బ్రహ్మ మహా పురాణము

కృష్ణ నిర్యాణము

తరువాత వ్యాసుడు ఇంకను

ఇట్లు కృష్ణునిచే తెలుపబడి దారుకుడు స్వామికి మణిమఱి నమస్కరించి ప్రదక్షిణ మొనరించి ఆయన చెప్పినట్లు పోయెను. తదుపరి ద్వారకకు అర్జునుని కొనివచ్చి వజ్రుని రాజును చేసెను. భగవంతుడగు గోవిందుడు వాసుదేవాత్మకమైన తన అంశమును బ్రహ్మమందు ఆరోపించి సర్వ భూతములందు ధరించెను. అనగా సర్వాత్మ భావమునందెను. పూర్వము దుర్వాసుడు చెప్పినట్లు (అది ద్విజుడు. బ్రాహ్మణుడు చెప్పిన మాట యైనందున) దానిని గౌరవించి మోకాలిపై పాదముంచి యోగ సమాధిని గొని నిల్చెను. అంతట జరుడు అను వ్యాధుడు (బోయ) అచటికి వచ్చెను. వాడు మునుపటి రోకలియందు మిగిలిన ఇనుప ముక్కతో తయారైన బాణమునుగొని ఒక లేడి కాలి అడుగువలె ఉన్న హరి పాదమును జూచి బాణముతో కొట్టెను. కొట్టి అదరికి వెళ్ళి నాలుగు బాహువులతో ఉన్న ఒక నరమూర్తిని చూచెను. ఆయనకు ప్రణామము చేసి క్షమింపు మని మఱిమఱి వేడుకొనెను. తెలియక లేడియనుకొని కొట్టితిని. నా పాప కర్మము చేత తగలబడుచున్న నన్ను నీవు తగలబెట్టవలదు అనెను. వానిని చూచి భగవంతుడు నీకు అణుమాత్రమైనను భయము వద్దు. నా ప్రసాదముచే దేవేంద్ర లోకమునకు ఏగుమని హరి పలికెను.

శ్రీహరి వాక్యానంతరము అప్పుడే విమానము ఏతెంచెను. ఆ బోయ హరి ప్రసాదము వలన అదియెక్కి స్వర్గమునకు వెళ్ళెను. అతడు ఎగిన తరువాత భగవంతుడు నారాయణుడు మనసున కందని అమేయము, అమలము, జన్మజరామరణములు లేనిది సర్వాత్మకమునైన ఆత్మయందు (తనయందు) ఆత్మను (తనను) వాసుదేవమూర్తియందు సంయోజించి మానుష దేహమును వదలి త్రివిధమయిన గతిని పొందెను. సాలోక్య సారూప్య సాయుజ్య రూపమైన పరమ ముక్తిని పొందెను. (211)