స్యమంతక ప్రత్యానయనము

సూతుడు ఇట్లు అనియె-

భజమానుని సుతులు రథముఖ్యుడు, విదూరథుడు అనువారు విదూరథుని కుమారుడు వీరుడగు రాజాధిదేవుడు. వానికి దత్త, అతిధత్త, శోణాశ్వ, శ్వేతవాహన, శమి, దండశర్మ, దంతశత్రు, శత్రుజిత్తులు అనువారు సుతులు. శ్రవణ శ్రవిష్ఠ అను కుమార్తెలు కలిగిరి. శమి కుమారుడు ప్రతిక్షత్రుడు, వానికి స్వయంభోజుడు, వానికి భదికుడు కల్గిరి. వాని కుమారులు భీమ పరాక్రమములు. వారిలో కృతవర్మ జ్యేష్ఠుడు. శతధన్వుడు మధ్యముడు. దేవాంతకుడు, నరాంతుడు, భిషక్కు పైతరుణుడు, సుదాంతుడు, అతిదాంతుడు, నికాశ్యుడు, కామదంభకుడు అనువారు కలిగిరి. దేవాంతకుని పుత్రుడు విద్వాంసుడగు కంబల బర్హిషుడు. వాని కొడుకులు అసమౌజుడు నాసమేజుడు అనువారు. పుత్ర సంతతిలేని అసమౌజనునికి సందష్ట్రుడు, సుచారువు, కృష్ణుడు అను కుమారులను అంధకుడు ఇచ్చెను. వారు అంధకులను పేరందిరి.గాంధారి మాద్రి కోష్టునియొక్క భార్యలు. గాంధారి తనయుడు మహాబలశాలి యగు అనమిత్రుడు. మాద్రి తనయుడు యుధాజిత్తు దేవమీఢుడు ఇతడు శత్రువులకు గూడ మిత్రుడు. శత్రుజేతయగు అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. వాని కొడుకులు ఇద్దరు. ప్రసేనుడు సత్రాజిత్తు, వీరు శత్రుసేనలను జయించినవారు.

సత్రాజిత్తు ప్రసేనుడు ద్వారవతిలో నుండెను. శ్యమంతకమను దివ్యమణిని సూర్యో పాసనచేసి సూర్యుని నుండి పొందెను. అతనికి సూర్యుడు ప్రాణ సమానుడైన మిత్రుడు. అతడొక నాడు వేకువజామున రథమెక్కి ఒక జలాశయమునకేగి స్నానముచేసి సూర్యోపస్థానము చేయుచుండగా సూర్య భగవానుడు ఎదుట స్పష్టమైన మూర్తితో తేజోమండల అకారముతో సాక్షాత్కరించెను. రాజు ఆయనను చూచి ఇట్లనెను. “గగనము నందు నిత్యము నిన్నెట్లు చూచుచున్నానో అట్లే తేజోమండలాకారమున ఇపుడు ఎదుట చూచుచున్నాను. జ్యోతిస్సులకెల్ల అధిపతివి నీవు. నీతో ఇట్లు చెలిమి నొందిన నాకు నీవలన గలుగు విశేషమేమి?” అని అడుగగా,

దీనిని విని ఇనుడు తన కంఠమునుండి తీసి స్యమంతకమణిని ఏకాంతమున నుంచెను. అంతట భానుని సాకారముగ ఆ రాజప్పుడు దర్శించెను. మఱియు అతనితో ముహూర్తకాలము సంప్రీతితో ప్రసంగించెను. అటుపై భాస్కరుడు బయలుదేరబోవు సమయమున ఆ ఱేడు ప్రభూ! ఏ రత్నము దాల్చి నీవు లోకములన్నిటిని ప్రకాశింప జేయుచున్నావో ఆ మణిరత్నమును నాకు దయచేయుమని కోరెను. సూర్యుడును అమ్మణిని ఆ రాజశిఖామణికి ఇచ్చెను. ఆ మణిని ధరించి సత్రాజిత్తు రాజధానిలో ప్రవేశించెను. ఆ పురజనులు అంతట ఇడుగో సూర్యుడు అవనికిదిగి వచ్చుచున్నాడని ఆ రాజును చూచి పరుగిడిరి. అట్లు రాజు పట్టణ మంతటిని ఆశ్చర్యమునముంచి అంతఃపురమునకు పోయెను. ఆ రత్నమును ఇక్కడ తన తమ్ముడు ప్రశేనజిత్తునకు ప్రీతితో ఇచ్చెను. ఆ మణి యావృష్ట్యంధకుల ఇంట బంగారమును వర్షించుచుండెను. అది వచ్చిన తరువాత మేఘుడు సకాలమున వర్షించుచుండెను. అందెందును వ్యాధిభయములు లేకపోయెను. గోవిందుడు  ప్రసేనుని మణిరత్నమును దీసికొననెంచెను. కాని అతడు శక్తుడయ్యు దానిని గైకొనలేదు. దానిని ధరించి ఒకప్పుడు ప్రసేనుడు వేటకుపోయి ఆ మణిని చూచి బెదరి మీదపడిన సింహము నోటబడి మృతిచెందెను. అయ్యెడ అప్రసేనుని చంపి పారిపోవు మృగరాజు (సింహము)ను ఋక్షరాజు (ఎలుగుబంటి) సంహరించి ఆ రత్న రాజమునుగొని తనగుహ జొచ్చెను. వృష్ణ్యంధకులయ్యెడ ప్రసేనుడు హతుడవుటవిని, అంతకు ముందు ఆ మణిని ఇమ్మని కోరియున్నందున ఇది కృష్ణుని పనియేమోయని శంకించిరి. అట్లు తనను అనుమానించుట ఎరిగి అపని తాను చేయకున్నను వచ్చిన అపవాదు తొలగించుకొన నిశ్చయించుకొని హరి ఆ మణిని వెనుకకు తెచ్చెనని ప్రతినచేసి అరణ్యమునకు వెళ్ళెను.

ప్రసేనుడు వేటాడిన తావునందు అతని అడుగుజాడలను, ఆప్తజనము వలన విని గుర్తించి, ఆజాడనుబట్టి పోయిపోయి వింధ్యపర్వతమున వెదకి వెదకి, అలసి సొలసి తుదకు ఋక్షవంతమను గిరియందు గుఱ్ఱముతోగూడ కూల్చబడిన ప్రసేనుని చూచెను. కాని మణిని మాత్రము కానడయ్యెను. ప్రసేనుని శరీరమునకు దగ్గర భల్లూకముచే హతమై పడియున్న సింహమును చూచెను. అడుగుల గుర్తులనుబట్టి ఆచంపినది భల్లూకమని మాత్రము గ్రహించెను. అట్లే పయనించి అల్లంతలో ఒక గుహను చూచెను. ఆ ఎలుగుబంటి బిలమందు (కొండగుహ) నుంచి ఒక సుందరి ఏడుపు వినవచ్చెను. అచ్చట ఒకదాది జాంబవంతుని తనయుని ఒక బాలుని ఎత్తుకొని స్యమంతకమణిని చూపుచు, ఆడించుచున్న దానిని చూచెను.

ఆ దాది పిల్లవానిని ఓదార్చుచు-

సింహః ప్రశేన మవధీత్ సింహో జాందవతా హతః |

సుకుమారక! మారోదీ స్తవ హ్యేష స్యమంతకః ||

సింహము ప్రసేనుని చంపినది. ఆ సింగము జాంబవంతునిచే చచ్చినది. ఓ సుకుమారుడా! ఏడువకు ఈ స్యమంతక మణి నీదే సుమా! అని దాది అనుచున్న మాటలను విని ఆ మాటలు పలికిన వ్యక్తిని బట్టి హరి వెనువెంటనే బిలమునందు ప్రవేశించెను. కృష్ణ భగవానుడు బిలద్వారమందు బలరామునితోగూడ యాదవులను ఇక్కడ ఉండుడని నిలిపి శార్ఙ ధనుస్సునుపూని, లోనికి పోయి జాంబవంతుని చూచెను. ఆ గుహయందు వాసుదేవుడు అతనితో యుద్ధము చేయుచు ఇరువది యొక్క రోజులు బాహు యుద్ధమున గడిపెను.

కృష్ణుడు బిలమందు ప్రవేశించిన తరువాత అతని జాడ తెలియక బలరామాదులు ద్వారవతికేగి కృష్ణుడందు హతుడయ్యెనని తెలిపిరి. వాసుదేవుడో, జాంబవంతుని గెలిచి, ఆ ఋక్షాధిపతి (ఎలుగుబంటుల రాజు) యొక్క తనయను జాంబవతిని పొంది తన అపవాదుపోవ ఎలుగుల రాజును అనునయించి స్యమంతక మణినిగైకొని ఉపాయమున, ఆ గుహనుండి వెలువడి అవలకేగెను. ఆయనతో విధేయులయిన పరివారము వెన్నంటి వచ్చిరి. ఇట్లు మణినిగొనివచ్చి, ఆత్మవిశోధనము చేసికొని సర్వసాత్వత జనసమావేశ మందు దానిని ఆతడు సత్రాజిత్తునకు ఒసంగెను. అరిజన సంహారియైన హరి లేనిపోని అపవాదునకు గురియై ఈ విధముగా తనపై వచ్చిన ఆ అపవాదును పోగొట్టుకొనెను.

సత్రాజిత్తు భార్యలు పదిమంది. వారియందు నూర్గురు కుమారులు ఉదయించిరి. అందు ప్రఖ్యాతిగలవారు ముగ్గురు. అందు అగ్రజుడు, భంగకారుడనువాడు, వాని తరువాతి వారు. వాతపతి, వసుమేధుడు, కూతురులు ముగ్గురు. వారిలో సత్యభామ ఉత్తము (పెద్దదన్న మాట) రెండవది ఉత్తమ వ్రతాచారపరాయణ యగు ప్రతిని, మూడవ కుమార్తె ప్రస్వాపిని అనునది. వారిని సత్రాజిత్తు కృష్ణునకు ఇచ్చెను. భంగకారి కొడుకులు ఇద్దరు. కీర్తిమంతులు, రూపవంతులు సభాక్షుడు, నావేయుడనువారు. (క్రోష్టు భార్యయగు) మాద్రి యందు గల్గినవాడు వృష్ణి పుత్రుడు, యుధాజిత్తు. వృష్ణి కుమారులు శ్వఫల్కుడు, చిత్రకుడు అని ఇద్దరు. శ్వఫల్కుడు, కాశిరాజ తనయను పెండ్లాడెను. ఆమె పేరు గాందిని. ఆమె తండ్రి ఆమెకు గోవులను ఎప్పుడు ఇచ్చెడువాడు (అందుచే ఆపేరు ప్రఖ్యాతికి వచ్చినది) ఆమె యందు పండితుడు, అతిథి ప్రియుడు మహావీరుడు బహుదక్షిణ ఇచ్చువాడు మహానుభావుడగు అక్రూరుడు ఉదయించెను. శ్వఫల్కునికి అక్రూరుడేగాక ఉపమద్గువు, మద్గువు, మదురుడు, అరిమర్దనుడు, ఆరిక్షేపుడు, ఉపేక్షుడు, అరిమేజయుడు, ధర్మపరుడైన ధర్ముడు, గృధ్రభోజుడు, అంధకుడు, అవాహుడు, ప్రతివాహుడు అనువారును సుందరియగు వసుంధర అను కుమార్తె కలిగిరి. వసుంధర విశ్రుతాశ్వుని వివాహమాడి పట్టమహిషి అయినది. అక్రూరునికి ఉగ్రసేనయందు కులనందనులైన నందనులు ఇద్దరు కల్గిరి. వసుదేవుడు, ఉపదేవుడు అనువారు. దేవవర్చస్కులు. చిత్రకుని కుమారులు పృథువు, విసృథువు, అశ్వగ్రీవుడు, అశ్వబాహుడు, సుపార్శ్వకుడు, గవేషణుడు, అరిష్టనేమి, ధర్ముడు, ధర్మభృత్తు, సుబాహువు, బహుబాహువు అను పుత్రులు. శ్రవిష్ఠ, శ్రవణ అను కూతుళ్లు కలిగిరి. కృష్ణుని ఈ అపవాద వృత్తాంతము విన్నవానికి ఎన్నడును ఆపదల స్పర్శ ఉండదు. (16)