బ్రహ్మ మహా పురాణము

వామనావతారము

నృసింహుని గురించి చెప్పితిమి. ఇక వామనుని గురించి వినుడు. బలి యజ్ఞమందు బలశాలియైన విష్ణువుచే మూడడుగులచే మహాసురులు సంక్షోభింపజేయబడిరి. విప్రచిత్తి, బృహత్ కీర్తి మొదలు శంబరుడు దాక గల రాక్షసులు శతఘ్ని చక్రముసలములు ధరించి, అశ్వ యంత్రములు పూని, బిందిపాల శూల ఉలూఖలములు జేపూని, పరశ్వధములూని, పాశముద్గర పరిఘాయుధములు గొని పెద్దబండలుగొని యుద్ధమునకు నడిచిరి. వారి ముఖములు తాబేలువలె కోడివలె, గుడ్లగూబలవలె ఉండెను. కొందరు గాడిదలు ఒంటెలు పందులు పిల్లులు నెమళ్ళ వంటి ముఖములు గలవారు. మొసళ్ళు మేకలు ఎడ్లు గొర్రెలు గేదెలు దున్నపోతులవంటి మొగములతో ఉండిరి. ఉడుము ముఖము కొందరిది. చుంచులు కప్పలను తోడేళ్ళను పోలినవారు కొందరు. అశ్వముఖులు క్రౌంచ ముఖులు (బెగ్గురు పక్షులు) మయూరముఖులు కొందరు. కొందరు గజచర్మము కృష్ణాజినము ధరించిరి. నల్లని బట్టలు కట్టుకొనిరి. కొందరు తలపాగలు, కొందరు కిరీటములు ధరించిరి. కొందరికి కుండలములు ఉన్నవి. జుట్టు విరబోసికొనిరి కొందరు. శంఖము వంటి మెడలుగల్గి నానా మాల్యములు గంధములు పూసికొని నానా వేషధారులై అందరు తమ ఆయుధములతో పచారు చేయుచున్న వారు హరిని సమీపించిరి. విష్ణువు పాదములతో కరతలముతో రక్కసులంగొట్టి భూమిని లాగుకొనెను. అతడు అడుగడుగున నాక్రమించి, చంద్ర సూర్యులు రొమ్ము దానం దాక పెరిగి, నాభిదాక అంతై ఇంతంతగుచు, సర్వమాక్రమించి సర్వంసహాధికారమును ఇంద్రున కొసంగెను. ఈ త్రివిక్ర మావతార వైభవమును వేదవిదులు వర్ణింతురు. ఇది విష్ణు యశస్సంకీర్తనము.