బ్రహ్మ మహా పురాణము

శ్రీకృష్ణ జన్మాను కీర్తనము

సూతుడు ఇట్లనియె-గాంధారి మాద్రియును, క్రోష్టుని భార్యలు గాంధారి అనమిత్రుని, మాద్రి యుధాజిత్తును దేవమీఢుడు అను ఇద్దరిని కనెను. వారి వంశమే వృష్టి వంశముగా మూడు శాఖలుగా వృద్ధి చెందెను. మాద్రి కొడుకులు వృష్ణి అంధకుడు అనువారు. శ్వఫల్కుడు, చిత్రకుడను వారు వృష్ణి యొక్క కుమారులు.

శ్వఫల్కుడు ధర్మపరుడు. వాని పాలనమునందు వ్యాధి భయము, అనావృష్టి తాపము మొదలైన బాధలు లేకుండెను. ఒకప్పుడు కాశీరాజు పాలించు దేశమునందు ఇంద్రుడు మూడేండ్లు వర్షింపనేలేదు, అపుడు కాశీరాజు శ్వఫల్కుని తనరాజ్యమునకు గొనివచ్చెను. అతడచ్చట మసలిన కారణముచేత హరివాహనుడు (ఇంద్రుడు) వానగురిపించెను. అపుడు శ్వఫల్కుడు కాశీశ్వరుని కుమార్తె గాదిని వివాహమాడెను. ఆమె నిత్యము విప్రునికి గోవును ఇచ్చుచుండెను.

శ్వఫల్కునకు సంతానముగా దాత, యజ్వ (యజ్ఞకర్త), వీరుడు, పండితుడు, అతిథిప్రియుడు, భూరిదక్షిణుడైన అక్రూరుడు, ఉపమద్గువు, మధువు, మందరుడు, అరిమేజయుడు, అవిక్షుతుడు, అంధకరువు, ఆవాహుడు, ప్రతివాహుడును సుందరి అను కన్యయుపుట్టిరి. అక్రూరునకు దేవవర్చస్సుగల ప్రసేనుడు, ఉపదేవుడు అనువారు ఉగ్రసేన యందు ఉదయించిరి. వృష్టి కుమారుడగు చిత్రకునకు పృధువు, వివృధువు, అశ్వగ్రీవుడు, అశ్వబాహువు, స్వపార్శ్వుడు, గవేషణుడు, అరిష్టనేమి అశ్వుడు, సుధర్ముడు, సుబాహువు, బహుబాహువు అనుకుమారులును శవిష్ఠ, శ్రవణ అను కుమార్తెలు పుట్టిరి. దేవమీఢుడు అసిక్నియందు శూరుడను వానినికనెను. శూరునకు భోజ్య యందు పదిమంది శూరులైన వారు ఉదయించిరి. తరువాత దుందుభి అను పేరున వర్ధిల్లిన వసుదేవుడు ముందుగ పుట్టెను. అతడు పుట్టగానే అకాశములో అనకములోనెడి వాద్య విశేషములు దుందుభులు మ్రోగినవి. పుష్పవృష్టి గురిసెను. వసుదేవునితో సముడయిన అందగాడు ఈ లోకమున లేడు. అతడు చంద్రునివంటి కాంతితో తేజరిల్లెను.

ఈయనకు దేవభాగుడు, దేవశ్రవుడు, అనాధృష్టి, కనవకుడు, వత్సవానుడు, గృంజముడు, శ్యాముడు, శమీకుడు, గండూషుడు అను కుమారులు. పృథుకీర్తి, పృథ, శ్రుతదేవ, శ్రుతశ్రవ రాజాధిదేవి అను అయిదుగురు కూతురులు వీరపత్నులు గల్గిరి. శ్రుతశ్రవయందు చైద్యుడు శిశుపాలుడనుపేర కల్గెను. ఇతడే క్రిందటి జన్మమున దైత్యపతి హిరణ్యకశిపుడు. వృద్ధశర్మ వలన పృధకీర్తియందు కరూశాధిపతియైన దంతవక్త్రుడు పుట్టెను. కుంతి అనురాజు పృథను కుమార్తెగా పెంచుకొనెను. ఆమే పాండవుల తల్లి కుంతి. ఆమెను పాండు రాజు పెండ్లాడెను. ఆమె అందు యముడే ధర్మవేత్తయైన ధర్మరాజై (యుధిష్ఠిరుడు) ఉదయించెను. వాయువువలన భీమసేనుడు కల్గెను. ఇంద్రుని వలన అప్రతి రథుడు, ఇంద్రపరాక్రముడు అయిన ధనంజయుడు (అర్జునుడు) ఉదయించెను. కనిష్ఠుడయిన అనమిత్రుడను వృష్టి కుమారునికి శినియను వాడుకల్గెను. శిని కొడుకు (శైనేయుడు) సత్యకుడు సత్యకుని కుమారుడు యయుధానుడు (సాత్యకి), దేవభాగునకు మహానుభావుడగు ఉద్ధవుడు ఆవిర్భవించెను. దేవశ్రవుని పండితాగ్రణి అందురు, దేవశ్రవుడు కీర్తిశాలియగు అశ్మక్యుడను సుతునిబడసెను. అనాధృష్టిని కృత్తశత్రువను కుమారుని, శ్రుతదేవ అను ఆమె శత్రుఘ్నుని కనెను. శ్రుతదేవ కుమారుడు ఏకలవ్యుడు నిషాదుని పెంపకములో పెరిగెను. వత్సవంతునకు పుత్రులులేని కారణముచేత శౌరి (శూరవంశము వాడగు వసుదేవుడు) తన కుమారుని కౌశికుని ధారాదత్తము చేసెను. అపుత్రకుడైన గండూషునకు విష్వక్సేనుడు తన కుమారులగు చారుదేష్ణుడు, సుధేష్ణుడు, పంచాలుడు, కృతలక్షణుడు అను వారినిదత్తత ఇచ్చెను.

చారుదేష్ణుడు యుద్ధమునకేగి ఎన్నడు వెనుదిరిగినవాడు గాడు అతడు రుక్మిణీ తనయులందు కడగొట్టువాడు, మహావీరుడు. అతడు యాత్రకు పోవునపుడు చారుధేష్టునిచే హతులైనవారిని (చారూన్ అనగా రుచిగ ఉన్నవారిని) ఇప్పుడు తినవలయునని వేలకొలది కాకులు అతని వెంట పోయెడివట. కనవకునికి తంత్రిజుడు, తంత్రిపాలుడు అను ఇద్దరు కల్గిరి. కంజమునికి వీరువు అశ్వహనువు గల్గిరి. శ్యామపుత్రుడగు శమీకుడు రాజ్యమేలెను. భోజవంశమున జనించుటచే ఏవగించువాడైనను రాజసూయమొనర్చెను. అతనికి శత్రునాశకుడగు అజాతశత్రువు గల్గెను. ఇక వసుదేవుని సంతానము తెల్పెదను. వృష్ణి యొక్క (వృష్ణి అంధకభోజ) త్రిశాఖమైన (మూడు శాఖలైన) ఈ వంశము యొక్క చరిత్ర ధారణము చేయు వాడు వంశాభివృద్ధిని పొందును అనర్ధములను బాయును.

పురు వంశమున పుట్టిన పౌరవి, రోహిణి, మధిరా, ఆది, వైశాఖి, భద్ర, సునామ్నీ, సహదేవ, శాంతిదేవ, శ్రీదేవి, దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, దేవకి అని. వసుదేవుని భార్యలు పదునల్లురు. సుతనువు బడబ అనువారిరువురు పరిచారికలు. పౌరవి, రోహిణియు బాహ్లికుని కుమార్తెలు. వసుదేవుని పెద్దభార్యకు రాముడు, శరణ్యుడు, శరుడు, దుర్దముడు, దమనుడు, శుభ్రుడు, పిండారకుడు, ఉశీనరుడు, చిత్ర అను కూతురు కల్గిరి. మొత్తం వీరు తొమ్మండుగురు. చిత్రయే సుభద్రయను పేరుతో గూడ ఖ్యాతి గాంచినది. వసుదేవునికి దేవకీయందు శౌరి (కృష్ణుడు) అవతరించెను. రామునికి రేవతియందు నిశఠుడను, ప్రియపుత్రుడు ఉదయించె. పార్ధునికి సుభద్రయందు రథికుడగు అభిమన్యుడు కల్గెను. అక్రూరునికి కాశికన్యయందు సత్యకేతువు జనించె. వసుదేవుని ఏడ్గురు భార్యలందు కలిగిన శూరుల క్రమమిది. శాంతిదేవకు భోజుడు విజయుడు అను ఇద్దరు కల్గిరి. సునామయందు వృకదేవుడు, గదుడుకల్గిరి. వృకదేవికి అగావహుడు పుట్టెను.

త్రిగర్తరాజు కూతురు శిశిరాయణి యొక్క భార్య గార్గ్యమునివర్యుని పౌరుషపరీక్షకు పూనుకొనెను. కాని అతని వీర్యము స్ఖలనముకాలేదు. పన్నెండవ సంవత్సరమున పరిహసితుడైన ఆముని ఒక ఘోషకన్యతో మిథున క్రీడకు ఉపక్రమించెను. ఆ ఘోషాంగన ఘోషవేషధారిణియైన గోపాలి అను ఒక అప్సరస. గోపకన్యా వేషము ధరించి, ధరింప అలవికాని అతని గర్భమును (శిశువును) ధరించెను. మనుష్య స్త్రీయైన ఆగార్గుని భార్యయందు శివుని ఆజ్ఞచే సింహమువంటి మహాబలశాలి కాలయవనుడనువాడు పుట్టెను. వాని పూర్వకాయము వర్తులాకారము సింహమువంటి ఆకారము గల్గియుండెను. ఆపుత్రకుడైన యవనరాజు యొక్క అంతఃపురమునవాడు పెరిగెను. అందువలన యవనునికి వాడు కుమారుడయి కాలయవనుడు అన ఒప్పెను. వాడు యుద్ధ కుతూహలముగొని యేరితో తలపడుదునని యడుగగా దేవర్షి నారదుడు వృష్టి-అంధక కులములను జెప్పెను. అక్షౌహిణిసేనతో వాడు మధురపై దండెత్తి పోయి దూతను పంపెను. అపుడు వృష్ణ్యంధకులు మహామతియైన కృష్ణుని పురస్కరించుకొని పోయి కార్యాలోచనచేసి ఒక నిశ్చయమునకు వచ్చి, పారిపోవుటకు అంగీకరించిరి. పినాకపాణియైన శివుని అభిప్రాయమును గౌరవించి మధురను వదలి కుశస్థలికి, ద్వారకనుచేరి నివాసము చేయనెంచిరి. ఇది శ్రీకృష్ణ జన్మ వృత్తాంతము. శుచియై ఇంద్రియములను నియమించుకొని పర్వములందు వినిపింపవలెను. అట్లు వినిపించిన విద్వాంసుడు ఋణములను బాసి సుఖియగును. (14)