వృష్టి వంశ వర్ణనము

లోమహర్షణ సూతుడు మునులతో ఇట్లు అనెను-

క్రోష్టునికి వృజినీవంతుడు పుట్టెను. వానికి స్వాహి జన్మించెను. అతడు యజ్ఞకర్తలలో శ్రేష్ఠుడు. స్వాహి కుమారుడు ఉషద్గువు. అతడు సంతతి కొఱకు భూరిదక్షిణములైన యజ్ఞములుచేసి చిత్రరథుడను కుమారుని పొందెను. అతడు మంచికర్మిష్ఠి. వాని కుమారుడు శశబిందువు యజ్వు. విపులదక్షిణుడు. రాజర్షుల వర్తనము అనుష్టించినవాడు. శశిబిందుని నందనుడు పృధుశ్రవుడు యశస్వి రాజయ్యెను. పురాణవీదులాతని కుమారుని అంతరుడని చెప్పుదురు.

ఈతనికి సుయజ్ఞుడు ఉదయించెను. వానికి ఉషతుడు కల్గెను. అతడు స్వధర్మాదరుడు. వానికి కొడుకు శినేయుడు. శత్రు తాపనుడు అతడు. వానితనూజుడు మరుతుడు. అతడు రాజర్షి. వాని జ్యేష్ట సుతుడు కంబల బర్హిషుడు. అతడు ప్రేత్య భాక్కయ్యు (మరణోన్ముఖుడై కూడ) ఉత్తమ సంతతిగల కుమారుడు కావలెనని గొప్ప ధర్మానుష్ఠానమును కోపముతో గావించెను. నూర్గురు పుట్టిన తరువాత అతనికి ఉత్తముడగు కుమారుడు ఒక్కడు ఉదయించెను. అతడు రుక్మకవచుడు. అతడు కవచధారులైన నూర్గురు ఉత్తమనుష్కులను రణమునందు వాడియైన బాణములతో చంపి, అత్యుత్తమ శ్రీలాభమందెను. వానికి శత్రుసంహారకుడగు పరాజిత్తు, వానికి రుక్మేషువు, పృధురుక్ముడు, జ్యామఘుడు, పాలితుడు, హరి అను మహావీరులు పుట్టిరి. పరాజిత్తునికి ఐదుగురు సుతులు ఉదయంచిరి. తండ్రి పాలితుని, హరిని విదేహరాజులకు ఇచ్చెను. పృథురుక్కుని ఆశ్రయమున రుక్మేషుడు రాజయ్యెను. వారిద్దరిచే పంపబడిన జ్యామఘుడు, ఆశ్రమమందుండెను. అతడు బ్రాహ్మణులచే లెస్సగ బోధింపబడి, ఏకాకియై ధనుస్సుపట్టి ధ్వజము, రథముగొని మరియొక దేశమునకు ఏగెను. నర్మదా తీరమున ఒంటరిగా తిరుగుచు, ఋక్షవంతమను గిరిని గెలిచి శుక్తిమతీ నగరమునందు వసించెను. వాని భార్య శైబ్య. బలశాలిని, పతివ్రత, సంతానము లేకున్నను, అతడు మఱియొక భార్యను జేసికొనలేదు.

అతనికి ఒకానొక యుద్ధమందు జయము గల్గెను. అందొక కన్యను కానుకగా బడసెను. ఆమెనువెంటగొని భార్యదరికేగి భయముతో “కోడలిదిగో” అని చూపెను. ఆమె ఎవరి కోడలు? యని ప్రశ్నించెను. ఆ మాటను వినిన జ్యామఘుడు ఇట్లనెను.

నీకు పుట్టబోవు కుమారునికిది భార్య అనెను. సూతుడు ఇట్లంతయు చెప్పిన మరియు ఇట్లనియె-

ఆ కన్య ఉగ్రమైన తపస్సు చేసెను. ఆ తపఃఫలముగా శైబ్య విదర్భుడను కుమారుని కనెను. విదర్భుడు ఆ రాజ పుత్రికయందు క్రధకైశికులు, అనుశూరులు విద్వాంసులు అగు ఇద్దరు కుమారులను గాంచెను, వారు రణవిశారదులు. విదర్భుని కుమారుడు భీముడు, వాని తనయుడు కుంతి. వాని కొడుకు ధృష్టుడు. అతడు రణధృష్టుడు. ప్రతాపశాలి. వాని కొడుకులు ముగ్గురు, శూరులు, పరమధార్మికులు. అవంతుడు, దశార్హుడు, విషహరుడు. దశార్హసుతుడు వ్యోముడు, వాని కొడుకు జీమూతుడు, వాని తనయుడు వికృతి. వాని కుమారుడు భీమరథుడు, నవరథుడు. నవరథుని పుత్రుడు దశరథుడు, వాని కుమారుడు శకుని. శకుని సుతుడు కరంభుడు, కరంభుని తనయుడు దేవరాతుడు, వాని పుత్రుడు దేవక్షత్రుడు. వాని సుతుడు వృద్ధక్షత్రుడు. వృద్ధక్షత్రనందనుడు, దేవపుత్ర సముడు, మధువుల వంశమునకు కర్త, మధురముగా మాట్లాడెడివాడు మధువనువాడు, అతనికి వైదర్భియందు పురుషోత్తముడగు పురుద్వంతుడనువాడు ఉదయించెను. మధునికి ఇక్ష్వాకి (ఇక్ష్వాకు వంశజాత) అను భార్యయందు సర్వగుణోపేతుడు సాత్వత కీర్తివర్ధనుడగు సత్త్వంతుడు అనువాడు పుట్టెను. అతడు స్త్వాతులు అను పేరు తెచ్చినవాడు. మహాత్ముడగు జ్యామఘుని విసృష్టిని విన్నవాడెప్పుడు పరమ ప్రీతినందును ప్రజావంతుడు (సంతానము కలవాడు) అగును.

అని చెప్పి ఇంకను సూతుడు ఇట్లు అనెను.

సత్త్వంతునివలన కౌసల్య అను నామె బలశాలురగు భాగి, భజమానుడు, దివ్యుడు దేవావృథుడు, అంథకుడు యదునందనుడగు వృష్టి అనువారలను కనెను. వారి విశేష సృష్టుల నాల్గింటిని విస్తరించి వర్ణించితిమి. భజమానునికి సృంజయ కుమార్తెలు బాహ్యక ఉపబాహ్యక అను భార్యలుండిరి. వారికి పెక్కురు పుత్రులు కల్గిరి. క్రిమి, క్రమణుడు, ధృష్టుడు, శూరుడు, పురంజయుడు. వీరు బాహ్యక కుమార్తె సృంజయయందు భజమానునకు జన్మించిరి. అయుతాజిత్తు, సహస్రజిత్తు, శతాజిత్తు దానకుడు అనువారు ఉపబాహ్యక సృంజయియందు కల్గినవారు.

దేవపృథుడు యజ్వ, తపస్వి. నాకుగుణశాలి అయిన కుమారుడు కావలెనని తపోనిష్టగొని పర్ణాశానదీజల మాచమించి, తపమాచరించుచుండెను. ఆ నదికి సదా తనయందు స్నానము చేయునాతని పై ప్రేమ కలిగెను. కాని ఏలాటి ప్రియ మాచరించుట అను ఆలోచనలో ఒక నిశ్చయమునకు రాజాలదయ్యెను. ఈరాజు కల్యాణగుణుడు. ఈతని కీడైన కల్యాణి ఎవ్వతె? ఇతడు కోరిన గుణశాలి కుమారుడు ఉదయింపవలెనన్న ఏలాటి ఉత్తమ కన్య ఇతనికి పత్ని కావలెను? అని ఏమేమో తనలోతాను గుణించుకొని తుదకు నేనే యేగి ఈతనికింతిని అగుదునని పరమసుందర రూపముధరించి ఆనృపతిని వరించెను. ఆమెను ఆ ప్రభువు ఇష్టపడెను.

ఉదారమతియగు ఆనృపతి ఆసతియందు తేజస్వియైన గర్భముంచెను. పదియవ నెలలో ఆమె సర్వకల్యాణ గుణనిధియగు బభ్రుదేవావృథుడను కుమారుని ప్రసవించెను. ఈతడు యేడువేల ఇరువది ఆఱుగురు పురుషులకు అమృతత్వ మొందించెను. యజ్వ, దానవతి, ధీమంతుడు బ్రహ్మణ్యుడు, దృఢాయుధుడునైన ఈ బభ్రుని (దేవావృధుని) వంశమున భోజులు సార్తికావతులని ప్రసిద్ధులైరి. కాశ్యప దుహిత అంధకుని వలన నల్వురగనెను. వారు కుకురుడు, భజమానుడు, సనకుడు, బలబర్హిషుడు. కుకురుని తనయుడు వృష్టి, వాని కొడుకు కపోతరోముడు. వానివాడుతివిరి. వానిసుతుడు పుశర్వనువు వానికి అభిజిత్తు వానికి ఇద్దరు పుత్రులు ఆహుకుడు, శ్రాహుకుడను అను ప్రసిద్ధి చెందిన వారు. ఆహుకునిగూర్చి పూర్వులు ఈ క్రింది గాథను ఉదహరింతురు.

శ్వేతపరివారముతో గూడి (తెల్లవాళ్ళతో) పసివానివలె అహుకుడు ఎనుబది. కవచముల దాల్చి మొదట పోవును. పుత్ర సంతానము లేనివాడు, నూరువేలేండ్లు అయుర్దాయము లేనివాడు, అపవిత్ర కర్ముడు. యజ్వ కానివాడు, భోజరాజు వెంట ఉండరాదు. భోజునికి ఏనుగులు పదివేలు, ధ్వజములు కవచము ధరించినవారు పదివేలమంది. మేఘ ఘోషములుగల రధములు పదివేలు, బంగారు వెండి ఎనుబోతులు ఇరువది యొక్కటిగా తూర్పు దిక్కునపోయెడివి. ఉత్తరమున అటులనే ఏగెడివి. భోజ వంశీయ రాజులందరు వింటి నారియే చిరుగంటగ మ్రోగించినట్టివారు. అనగా మహాయోధులు. మరియు అంధక వంశీయులు తమ తోబుట్టువును అవంతీయులకు ఇత్తురు అని ఆ గాథ.

ఆహుకునికి కాశ్యపి అనునామె యందు దేవకుమారులను పోలిన దేవకుడు, ఉగ్రసేనుడనువారు ఇద్దరు కుమారులు కల్గిరి. దేవకుని కుమారులు నల్గురు. దేవవంతుడు, ఉపదేవుడు, నందేవుడు, దేవరక్షితుడు అనువారు. కుమార్తెలు ఏడుగురు. అతడు వారిని వసుదేవునికిచ్చి పెండ్లి చేసెను. వారు దేవకి, శాంతిదేవ, సుదేవ, దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, సునామ్నిని అనువారు. ఉగ్రసేనుని కొడుకులు తొమ్మండ్రు. కంసుడు, న్యగ్రోధుడు, సునాముడు, కంకుడు, సుభూషణుడు, రాష్ట్రపాలుడు, సుతనువు, అనావృష్టి, పుష్టిమంతుడు అనువారు. వారి చెల్లెండ్రు అయిదుగురు. కంస, కంసవతీ, సుతనువు, రాష్ట్రపాలి, కంక అనువారు. ఇది కుకుర వంశీయుడైన ఉగ్రసేనుని అతడి సంతతితో గూడిన వర్ణన. ఎవరు మిక్కిలి తేజశ్శాలురైన కుకురుల వంశమును విని ధారణ చేయునో అతడు వంశాభివృద్ధినంది సుఖించును. (15)