజింపకయే జరిగిన కాలము అది వ్యర్థము. ఉత్తములకు అది బాధాకరము అగును. గురువుల, దేవతల విప్రుల తలిదండ్రులను పూజించువారి జన్మము సార్థకము. ఇంతదనుక ఇది తప్పుచేసిన తప్పిదము. తండ్రీ! క్షమింపుము. కంసుని బలపరాక్రమములకు జడిసి పరవశులమై ఉన్నందున అట్లు జరిగినది అని పలికి ప్రీతితో యదువృద్ధుల పాదములపై వ్రాలి ఇద్దరును వసుదేవుని మనసునకు ఊరటనుకూర్చిరి.

అంతట కంసుని భార్యలు వాని తల్లులు నేలపై విగతజీవుడై పడియున్న కంసుని చుట్టును జేరి, దుఃఖ శోకముల మునిగి (దుఃఖము= కష్టము, శోకము=ఆప్తబంధు మరణాదులచే మనస్సుకు కలుగు బాధ) పెక్కురీతుల కలతపడి, పశ్చాత్తాపము చెందుచు పెక్కురీతులుగా ఏడ్చిరి. హరి తాను కన్నుల నీరు పెట్టి కొని వారలను ఓదార్చెను. అటు తరువాత ఉగ్రసేనుని బంధము నుండి విడిపించెను. మఱియు కొడుకును కోల్పోయిన వాడైన అతడిని వానిని రాజ్యమునందు అభిషిక్తుని జేసెను. రాజ్యాభిషిక్తుడై అతడు తన కొడుకునకు ఇంకను ఆ సమయమున చచ్చిన వారికిని ప్రేత కృత్యములు కావించెను. అట్లొనర్చి సింహాసన మెక్కిన ఆతనితో కృష్ణుడు శంకింపక ఇపుడు ఏమి చేయవలయునో ఆనతిమ్ము. యయాతి శాపముచే నీ యదువంశము రాజ్యానికి అనర్హమే అయినను ఇప్పుడు నేను భృత్యుడనై ఉన్నాను కావున నీవు దేవతలనైనను శాసింపుము. నరపాలుర లెక్కేమి అని కార్య నిమిత్తమున మానుషాకారములు ధరించిన భగవంతుడు మానవ భాషణముల ఉగ్రసేనునితో పలికి, వాయువు బిలిచి ఇట్లనియె. నీవేగి ఇంద్రునితో ఇట్లనుము. ఇంద్ర! గర్వమువలదు. కృష్ణుడు చెప్పుచున్నాడు. నీ సుధర్మ సభ అనుసింహాసనమును ఉగ్రసేనునికి సమర్పింపుము. అత్యుత్తమము రాజులకర్షము. ఈ సుధర్మ సభారత్నము (సర్వసభా శ్రేష్ఠము) యదువు లెక్కుట యుక్తము అని పలుక పవనుడు స్వర్గమునకు పోయి శచీపతికి అదియెల్ల విన్నవించెను. అతడును సుధర్మ సభను వాయువునకు ఒసగెను. వాయువు కొనివచ్చిన ఆ దివ్యసభను సర్వ రత్నాఢ్యమును (సర్వ వస్తువులలో అత్యుత్తమ శ్రేష్ఠవస్తువులు గలదానిని) గోవిందుని భుజముల నీడలో ఉండి యదు శ్రేష్టులు అనుభవించిరి.

సర్వ విజ్ఞానము లెఱిగినవారు, కేవల జ్ఞాన స్వరూపులైన ఆవీరులు రామకృష్ణులు శిష్యాచార మిట్లుండవలెనని లోకమునకు వెల్లడించువారై కాశీ క్షేత్రమునందు పుట్టి అవంతీ పురమునందు (ఉజ్జయినిలో) వసించుచున్న సాందీపని సన్నిధికి పోయి అస్త్ర విద్యను బోధింపవలసినదిగా ఆయనను అడిగిరి. ఆయనకు శిష్యులై గురుశుశ్రూష చేయుచు ఎల్లజనమునకు సదాచారము గురుశిష్య భావమిట్లుండ వలెనని చేసి చూపించిరి. ధనుర్వేదము రహస్యముగ, సంగ్రహముగ, అరువది నాల్గు దినములలో ఆయన నుంచి అధ్యయనము చేసిరి. అది వింతలలోకెల్ల వింత అయ్యెను. సాందీపనియు ఎన్నడు ఊహింప వలనుగానిది, అమానుషము అయిన ఆ అధ్యయనము తీరుగని, ఆలోచించి చంద్ర సూర్యులు ఇటు వచ్చినారని వారిని భావించెను. ఆ ఇద్దరు చెప్పిన మాత్రాన (ఉపదేశ మాత్రమున) అస్త్ర క్రమమెల్లపొంది, తమకు గురుదక్షిణ ఏమీయవలెనో అడుగు మనిరి. ఆయన మతిమంతుడు కావున వారిపనిని అతీంద్రియ జ్ఞానమునగని (కేవల తపోదృష్టితో చూచి)లవణసముద్రమున ప్రభాస తీర్థమందు మున్ను గతించిన పుత్రుని యాచించెను.

అప్పుడు బలరామకృష్ణులిద్దరు అస్త్రములను చేకొని సముద్ర ప్రాంతమునకు చేరి సాగరునితో గురుపుత్రుని ఇమ్మని పల్కిరి. వార్ధియు చేతులు మొగిచి నేను సాందీపని పుత్రుని హరింప లేదనియు పంచజనుడను దైత్యుడు శంఖము రూపమున నుండు వాడు ఆబాలుని గొనిపోయెను వాడు నా నీటిలోనే ఉన్నాడు అనెను. అదివిని కృష్ణుడు నీళ్లలోనికి ప్రవేశించి పంచజనుని పంచత్వ మందించి (చంపి) వాని అమ్ముల పొడమిన ఉత్తమమైన శంఖమును చేకొనెను. దాని నాదముచే దైత్యులకు బలము పోవును. దేవతలకు తేజస్సు వృద్ధిపొందును. అధర్మము క్షయించును. అట్టి పాంచజన్యము నెత్తి బలభద్రుడును, హరియును యమపురికేగి యమునిగెల్చి, యమయాతనలు పడుచున్న ఆ బాలునిగొని మునుపటి వలె మానవ శరీరమున ఉన్న వానిని తండ్రియైన సాందీపునికి బలరామకృష్ణులు ఒసంగిరి.

అటనుండి ఉగ్రసేన పరిపాలనలో ఉన్న మధురకు వారు ఏతెంచిరి, మధురాపుర వాసులు స్త్రీ పురుషులు వారి ఆగమనమునకు అమితానందభరితులైరి. (194)