జనకుడు వసిష్ఠునితో పలికెను
మీరు ప్రతిపాదించిన క్షర అక్షర తత్త్వముల సంబంధము లోకమున స్త్రీ పురుషుల సంబంధము వంటిదని నేననుకొనుచున్నాను. అన్ని ప్రాణులలోను ఋతు కాలమున సంగమించినపుడు స్త్రీ పురుషులు అన్యోన్య గుణములను ఒకచో చేర్చిననే, మఱియొక దేహి దేహధారణము జరుగుచున్నది. పురుషుని నుండి అస్థిస్నాయుమజ్జలును స్త్రీ నుండి త్వక్ మాంస రక్తములును ఏర్పడి దేహమునకు రూపమును ఈయజాలడు. ఇట్లే క్షరతత్వము అగు ప్రకృతియు అక్షరతత్త్వమగు పరతత్త్వరూప పురుషుడును కలియనిదే ఈసృష్టి జరుగదని వేదశాస్త్ర ప్రమాణములు తెలుపుచున్నవని ఇవే నా అభిప్రాయము. మాకు తమనుండి ఈ తత్త్వము తెలియవలెను. తత్త్వజ్ఞానము వలన మోక్షముకలుగును. మేము మోక్షమును కోరువారము. అనామయమును అజేయమును అజరమును నిత్యమును అతీంద్రియమును అనీశ్వరమును అగు పరతత్త్వమును పొందుట మా కోరిక. కనుక యథార్థ తత్త్వమును మాకు తెలుపుము.
వసిష్ఠుడు జనకునితో పలికెను:
ఓ జనకా! నీవు చెప్పినట్లే విషయ నిర్ణయమునందు వేదశాస్త్రములు ప్రమాణములు. నీవు తత్త్వమును గ్రహింపగల జిజ్ఞాసువు. కాని వేదశాస్త్రములను గ్రంథములుగా అధ్యయనము చేసి ధారణ చేసినందువలన ప్రయోజనము లేదు. వాని యందలి విషయమును ఎఱిగి వివేచనతో తత్త్వ నిర్ణయము చేసినవారు మాత్రమే ఆ ప్రమాణ భూతములగు వేద శాస్త్రము లందలి తాత్త్విక విషయ మిది అని చెప్పగలరు గాని మిగిలిన వారు గ్రంథములను ధారణ చేయుట బరువును మోయుటకు మాత్రమే. నేను తత్త్వమును ఉన్నది ఉన్నట్లుగ చెప్పెదను వినుము. ఈ విషయమున సిద్ధాంతములో యోగులకును సాంఖ్యులకును అభిప్రాయ భేదములేదు. ఈ రెండు దర్శనములును ఒక దానిని మఱియొకటి అనుగమించుచునే-పరస్పర విరోధము లేకుండ విషయమును ప్రతిపాదించుచునే ఉండును. వాటి పరస్పర సమన్వయము నెఱిగినవాడే తత్త్వజ్ఞుడు.
వసిష్ఠుడు ఇంకను ఇట్లు పలికెను:
ద్రవ్యము నుండి ద్రవ్యము, ఇంద్రియము నుండి ఇంద్రియము, దేహము నుండి దేహము, బీజము నుండి బీజము, గుణముల నుండి గుణములు ఉత్పన్నమగును. చతుర్వింశతి తత్త్వ రూపమగు ప్రకృతికంటె అతీతమగు పంచ వింశతితమ, ఇరువది యైదవ, తత్త్వము బీజము. దానికి ద్రవ్యములు ఇంద్రియములు దేహములు, గుణములు అనునవి లేవు. త్వక్కు మాంసము రక్తము మేధస్సు పిత్తము మజ్జ అస్తి స్నాయువు ఈ ఎనిమిదియు స్త్రీ నుండి ఏర్పడినను పురుషుని నుండి ఏర్పడినను ఇవి అన్నియు ప్రాకృతికములు-ప్రకృతి నుండి కలిగినవి. ఇవి అన్నియు లింగములు. హేతువులు-గుర్తులు: పంచ వింశతి తమ తత్త్వమగు ఆత్మ ఇచ్చట ఉపాధిని గ్రహించియున్నదని మనము వ్యవహారమునకై గుర్తించుటకు ఉపపత్తి మాత్రమే. అనగా పర్వతమునకు ఆవల దూరముగా పొగ కనబడగా అచ్చట ఆ పొగ ఉన్న తప్పక ఉండవలసిన అగ్ని ఉన్నదని ఊహించినట్లే ఆయా పనులను చేయుచున్న దేహములో ఈ ఆత్మతత్త్వము ఉన్నదని ఊహించుటకు అవకాశమును ఇచ్చునది లింగము. అంతేకాని ఈ దేహము, ఇంద్రియములు, ధాతువులు ప్రకృతి జనితములే కాని అది క్షరతత్త్వము యొక్క కాని అక్షర తత్త్వముయొక్క కాని వాస్తవ రూపము కాదు. అంతేకాక ఆ క్షరాక్షరాత్మకమగు ఆత్మతత్త్వము నిర్గుణము. నిరింద్రియము నిర్దేహము. ఐనను మాయాకృతమైన అహంకార మమకార ఆవరణముచే సగుణము సేంద్రియము-సశరీరము అగుచున్నది. ఈ ప్రకృతియు మాయాకృతము. అనగా ఈ దృశ్యమగు ఈ ప్రకృతి యంతయు ఆ ఆత్మతత్త్వము యొక్క వ్యక్తరూపము. ఇవిలేని ఆ తత్త్వము అవ్యక్తము. అవ్యక్తము ప్రబుద్ధము-బుద్ధ్య మానము. వ్యక్తమగు క్షర తత్త్వము అప్రబుద్ధము. అదియే ఈ మాయాకృత ప్రకృతి తత్త్వములు ఇరువది నాలుగింటికి అతీతమగు ఇరువదియైదవ తత్త్వము. ఏకత్వము అక్షరతత్త్వము. నానాత్వము క్షరతత్త్వము. ఇది వాస్తవమగు విషయ ప్రతిపాదనము.
జనకుడు వసిష్ఠుని ఇట్లు ప్రార్థించెను:
ఓ ద్విజసత్తమా! ఏకత్వము అక్షరతత్త్వము-నానాత్వము క్షరతత్త్వము అని తాము చెప్పిన విషయము నిస్సంశయముగా నాకు అవగతము కాలేదు. ప్రబుద్ధము-బుద్ధ్య మానము-అప్రబుద్ధము అను నిదర్శనము కూడ నాకు అవగతము కాలేదు. అక్షర క్షరముల వివేచించుకొనుటకు తాము తెలిపిన హేతువులు కూడ నా బుద్ధి అస్థిరమగుటచే దానియందు నిలువలేదు. కావున తాము నాయందలి దయతో అక్షరక్షర తత్త్వములను ఏకత్వ నానాత్వములతో దర్శించవలసిన తీరును ద్వంద్వముల స్థితిని అక్షరతత్త్వము ఆ ద్వంద్వములచే నిరుద్ధము, అడ్డగించబడినది, బాధనొందబడినది, కాని స్థితిని విద్య, అవిద్య, వీని స్వరూపమును సాంఖ్య విధానమునను యోగవిధానమునను తత్త్వమును వివేచించు ప్రక్రియలను బుద్ధ అబుద్ధ స్థితుల వివేచనమును చక్కగా తెలుప ప్రార్థించుచున్నాను” అని అడుగగా
వసిష్ఠుడు జనకునితో ఇట్లు పలికెను:
నీవడిగిన ప్రశ్నకు చాల సంతోషము కలిగినది. ఓ మహారాజా! నీవడిగిన వానిలో యోగశాస్త్రానుసారియగు తత్త్వ వివేచన ప్రక్రియను నీకు తెలిపెదను వినుము. ఈ ప్రక్రియలో ధ్యానమే యోగసాధనకు బలమును చేకూర్చును. ధ్యానము కూడ మనస్సు యొక్క ఏకాగ్రత-ప్రాణాయామము అని రెండు విధములు. ఈ రెండిటిలో ప్రాణాయామము సగుణ ధ్యాన ప్రక్రియ. మానస ఏకాగ్రతా రూపమగు ధ్యానము నిర్గుణమైనది. ఈ రెండు విధములగు ధ్యాన ప్రక్రియల దేనిని సాధన చేయదలచినను ఈ చెప్పబోవు నియమములను తప్పక పాటించవలెను. మూత్ర విసర్జనము మల విసర్జనము నియతములు కావలెను. అందులకై ఆహారమునను నియమము కావలెను. దినమున రెండు మారులు భుజింప రాదు. భగవంతునికి నివేదించిన దానిని తత్పరుడై భుజించవలెను. ఇంద్రియములను ఆయా ఇంద్రియ విషయముల నుండి మరలించి మనస్సు నియమించవలెను. మౌనమును విచారణా శీలత్వమును పూనవలెను. ఆ ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మాత్రమే అని లెక్కించినచో పది మాత్రము. వాటితో మనోబుద్ధులను కూడ చేర్చినచో పండ్రెండు. ఇట్టి ఇంద్రియ నిగ్రహ పూర్వకమగు ధ్యాన ప్రక్రియతో చతుర్వింశతి తత్త్వములకు అతీతమగు తత్త్వమును సాక్షాత్కరించు కొనవలెను. మనస్సును తత్త్వ సాక్షాత్కారమునకై చోదన చేయవలెను. ఆ తత్త్వము అజరము. విశ్వాత్మకము. అదియే జ్ఞేయము-తెలిసికొన-సాక్షాత్కరించు కొనదగినది. ఉన్నత మనస్సు గల సాధకుడు ఆశ్రయించవలసినది ఈ తత్త్వమునే. మఱి దేనిని కాదు. సర్వ సంగములను విడిచి లఘువు-తేలికగా జీర్ణమగు-ఆహారము తినుచు ఇంద్రియములను జయించి రాత్రియొక్క మొదటి జాములోనో కడపటి జాములోనో మనస్సును తత్త్వముపై నిలుపవలెను. కొయ్య మొద్దు వలె నిశ్చలుడై-అనగా స్థిరమగు చిత్తము కలవాడై-విధివిధానముతో ధ్యానము చేసినవాడు యుక్తుడు-యోగసాధకుడు అని చెప్పబడును. అప్పుడు ఆ సాధకుడు ఏమియు వినడు, వాసన చూడడు, చూడడు; స్పర్శమును అనుభవించడు; మనస్సుతో ఏదియు సంకల్పించడు; ఆలోచింపడు, ఎఱుగడు. అప్పుడే ఈ యుక్తుడు, యోగసాధకుడు, ప్రకృతిని స్వాభావిక స్థితియగు, తత్త్వమును పొందెనని చెప్పబడును. ఆ స్థితిలో ఈ ఆత్మతత్త్వము లోకమునందలి దీపమువలె వత్తి నూనె ప్రమిద మొదలగునవి లేకయు ప్రకాశించును. దానికి ఇంద్రియములు మొదలగు వ్యావహారిక చిహ్నములు ఏవియు లేవు. క్రిందికిని పైకిని అడ్డముగాను అన్ని వైపులకును ప్రసరించగలదు; ఆ తత్త్వ దర్శనము కాగానే సాధకుడు ఆత్మ దర్శనముతో కూడిన వాడయ్యెను అనబడును. అతడే హృదయస్థుడగు అంతరాత్మ. అతడే జ్ఞేయుడు, తెలియబడవలసిన వాడు. జ్ఞుడు-అన్నింటిని ఎఱిగిన వాడు. అని నావంటి తత్త్వవేత్తలు చెప్పుదురు. ఆ తత్త్వము పొగలేని అగ్ని వంటిది. కిరణములు ఏ ఆవరణములును లేక వెలుగు సూర్యుని వంటి వాడు. నిర్మలాకాశమున ప్రకాశించు మెఱపు ప్రకాశము వంటివాడు. ఈ తత్త్వమును ధృతిమంతులు-నిశ్చలచిత్తము కల మనీషులు మహాత్ములు బ్రహ్మనిష్ఠులగు బ్రాహ్మణులు తనయందు తన్నే దర్శింతురు. ఈ మహాతత్త్వము తనకు ఏదియు ఉత్పత్తి హేతువు లేనట్టిది. అమృతరూపమైనది. అది అణువులకంటె అణుతరము. మహత్తులకంటె మహత్తరము. అంతట అన్ని భూతముల యందు నిశ్చయముగా నిశ్చలముగా నుండియు కనబడదు-లోకకర్తయగు ఈతడు బుద్ధి అను ద్రవ్యముతో వెలుగు మనోదీపము యొక్క ప్రకాశము సాయమున చూడ సాధ్యమగును. మహా తపస్సునకు ఆవల నుండును. తమో గుణముచే ఆవరింపబడినవాడు కాదు. వేదతత్త్వజ్ఞులగు వారు ఈ తత్త్వమును గూర్చియే “తమసః పరస్తాత్” “తమస్సునకు ఆవల దూరముగా నున్నవాడు” అని చెప్పుచున్నారు. ఇతడు విమలుడు. లింగ రహితుడు-అనగా ఇంద్రియ దేహాది ఉపాధులు లేనివాడయ్యు కలవాడై కనబడుచున్నాడు. ఈ యోగ దర్శనమును అనుష్ఠించినవారు అజరుడు-నాశరహితుడు-అగు పరమాత్ముని దర్శింప గలుగుదురు.
ఇంతవరకును నేను నీకు యోగ దర్శనమును తాత్త్వికముగా తెలిపితిని. ఇక సాంఖ్య, జ్ఞాన, దర్శనమును తెలిపెదను. ఇది పరిసంఖ్యా నిదర్శన రూపమైనది. (ఇదియే సత్యము కాని అది సత్యము కాదు అని చెప్పుట పరిసంఖ్యానము. సామాన్య మానవులకు వ్యవహారములో కనబడుచున్నందున ఈ లోకము సత్యమే అనిపించును. కాని శాస్త్రములలో మాత్రము ప్రపంచము శాశ్వతమగు సత్యముకాదు. పరమాత్మ తత్త్వమే శాశ్వతమగు సత్యమని చెప్పబడుచున్నది. ఈ రెండిటిలో ఏది గ్రాహ్యము? అని సందేహము కలుగును. అట్టివానికి వివేచనా పూర్వకముగా జగత్తు యొక్క సత్యత్వమును నిర్ధారించునది పరిసంఖ్య అదియే సంఖ్య, సంఖ్యా-నిర్ణయ-ప్రధానమైన దర్శనము సాంఖ్య దర్శనము. ఇది మీమాంసాశాస్త్ర ప్రక్రియ ననుసరించిన వివరణము)
ఆ పరమాత్మ తత్త్వము యొక్క వ్యక్త స్థితికి మూలమగు పరమస్థితియే అవ్యక్త స్థితి-ఇదియే ప్రఖ్యానము వ్యక్తత అనబడును. ఇదియు పరమాత్ముని యొక్క ప్రకృతి-స్వాభావిక స్థితియే. కాని ఉత్కృష్టమైనదియు మొట్టమొదటిదియు కావున ‘పరాప్రకృతి’ అనబడును. రెండవదశ మహత్త్వము. ఇదియే వేదాంత దర్శనము నందలి బుద్ధి తత్త్వాత్మకమగు హిరణ్యగర్భుడు అనెడి తత్త్వము. మహత్తునుండి అహంకారము వ్యక్తమగుట మూడవ దశ. అహంకారము నుండి పంచ-సూక్ష్మ అపంచీ కృత భూతములు ఏర్పడుట నాలుగవ దశ. మహత్తు, అహంకారము, మనస్సు, పంచ భూతములు అనెడి ఎనిమిదియు అపరా ప్రకృతి అనబడును. వీని విస్తరణములగు షోడశ వికారములు, విశేష పంచకము, పంచేంద్రియములు మొదలగు భౌతిక సృష్టి యంతయు ఐదవదశ. ఇదియే సాంఖ్య తత్త్వమంతయు.
షోడశ కశ్చ వికారః-అనియు గణశ్చషోడశకః-అనియు చెప్పిన విధమున ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు శబ్ద స్పర్శ రూప రస గంధములు అనెడి తన్మాత్రలు ఐదు మనస్సు మొత్తము పదునారు వికారములు. వీనిలో ఈ ఐదు తన్మాత్రలు స్థూల భూత సృష్టికి మూలము కావున ఐదు విశేషములు వాటిని జీవుడు అనుభవించుటకు సాధనములు కావున ఐదు జ్ఞానేంద్రియములు ముఖ్యములని ఇచట సూచింపబడినదని గ్రహించవలెను.
ఇవి అన్నియు ఏక్రమమున సృష్టింపబడినవో ఆ క్రమమునకు ప్రతిలోమముగా లయము జరుగును. అనగా చివరి చివరిది లయమొంది మొదటి మొదటిది మిగులుచు వచ్చును. ఈలయము అలలు సముద్రములో లయమగుటవంటిది. ఏలయన ఏది ఎచట నుండి జనించునో అది దానియందే లయమొందును. ఇట్లు లయమొందగా కడపటికి మిగిలిన ఆత్మతత్త్వము యోగ సాధనమున తనయందు తన్నుతానుగా చూచును. ఓ రాజ సత్తమా! అపరాపరా ప్రకృతుల సృష్టి ప్రళయ స్వరూప క్రమము ఇదియే. ప్రళయమునకు తరువాత ఏకత్వము. సృష్టి కాలములో నానాత్వము. దీనికి అంతటికిని అధిష్ఠాత అవ్యక్త కూటస్థ తత్త్వము. పరమాత్ముడు తన్నుతాను నానాత్వమున రూపొందించుకొనగా ఏర్పడిన పాంచ భౌతిక దేహము క్షేత్రము. దానిని మహాన్ ఆత్మా-మాయావశమున ఆశ్రయించి అధిష్ఠాతయై యుండును. ఇది ఇరువది ఐదవ తత్త్వము. ఇతడు క్షేత్రమును ఎరుగును. క్షేత్రం, జానాతి, కావున క్షేత్రజ్ఞుడు. వ్యక్తరూపమగు ఈ దేహము అనుపురమున శయనించుటచే, పురి, శేతే, పురుషుడు అనబడును. ఇదియే క్షేత్ర క్షేత్రజ్ఞ వ్యక్తావ్యక్త పరాZపరా ప్రకృతి వివేచన క్రమము ఈ క్షేత్రజ్ఞుడే జ్ఞాత-జానాతి-తెలుసుకొనువాడు. ఈ జ్ఞాతయొక్క స్థితిని ఆధారరముగా చేసుకొని-జ్ఞాత-జ్ఞానము-జ్ఞేయము అను త్రిపుటి ఏర్పడుచున్నది. ఇచట మరియు సూక్ష్మమగు వివేచనా క్రమము ఇది; క్షేత్రజ్ఞుడుగానున్న అవ్యక్త తత్త్వము వ్యక్తమైనట్లు కనబడుచు జ్ఞాత అగును. వ్యక్తతత్త్వములకు అతీతమైన ఇరువదియైదవ శుద్ధతత్త్వము జ్ఞేయము తెలియబడవలసినది. దానిని ఎరుగుట వ్యవహారదశలో జ్ఞానము కాని పరమార్థదశలో ఆ అవ్యక్త శుద్ధ తత్త్వము ఒక్కటి యే జ్ఞానము. అది ఎఱుగుట అనెడి వ్యాపారమునకు పనికి అతీతము అదిచిత్ జ్ఞాన రూపమైనది.
ఓ జనక మహారాజా! వాస్తవమగు జ్ఞానమనగా ఈ పరాప్రకృతిని సాక్షాత్కరించు కొనుటయే. సగుణము నుండి నిర్గుణమును వేరుపరచి తెలిసికొని, అది తానగుటయే. ఈ స్థితిని పొందినవారికి జనన మరణావృత్తి లేదు. క్షరభావము ఉండదు. కావున క్షరా క్షరములు రెండును లోకవ్యవహారము నందలి స్త్రీ పురుషులవలె పరస్పర ఆశ్రయములని నీవనుకొనిన భావమునకు కూడ ఇచ్చట అవకాశము లేదు. ఇదియెరుగక వేరుగా తెలిసికొను మందమతులకు జననమరణ పునరావృత్తి తప్పదు. వారు అవ్యక్తతత్త్వమును వ్యక్తతత్త్వమునుగా చూచుటచే దానినే అనువర్తించుచు వ్యక్త స్థితిలో పడియుండక సంసారమున సంచరించక-తప్పదు. వ్యక్త ప్రపంచము నందలి ఏ తత్త్వమును కానట్టి ఇరువది యైదవదగు అవ్యక్త తత్త్వమును ఎరిగినవారికి భయములేదు. (243)