ఇట్లు పరమేశ్వరుడు చెప్పిన విషయము అంతయు విని జగన్మాత హర్షమును ప్రీతిని ఆశ్చర్యమును పొందెను. ఆ సమయములో శివుని సమీపమున ఉన్న మునివరులును తీర్థయాత్రా ప్రసంగమున అచటికివచ్చి చేరియున్న ద్విజులును శివుని సంపూజించి నమస్కరించి లోకముల హితమునుకోరి తమకుగల సంశయమును ప్రశ్నించిరి.
“ఓ త్రిలోచనా! దక్షయజ్ఞ వినాశనా! జగన్నాథా! మా హృదయమందున్న సంశయమును అడుగుచున్నాము. మహాఘోరమయి భయంకరమయి గగుర్పాటు కలిగించు ఈ సంసారములో అల్పప్రజ్ఞ కలవారగు మానవులు ఎంతో కాలము జన్మ ఆవృత్తి పొందుచున్నారు. వీరు జన్మ సంసారముల బంధనమునుండి విడుదల పొందు ఉపాయమును వినగోరుచున్నాము చెప్పుము.
ఓ బ్రాహ్మణులారా! కర్మపాశములచే బద్ధులయి దుఃఖములను అనుభవించుచున్న మానవులకు వాసుదేవుడు తప్ప వేరు ఉపాయములేదు. శంఖ చక్ర గదా ధరుడగు ఆ దేవుని మనోవాక్కర్మలతో లెస్సగా పూజించువారు మోక్షమును పొందుదురు. జగద్రూపుడగు వాసుదేవుని వైపునకు మరలి ఉండని మనస్సు కలవారు పశువులవలెనే ఆహారనిద్రాది చేష్టలతో ఈ లోకమున జీవించుటవలన ప్రయోజనము ఏమున్నది?
ఓ పినాకధారీ! భగుడు అను ఆదిత్యుని నేత్రము పోగొట్టినవాడవు, సర్వలోకముల నమస్కృతుల అందుకొనువాడవు అగు శంకరా! వాసుదేవుని మాహాత్మ్యమును వినగోరుచున్నాము.
బ్రహ్మ కంటెను మేలగువాడు శాశ్వతుడగు పురుషుడు హరి. అతడే కృష్ణుడు. మేఘములులేని ఆకాశమున ఉదయించిన సూర్యునివలె బంగారు కాంతితో ప్రకాశించువాడు. పది బాహువులు మహా తేజస్సుకలిగి రాక్షస సంహారియై శ్రీవత్సమను మచ్చతో కూడి విషయేంద్రియములకు అధిపతియై సర్వదేవతా సమూహమునకు ప్రభువగువాడు. ఆతని ఉదరమునుండి బ్రహ్మశిరస్సు నుండి నేను జన్మించితిమి. శిరోజముల నుండి జ్యోతిస్సులు, రోమముల నుండి దేవదానవులు దేహమునుండి ఋషులు శాశ్వతములగు లోకములు జనించినవి. అతడు సాక్షాత్ బ్రహ్మకును సర్వలోకములకును గృహము. ఈ పృథివి అంతటిని సృష్టించువాడు-త్రిలోకములకు ఈశ్వరుడు, రక్షకుడు. చరాచర భూతముల సంహరించువాడు. తానే దేవతలకును దేవుడు, రక్షకుడు. పరుల తపింప జేయువాడు. సర్వజ్ఞుడు సర్వము సృష్టించువాడు అంతట ఉండువాడు. అన్నివైపులకు ముఖములు కలవాడు. మూడు లోకములందును అతనికంటె మేలగు తత్త్వము ఏదియు లేదు. సనాతనుడు, ఎల్లప్పుడు ఉండువాడు, మహాభాగుడు, గోవిందుడు, సర్వధర్మ రక్షకుడు అని ప్రసిద్ధి కలవాడు. మహామానవంతుడగు ఆ వాసుదేవుడు దేవకార్యార్థమై మానవదేహము ధరించి యుద్ధమున రాజులను అందఱను సంహరించును. ఈ త్రివిక్రముడు లేనిదే ఈ లోకమున దేవతలును తమకార్యములను నెరవేర్చుకొనజాలరు. అతడు సర్వ భూతముల నమస్కారములను అందుకొను సర్వ భూతనాయకుడు. అతనికి నాయకులు ఎవరునులేరు. దేవతలకు రక్షకుడు కార్యజగద్రూపుడు పరబ్రహ్మ తత్త్వరూపుడు బ్రహ్మర్షులకును శరణ్యుడుఅగు అతని నాభియందు బ్రహ్మశరీరమునందు నేను అందఱు దేవతలును సుఖముగా ఉన్నాము. ఆ దేవుడు పద్మనేత్రుడు. లక్ష్మి తన గర్భమందున్నవాడు, లక్ష్మితో కూడియుండువాడు, శార్ఞ్గము చక్రము ఖడ్గము గరుడధ్వజము కలిగి ఉత్తమమగు సుశీలము శౌచము బహిరింద్రియ నిగ్రహము పరాక్రమము వీర్యము దేహసౌందర్యము చక్కని ఆకృతి ఎత్తుసరి ఋజు స్వభావ సంపద సౌమ్యత రూపము బలము కలవాడు. ఆశ్చర్యకరమగు రూపములుకల సర్వ దివ్యాస్త్రములు కలవాడు. యోగమాయచే వేయి కన్నులు విరూపములగు కన్నులు కలవాడు. ఉన్నత మనస్సుకలవాడు. వాక్కుతో తన మిత్రజనుల మెచ్చువాడు. జ్ఞాతులకును బంధుజనులకును ప్రియుడు. క్షమాగుణము కలవాడు. అహంకారము లేనివాడు. బ్రహ్మత్వమును ఇచ్చువాడు. భయముచే బాధనొందు వారి భయమును పోగొట్టువాడు. మిత్రుల ఆనందమును వృద్ధిచేయువాడు. సర్వభూతములకు శరణ్యుడు. దీనుల పాలించుటయందు ఆసక్తుడు. వేదశాస్త్రముల అధ్యయనము యోగ్యత కలవాడు. ఆశ్రితులకు రక్షకుడు. శత్రుభయంకరుడు. నీతితత్త్వమును ఎఱిగి ఆచరించువాడు. వేదవేదాంగతత్త్వము ప్రవచించువాడు. ఇంద్రియముల జయించినవాడు.
దేవతల మేలు కొఱకే, ఆ వాసుదేవుడు ఉత్తమ బుద్ధిశాలియై ధర్మముచే సంస్కరింప బడినను ప్రజాపతి యొక్క శుభ మార్గమున మహాత్ముడగు మనువు వంశమున జన్మించును. మనువునకు అంశుడు అతనికి అంతర్ధాముడు అతనికి పూజ్యుడగు హవిర్ధాముడను ప్రజాపతి అతనికి ప్రాచీన బర్హిజనింతురు. అతనికి ప్రచేతసుడు మొదలగు పదిమంది కుమారులు పుట్టుదురు. వారిలో ప్రచేతసుని కుమారుడగు దక్షుడు ప్రజాపతి అగును. దక్షుని పుత్త్రికలు దాక్షాయణులను నక్షత్రములు. ఆదిత్యుని కుమారుడు వైవస్వతమనువు. ఈ వైవస్వతమను వంశమున ఇల అను ఆమెయు సుద్యుమ్నుడును జన్మింతురు. ఇలా కుమారుడు బుధుడు, అతనికి పురూరవసుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, ఆతనికి యయాతి, అతనికి యదువు, అతనికి మహాబలశాలియగు క్రోష్ట, అతనికి వృజినీవాన్, అతనికి పరాజయమునే ఎఱుగని వీరుడగు ఉషంగుడు, అతనికి శూరుడగు చిత్రరథుడు, అతనికి కడసారి కుమారుడుగా శూరుడనువాడు కలుగును. ప్రసిద్ధమగు వీర్యము కలిగి సత్ర్పవర్తనము సద్గుణములు కలిగి యజ్ఞములను ఆచరించిన పవిత్రుల వంశమున జన్మించిన క్షత్రియశ్రేష్ఠుడు మహావీర్యము మహాయశస్సుకల ఆ శూరుడను అతడు తనవంశమును విస్తరింప చేయువాడును అభిమానశాలియు వసుదేవుడని ప్రసిద్ధి పొందినవాడును అగు దుందుభిని కుమారునిగా పొందును. అతనికి కుమారుడు చతుర్భాహుడగు వాసుదేవుడు. యదువంశ సంజాతుడగు దాత-బ్రాహ్మణులను ఆదరించువాడు, బ్రాహ్మణులకు ప్రీతిపాత్రుడు బ్రాహ్మణుల యందు ప్రీతి కలవాడు. గిరి వ్రజమునందలి మగధరాజగు జరాసంధుని, అతడు జయించి అతనిచే బద్ధులై యున్న రాజులను అందఱును విడిపించును. పృథివియందే తనకెదుఱులేని వీర్యవంతుడగు ఆ వాసుదేవుడు, శ్రీకృష్ణుడు సమస్త రాజశ్రేష్ఠులచే ఆశ్రయింపబడును. సమస్త రాజులకు రాజై విక్రమము కలిగి శూరునకు ఉండదగిన దృఢ దేహనిర్మాణము కలిగి ఆ ప్రభువు ద్వారక యందు వసించుచు, చెడుమనస్సు కలవారగు శత్రువుల జయించి భూదేవిని పాలించును. మీరు అతనిని ఆశ్రయించి బ్రాహ్మణులకు చేయదగిన మేలైన పూజలతో శాశ్వతుడగు పరబ్రహ్మ మునువలె శాస్త్ర న్యాయానుసారము అర్చింతురు. లోకపితామహుడగు బ్రహ్మను నన్నును దర్శింపగోరువారు ప్రతాపవంతుడును భగవానుడు అగు వాసుదేవుని దర్శింపవలెను. అతనిని దర్శించుట నన్ను దర్శించుటయే. అందు సందేహములేదు. బ్రహ్మయు వాసుదేవుడే అని ఓ తపోధనులారా! తెలిసికొనుడు. పుండరీకాక్షుడగు వాసుదేవ కృష్ణునకు ఎవరిపై ప్రీతికలుగునో వారి విషయమున బ్రహ్మాది దేవతలందఱు ప్రీతులగుదురు. శ్రీకృష్ణుని ఆశ్రయించిన మానవునకు కీర్తియు స్వర్గమును లభించును. ధార్మికుడు అగు వాసుదేవుడే ఇతరులకు సర్వ ధర్మములను ఉపదేశించువాడగును. ధర్మము ఎఱిగిన వారెల్లరును దేవతలకు ప్రభువు, అచ్యుతుడు-తన్నాశ్రయించినవారిని అధోగతికి పోనీయనివాడు-అగు వాసుదేవునికి నమస్కరింపవలెను. విభుడగు ఆ శ్రీకృష్ణుని ఆసక్తితో అర్చించినచో ధర్మమే లభించును.
మహా తేజస్సు కలవాడును, పురుష శ్రేష్ఠుడును అగు ఆ వాసుదేవుడు ప్రజల హితమును కోరి ధర్మమును ఉద్ధరించుటకై ఋషులను సృష్టించెను. సనత్కుమారుడు మొదలగు ఆ ఋషులు తపోవంతులై గంధమాదన పర్వతమున ఉన్నారు. అందువలన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ధర్మజ్ఞుడును ధర్మ ప్రవచన సామర్థ్యము కలవాడును అగు ఆ వాసుదేవునికి నమస్కరించినచో అతడును వారికి నమస్కరించును. అట్లే తన్నాదరించిన వారిని తానాదరించును. తన్ను దర్శించినవారిని తాను దర్శించును, తన్నాశ్రయించినవారిని తనాశ్రయించును. తన్నర్చించిన వారిని తానర్చించును. ఇట్లు మానవలోకమున సజ్జనులు దోషరహితుడు సద్గుణశాలి అదిదేవుడు పూజ్యుడునగు విష్ణుని విషయమున తపమాచరింతురు. సనాతనుడు, శాశ్వతుడు అగు అదేవుని దేవతలును అర్చింతురు. తమకు తగిన అభయముతో, శరణాగతితో ఆయనను అనుష్ఠించుచు ద్విజులు మొదలగువారు త్రికరణములతో నమస్కరించుచు యగ్నిపూర్వకముగా దర్శనము చేసికొనవలెను. ఓ మునిశ్రేష్ఠులారా! నేను వ్యవస్థచేసిన మార్గము ఇది. సర్వ దేవులకు ఈశుడగు ఆ వాసుదేవుని దర్శించినచో సర్వదేవ శ్రేష్ఠులను దర్శించినట్లే. మహావరాహరూపుడు సర్వలోక సృష్టికర్త జగములకు రక్షకుడు అగు ఆ వాసుదేవుని నేనును నిత్యము నమస్కరించుచుందును. నేను మొదలుగా సమస్త దేవతలును ఆయన దేహమున వసింతుము. కనుక ఆయన దర్శనముచే త్రిమూర్తుల దర్శనము జరుగును. ఆ వాసుదేవుని అన్న వెండికొండల కాంతి వంటి కాంతి కలిగి హలి-హలము ధరించినవాడు, బలుడు అని ప్రసిద్ధుడై భూమిని రక్షించును. అతడు సహస్ర శిరస్కుడగు శేషుడే. దేవుడును ప్రభువును పరమాత్మ రూపుడునగు అతని అంతమును కశ్యపుని కుమారుడును బలశాలియునగు గరుడుడును తన వీర్యముతో చూడజాలక పోవుటచే అతడు అనంతుడు అనబడెను. ఆ శేషుడే సంతోషముతో కూడి భూమ్యంతర్భాగమున భూమిని చుట్టుకొని తన పడగలతో భూమిని ధరించుచు చరించుచు వసించుచున్నాడు. ఆ విష్ణువే ఈ అనంతుడు. అట్లే సర్వ ధరాధరుడగు హృషీకేశుడగు వాసుదేవ కృష్ణుడే ఈ బలరాముడు. ఈ పురుష శ్రేష్ఠులు ఇరువురును దివ్యులు, దివ్య పరాక్రమము కలవారు. చక్రమును నాగలిని ధరించిన ఈ ఇరువురను మీరు అర్చించి పూజించవలెను. ఓ తపోధనులారా! మీకు నేను తెలుపుచున్న అనుగ్రహము ఇదియే. కనుక మీరు ప్రయత్నపూర్వకముగా ఆ యదుశ్రేష్ఠుని పూజించ వలెను. (226)