విరజమను క్షేత్రమందు విరజయను పేరుగల మాత సరస్వతీదేవి సుప్రతిష్ఠింపబడినది. ఆమెను దర్శించిన మనుజుడు ఏడు తరముల వారిని పవిత్రులను చేయగలడు. ఆ దేవిని ఒక్కమారైనను దర్శించి పూజించి మ్రొక్కినవాడు తన వంశమును ఉద్ధరించి స్వర్గలోకమునకు ఏగును. ఆ విరజ క్షేత్రమునందు లోకమాతలింక ఎందఱో ఉన్నారు. వారు సర్వపాప హారిణులు భక్తవత్సలలు, వరప్రదాత్రులు. అక్కడ సర్వ పాప హారిణి వైతరిణీనది ఉన్నది. అందు స్నానముచేసిన నరోత్తముడు సర్వ పాపవిముక్తుడగును. అక్కడనే వరాహమూర్తియై హరి తనకుతాను వెలసియున్నాడు. ఆయనను భక్తితో దర్శించి మ్రెక్కిన విష్ణు పరమాత్మను చేరుకుందురు.
విరజ క్షేత్రమందున్న కపిలతీర్థము, గోగ్రహము, సోమము, అలాబుతీర్థము, మృత్యుంజయము, క్రోడము (వరాహము), వాసుకము, సిద్ధకేశ్వరము అను పేరుగల ఈ ఎనిమిది తీర్థములందు బుద్ధిమంతుడు ఇంద్రియములను నిగ్రహించి యధావిధిగ స్నానము చేసి దేవతలకు మ్రొక్కి సర్వ పాపముక్తుడై దివ్యవిమానమెక్కి గంధర్వులు గానము చేయుచు కీర్తింపగా ఏగి ఆ లోకమందు పూజ్యుడగును.
విరజ క్షేత్రమున పితరులకు పిండదానముచేసిన అది అక్షయ తృప్తికరమగును. ఈ నా క్షేత్రమందు శరీరము విడిచినవారు ముక్తులగుదురు. ఇచట సముద్ర స్నానము చేసి కపిలుడను పేరనున్న విష్ణువును, వారాహియను దేవతను దర్శించిన స్వర్గమందుదురు. ఇచట పుణ్యతీర్థములందు ఆలయములు పెక్కులున్నవి. అవి ఆ యాత్రా సమయమందు తెలిసికొని సేవింపదగును. సముద్రము ఉత్తరపు ఒడ్డునగల ప్రదేశమందు గుహ్యమైన ముక్తి క్షేత్రమున్నది. అందంతట ఇసుకమేటలు ఉన్నవి. పదియోజనముల వైశాల్యము గలది. అశోకాది నానా ఫలవృక్షములు, మందారాదులు, పూలచెట్లు, ఖర్జూరాది వృక్షములు సర్వ ఋతుఫల కుసుమ గంధ భరితములు, పక్షికూజిత మనోహరములు ఎన్నో కలవు. దిగుడు బావులు పుష్కరిణులు తామర కొలనులకు లెక్కేలేదు. స్వవర్ణ ధర్మానుసారులు గృహస్థాద్యాశ్రమముల వారు అక్కడ ఉన్నారు. స్త్రీలు, పురుషులు, హృష్టులు, పుష్టులును అందే వసింతురు. అది సర్వవిద్యాసదనము సర్వ ధర్మ గుణాకరము. అట్టి క్షేత్రము మఱి దుర్లభము.
అక్కడ పురుషోత్తముడను పేర విష్ణువున్నాడు. ఉత్కళ దేశము సరిహద్దువరకుగల దేశము కృష్ణానుగ్రహముచే పుణ్యతమము. నేను, రుద్రుడు, ఇంద్రుడు, అగ్నిముఖులగు దేవతలు అచ్చటనే ఎల్లవేళల వసింతుము. గంధర్వులు, అప్సరసలు, పితరులు, మనుష్యులు, మునులు, వాలఖిల్యాదులు, కశ్యపాదులు, గరుడులు, కిన్నరులు, నాగులు, సాంగములైన వేదములు, సర్వశాస్త్రములు, ఇతిహాస పురాణాదులు, యజ్ఞములు, పుణ్యనదులు, తీర్థములు, గిరులు, సాగరములు అక్కడనే ఉన్నవి. ఇట్లు దేవ, ఋషి, పితృ సేవితమై సమస్తోపభోగములతో కూడిన పవిత్రతమమైన దేశమున నివాసము ఎవనికి రుచింపదు? దానికంటె అధికమైన శ్రేష్ఠత్వము ఏదేశమున ఉండును? బ్రాహ్మణులారా! ముక్తిప్రదుడైన పురుషోత్తముడు స్వయముగ సన్నిహితుడై ఉన్న ఉత్కళ దేశవాసులు ధన్యులు,
అక్కడ తీర్థ స్నానముచేసి పురుషోత్తముని సేవించినవారు స్వర్గమునకు పోవుదురు. వారు యముని ఆలయమునకు పోరు. ఉత్కల దేశమునందలి పురుషోత్తమ క్షేత్ర నివాసుల జీవితము ధన్యము. ప్రసన్నములై విశాల నేత్రములు, చక్కని కనుబొమలు, కేశపాశము, కిరీటము, ఇంపైన చెవి కమ్మలు, చిఱునవ్వు, చక్కని పలువరుసయుకల్గి కిరీటాలంకృతుడైన ఆ కృష్ణ పరమాత్మ యొక్క ముఖపద్మము త్రిలోకానంద జనకము. (42)