బ్రహ్మ మహా పురాణము

గోవర్ధన పట్టాభిషేకము

కృష్ణా! కృష్ణా! నేను ఇటకు నీ సన్నిధికి ఎందులకు వచ్చితినో వినుము. ఇది మఱొక లాగున భావింవద్దు. భూభారముదింప ఈ ఇలపై నీవు అవతరించిన నిఖిల ఆధారుడవు. నన్ను గూర్చిన మహోత్సవమునకు భంగమయ్యెనన్న విరోధమున గోకులమును చెఱుప నేను పంపిన కారు మబ్బులచే ఇంత రగడ జరిగినది. నీవు ఆ గిరినెత్తి యాదవులను రక్షించితివి. ఆ వింతను చూచి నేనును సంతుష్టుడనైతిని. దేవతలకు కార్యము దీనిచే నెరవేరినది. నా ప్రయోజనము చక్కగ సిద్ధించినది. నీ రక్షణ పొందిన గోవులు నీ అవతార కారణమునకు కారణమైనవి. ప్రోత్సాహము చేయుటకు నీ వద్దకు వచ్చితిని. గోవిందుడవు నీవే. ఇపుడు ఉపేంద్రుడవును కాగలవు అని ఐరావతము మెడనుండి గంటను చేకొని పవిత్ర జల పూర్ణమైన ఆ గంటచే హరికి అభిషేకము కావించెను. గోప్రేరణచే జరిపిన ఆ గోవర్ధన పట్టాభిషేక వైభవమందు గోవులు హెచ్చుగా చేపిన క్షీరధారలచే, ఆ క్షణమే అభిషేకించి వసుంధరను కూడ పూర్తిగా తడిపినవి. శచీపతి పేరుతో, వినయముతో కృష్ణునిచూచి మఱియు ఇట్లనియె.

“ఈ వైభవమంతయు గోవుల మాటనుబట్టి చేసితిని. ఒక విన్నపము కావించెదను అలింపుము. నా అంశమున ఈ అవనిపై మహాపురుషుడై అర్జునుడు అవతరించి ఉన్నాడు. అతడు తమ రక్షణకు అర్హుడు. భూభారమునందు నీతో చెలిమి చేయగలడు. వానిని నీవు నిన్నువలె కాపాడవలయును” అనగా భగవంతుడు ఇట్లనెను. “భారత వంశమున నీ అంశమున పార్థుడు పుట్టుట నేనెఱుగుదును. వానిని నేను అవని ఉన్నంతదనుక పాలింతును. ఆ అర్జునుని ఎవ్వడును యుద్ధమున గెలువజాలడు. కంసుడు అరిష్టుడు కేశి కువలయాపీడుడు, నరకుడు మఱి ఎందరో కూలిన తరువాత మహాయుద్ధము జరుగ గలదు. దానిచే భూభారము హరింపబడును. అందుచే నీవేగుము. నీ పుత్రునకై నీవు పరితాప పడకుము. అర్జునునికి శత్రువనువాడు ఒక్కడు నా ముందు ఉండబోడు. భారత యుద్ధము జరిగిన తరువాత అర్జునుని కొఱకే నేను యుధిష్ఠిరాదులను క్షేమమున ఉన్న వారిని కుంతికి సమర్పింతును” అని హరి పలుక దేవాధిపతి జనార్దనుని కౌగలించుకొని ఐరావత మెక్కి స్వర్గమునకు పోయెను. కృష్ణుడును గోవులతో గోపాలురతో కూడి గోపికల చూపులచే పవిత్రమైన త్రోవనకు గొల్లపల్లెకు ఏతెంచెను. (188)